విద్యుత్తు మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

భారతదేశంలో ఎల్‌పీజీ నుంచి విద్యుత్‌కు మారడాన్ని వేగవంతం చేయడానికి వాణిజ్య ఈ-కుకింగ్ పరిష్కారాలను ప్రదర్శించిన బీఈఈ


'గో ఎలక్ట్రిక్ కమర్షియల్ ఎలక్ట్రిక్ కుకింగ్ వెండర్ డైరెక్టరీ'లో పేర్లు నమోదు చేసుకోవాల్సిందిగా భాగస్వాములకు ఆహ్వానం

నాడు పోస్టు చేయడమైనది: 10 SEP 2026 7:33PM by PIB Hyderabad

కేంద్ర ప్రభుత్వ విద్యుత్ మంత్రిత్వ శాఖకు చెందిన బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ (బీఈఈ) ఢిల్లీలో ‘భారతదేశ ఈ-కుకింగ్ లక్ష్య సాధనను వేగవంతం చేయడం: సాంకేతిక ప్రదర్శన నుంచి వాస్తవ క్షేత్రస్థాయి ఉపయోగం వరకు’ అంశంపై ’కమర్షియల్ ఇండక్షన్ కుకింగ్ షోకేస్, షెఫ్ ఛాలెంజ్’ను నిర్వహించింది. భారత్‌లోని వాణిజ్య, సంస్థాగత వంటశాలలలో ఎనర్జీ ఎఫిషియెంట్ ఈ-కుకింగ్ విధానాన్ని ముందుకు తీసుకెళ్లడానికి ఈ కార్యక్రమం విధాన రూపకర్తలు, ప్రభుత్వ రంగ సంస్థలు, తయారీదారులు, సాంకేతిక సంస్థలు, చెఫ్‌లు, హోటల్‌ యజమానులు, వాణిజ్య కిచెన్ ఆపరేటర్లను ఒకే వేదికపైకి తీసుకువచ్చింది.

ఈ కార్యక్రమానికి విద్యుత్ మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ పంకజ్ అగర్వాల్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఏడుగురు ప్రముఖ తయారీ సంస్థలకు చెందిన వాణిజ్య ఈ-కుకింగ్ ఉపకరణాలు, సాంకేతికతలతో కూడిన ప్రదర్శనను ఆయన ప్రారంభించారు. బీఈఈ డైరెక్టర్ జనరల్ శ్రీ కృష్ణ చంద్ర పాణిగ్రాహి కీలకోపాన్యాసం చేయగా సీఎల్ఏఎస్‌పీ డైరెక్టర్ కుమారి నేహా ధింగ్రా స్వాగతోపన్యాసం ఇచ్చారు.

సభనుద్దేశించి శ్రీ పంకజ్ అగర్వాల్ మాట్లాడుతూ.. భారతదేశం ఎలక్ట్రిక్ వంట వైపు మళ్లేందుకు ఇంధన భద్రతే అసలైన చోదక శక్తి అని పేర్కొన్నారు. ప్రస్తుత ప్రపంచ సంఘర్షణలు, ఎల్‌పీజీ ధరల పెరుగుదల కారణంగా ఈ-కుకింగ్‌కు మారడం కేవలం వ్యూహాత్మక మార్పు మాత్రమే కాకుండా ఒక ఆచరణాత్మక ఎంపిక కూడా అని ఆయన స్పష్టం చేశారు. ప్రధాన మంత్రి సహజ్ బిజ్లీ హర్ ఘర్ యోజన (సౌభాగ్య), పీఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన వంటి పథకాలను ఉదహరించిన ఆయన.. నివాస రంగంలో ఈ-కుకింగ్ పరికరాలను ప్రోత్సహించడానికి బలమైన పునాదిని అందించే అనుకూల వాతావరణం ఇప్పటికే ఉందని తెలిపారు. ఇండక్షన్‌పై వండిన ఆహారం విషయంలో రుచి పట్ల చెఫ్‌ల ఆందోళన, వినియోగదారుల అలవాట్లు, స్థానిక విద్యుత్ సరఫరా సామర్థ్యంలోని లోపాలు వంటి ప్రవర్తనా, మౌలిక సదుపాయాలకు సంబంధించిన అడ్డంకులు ఇండక్షన్‌ విస్తృతంగా వాడేందుకు సవాలుగా ఉన్నాయని ఆయన అన్నారు. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని డిమాండ్‌ను పెంచడానికి, ఎలక్ట్రిక్ విధానాలను ప్రధాన స్రవంతిలోకి తీసుకొచ్చేందుకు అవగాహన కల్పించడమే అత్యంత వేగవంతమైన సాధనమని ఆయన పేర్కొన్నారు. 

కీలకపోన్యాసం ఇచ్చిన బీఈఈ డైరెక్టర్ జనరల్ శ్రీ కృష్ణ చంద్ర పాణిగ్రాహి.. విద్యుత్ మంత్రిత్వ శాఖ, సీఎల్ఏఎస్‌పీ, పరిశ్రమలు, ఆతిథ్య రంగం, పీఎస్‌యూలు, తయారీదారులు, చెఫ్‌ల ప్రతినిధులకు స్వాగతం పలికారు. భారతదేశ ఈ-కుకింగ్ వ్యవస్థను ముందుకు తీసుకెళ్లడంలో వారు పోషిస్తున్న పాత్రకు ధన్యవాదాలు తెలిపారు. భారతదేశ ఇంధన పరివర్తన కేవలం స్వచ్ఛమైన ఇంధన వనరుల గురించే కాదని, ఇంధనాన్ని మరింత సమర్థవంతంగా వినియోగించడం గురించి కూడా అని ఆయన అన్నారు. సామర్థ్యం, ఇంధన భద్రత, సౌకర్యం, సుస్థిరతలను ఈ-కుకింగ్ ఒకే వేదికపైకి తెస్తుందని పేర్కొన్నారు. హోటళ్లు, రెస్టారెంట్లు, క్యాంటీన్లు, ఆసుపత్రులు, సంస్థలు నమ్మకమైన సరఫరాదారులను కనుగొనడానికి సహాయపడే పబ్లిక్ ప్లాట్‌ఫామ్ అయిన 'గో ఎలక్ట్రిక్ కమర్షియల్ ఎలక్ట్రిక్ కుకింగ్ వెండర్ డైరెక్టరీ'లో పేర్లు నమోదు చేసుకోవాల్సిందిగా తయారీదారులు, పంపిణీదారులు, సిస్టమ్ ఇంటిగ్రేటర్లు, పరిష్కారాలు అందించే సంస్థలును బీఈఈ ఆహ్వానిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. వాణిజ్య ఇండక్షన్ హాబ్‌ల కోసం స్టాండర్డ్స్- లేబులింగ్ ఫ్రేమ్‌వర్క్‌ను అభివృద్ధి చేయడానికి భారతీయ ప్రమాణాల సంస్థతో (బీఐఎస్) కలిసి బీఈఈ పనిచేస్తున్నట్లు ఆయన తెలిపారు. వ్యక్తిగత ప్రదర్శన ప్రాజెక్ట్‌లకే పరిమితం కాకుండా మరింత మెరుగైన వాణిజ్య ఈ-కుకింగ్ వ్యవస్థ వైపు అడుగులు వేయడమే బీఈఈ లక్ష్యమని శ్రీ కృష్ణ చంద్ర పాణిగ్రాహి తెలిపారు. "దీనివల్ల వినియోగదారులకు సాంకేతికతపై నమ్మకం ఉంటుంది. తయారీదారులకు మార్కెట్ అవసరాలపై అవగాహన ఉంటుంది. విధాన రూపకర్తలకు దీని విస్తరణకు అవసరమైన ఫలితాలు లభిస్తాయి" అని ఆయన పేర్కొన్నారు.

ప్రారంభోత్సవం తర్వాత ‘కమర్షియల్ ఇండక్షన్ చెఫ్ ఛాలెంజ్’ నిర్వహించారు. ఇందులో ముగ్గురు చెఫ్‌లు ఇండక్షన్ కుక్‌టాప్‌లను ఉపయోగించి వంటకాలు తయారు చేశారు. ఇండక్షన్ సాంకేతికత పనితీరు, వినియోగంలో సౌలభ్యం, ఉష్ణోగ్రత నియంత్రణ, వంట సమయాన్ని ప్రత్యక్షంగా పరిశీలించడానికి ఈ ప్రదర్శన సహకరించింది.

దేశవ్యాప్తంగా ఇంధన సమర్థ ఈ-కుకింగ్ వినియోగాన్ని వేగవంతం చేయడానికి విద్యుత్ మంత్రిత్వ శాఖ, సీఎల్ఏఎస్‌పీ, తయారీదారులు, పారిశ్రామిక సంఘాలు, ప్రభుత్వ రంగ సంస్థలు, వాణిజ్య కిచెన్ సంస్థలతో కలిసి పనిచేయడానికి బీఈఈ నిబద్ధతను పునరుద్ఘాటించడంతో ఈ కార్యక్రమం ముగిసింది.

వికసిత్, ఆత్మనిర్భర్ భారత్ ఆకాంక్షకు అనుగుణంగా భారత వాణిజ్య వంటశాలలను సాంకేతిక ప్రదర్శన నుంచి వాస్తవ క్షేత్రస్థాయి ఉపయోగం వైపు తీసుకెళ్లడంలో ప్రభుత్వం, పరిశ్రమలు, ఆతిథ్య రంగం ఉమ్మడి బాధ్యతను ఈ కార్యక్రమం మరోసారి స్పష్టం చేసింది.

బీఈఈ:

ఇంధన పరిరక్షణ చట్టం-2001 నిబంధనల ప్రకారం 2002 మార్చి 1న ‘బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ’ని (బీఈఈ) ఏర్పాటు చేసింది. స్వీయ-నియంత్రణ, మార్కెట్ సూత్రాలపై దృష్టి సారించి విధానాలు, వ్యూహాలను అభివృద్ధి చేసే విషయంలో సహాయపడటం బీఈఈ ప్రధాన లక్ష్యం.

భారతీయ ఆర్థిక వ్యవస్థలో ఇంధన ఉపయోగాన్ని తగ్గించడం దీని ముఖ్య ఉద్దేశం. చట్టం ప్రకారం తనకు కేటాయించిన విధులను నిర్వర్తించడంలో గుర్తించిన వినియోగదారులు, నియమిత సంస్థలు, ఇతర సంస్థలతో బీఈఈ సమన్వయం చేసుకుంటుంది. ఈ చట్టం నియంత్రణ, ప్రోత్సాహక విధులకు కూడా అవకాశం కల్పిస్తుంది.

 

***


(రిలీజ్ ఐడి: 2308999) సందర్శకుల సూచీ సంఖ్య : : 2
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी