సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
గుజరాత్‌లోని ఎన్‌ఎఫ్‌ఎస్‌యూ, గిఫ్ట్ సిటీని సందర్శించిన తెలంగాణ మీడియా ప్రతినిధుల బృందం
నాడు పోస్టు చేయడమైనది:
09 SEP 2026 11:27PM by PIB Hyderabad
హైదరాబాద్‌లోని పత్రికా సమాచార కార్యాలయం (పీఐబీ) ఆధ్వర్యంలో జరుగుతున్న గుజరాత్ మీడియా పర్యటనలో భాగంగా తెలంగాణ మీడియా ప్రతినిధుల బృందం ఈ రోజు గాంధీనగర్‌లోని నేషనల్ ఫోరెన్సిక్ సైన్సెస్ విశ్వవిద్యాలయం (ఎన్‌ఎఫ్‌ఎస్‌యూ), గిఫ్ట్ సిటీని సందర్శించింది.
నేషనల్ ఫోరెన్సిక్ సైన్సెస్ విశ్వవిద్యాలయ సందర్శన
ఫోరెన్సిక్ సైన్స్, పరిశోధనలు, సాంకేతికత, ప్రత్యేక శిక్షణను ముందుకు తీసుకెళ్లడంలో విశ్వవిద్యాలయం పోషిస్తున్న పాత్ర గురించి ప్రతినిధుల బృందానికి ‘ఎన్‌ఎఫ్‌ఎస్‌యూ’ వైస్ ఛాన్సలర్ డా. జే.ఎం. వ్యాస్ వివరించారు. ఈ రంగంలో అనుభవాలను పరస్పరం పంచుకోవడంతో పాటు శాస్త్రీయ దర్యాప్తును బలపరచడంలో పెరుగుతున్న ఫోరెన్సిక్ సైన్స్ ప్రాముఖ్యతను ఆయన ప్రధానంగా చెప్పారు.
ఫోరెన్సిక్ సైన్స్‌ను బలోపేతం చేయడానికి, ఆధునిక- శాస్త్రీయ- సాక్ష్యాల ఆధారిత నేర విచారణ వ్యవస్థను తయారుచేయటానికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దార్శనికతను డా.జే.ఎం వ్యాస్ ప్రశంసించారు. ఎక్కువ మంది శిక్షణ పొందిన ఫోరెన్సిక్ నిపుణులను తయారుచేసేందుకు దక్షిణాది రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా ఫోరెన్సిక్ విద్య, ప్రత్యేక సంస్థలను ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన తెలిపారు.
దేశవ్యాప్తంగా ఫోరెన్సిక్ విద్య, సామర్థ్యాన్ని పెంచే ప్రయత్నాలలో భాగంగా ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటకతో సహా పలు రాష్ట్రాల్లో అదనపు ఎన్‌ఎఫ్‌ఎస్‌యూ క్యాంపస్‌లను ఏర్పాటు చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందని ఆయన చెప్పారు.
ఎన్‌ఎఫ్‌ఎస్‌యూలోని ప్రత్యేక ఫోరెన్సిక్ ప్రయోగశాలలను మీడియా బృందం సందర్శించింది. ఫోరెన్సిక్ సాంకేతికతలు, మెలకువలపై ప్రత్యక్ష అనుభవాన్ని పొందడంతో పాటు శాస్త్రీయ దర్యాప్తులో వాటి ఉపయోగించటంపై వారు అవగాహన చేసుకున్నారు.




ఈ బృందం ఎన్‌ఎఫ్‌ఎస్‌యూ మీడియా సెంటర్, మల్టీమీడియా ఫోరెన్సిక్ సౌకర్యాలను కూడా సందర్శించింది. మీడియా సాంకేతికతలు, ఆడియో- వీడియో- డిజిటల్ చిత్రాల ఫోరెన్సిక్ విశ్లేషణపై ప్రత్యక్ష అవగాహన తెచ్చుకున్నారు. దర్యాప్తు, నేరాలను గుర్తించడంలో సాంకేతికత, శాస్త్రీయ పద్ధతుల వినియోగం గురించి సంబంధిత నిపుణులు మీడియా ప్రతినిధులకు వివరించారు.
గిఫ్ట్ సిటీ సందర్శన
ఆ తర్వాత గుజరాత్ ఇంటర్నేషనల్ ఫైనాన్స్ టెక్-సిటీ (గిఫ్ట్ సిటీ)ని సందర్శించిన మీడియా ప్రతినిధుల బృందం.. అక్కడి ఆధునిక మౌలిక సదుపాయాలు, సమీకృత ఆర్థిక- సాంకేతిక వ్యవస్థ గురించి తెలుసుకుంది.
అక్కడ లభించే కీలక రాయితీలు, నియంత్రణ విధానం, మౌలిక సదుపాయాలు, నగర ప్రణాళిక, గ్లోబల్ రీచ్, టెక్నాలజీ ఆధారిత సేవల గురించి గిఫ్ట్ సిటీ ప్రతినిధులు వివరించారు.

మీడియా ప్రతినిధుల బృందం గిఫ్ట్ సిటీలోని భూగర్భ యుటిలిటీ టన్నెల్‌ను కూడా సందర్శించింది. విద్యుత్, ఐసీటీ, నీరు, మురుగునీరు, వ్యర్థాల నిర్వహణ సేవల కోసం ఏర్పాటు చేసిన సమీకృత మౌలిక సదుపాయాల గురించి ప్రత్యక్ష అవగాహన పొందింది. ఈ ఇంటిగ్రేటెడ్ అండర్‌గ్రౌండ్ వ్యవస్థ.. గిఫ్ట్ సిటీకి ఉన్న ‘తవ్వకం రహిత (డిగ్గింగ్ ఫ్రీ) నగర భావనకు మద్దతునిస్తూ అత్యవసర సేవలను సమర్థవంతంగా నిర్వహించేందుకు వీలు కల్పిస్తుంది.
గిఫ్ట్ సిటీ ఆటోమేటెడ్ వేస్ట్ కలెక్షన్ సిస్టమ్ (ఏడబ్ల్యూసీఎస్) గురించి కూడా మీడియా ప్రతినిధులకు వివరించారు. భారతదేశపు మొట్టమొదటి ఆటోమేటెడ్ వ్యర్థ నిర్వహణ వ్యవస్థగా ఇది గుర్తింపు పొందింది.
అంతర్జాతీయ బ్యాంకింగ్, మూలధన మార్కెట్లు, బీమా, ఫండ్ మేనేజ్‌మెంట్, ఫిన్‌టెక్, ఇతర ఆర్థిక సేవలతో కూడిన గిఫ్ట్ సిటీ సమీకృత వ్యవస్థను, భారతదేశపు అంతర్జాతీయ ఆర్థిక సేవల కేంద్రంగా దాని పాత్రను గిఫ్ట్ సిటీ అధికారులు వివరించారు.
_20260910083815_e34787.jpeg)


సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన, ప్రపంచ స్థాయిలో పోటీపడగల భారతదేశాన్ని సాధించాలన్న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆకాంక్షకు అనుగుణంగా శాస్త్రీయ సామర్థ్యాలను బలోపేతం చేయడం, నైపుణ్యం కలిగిన మానవ వనరులను అభివృద్ధి చేయడం, ఆవిష్కరణలను ప్రోత్సహించడం, ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలను నిర్మించడంపై కేంద్ర ప్రభుత్వం పెడుతున్న దృష్టిని ఈ మీడియా పర్యటన తెలియజేస్తోంది.
***
(రిలీజ్ ఐడి: 2308969)
సందర్శకుల సూచీ సంఖ్య : : 12