వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
మొట్టమొదటిసారిగా నిర్వహించిన ఇన్నోప్రోమ్ ఇండియా 2026లో భారత తదుపరి తరం పారిశ్రామిక వ్యవస్థలను ప్రదర్శించిన ఎన్ఐసీడీసీ
ఇన్నోప్రోమ్ ఇండియా కార్యక్రమంతో తయారీ, సాంకేతికత, పెట్టుబడుల రంగాల్లో భారత్ - రష్యా సహకారం మరింత బలోపేతం
2030 నాటికి భారత్ - రష్యా ద్వైపాక్షిక వాణిజ్య లక్ష్యం రూ. 9.45 లక్షల కోట్లకు (100 బిలియన్ అమెరికా డాలర్లు) పెంచాలని నిర్ణయం
13 రాష్ట్రాల్లో రూ.5.35 లక్షల కోట్ల పెట్టుబడులకు అవకాశాలు కల్పించనున్న 20 పారిశ్రామిక స్మార్ట్ నగరాలు
నాడు పోస్టు చేయడమైనది:
09 SEP 2026 7:26PM by PIB Hyderabad
న్యూఢిల్లీలోని భారత్ మండపంలో 2026 సెప్టెంబర్ 9 నుంచి 11 వరకు జరుగుతున్న ఇన్నోప్రోమ్ ఇండియా 2026లో వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ పరిధిలోని పరిశ్రమలు, అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక విభాగానికి (డీపీఐఐటీ) చెందిన జాతీయ పారిశ్రామిక కారిడార్ అభివృద్ధి సంస్థ (ఎన్ఐసీడీసీ) పాల్గొంది.
భారత్ లో తొలిసారిగా నిర్వహిస్తున్న ఇన్నోప్రోమ్ కార్యక్రమం భారత్ - రష్యా ప్రత్యేక, విశిష్ట వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు కీలక వేదికగా నిలుస్తోంది. ఇరు దేశాలకు చెందిన ప్రభుత్వ ప్రతినిధులు, తయారీదారులు, సాంకేతిక సంస్థలు, పెట్టుబడిదారులు, పారిశ్రామిక సంస్థలను ఈ కార్యక్రమం ఒకే వేదికపైకి తీసుకువచ్చింది.
భారత్, రష్యా 2030 నాటికి సుమారు రూ.9.45 లక్షల కోట్ల (100 బిలియన్ అమెరికా డాలర్లు) ద్వైపాక్షిక వాణిజ్య లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాయి. విస్తృత ఆర్థిక భాగస్వామ్యంలో తయారీ, పెట్టుబడులు, సాంకేతిక సహకారం, రవాణా, స్థానికీకరణ, పారిశ్రామిక సమూహాలపై క్రమంగా మరింత దృష్టి కేంద్రీకరిస్తున్నారు.
భారత ప్రభుత్వ వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ, రష్యా పరిశ్రమ, వాణిజ్య మంత్రిత్వ శాఖల సహకారంతో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం తయారీ, పారిశ్రామిక సాంకేతికత, స్థానికీకరణ, పెట్టుబడులు, వ్యాపార భాగస్వామ్యాల రంగాల్లో సహకారాన్ని బలోపేతం చేయడంపై దృష్టి సారించింది.
ఎన్ఐఐసీడీసీ భాగస్వామ్యంతో రష్యా కంపెనీలు, ప్రాంతీయ ప్రభుత్వాలు, సాంకేతిక సేవల సంస్థలు, పెట్టుబడిదారులు, వ్యాపార ప్రతినిధులతో నేరుగా చర్చలు జరిపే అవకాశం లభించింది. దీర్ఘకాలిక తయారీ రంగ పెట్టుబడులకు ఆకర్షణీయమైన గమ్యస్థానాలుగా భారత పారిశ్రామిక కారిడార్లను ప్రదర్శించేందుకు కూడా ఇది దోహదపడింది.
ఎన్ఐఐసీడీసీ ప్రదర్శన స్టాల్‌కు విశేష స్పందన లభించడంతో పాటు పెద్ద సంఖ్యలో ప్రతినిధులు సందర్శించారు. ఎన్ఐసీడీసీకి చెందిన పారిశ్రామిక స్మార్ట్ నగరాలు, పెట్టుబడులకు సిద్ధంగా ఉన్న మౌలిక సదుపాయాలు, భవ్య, పీఎం మిత్ర పార్కులు, ఐసీఎల్‌పీ, డిజిటల్ రవాణా కార్యక్రమాలపై ప్రతినిధులు ఆసక్తి చూపించారు.
ఎన్ఐఐసీడీసీ ప్రతినిధులు వ్యాపార సంస్థల మధ్య సమావేశాలతో పాటు, పెట్టుబడిదారులు, తయారీ సంస్థలు, సాంకేతిక సంస్థలు, ప్రభుత్వ ప్రతినిధులతో ప్రత్యేకంగా చర్చలు జరిపారు. ఈ సందర్భంగా పారిశ్రామిక అభివృద్ధి, తయారీ రంగంలో సహకారం, పరస్పర సహకారానికి అవకాశం ఉన్న రంగాలపై అభిప్రాయాలను పంచుకున్నారు.
ఎన్ఐసీడీసీ బృందం ప్రదర్శనలో పాల్గొన్న వివిధ సంస్థల స్టాళ్లను సందర్శించి, నిర్వాహకులతో చర్చలు జరిపింది. అభివృద్ధి చెందుతున్న పారిశ్రామిక సాంకేతికతలు, తయారీ పరిష్కారాలు, వివిధ రంగాల్లోని సామర్థ్యాల గురించి తెలుసుకున్నారు. ఈ పరస్పర చర్చల ద్వారా విజ్ఞానం, పారిశ్రామిక రంగ అనుభవాలను పంచుకోవడంతో పాటు భారత్ - రష్యా మధ్య పారిశ్రామిక, సాంకేతిక సహకారాన్ని మరింతగా విస్తరించేందుకు అవకాశం ఉన్న రంగాలను గుర్తించారు.
భారతదేశం ప్రణాళికాబద్ధంగా చేపట్టిన అతిపెద్ద పారిశ్రామిక మౌలిక సదుపాయాల కార్యక్రమాల్లో ఒకటైన జాతీయ పారిశ్రామిక కారిడార్ అభివృద్ధి కార్యక్రమం కింద ఉన్న అవకాశాలను ఎన్ఐసీడీసీ ఇన్నోప్రోమ్ ఇండియా 2026లోప్రదర్శించింది.
జాతీయ పారిశ్రామిక కారిడార్ అభివృద్ధి కార్యక్రమం 11 పారిశ్రామిక కారిడార్లు, 20 గ్రీన్‌ఫీల్డ్ పారిశ్రామిక స్మార్ట్ నగరాలు, 13 రాష్ట్రాల్లో విస్తరించి ఉంది. ఇప్పటికే నాలుగు పారిశ్రామిక స్మార్ట్ నగరాలు అభివృద్ధి చెందగా, మరో 16 ప్రాజెక్టులు వివిధ దశల్లో అమలులో ఉన్నాయి.
ఈ ప్రాజెక్టులన్నీ కలిపి సుమారు 19,878 హెక్టార్ల విస్తీర్ణంలో ఉన్నాయి. వీటి ద్వారా దాదాపు రూ.5.35 లక్షల కోట్ల (56.6 బిలియన్ అమెరికా డాలర్లు) పెట్టుబడులకు, సుమారు 14 లక్షల ఉద్యోగాల కల్పనకు అవకాశం ఉందని అంచనా.
పూర్తయిన, రాబోయే ప్రాజెక్టులను కలుపుకుని, సుమారు 2,109 హెక్టార్ల విస్తీర్ణంలో 469 పారిశ్రామిక స్థలాలను కేటాయించారు. వీటి ద్వారా సుమారు రూ.2.21 లక్షల కోట్ల (23.4 బిలియన్ అమెరికా డాలర్లు) పెట్టుబడులకు, దాదాపు 1.29 లక్షలమందికి ఉపాధి కల్పించే అవకాశం ఉంది.
అభివృద్ధి చేసిన నాలుగు పారిశ్రామిక స్మార్ట్ నగరాలు:
*ధోలేరా ప్రత్యేక పెట్టుబడి ప్రాంతం, గుజరాత్
*షేంద్ర-బిడ్కిన్ పారిశ్రామిక ప్రాంతం (ఔరిక్), మహారాష్ట్ర
*ఇంటిగ్రేటెడ్ ఇండస్ట్రియల్ టౌన్‌షిప్ గ్రేటర్ నోయిడా, ఉత్తరప్రదేశ్
*ఇంటిగ్రేటెడ్ ఇండస్ట్రియల్ టౌన్‌షిప్ విక్రమ్ ఉద్యోగ్‌పురి, మధ్యప్రదేశ్
ఈ నగరాలను పెట్టుబడులకు సిద్ధంగా, వెంటనే కార్యకలాపాలు ప్రారంభించుకునేలా తయారీ పారిశ్రామిక వ్యవస్థలుగా అభివృద్ధి చేస్తున్నారు. ఇందులో పూర్తిస్థాయి మౌలిక సదుపాయాలతో కూడిన పారిశ్రామిక భూమి, విశ్వసనీయ విద్యుత్, నీరు, మురుగునీటి నిర్వహణ వ్యవస్థలు, సమాచార, కమ్యూనికేషన్ సాంకేతిక మౌలిక సదుపాయాలు, జాతీయ రహదారులు, రైల్వేలు, నౌకాశ్రయాలు, విమానాశ్రయాలకు బహుముఖ రవాణా అనుసంధానం ఉన్నాయి.
ఈ కార్యక్రమాన్ని ప్రధానమంత్రి గతిశక్తి జాతీయ మాస్టర్ ప్లాన్‌కు అనుగుణంగా కూడా అమలు చేస్తున్నారు. దీని ద్వారా పారిశ్రామిక అభివృద్ధిని ప్రధాన రవాణా, సరకు రవాణా వ్యవస్థలతో సమగ్రంగా అనుసంధానించే అవకాశం కలుగుతుంది.
రష్యాకు చెందిన సంస్థలు సహా పలు ప్రతిష్ఠాత్మక అంతర్జాతీయ కంపెనీలు ఎన్ఐసీడీసీ నగరాల్లో తమ కార్యకలాపాలను నిర్వహిస్తూ, సజావుగా పనిచేస్తున్నాయి.
ద్వైపాక్షిక వేదికలు, పారిశ్రామిక సందర్శనలు, పెట్టుబడులకు సంబంధించిన చర్చల ద్వారా రష్యా ప్రభుత్వ సంస్థలు, దౌత్య వర్గాలు, పారిశ్రామిక సంస్థలు, వ్యాపార ప్రతినిధి బృందాలతో ఎన్ఐసీడీసీ నిరంతరంగా సంప్రదింపులు కొనసాగిస్తోంది. భారత్ - రష్యా తయారీ రంగ సహకారానికి అధునాతన ఇంజినీరింగ్, యంత్ర పరికరాలు, రైల్వేలు, రవాణా పరికరాలు, లోహాలు, ఇంధన, పునరుత్పాదక ఇంధన రంగాలు, ఆటోమొబైల్స్, అంతరిక్ష, రక్షణ, ఔషధాలు, రసాయనాలు, వస్త్రాలు, అధునాతన తయారీ సాంకేతికతలు వంటి రంగాలు ప్రధాన అవకాశాలుగా ఉన్నాయి.
గతంలో రష్యా భాగస్వాములతో జరిగిన చర్చల్లో ఇటువంటి సహకారానికి ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణపట్నం పారిశ్రామిక ప్రాంతం, కర్ణాటకలోని తుమకూరు పారిశ్రామిక ప్రాంతం వంటి ఎన్ఐసీడీసీ నగరాలను పరిశీలించగల ప్రాంతాలుగా గుర్తించారు.
మాస్కో ప్రభుత్వంతో ఎన్ఐసీడీసీ కొనసాగిస్తున్న సంప్రదింపుల్లో, భారత్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి ఉన్న మాస్కోకు చెందిన కంపెనీలను గుర్తించడం, వ్యాపార సంస్థల మధ్య పరస్పర భాగస్వామ్య అవకాశాల కల్పన, వ్యాపార ప్రతినిధి బృందాల పర్యటనలు, పారిశ్రామిక సమూహాలు, ప్రత్యేక ఆర్థిక మండళ్లకు సంబంధించిన అనుభవాల మార్పిడి, ఎన్ఐసీడీసీ నగరంలో రష్యా పారిశ్రామిక సమూహాన్ని ఏర్పాటు చేసే అవకాశాలపై చర్చలు కూడా ఉన్నాయి.
ఇటువంటి పారిశ్రామిక సమూహం ద్వారా రష్యాకు చెందిన ప్రధాన తయారీ సంస్థలు, విడిభాగాల సరఫరాదారులు, సాంకేతిక సంస్థలు, భారతీయ భాగస్వాములను ఒకే వేదికపైకి తీసుకురావచ్చు. తద్వారా స్థానికీకరణ, సాంకేతిక భాగస్వామ్యాలు, పటిష్ఠమైన సరఫరా వ్యవస్థల అభివృద్ధికి తోడ్పడుతుంది.
పారిశ్రామిక కారిడార్లకు మించి, కేంద్ర జౌళి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఏడు పీఎం మెగా ఇంటిగ్రేటెడ్ టెక్స్‌టైల్ రీజియన్ అండ్ అపారెల్ (పీఎం మిత్ర) పార్కులకు ప్రాజెక్టు నిర్వహణ సంస్థగా ఎన్ఐసీడీసీ వ్యవహరిస్తోంది. ఆధునిక మౌలిక వసతులు, మెరుగైన సరకు రవాణా అనుసంధానంతో సమగ్ర జౌళి తయారీ వ్యవస్థలుగా ఈ పార్కులను అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
దేశవ్యాప్తంగా 2026–27 ఆర్థిక సంవత్సరం నుంచి 2031–32 ఆర్థిక సంవత్సరం వరకు పెట్టుబడులకు సిద్ధంగా ఉండే, వెంటనే కార్యకలాపాలు ప్రారంభించుకునే సౌకర్యాలతో కూడిన 100 పారిశ్రామిక పార్కుల అభివృద్ధికి ఉద్దేశించిన భారత్ ఔద్యోగిక వికాస్ యోజన (భవ్య)కు ఎన్ఐసీడీసీ ప్రాజెక్టు నిర్వహణ సంస్థగా మద్దతు అందిస్తోంది. ఈ పథకానికి మొత్తం సుమారు రూ.33,660 కోట్ల (3.56 బిలియన్ అమెరికా డాలర్లు) నిధుల కేటాయింపు ఉంది.
ఎన్ఐసీడీసీ పారిశ్రామిక కారిడార్ భూ వేదిక (ఐసీఎల్‌పీ)ను కూడా ప్రదర్శించింది. భౌగోళిక సమాచార వ్యవస్థ ఆధారంగా రూపొందించిన ఈ జాతీయ వేదిక ద్వారా దేశవ్యాప్తంగా 4,000 పైగా పారిశ్రామిక పార్కులకు సంబంధించిన భూమి లభ్యత, మౌలిక వసతులు, అనుసంధానత వంటి వివరాలను పెట్టుబడిదారులకు అందిస్తుంది.
లాజిస్టిక్స్ డేటా సర్వీసెస్ లిమిటెడ్ (ఎన్ఎల్‌డీఎస్ఎల్) యూనిఫైడ్ లాజిస్టిక్స్ ఇంటర్‌ఫేస్ ప్లాట్‌ఫామ్ (యూఎల్ఐపీ), లాజిస్టిక్స్ డేటా బ్యాంక్ (ఎల్‌డీబీ) ద్వారా భారతదేశ డిజిటల్ లాజిస్టిక్స్ వ్యవస్థను కూడా ఎన్ఐసీడీసీ బలోపేతం చేస్తోంది. ఎల్‌డీబీ ఎగుమతి, దిగుమతి కంటైనర్ల రవాణాపై ప్రారంభం నుంచి ముగింపు వరకు సమగ్ర దృశ్యమానతను అందిస్తూ, ఇప్పటివరకు 10 కోట్లకు పైగా కంటైనర్లను ట్రాక్ చేసింది.
ఎన్ఎల్‌డీఎస్ఎల్ కోయ్లా శక్తి – స్మార్ట్ కోల్ అనలిటిక్స్ డ్యాష్‌బోర్డ్‌తో పాటు ట్రాక్ యువర్ ట్రాన్స్‌పోర్ట్ (టీవైటీ), ట్రాన్స్‌పోర్ట్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ (టీఎంఎస్), లాజిస్టిక్స్ ఈ-మార్కెట్‌ప్లేస్ (ఎల్ఈఎంపీ) వంటి పరిష్కారాలను కూడా అభివృద్ధి చేసింది. ఇవి రవాణా అంశాలపై దృశ్యమానత, సామర్థ్యం, డేటా ఆధారిత నిర్ణయాలను మెరుగుపరచడంలో సహాయపడుతున్నాయి.
పారిశ్రామిక స్మార్ట్ నగరాలు, పీఎం మిత్ర పార్కులు, భవ్య, ఐసీఎల్‌పీ, డిజిటల్ లాజిస్టిక్స్ వ్యవస్థ ద్వారా ఎన్ఐసీడీసీ భారత్‌ను పోటీతత్వం కలిగిన తయారీ, స్థానికీకరణ, పెట్టుబడుల గమ్యస్థానంగా తీర్చిదిద్దుతోంది. ఆ విధంగా భారత్ - రష్యా ఆర్థిక సహకారాన్ని పారిశ్రామిక పెట్టుబడులు, సాంకేతిక భాగస్వామ్యాలు, ఉపాధి అవకాశాలు, పటిష్ఠమైన సరఫరా వ్యవస్థలుగా మార్చేందుకు దోహదపడుతోంది.
***
(రిలీజ్ ఐడి: 2308565)
సందర్శకుల సూచీ సంఖ్య : : 13