సాంఘిక న్యాయం, మరియు సాధికారత మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

మత్తు పదార్థాల రహిత భారత్‌ కోసం ఆధ్యాత్మిక శక్తి

'నషా ముక్త్ భారత్ అభియాన్'లో చేరిన అధ్యాత్మ్ విజ్ఞాన సత్సంగ కేంద్రం, చిన్మయ మిషన్, దివ్య జ్యోతి జాగృతి సంస్థాన్, హరే కృష్ణ ఉద్యమం వంటి మరో నాలుగు ఆధ్యాత్మిక సంస్థలు

కార్యదర్శి శ్రీ సుధాంశు పంత్ సమక్షంలో సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖతో అవగాహన ఒప్పందాలపై సంతకాలు చేసిన ఆయా సంస్థలు

మాదక ద్రవ్యాల వ్యసనానికి వ్యతిరేకంగా క్షేత్రస్థాయిలో అవగాహన, నివారణ, పునరావాసం, సామాజిక సమీకరణను బలోపేతం చేయడానికి దోహదపడనున్న ఈ సంస్థలు

నాడు పోస్టు చేయడమైనది: 09 SEP 2026 5:50PM by PIB Hyderabad

నషా ముక్త్ భారత్‌ను తయారుచేసే ప్రయత్నాలను మరింత బలోపేతం చేసే దిశగా కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ మరో అడుగు వేసింది. ఢిల్లీలోని మంత్రిత్వ శాఖ చింతన్ కాన్ఫరెన్స్ హాల్‌లో నాలుగు ప్రముఖ ఆధ్యాత్మిక సంస్థలైన ‘అధ్యాత్మ్ విజ్ఞాన సత్సంగ కేంద్రం, చిన్మయ మిషన్, దివ్య జ్యోతి జాగృతి సంస్థాన్, హరే కృష్ణ ఉద్యమం‌’లతో సామాజిక న్యాయం- సాధికారత శాఖ (డీఓఎస్‌జేఈ) అవగాహనా ఒప్పందాలపై (ఎంఓయూ) సంతకాలు చేసింది.

 

సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ సుధాంశు పంత్, మాదక ద్రవ్యాల నివారణ శాఖ సంయుక్త కార్యదర్శి డాక్టర్ సందీప్ ఆర్. రాథోడ్, ఈ శాఖకు చెందిన సీనియర్ అధికారులు, ఆయా ఆధ్యాత్మిక సంస్థల ప్రతినిధుల సమక్షంలో ఈ ఒప్పందాలు కుదిరాయి.

 

సామాజిక న్యాయం, సాధికారత శాఖ తరఫున డైరెక్టర్ (మాదక ద్రవ్యాల నివారణ) శ్రీ ఆస్తిక్ కుమార్ పాండే ఈ అవగాహనా ఒప్పందాలపై సంతకం చేశారు. సభికుల హర్షధ్వానాల మధ్య ఈ ఒప్పంద పత్రాలను పరస్పరం మార్చుకున్నారు. 

 

అధ్యాత్మ్ విజ్ఞాన సత్సంగ కేంద్రం నుంచి శ్రీ చంద్ర సింగ్, చిన్మయ మిషన్ నుంచి శ్రీమతి ప్రేమ విశ్వనాథ్, దివ్య జ్యోతి జాగృతి సంస్థాన్ నుంచి సాధ్వి శితాభ భారతి, హరే కృష్ణ ఉద్యమం నుంచి శ్రీ ఫతే చంద్ శర్మ ఈ అవగాహన ఒప్పందాలపై సంతకాలు చేశారు.

 

 

మాదక ద్రవ్యాల వ్యసనానికి వ్యతిరేకంగా అవగాహన, నివారణ, సామాజిక సమీకరణను బలోపేతం చేయడానికి ఆధ్యాత్మిక, నైతిక విలువల ఆధారిత సంస్థలకు ఉన్న విస్తృతమైన ప్రభావం, కమ్యూనిటీ నెట్‌వర్క్‌లను ఉపయోగించుకోవడానికి 'నషా ముక్త్ భారత్ అభియాన్' (ఎన్ఎంబీఏ) కింద ఈ శాఖ చేస్తున్న నిరంతర ప్రయత్నాలలో భాగంగా ఈ భాగస్వామ్యాలను కుదుర్చుకుంది. 

 

ఈ సమావేశాన్ని ఉద్దేశించి సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ సుధాంశు పంత్ మాట్లాడుతూ.. 'నషా ముక్త్ భారత్' ఆశయ సాధనలో ఆధ్యాత్మిక సంస్థల ప్రాముఖ్యతను ప్రధానంగా చెప్పారు. ఇప్పటికే మంత్రిత్వ శాఖతో కలిసి పనిచేస్తున్న సంస్థల కృషిని ఆయన అభినందించారు. ఎన్ఎంబీఏ కింద వారి సమష్టి కార్యక్రమాల ద్వారా ఈ శాఖ ఇప్పటివరకు 34.42 కోట్లకు పైగా ప్రజలను చేరుకోగలిగిందని ఆయన తెలిపారు. 

మత్తుపదార్థాల నివారణ, అవగాహన, పునరావాస సందేశాన్ని ముఖ్యంగా క్షేత్రస్థాయిలో విస్తృతంగా ప్రచారం చేయడానికి నూతనంగా భాగస్వామ్యాలు కుదుర్చుకున్న సంస్థలు తమ విస్తృత నెట్‌వర్క్‌లను పూర్తిగా ఉపయోగించుకోవాలని కార్యదర్శి పిలుపునిచ్చారు. ప్రభుత్వ చొరవ, పౌర సమాజం- ఆధ్యాత్మిక సంస్థల సమష్టి సామర్థ్యం మాదకద్రవ్యాల వ్యసనానికి వ్యతిరేకంగా ఒక సుస్థిర సామాజిక ఉద్యమాన్ని సృష్టించడంలో సహాయపడుతుందని ఆయన చెప్పారు.

ఆధ్యాత్మిక బలం, సామాజిక బాధ్యత, సామాజిక సమీకరణను ఒకదగ్గరికి చేర్చడమే ఎన్ఎంబీఏ కింద ఆధ్యాత్మిక సంస్థల భాగస్వామ్య ప్రధాన ఉద్దేశమని శ్రీ సుధాంశు పంత్ తెలిపారు. వ్యక్తులు, కుటుంబాలలో మానసిక స్థైర్యాన్ని పెంపొందించడంలో, మాదకద్రవ్యాల వ్యసనానికి సంబంధించిన సామాజిక కళంకాన్ని తగ్గించడంలో.. బాధితులు సకాలంలో సహాయం, చికిత్స, పునరావాసం పొందేలా ప్రోత్సహించడంలో వాటి విస్తృత క్షేత్రస్థాయి నెట్‌వర్క్‌ కీలక పాత్ర పోషిస్తుందని ఆయన పేర్కొన్నారు.

ఈ భాగస్వామ్యాల ద్వారా నివారణ, పునరావాసం, కరుణ, సామాజిక బాధ్యత అనే సందేశాలు సమాజంలోని వివిధ వర్గాలకు చేరేలా చూసుకుంటూ దానిని ఒక సుస్థిర ప్రజా ఉద్యమంగా తయారు చేయడమే మంత్రిత్వ శాఖ లక్ష్యమని కార్యదర్శి స్పష్టం చేశారు.

నషా ముక్త్ భారత్ ఆశయ సాధనకు మనలో ఉన్న సమష్టి సంకల్పాన్ని ఆధ్యాత్మిక, సామాజిక సంస్థల విస్తరిస్తున్న నెట్‌వర్క్ మరింత బలపరుస్తుందని.. 'వికసిత భారత్' నిర్మాణానికి ఇది దోహదపడుతుందని శ్రీ సుధాంశు పంత్ అన్నారు.

మాదక ద్రవ్యాల నివారణ, పునరావాస కార్యక్రమాలలో జనజాగృతి, స్వచ్ఛంద సేవా సమీకరణతో పాటు యోగా, ధ్యానం, ఆధ్యాత్మిక కౌన్సెలింగ్, నైతిక విలువల ఆధారిత పద్ధతులను కలిపేందుకు ఈ భాగస్వామ్యాలు ఎంతగానో దోహదపడతాయని కార్యదర్శి పేర్కొన్నారు.

సమాజానికి మార్గదర్శనం చేయడంలో, క్రమశిక్షణను పెంపొందించడంలో, విలువలతో కూడిన జీవితాన్ని ప్రోత్సహించడంలో వ్యక్తిగత, కుటుంబ స్థైర్యాన్ని బలపరచటంలో ఆధ్యాత్మిక సంస్థలు పోషిస్తున్న కీలక పాత్రను గుర్తిస్తూ గతంలో 'ది ఆర్ట్ ఆఫ్ లివింగ్, బ్రహ్మకుమారీస్, సంత్ నిరంకారీ మిషన్, ఇస్కాన్, శ్రీ రామచంద్ర మిషన్, అఖండ విశ్వ గాయత్రీ పరివార్, శివానంద యోగ వేదాంత ధన్వంతరి ఆశ్రమం, పతంజలి విశ్వవిద్యాలయా'లతో కూడా మంత్రిత్వ శాఖ అవగాహన ఒప్పందాలు కుదుర్చుకుంది.

ఈ కార్యక్రమంలో భాగంగా పాల్గొన్న సంస్థల ప్రతినిధులతో కార్యదర్శి మాదకద్రవ్యాల వ్యతిరేక ప్రతిజ్ఞ చేయించారు. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణానికి మన సమష్టి నిబద్ధతను మరింత బలోపేతం చేయడానికి ఆయా సంస్థలు తమ ప్రధాన కార్యక్రమాలు, వేడుకలు, బహిరంగ సభలలో కూడా ఈ ప్రతిజ్ఞను చేయించాలని కోరారు. 

మాదక ద్రవ్యాల దుష్ప్రభావాల విషయంలో అవగాహనతో పాటు బాధితుల పునరావాసానికి ఉన్న ప్రాముఖ్యతను తెలియజేస్తూ మంత్రిత్వ శాఖ రూపొందించిన మూడు లఘు చిత్రాలను ఈ సందర్భంగా ప్రదర్శించారు. ఎన్‌ఎంబీఏ పోర్టల్‌లో 'నషా ముక్తి మిత్ర'గా నమోదు చేసుకోవడం, ఈ-ప్రతిజ్ఞ చేయడం వంటి వివిధ కార్యక్రమాల గురించి పాల్గొన్న వారికి వివరించారు.

 

***


(రిలీజ్ ఐడి: 2308510) సందర్శకుల సూచీ సంఖ్య : : 7
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Tamil