బొగ్గు మంత్రిత్వ శాఖ
బొగ్గు కంపెనీల కోసం తొలి ప్రత్యేక ‘సీఎస్‌ఆర్’ చట్రానికి కేంద్ర బొగ్గు-గనులశాఖ మంత్రి శ్రీ జి.కిషన్ రెడ్డి శ్రీకారం
· ‘తలసేమియా బాల సేవా యోజన’.. ‘నన్హా సా దిల్’ పథకాల కింద సాధించిన విజయాలకు ప్రశంసలు
· సీఐఎల్ ప్రతిష్టాత్మక ‘సీఎస్ఆర్’ పథకాల కింద 1,050కి పైగా ఎముక మజ్జ మార్పిడి.. గుండె లోపాలను సరిదిద్దే 1,500 శస్త్ర చికిత్సలు పూర్తి
నాడు పోస్టు చేయడమైనది:
08 SEP 2026 7:48PM by PIB Hyderabad
కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ, కోల్ ఇండియా లిమిటెడ్ (సీఐఎల్) తాము కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద చేపట్టిన ప్రధాన కార్యక్రమాలు ‘తలసేమియా బాల్ సేవా యోజన’ (టీబీఎస్‌వై), ‘నన్హా సా దిల్’ ద్వారా సాధించిన కీలక విజయాలపై న్యూడిల్లీలో ఇవాళ ఒక వేడుకను నిర్వహించాయి. ఇదే వేదికపై భారతీయ బొగ్గు కంపెనీల కోసం సమగ్ర ‘సీఎస్‌ఆర్’ చట్రాన్ని కూడా ఆవిష్కరించాయి.
ఈ కార్యక్రమానికి కేంద్ర బొగ్గు-గనుల శాఖ మంత్రి శ్రీ జి.కిషన్ రెడ్డి, సహాయ మంత్రి శ్రీ సతీష్ చంద్ర దూబే, కార్యదర్శి శ్రీ విక్రమ్ దేవ్ దత్ హాజరు కాగా, పలువురు ఉన్నతాధికారులు సహా వైద్య నిపుణులు, పథకాల అమలు భాగస్వామ్య సంస్థలు, లబ్ధిదారుల కుటుంబాలు కూడా ఇందులో పాల్గొన్నారు.
తలసేమియా బాల్ సేవా యోజన (టీబీఎస్‌వై)
అరుదైన జన్యు సంబంధిత రక్త రుగ్మతలు- తలసేమియా, అప్లాస్టిక్ అనీమియా పీడితులైన బాలల చికిత్స లక్ష్యంగా ‘టీబీఎస్‌వై’ని దేశవ్యాప్తంగా ప్రారంభించారు. ఇది తొలుత 4 ఆసుపత్రులతో మొదలై, ప్రస్తుతం 21 గుర్తింపు పొందిన ఆసుపత్రుల స్థాయికి విస్తరించింది. ఈ అరుదైన జన్యు సంబంధ రక్త రుగ్మతల పీడితులకు చికిత్స కోసం ఇంత భారీ స్థాయిలో ఆరోగ్య సంరక్షణ కార్యక్రమం చేపట్టిన ఏకైక కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ (సీపీఎస్‌ఈ) ‘సీఐఎల్’ ఒక్కటే కావడం గమనార్హం. నాలుగు దశలలో అమలు చేసే ఈ పథకాన్ని రూ.130 కోట్లతో చేపట్టగా, ఎముక మజ్జ మార్పిడి (బీఎంటీ) చికిత్స కోసం ప్రతి రోగికి రూ.10 లక్షల వంతున గుర్తింపు పొందిన ఆసుపత్రులకు నేరుగా నిధులు అందజేస్తారు. ఈ మేరకు ఇప్పటిదాకా 1,050 మందికి పైగా బాలలు బీఎంటీ ప్రక్రియ ద్వారా చికిత్స పొందారు. వీరిలో అత్యధికులు ఇప్పుడు సాధారణ, ఆరోగ్యకర జీవితం గడుపుతుండటం విశేషం. ‘తలసేమిక్స్ ఇండియా’ సహకారంతో అమలయ్యే ఈ పథకాన్ని కేంద్ర ఆరోగ్య-కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ మార్గదర్శక సూత్రాల ప్రకారం పర్యవేక్షిస్తున్నారు.
నన్హా సా దిల్ (ఎన్‌ఎస్‌డీ)
దేశంలో ఏటా సుమారు 2.4 లక్షల మంది నవజాత శిశువులు పుట్టుకతో సంక్రమించే గుండె జబ్బుల (సీహెచ్‌డీ)కు లోనవుతున్నారు. వీరిలో కేవలం 5 శాతం బాలలకు మాత్రమే సకాలంలో చికిత్స లభిస్తుండగా, ‘శ్రీ సత్యసాయి హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ ట్రస్ట్’ భాగస్వామ్యంతో సీఐఎల్ ‘నన్హా సా దిల్’ పేరిట పథకాన్ని ప్రారంభించింది. జార్ఖండ్‌లోని నాలుగు జిల్లాల్లో 2024 మార్చిలో ఈ పథకానికి శ్రీకారం చుట్టగా, సీఐఎల్ అనుబంధ సంస్థలైన ఎస్‌ఈసీఎల్, సీసీఎల్, ఎన్‌సీఎల్, డబ్ల్యూసీఎల్ దీన్ని మరింత విస్తరింపజేశారు. ఆధునిక రోగ నిర్ధారణ ఉపకరణాల ద్వారా 2 లక్షల మందికిపైగా బాలలకు పరీక్షలు నిర్వహించి 1,500 మందికి శస్త్రచికిత్స చేశారు. వారితోపాటు కుటుంబ సభ్యులకూ ప్రయాణ, ఆసుపత్రి ఖర్చులు సహా వైద్య సేవలు పూర్తి ఉచితంగా లభించాయి.
భారత బొగ్గు కంపెనీల కోసం సమగ్ర కార్పొరేట్ సామాజిక బాధ్యత చట్రం
ఫలితాధారిత కార్పొరేట్ సామాజిక బాధ్యత కార్యక్రమాల దిశగా బొగ్గు రంగం కోసం సమగ్ర ‘సీఎస్‌ఆర్’ చట్రాన్ని కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ ప్రారంభించింది. కంపెనీల చట్టం-2013 ప్రకారం చట్టబద్ధ ‘సీఎస్‌ఆర్’ అమలులోకి వచ్చాక ప్రత్యేకించి ఒక రంగం కోసం తొలిసారి ఇలాంటి చట్రం రూపొందడం ఓ కీలక ఘట్టం. ఈ చట్రాన్ని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ (ఐఐసీఏ) రూపొందించింది. బొగ్గు గనుల ప్రాంతాల్లో నివసించే ప్రజల ప్రయోజనార్థం, ప్రభావశీల, ఫలితాధారిత ‘సీఎస్‌ఆర్’కు ఇది మార్గనిర్దేశం చేస్తుంది.
ఈ సందర్భంగా శ్రీ జి.కిషన్ రెడ్డి మాట్లాడుతూ- గత దశాబ్ద కాలంలో ఆరోగ్య సంరక్షణ, విద్య, జీవనోపాధి, సామాజికాభివృద్ధి రంగాలలో సీఐఎల్ కొనసాగిస్తున్న సీఎస్‌ఆర్ నిబద్ధతను కొనియాడారు. ఈ మేరకు అమలు చేస్తున్న ‘టీబీఎస్‌వై’, ‘ఎన్‌ఎస్‌డీ’ పథకాలతోపాటు ‘ఎస్‌ఈసీఎల్’ ‘సుశ్రుత్’ వంటి కీలక కార్యక్రమం నిర్వహించడాన్ని ఆయన ప్రశంసించారు. తలసేమియా, పుట్టుకతో వచ్చే గుండె జబ్బులతో దేశవ్యాప్తంగా అనేకమంది బాలల బాధపడుతున్నారని గుర్తుచేశారు. వారి ప్రయోజనార్థం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, అమలు సంస్థలు, తల్లిదండ్రుల సంఘాలు సహా యావత్ సమాజం బాధ్యత స్వీకరించాల్సిన ఆవశ్యకతను ఆయన స్పష్టం చేశారు. ఈ పథకాల కింద చికిత్స పొంది కోలుకున్న బాలల ఉజ్వల భవిష్యత్తు దిశగా వారి విద్యావసరాలకు ప్రభుత్వ చేయూత ఉంటుందని ఆయన భరోసా ఇచ్చారు.
ప్రతి బిడ్డకూ మెరుగైన చికిత్స, అవసరమైన ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలు, గౌరవప్రద జీవనానికి తగిన అవకాకాలు అందుబాటులో ఉండాలని బొగ్గు-గనుల శాఖ సహాయ మంత్రి శ్రీ సతీష్ చంద్ర దూబే అన్నారు. తలసేమియా బాధితులకు చికిత్స, వారి కుటుంబాలకు మద్దతుగా సీఐఎల్ తన ‘సీఎస్ఆర్’ కార్యక్రమాల ద్వారా చేస్తున్న కృషిని ఆయన అభినందించారు.
బొగ్గు మంత్రిత్వశాఖ కార్యదర్శి శ్రీ విక్రమ్ దేవ్ దత్ ప్రసంగిస్తూ- ఆపన్నులైన బాలలు, వారి కుటుంబాలకు ప్రాణరక్షక ఆరోగ్య సంరక్షణ కల్పనలో సీఐఎల్ చేపట్టిన సీఎస్‌ఆర్ కార్యక్రమాల పరిణామాత్మక ప్రభావాన్ని ప్రముఖంగా ప్రస్తావించారు. ఈ క్రమంలో వైద్యులు, చికిత్సలందించే జాబితాలోని ఆసుపత్రులు, భాగస్వామ్య సంస్థల నిస్వార్థ సేవాభావనను ఆయన ప్రశంసించారు. నాణ్యత, హామీ సహిత సంరక్షణ, కేసులపై తక్షణ పర్యవేక్షణ, పారదర్శకత, జవాబుదారీతనం, విస్తరణ సామర్థ్యం వంటివి ఈ కార్యక్రమాలకు కీలక స్తంభాలని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో భాగంగా తొలుత బొగ్గు మంత్రిత్వశాఖ అదనపు కార్యదర్శి శ్రీమతి రూపీదర్ బ్రార్ ఆహూతులకు స్వాగతం పలికారు. ప్రజల జీవన స్థితిగతులను తెలుసుకోవడం, సమాజాలకు సాధికారత కల్పన, అత్యంత ఆపన్నులకు అవకాశాల సృష్టిలోనే సీఎస్‌ఆర్ వాస్తవిక స్ఫూర్తి ప్రస్ఫుటం కాగలదని ప్రముఖంగా ప్రస్తావించారు. ఈ కార్యక్రమాలు స్థానిక అవసరాలతో మమేకమై, సునిశిత ప్రణాళిక సహితంగా విస్పష్ట ఫలితాలు సాధించేలా చూసుకోవాల్సిన అవసరాన్ని ఆమె స్పష్టం చేశారు. ఈ కొత్త చట్రంతో బొగ్గు రంగమంతటా సీఎస్‌ఆర్ కార్యకలాపాలు మరింత ప్రభావశీలం, నిర్మాణాత్మకం, పారదర్శకం, ఫలితాధారితంగా సాగడంలో ఈ చట్రం ఓ కీలక మలుపని చెప్పారు. తద్వారా ప్రతి కార్యక్రమం క్షేత్రస్థాయిలో వాస్తవ ప్రయోజనకారిగా మారి, బలమైన, ఆరోగ్యకర, సాధికార సమాజ వికాసానికి దోహదం చేస్తుందని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ముంబయిలోని కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆసుపత్రి ట్రాన్స్‌ప్లాంట్ యూనిట్ అధిపతి డాక్టర్ శాంతను సేన్ మాట్లాడుతూ- దేశంలో ఏటా 10,000 మందికి పైగా బాలలు తలసేమియాతో జన్మిస్తున్నారని వెల్లడించారు. వారి జీవితమంతా రక్త మార్పిడితోనే గడిచిపోవాల్సి వస్తుందని ఆయన అన్నారు. అయినప్పటికీ, వీరిలో అధికశాతం ఎక్కువ కాలం జీవించలేరని చెప్పారు. దీనికిగల ఏకైక నివారణ మార్గం ఎముక మజ్జ మార్పిడి (బోన్ మ్యారో ట్రాన్స్ ప్లాంట్-బీఎంటీ) మాత్రమేనని వివరించారు. అయితే, ఈ చికిత్స అత్యంత ఖరీదైనది కావడంతో వ్యాధి పీడితుల తల్లిదండ్రులకు శక్తికి మించిన భారం అవుతోందన్నారు. ఈ నేపథ్యంలో వినూత్న ‘టీబీఎస్‌వై’ ద్వారా అత్యంత ఖరీదైన విశిష్ట ప్రాణరక్షక చికిత్సను వారికి అందుబాటులోకి తేవడంపై వైద్య సమాజం తరపున ‘సీఐఎల్’కు ఆయన ధన్యవాదాలు తెలిపారు.
ఈ పథకాల ద్వారా లబ్ధి పొందిన బాలలు, వారి కుటుంబాలు ఈ సందర్భంగా కోల్ ఇండియా లిమిటెడ్, బొగ్గు మంత్రిత్వశాఖ, వైద్యులు, ఆసుపత్రులు, భాగస్వామ్య సంస్థలకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. తమ వ్యక్తిగత అనుభవాలను పంచుకుంటూ- సకాలంలో చికిత్స అందడంతో తమ జీవితాల్లో త్త ఆశలు చిగురించాయని పెద్దలు వివరించారు. అలాగే, ఆత్మవిశ్వాసంతో ఉజ్వల భవిష్యత్తు వైపు పయనించే అవకాశం దక్కడంపై బాలలు కృతజ్ఞతాంజలి సమర్పించారు. వారి మాటలు, చిరునవ్వులు కార్పొరేట్ సామాజిక బాధ్యత వాస్తవిక ప్రభావాన్ని ప్రతిబింబించాయి. ప్రగతిశీల గణాంకాలు లేదా ప్రాజెక్టులకే కాకుండా మలి చిగురు తొడిగిన జీవితాలు, పునరుజ్జీవనం పొందిన కలలు, ఉజ్వల భవిష్యత్తుకూ అవి ప్రతీకగా నిలిచాయి.
ఈ సందర్భంగా టీబీఎస్‌వై విజయ ప్రస్థానంపై రూపొందించిన పుస్తకావిష్కరణతో పాటు ఆరోగ్య రంగంలో సీఐఎల్ చేపట్టిన సీఎస్‌ఆర్ కార్యక్రమాలపై లఘు చిత్రాల ప్రదర్శన నిర్వహించారు. అలాగే, వైద్యులు-ప్రముఖులకు సత్కారం, లబ్ధిదారుల కుటుంబాలతో ముఖాముఖి వంటివి కార్యకలాపాలు చోటుచేసుకున్నాయి.
***
(రిలీజ్ ఐడి: 2308120)
సందర్శకుల సూచీ సంఖ్య : : 10