ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ ఫర్మేశన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ
అమెరికాలోని సేలర్ యూనివర్సిటీతో నైలిట్ డిజిటల్ యూనివర్సిటీ (ఎన్‌డీయూ) వేదిక అనుసంధానం
ఎన్‌డీయూ వేదిక-సేలర్ యూనివర్సిటీ భాగస్వామ్యాన్ని ప్రారంభించిన ఎంఈఐటీవై కార్యదర్శి శ్రీ ఎస్. కృష్ణన్... వివిధ అసోసియేషన్లు, పరిశ్రమలు, విద్యాసంస్థల భాగస్వామ్యంతో ఎంఓయూలు కుదుర్చుకున్న నైలిట్
నాడు పోస్టు చేయడమైనది:
10 SEP 2026 12:29PM by PIB Hyderabad
ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ (ఎంఈఐటీవై) ఆధ్వర్యంలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ (నైలిట్), సేలర్ డిజిటల్ లెర్నింగ్ వనరులను నైలిట్ డిజిటల్ యూనివర్సిటీ (ఎన్‌డీయూ) వేదికతో ఏకీకృతం చేయటానికి అమెరికాలోని సేలర్ యూనివర్సిటీతో సహకారాన్ని ప్రారంభించింది.
ఎంఈఐటీవై కార్యదర్శి శ్రీ ఎస్. కృష్ణన్ ముఖ్య అతిథిగా హాజరై ఈ భాగస్వామ్యాన్ని ప్రారంభించారు. న్యూఢిల్లీలోని ఎంఈఐటీవై కార్యాలయంలో ఈ కార్యక్రమం జరిగింది.
ఈ ఏకీకరణతో ఎన్‌డీయూ వేదిక ద్వారా నేర్చుకునే విద్యార్థులకు సేలర్ యూనివర్సిటీ అందిస్తున్న నాణ్యమైన, స్వీయ-అధ్యయన, ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఆన్‌లైన్ కోర్సులు, అభ్యసన వనరులు విస్తృత స్థాయిలో అందుబాటులోకి వస్తాయి. ఈ కార్యక్రమం డిజిటల్ లెర్నింగ్‌లో విద్యార్థులకు మరింత వెసులుబాటును, ఎంపిక స్వేచ్ఛను అందిస్తుందని భావిస్తున్నారు. జాతీయ, అంతర్జాతీయ అభ్యసన అవకాశాలు ఒకే వేదికలో ఉండేలా సమగ్ర వ్యవస్థను ఇది ఏర్పాటు చేస్తుంది.
ఈ సహకారం అంతర్జాతీయ విద్యా భాగస్వామ్యం, సాంకేతికత ఆధారిత విద్య ద్వారా భారతదేశ డిజిటల్ లెర్నింగ్ వ్యవస్థను బలపరచటంలో కీలక ముందడుగు. ఇది నైలిట్ డిజిటల్ యూనివర్సిటీ (ఎన్‌డీయూ) వేదిక పరిధిని, వినియోగాన్ని మరింత మెరుగుపరుస్తుందని అంచనా. ముఖ్యంగా డిజిటల్ విద్య అందరికీ అందుబాటులో ఉండేలా విస్తృతం చేయటం ద్వారా మారుతున్న సాంకేతిక, ఉపాధి రంగాలకు తగిన ఆధునిక జ్ఞానం, నైపుణ్యాలను సంపాదించటంలో అభ్యర్థులకు ఇది తోడ్పడుతుంది. నిరంతర అభ్యసనం, డిజిటల్ అప్‌స్కిల్లింగ్, నైపుణ్యాభివృద్ధికి సంబంధించిన అవకాశాలను విస్తరించేందుకు ప్రపంచ స్థాయి భాగస్వామ్యాలను వినియోగించుకోవాలనే నైలిట్ నిబద్ధతను ఈ కార్యక్రమం ప్రతిబింబిస్తుంది.
ఎంఈఐటీవై కార్యదర్శి శ్రీ ఎస్. కృష్ణన్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా నైలిట్ డిజిటల్ యూనివర్సిటీ వేదిక, అమెరికాలోని సేలర్ యూనివర్సిటీ మధ్య జరిగిన సహకార ఒప్పంద ప్రారంభోత్సవం సందర్భంగా నైలిట్ సంస్థను అభినందించారు. నాణ్యమైన డిజిటల్ అభ్యాసాన్ని విస్తరించటంలో, నైపుణ్యాభివృద్ధి, మెరుగైన నైపుణ్యాలు, నిరంతరం నేర్చుకునేందుకు అవకాశాలను బలోపేతం చేయటంలో ఈ కార్యక్రమం కీలక ముందడుగని ప్రశంసించారు. డిజిటల్ విద్యా విధానాన్ని మెరుగుపరచటంలో, సాంకేతికత ఆధారిత ఆర్థిక వ్యవస్థ కోసం మారుతున్న అవసరాలకు తగినట్లుగా అభ్యాసకులను సిద్ధం చేయటంలో ఇలాంటి అంతర్జాతీయ సహకారాలు ఎంతగానో దోహదపడతాయని స్పష్టం చేశారు.
కన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సీఐఐ), నాస్కామ్, ఎలక్ట్రానిక్స్ సెక్టార్ స్కిల్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఈఎస్ఎస్సీఐ), పియర్సన్ ఇండియా ఎడ్యుకేషన్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్, స్టెమ్‌లోర్ ఇన్నోవేటర్స్ ఎల్ఎల్పీ, డస్సాల్ట్ సిస్టమ్స్, ఏబీఈఎస్ ఇంజనీరింగ్ కాలేజ్, జల్గావ్‌లోని కవయిత్రి బహినాబాయి చౌదరి నార్త్ మహారాష్ట్ర యూనివర్సిటీ (కేబీసీఎన్‌ఎంయూ) వంటి అగ్రగామి సంస్థలతో ఎంఓయూలు కుదుర్చుకోవటం పట్ల అన్ని భాగస్వామ్య పక్షాలకు ఆయన అభినందనలు తెలిపారు. భారతదేశ డిజిటల్ నైపుణ్యాలు, విద్యా రంగాన్ని బలోపేతం చేయటానికి, పరిశ్రమ - విద్యా సంస్థల మధ్య సంబంధాలను మరింత పటిష్టం చేయటానికి, నాణ్యమైన, సాంకేతికతతో కూడిన, పరిశ్రమకు అవసరమైన అభ్యాస అవకాశాల విస్తరణకు ఈ సహకారాలు కీలకమైన ముందడుగులని అభివర్ణించారు.
పరిశ్రమలు, ప్రపంచ డిజిటల్ ఆర్థిక వ్యవస్థలో మారుతున్న అవసరాలకు తగినట్లుగా నైపుణ్యాభివృద్ధిని అనుసంధానించాల్సిన అవసరాన్ని శ్రీ కృష్ణన్ స్పష్టం చేశారు. భారతదేశ నైపుణ్య వనరులు ఎల్లప్పుడూ పోటీతత్వంతో, ప్రయోజనకరంగా ఉండేలా చూసేందుకు నిరంతర అభ్యాసం, నైపుణ్యాల పెంపు, నూతన నైపుణ్యాల శిక్షణ ప్రాముఖ్యతను ఆయన తెలిపారు.
ప్రారంభోపన్యాసం చేస్తూ నైలిట్ డైరెక్టర్ జనరల్ డాక్టర్. ఎం. ఎం. త్రిపాఠి ముఖ్య అతిథులకు, భాగస్వామ్య సంస్థలకు స్వాగతం పలికారు. డిజిటల్ విద్య, నైపుణ్యాభివృద్ధి, నూతన సాంకేతికత సామర్థ్యాలను బలోపేతం చేయటంలో భాగస్వామ్యాల ప్రాముఖ్యతను స్పష్టం చేశారు. నాణ్యమైన, సౌకర్యవంతమైన, పరిశ్రమలకు సరిపోయే అభ్యాస అవకాశాలను మరింత విస్తృతం చేయాల్సిన అవసరాన్ని వివరించారు.
డిజిటల్ లెర్నింగ్ వ్యవస్థను ఈ సహకారం మరింత మెరుగుపరుస్తుందని, నిరంతర నైపుణ్యాభివృద్ధికి, నైపుణ్యాలను పెంపొందించుకునేందుకు దోహదపడుతుందన్నారు. డిజిటల్ ఆర్థిక వ్యవస్థలో మారుతున్న అవసరాలకు తగినట్లుగా అభ్యాసకులు సంబంధిత నైపుణ్యాలను పొందేందుకు గొప్ప అవకాశాలను సృష్టిస్తుందని డాక్టర్ త్రిపాఠి పేర్కొన్నారు. భవిష్యత్తుకు సిద్ధంగా ఉన్న, ప్రపంచవ్యాప్తంగా పోటీ పడగల శ్రామిక శక్తిని అభివృద్ధి చేయటంలో ఇలాంటి కార్యక్రమాల పాత్రను స్పష్టం చేశారు.
అమెరికాలోని సేలార్ యూనివర్సిటీ ప్రొవొస్ట్, సీనియర్ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ డేవిడ్ షుల్మాన్ ఈ సహకారాన్ని స్వాగతించారు. నాణ్యమైన, సౌకర్యవంతమైన, పరిశ్రమకు సరిపోయే డిజిటల్ విద్యను అందుబాటులోకి తీసుకురావటంలో ఈ సహకారానికున్న సామర్థ్యాన్ని ఆయన స్పష్టం చేశారు. నేర్చుకునేవారికి సౌకర్యవంతమైన డిజిటల్ అభ్యాస వాతావరణాన్ని అందించటంలో నైలిట్ డిజిటల్ యూనివర్సిటీ (ఎన్‌డీయూ) వేదిక పాత్రను డాక్టర్ షుల్మాన్ తెలియజేశారు. ఏఐ, ప్రోగ్రామింగ్, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ, బిజినెస్ మేనేజ్‌మెంట్ వంటి రంగాల్లో సేలార్ యూనివర్సిటీలోని ఉచిత, స్వీయ-అధ్యయన ఆన్‌లైన్ కోర్సులను అనుసంధానించటం ద్వారా ఎన్‌డీయూ లెర్నింగ్ వ్యవస్థను మరింత మెరుగుపరుస్తుందన్నారు.
నైలిట్ దేశవ్యాప్త డిజిటల్ వ్యవస్థను, సేలర్ యూనివర్సిటీ ఓపెన్-లెర్నింగ్ వనరులతో ఎన్‌డీయూ వేదిక ద్వారా అనుసంధానం చేయటం వల్ల విద్యార్థులు, ఉద్యోగులు, నైపుణ్యాలను మెరుగుపరచుకోవాలనుకునే వారికి అభ్యాస అవకాశాలు విస్తృతమవుతాయని తెలిపారు. టైర్-2, టైర్-3, వెనుకబడిన ప్రాంతాలతో సహా డిజిటల్ నైపుణ్యం గల, ప్రపంచవ్యాప్తంగా పోటీపడగల శ్రామిక శక్తిని రూపొందించటంలో ఇది దోహదపడుతుందని తెలిపారు.
యూఎస్‌ఏలోని సేలర్ యూనివర్సిటీ ఉపాధ్యక్షురాలు డాక్టర్ శీలా జగన్నాథన్ ప్రసంగిస్తూ... కృత్రిమ మేధ, ఇతర అభివృద్ధి చెందుతున్న సాంకేతికతల్లో వస్తున్న వేగవంతమైన మార్పులకు అనుగుణంగా నిరంతరం నేర్చుకునేందుకు, నైపుణ్యాలను పెంపొందించుకోవటానికి సిద్ధంగా ఉండే నైపుణ్యం గల శ్రామిక శక్తి అవసరమని స్పష్టం చేశారు.
సమర్థవంతమైన, స్వీయ అధ్యయన మార్గాలను, ధ్రువపత్రాలను అందించటంలో నైలిట్ డిజిటల్ యూనివర్సిటీ (ఎన్‌డీయూ) వేదిక సామర్థ్యాన్ని డాక్టర్ జగన్నాథన్ స్పష్టం చేశారు. ఏఐ, డేటా సైన్స్, ప్రోగ్రామింగ్, సైబర్ సెక్యూరిటీ వంటి రంగాల్లో 160కి పైగా ఉచిత ఆన్‌లైన్ కోర్సులను సేలర్ యూనివర్సిటీ అందిస్తోందని ఆమె వెల్లడించారు. విద్యకు అందరినీ చేరువ చేసేందుకు, ఉపాధి అవకాశాలను మెరుగుపరిచేందుకు, భవిష్యత్తుకు సిద్ధంగా ఉండే, ప్రపంచ స్థాయిలో పోటీపడగల శ్రామిక శక్తిని అభివృద్ధి చేసేందుకు... నైలిట్ దేశవ్యాప్త నెట్వర్క్, సేలర్ యూనివర్సిటీ ఓపెన్-లెర్నింగ్ వనరులు ఈ సహకారం ద్వారా కలిసి పనిచేస్తాయని ఆమె చెప్పారు.
నైలిట్ డైరెక్టర్ (స్కీమ్, స్కిల్లింగ్), ఎగ్జ్సామినేషన్స్ చీఫ్ కంట్రోలర్ డాక్టర్ అలోక్ త్రిపాఠి ప్రసంగాన్ని ముగిస్తూ... డిజిటల్ నైపుణ్యాలు, అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలు, పరిశ్రమ ఆధారిత అభ్యాసన దిశగా నైలిట్ చేస్తున్న ప్రయత్నాలను ఈ భాగస్వామ్యాలు మరింత బలపరుస్తాయని స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా ఉన్న అభ్యర్థులకు ఇవి విస్తృత అవకాశాలను కల్పిస్తాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న భాగస్వాములందరి నిరంతర మద్దతుకు కృతజ్ఞతలు తెలుపుతూ... భవిష్యత్‌కు సిద్ధంగా ఉన్న, ప్రపంచవ్యాప్తంగా పోటీపడగల డిజిటల్ శ్రామిక శక్తిని పెంపొందించేందుకు నిరంతరం సహకరించుకోవాలని పిలుపునిస్తూ కార్యక్రమాన్ని ముగించారు.
భాగస్వామ్య సంస్థలతో ఎంఓయూల మార్పిడి
ఈ కార్యక్రమంలో భాగంగా అసోసియేషన్, పరిశ్రమ, విద్యా రంగాలకు చెందిన 8 భాగస్వామ్య సంస్థలతో నైలిట్ అవగాహన ఒప్పందాల (ఎంఓయూలు)ను కుదుర్చుకుంది. ఎన్‌డీయూ వేదికను వినియోగించుకుంటూ.. పరిశ్రమలకు తగిన నైపుణ్య శిక్షణ, ధ్రువీకరణ, అధ్యాపక అభివృద్ధి, ఇంటర్న్‌షిప్‌లు, డిజిటల్ అభ్యాస అవకాశాలను విస్తరించటం ఈ సహకారాల ప్రధాన ఉద్దేశం. ఆ భాగస్వామ్య సంస్థలు:
-
కన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సీఐఐ)
-
నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్‌వేర్ అండ్ సర్వీసెస్ కంపెనీస్ (నాస్కామ్)
-
ఎలక్ట్రానిక్స్ సెక్టార్ స్కిల్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఈఎస్ఎస్సీఐ)
-
పియర్సన్ ఇండియా ఎడ్యుకేషన్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్
-
స్టెమ్ లెర్నింగ్ అండ్ అవుట్‌రీచ్ ఫర్ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్ (స్టెమ్‌లోర్)
-
డసాల్ట్ సిస్టమ్స్
-
ఏబీఈఎస్ ఇంజనీరింగ్ కాలేజ్
-
జల్గావ్‌లోని కవయిత్రి బహినాబాయి చౌదరి నార్త్ మహారాష్ట్ర యూనివర్సిటీ (కేబీసీఎన్‌ఎంయూ)
నైలిట్ గురించి
భారత ప్రభుత్వ ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ (ఎంఈఐటీవై) ఆధ్వర్యంలోని స్వయంప్రతిపత్తి గల శాస్త్రీయ సంస్థ నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (నైలిట్)... నైపుణ్యాభివృద్ధి, డిజిటల్ సాధికారతలో అగ్రగామి సంస్థ.
56 నైలిట్ కేంద్రాలు, 700లకు పైగా గుర్తింపు పొందిన సంస్థలు, 8,000లకు పైగా ఫెసిలిటేషన్ కేంద్రాల ద్వారా విస్తృతమైన వ్యవస్థ గల నైలిట్.. ఈ అండ్ ఐసీటీ రంగంలోని అభివృద్ధి చెందుతున్న సాంకేతికతల్లో మిలియన్ల కొద్దీ విద్యార్థులకు నైపుణ్య శిక్షణనిచ్చి సర్టిఫికేట్లను అందించింది.
యూజీసీ (డీమ్డ్ విశ్వవిద్యాలయాల సంస్థలు) నిబంధనలు-2023 ప్రకారం... ప్రత్యేక కేటగిరి ద్వారా నైలిట్ సంస్థకు "డీమ్డ్ టూ బి యూనివర్సిటీ" హోదా లభించింది. ఈ సంస్థకు రోపార్ (పంజాబ్) ప్రధాన కేంద్రంగా, ఐజ్వాల్, అగర్తలా, కాలికట్, ఛత్రపతి శంభాజీనగర్, గోరఖ్‌పూర్, ఇంఫాల్, ఈటానగర్, అజ్మీర్, కొహిమా, పాట్నా, శ్రీనగర్‌లోని పదకొండు ఉప-కేంద్రాలున్నాయి. డిజిటల్ సాంకేతికతలను ఉపయోగించి ఈ అండ్ ఐసీటీ రంగంలో ఉన్నత విద్యలో విప్లవాత్మక మార్పులు తీసుకురావాలని ఇది లక్ష్యంగా పెట్టుకుంది.
నైలిట్ డిజిటల్ యూనివర్సిటీ (ఎన్‌డీయూ) వేదిక గురించి
అక్టోబర్ 2, 2025న ప్రారంభమైన అత్యాధునిక డిజిటల్ అభ్యాస వేదిక.. నైలిట్ డిజిటల్ యూనివర్సిటీ (ఎన్‌డీయూ)వేదిక. అభివృద్ధి చెందుతున్న సాంకేతిక రంగాల్లో అందరికీ అందుబాటులో ఉండేలా, తక్కువ ఖర్చుతో, పరిశ్రమల అవసరాలకు తగినట్లుగా విద్యను అందించేందుకు దీన్ని రూపొందించారు. ఈ వేదికలో 2.80 లక్షలకు పైగా నమోదు చేసుకున్న అభ్యాసకులున్నారు. ఏఐ, సైబర్ సెక్యూరిటీ, డేటా సైన్స్, క్లౌడ్ కంప్యూటింగ్, సెమీకండక్టర్ డిజైన్, వీఎల్ఎస్ఐ, ఇతర సరికొత్త రంగాల్లో 120కి పైగా కోర్సులను ఎన్‌డీయూ అందిస్తోంది. దేశవ్యాప్తంగా 36 రాష్ట్రాలు, యూటీలు, 761 జిల్లాల్లోని అభ్యాసకులకు ఈ వేదిక అందుబాటులో ఉంటుంది. ఏఐ-ఆధారిత టూల్స్, వర్చువల్ ల్యాబ్స్, అధునాతన లెర్నింగ్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ (ఎల్ఎంఎస్) ద్వారా ఎప్పుడైనా, ఎక్కడైనా ఆన్‌లైన్, సమ్మిళిత అభ్యాస విధానానికి ఇది మద్దతిస్తుంది. ఇకపై ఎన్‌డీయూ... ఎన్‌ఎస్‌క్యూఎఫ్ ఆమోదిత, ఎన్సీవీఈటీ గుర్తింపు పొందిన కోర్సులను అందించనుంది. ఏబీసీ విధానం ద్వారా క్రెడిట్ బదిలీ సౌకర్యంతోపాటు స్వీయ అభ్యసన మార్గాలకు ప్రాధాన్యతనిస్తుంది. దీనిద్వారా ఉపాధి అవకాశాలు మెరుగవటంతో పాటు నిరంతరం నైపుణ్యాలను మెరుగుపరచుకోవచ్చు.
***
(రిలీజ్ ఐడి: 2308956)
సందర్శకుల సూచీ సంఖ్య : : 2