ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

అనువాదం: ముంబయిలో జరిగిన గ్లోబల్ ఫిన్‌టెక్ ఫెస్ట్ (జీఎఫ్ఎఫ్) 2026 ప్రారంభోత్సవంలో ప్రధానమంత్రి ప్రసంగం

నాడు పోస్టు చేయడమైనది: 08 SEP 2026 8:14PM by PIB Hyderabad

భారత్, విదేశాల నుంచి గ్లోబల్ ఫిన్‌టెక్ ఫెస్ట్‌కు విచ్చేసిన అతిథులందరికీ నేను స్వాగతం పలుకుతున్నాను. ఈ రోజు మరో హ్యాట్రిక్ సాధించడం నాకు ఎంతో ఆనందంగా ఉంది. 2024లో ప్రభుత్వం మూడోసారి ఏర్పడినప్పుడు ఒక హ్యాట్రిక్ నమోదైతే నేడు మీ మధ్యలో నా హాజరు రూపంలో మరో హ్యాట్రిక్ నమోదైంది. గ్లోబల్ ఫిన్‌టెక్ ఫెస్ట్‌కు నేను వరుసగా హాజరవుతుండటం ఇది మూడోసారి. వికసిత్ భారత్ నిర్మాణంలో మీరు ఎంత ముఖ్యమో, మీ పని ఎంత ప్రాముఖ్యమైందో ఈ హ్యాట్రిక్ తెలియజేస్తోంది.

మిత్రులారా, 

ఇక్కడకు వచ్చిన ప్రతిసారీ నేను మరింత మంది యువతను చూస్తున్నాను.. మరింత శక్తిని పొందుతున్నాను. అవకాశాల పరిధి మరింత విస్తరిస్తున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. రిస్క్ తీసుకునే సామర్థ్యం పెరుగుతోందని, కలలు మరింత సాహసోపేతంగా మారుతున్నాయని అర్థమవుతోంది. అందువల్లనే అభివృద్ధి చెందిన భారతదేశం భవిష్యత్తుపై నాకున్న విశ్వాసం మరింత బలపడుతోంది.

మిత్రులారా,

ఫిన్‌టెక్ రంగంలోని ఈ ఉత్సాహం మధ్య ముంబయిలో ఈ రోజుల్లో సాంస్కృతిక శక్తి కూడా తారాస్థాయిలో ఉంది. మరో కొన్ని రోజుల్లో మహారాష్ట్రలో, దేశవ్యాప్తంగా గణేష్ ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. మన సంప్రదాయంలో ప్రతి శుభకార్యానికి ముందు వినాయకుడిని స్మరించుకుంటాం. గణపతి బప్పాకు నమస్కరిస్తూ గ్లోబల్ ఫిన్‌టెక్ ఫెస్ట్ 2026లో పాల్గొంటున్న మీ అందరికీ నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.

మిత్రులారా,

ప్రపంచ పరిస్థితి ఎలా ఉందో మీ అందరికీ బాగా తెలుసు. ప్రపంచం ప్రస్తుతం ఘర్షణలు, అనిశ్చితి కాలాన్ని ఎదుర్కొంటోంది. ఇంధనం, వస్తు సరఫరా వ్యవస్థలు తీవ్ర ఒత్తిడిలో ఉన్నాయి. వాణిజ్య రంగంలో ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఈ పరిస్థితులు ఎంతోకాలంగా కొనసాగుతున్నాయి. ఏప్రిల్ నుంచి జూన్ వరకు ఉన్న త్రైమాసికం అత్యంత సవాలుతో కూడుకున్నది. అటువంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా భారత్ 7.8 శాతం వృద్ధి రేటును సాధించినప్పుడు ప్రపంచానికి ఒక నూతన ఆత్మవిశ్వాసం లభిస్తుంది. ఆ నమ్మకాన్ని నేను ఇక్కడ మీ ముఖాల్లో స్పష్టంగా చూడగలను.

మిత్రులారా, 

భారత్‌పై పెరుగుతున్న ఈ విశ్వాసానికి మన సార్వభౌమ క్రెడిట్ రేటింగ్‌లు మరో ఉదాహరణ. ఇటీవల  జపాన్‌కు చెందిన ఒక క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ భారతదేశ సార్వభౌమ క్రెడిట్ రేటింగ్‌ను 'ఏ' కేటగిరీకి అప్‌గ్రేడ్ చేసింది. రేటింగ్ పెరగడం సంతోషకరమైన విషయమే అయినప్పటికీ ఈ అదృష్టం మూడు దశాబ్దాల తర్వాత అంటే ముప్పై సంవత్సరాల తర్వాత దక్కిందనే విషయం చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు. భారత్ వృద్ధి వేగం, మన స్థూల ఆర్థిక స్థిరత్వం, ఇటీవలి సంవత్సరాలలో చేపట్టిన నిర్మాణత్మక సంస్కరణల పట్ల ప్రపంచం ఎంతటి భరోసాతో ఉందో ఇది నిరూపిస్తోంది. నేను మళ్లీ చెబుతున్నాను.. భారతదేశ సంస్కరణల వేగం మరింత ఎక్కువ వేగంతో ముందుకు దూసుకుపోతుంది.

మిత్రులారా,

భారతదేశ ఫిన్‌టెక్ ప్రయాణం అసాధారణమైంది. దీనికి ఉన్న అతిపెద్ద ప్రచారకర్తలలో మన యూపీఐ ఒకటి. నేను గత ఏడాది కూడా దీని గురించి మాట్లాడాను. కానీ ఈ పరివర్తన ఎంత పెద్దదంటే ఎప్పుడు ఫిన్‌టెక్ గురించి చర్చించినా యూపీఐ లేకుండా అది ఎప్పటికీ అసంపూర్ణంగానే ఉంటుంది.

మిత్రులారా,

కొద్ది రోజుల క్రితం ఆగస్టు 25న యూపీఐ పదేళ్లు పూర్తి చేసుకుంది. పదేళ్ల క్రితం మీ బ్యాంక్ మీ చేతివేళ్ల మీద ఉంటుందని నేను చెప్పినప్పుడు కొందరు ఇది అసాధ్యం అని భావించారు. నేను బాగా అవగాహన ఉన్న వ్యక్తుల గురించే మాట్లాడుతున్నాను. వారి ముఖాలను గుర్తుంచుకోండి. అప్పుడే కొత్తగా బ్యాంకు ఖాతాలు తెరిచిన లక్షలాది మంది సాధారణ భారతీయుల గురించి నేను మాట్లాడటం లేదు. వారు తరతరాలుగా ఎప్పుడూ బ్యాంకు తలుపు కూడా చూడలేదు. కానీ ఈ రోజు పదేళ్ల తర్వాత చూడండి. తరతరాలుగా బ్యాంకింగ్ వ్యవస్థకు వెలుపల ఉన్న అదే లక్షలాది మంది ప్రజలు భారత్‌లో ఫిన్‌టెక్ వృద్ధికి అతిపెద్ద చోదక శక్తులుగా మారారు.

మిత్రులారా, 

ఈ రోజు ఒక్క ఆగస్టు నెలలోనే యూపీఐ ద్వారా 2,400 కోట్లకు పైగా లావాదేవీలు జరిగాయి. అంటే మనం ఇక్కడ కూర్చున్న ఈ సమయంలో కేవలం 10 నిమిషాల్లోనే దేశవ్యాప్తంగా సగటున 5 మిలియన్లకు పైగా యూపీఐ లావాదేవీలు జరిగాయి. ఈ ప్రభావం వల్లే ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ మాట్లాడుతూ.. యూపీఐ కేవలం ఒక సాంకేతిక కథ మాత్రమే కాదని అది ఒక నాగరికతా ప్రయాణమని అభివర్ణించారు.

మిత్రులారా,

యూపీఐ ఇప్పుడు కేవలం భారతదేశానికే పరిమితం కాలేదు. కొద్ది సంవత్సరాల క్రితం ఒక భారతీయ బ్యాంకు ఖాతా నుంచి నేరుగా విదేశాల్లో చెల్లింపులు చేయొచ్చు అని ఎవరైనా చెబితే దాదాపు ఎవరూ నమ్మి ఉండే వారు కాదు. కానీ నేడు అది వాస్తవ రూపం దాల్చింది. భారతదేశ యూపీఐ ఇప్పుడు 11 దేశాల్లో అందుబాటులో ఉంది. ఇవి మనం ఎంత సుదీర్ఘ ప్రయాణం చేశామో తెలిపే అసాధారణమైన గణాంకాలు. కానీ ఇప్పుడు ప్రశ్న ఏంటంటే.. మనం ఈ ప్రయాణంతో సంతృప్తి చెందాలా? భారతదేశంలో ఫిన్‌టెక్ విజయాన్ని మనం అంతిమంగా భావించాలా?

మిత్రులారా,

నేను విధాన రూపకల్పన, పరిపాలనా వ్యవస్థలో 25 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్నాను. ఈ సంవత్సరాల్లో నన్ను చూసిన వారికి బాగా తెలుసు.. మోదీ ఒక విజయం వద్ద ఆగిపోయి సంబరాలు చేసుకుని సంతృప్తి చెందే వ్యక్తి కాదు. ఒక లక్ష్యం నెరవేరినప్పుడు నేను వెంటనే అంతకంటే పెద్ద లక్ష్యం కోసం సన్నాహాలు ప్రారంభిస్తాను. 

మిత్రులారా, 

ఈ రోజు మన యూపీఐ అనేక దేశాలకు చేరుకుంది. కానీ ఇది కేవలం మొదటి అడుగు మాత్రమే. ఆయా దేశాల చెల్లింపుల వ్యవస్థలతో మన వ్యవస్థను అనుసంధానించడమే మన తదుపరి లక్ష్యం కావాలి. మనం ఇప్పటికే సింగపూర్‌తో ఈ అనుసంధానాన్ని విజయవంతంగా పూర్తి చేశాం. దీనివల్ల భారత్, సింగపూర్ మధ్య లావాదేవీలు సరిగ్గా ఒకే నగరంలోని రెండు ప్రాంతాల మధ్య జరిగినంత సులభంగా జరుగుతున్నాయి. ఇదే తరహా అనుసంధానాన్ని మనం ఇతర దేశాలు ఇతర మార్కెట్లతోనూ నిర్మించాలి. ఈ లక్ష్యంతోనే మనం ముందుకు సాగాలి. ఎక్కడైతే భారతీయులు పెద్ద సంఖ్యలో నివసిస్తున్నారో, ఎక్కడైతే భారత్ పెద్ద ఎత్తున వాణిజ్యం సాగిస్తోందో, మాతో కలిసి పనిచేయడానికి ఏ దేశమైతే సిద్ధంగా ఉంటుందో.. వాటన్నింటినీ అనుసంధానించే దిశగా మనం కృషి చేయాలి.

మిత్రులారా,

ఇది ఎందుకు అవసరమంటే.. విదేశాల్లో భారీ సంఖ్యలో భారతీయులు ఉద్యోగాలు, ఉపాధి పొందుతున్నారు. స్వదేశానికి డబ్బు పంపడంలో ప్రపంచంలోనే భారతీయులు ప్రథమ స్థానంలో ఉన్నారు. కానీ నేడు ఆ మొత్తంలో కొంత భాగం లావాదేవీల ఛార్జీల రూపంలో వృథా అవుతోంది. యూపీఐ ఈ విషయంలోనూ భారతీయులకు ఎంతో మేలు చేయగలదు. దీని ద్వారా డబ్బు మరింత త్వరగా వారి కుటుంబాలకు చేరుతుంది.

మిత్రులారా,

ఈ రోజు మనం భారత్‌లో కార్డుల ద్వారా ఎలా చెల్లింపులు చేస్తున్నాం? ఈ వ్యవస్థ వేరే చోట రూపొందించిన ప్రమాణాల ఆధారంగా నడుస్తోంది. అప్పట్లో మనకు సొంత ప్రత్యామ్నాయం లేకపోవడం వల్ల ఇతరులు సృష్టించిన ఆ ప్రమాణాలు, నిబంధనలను మనం అంగీకరించాల్సి వచ్చింది. కానీ ఇప్పుడు మనకంటూ సొంత ప్రత్యామ్నాయం ఉంది. ఇప్పుడు మనమే మన సొంత నిబంధనలను, ప్రమాణాలను రూపొందించుకొని వాటిని ప్రపంచంతో అనుసంధానించగలం. మీరందరూ దీన్ని సాధించగలరని నాకు పూర్తి నమ్మకం ఉంది.

మిత్రులారా, 

సాంకేతికత అనేది సమగ్రతను సాధించడానికి అత్యంత ప్రభావవంతమైన సాధనం. యూపీఐ దీన్ని నిరూపించింది. ఫిన్‌టెక్ విషయానికి వస్తే సంప్రదాయ నమూనాలు చేరుకోలేని చోటికి చేరుకోవడం దాని ప్రత్యేకత కావాలి. సంప్రదాయ బ్యాంకులు ఎక్కడైతే అడుగుపెట్టలేకపోయాయో, బ్యాంక్ శాఖలు ఎక్కడైతే అందుబాటులో లేవో సరిగ్గా ఆ ప్రాంతానికి, ఆ ప్రతి ఒక్క వ్యక్తి వద్దకు  బ్యాంకింగ్ వ్యవస్థను యూపీఐ తీసుకువెళ్లింది.

మిత్రులారా,

నేడు ఫిన్‌టెక్ మార్కెట్‌లో ఎక్కువ భాగం కేవలం చెల్లింపులకే పరిమితమై ఉంది. కానీ ఇప్పుడు మనం తదుపరి స్థాయికి వెళ్లాలి. అది కూడా వేగంగా అడుగులు వేయాలి. ఫిన్‌టెక్ మార్కెట్‌లో చెల్లింపులతో పాటు క్రెడిట్ లావాదేవీల వాటా, బీమా వాటా పెరగాలి. అదేవిధంగా పొదుపు, పెట్టుబడులు, పింఛన్ల వాటా కూడా మరింత వృద్ధి చెందాలి.

మిత్రులారా,

సంప్రదాయ ఆర్థిక నమూనాల పరిధికి ఇంకా దూరంగా ఉన్న లేదా సరిగ్గా ప్రయోజనం అందుకోలేకపోతున్న దేశ సామర్థ్యాన్ని ఫిన్‌టెక్ వెలికితీయగలదని నేను గట్టిగా నమ్ముతున్నాను. వికసిత్ భారత్ సాధనకు ఈ సామర్థ్యాన్ని పూర్తిగా ఉపయోగించుకోవడం అత్యంత అవసరం.

మిత్రులారా, 

పీఎం స్వనిధి విజయంలో దీని ప్రభావాన్ని మనం ఇప్పటికే స్పష్టంగా చూడొచ్చు. మన వీధి వ్యాపారులు నగరాలకు వెన్నెముక వంటివారు. కానీ వారు దేశ బ్యాంకింగ్ వ్యవస్థకు, అధికారిక రుణ వ్యవస్థకు దూరంగా ఉండేవారు. పీఎం స్వనిధి పథకం లక్షలాది మంది వీధి వ్యాపారులను అధికారిక వ్యవస్థతో అనుసంధానించింది. ఇప్పుడు ఈ సోదరీసోదరుల వద్ద స్వనిధి క్రెడిట్ కార్డు కూడా ఉంది. అంటే వారి వద్ద అధికారిక రుణాలు పొందే సాధనం ఉందన్నమాట. ఈ లబ్ధిదారుల సగటు వార్షిక ఆదాయం 20 శాతానికి పైగా పెరిగిందని అధ్యయనాలు నిరూపిస్తున్నాయి. అంతేకాకుండా వారి కుటుంబాల జీవన ప్రమాణాలు మెరుగయ్యాయి. గృహ వసతి, పోషకాహారం, ఆరోగ్య సేవలు, పిల్లల చదువుల్లో స్పష్టమైన మార్పు వచ్చింది. అందుకే ఈ పథకాన్ని 2030 వరకు పొడిగించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

మిత్రులారా,

యూపీఐ కనుక లేకపోతే పీఎం స్వనిధి ఈ స్థాయి విజయాన్ని సాధించి ఉండేది కాదు. ఈ పథకం విజయవంతం కావడంలో యూపీఐ చాలా పెద్ద పాత్ర పోషించింది. ఈ అనుభవం నుంచి పాఠాలు నేర్చుకుంటూ ఆర్థిక కార్యకలాపాలను మరింత వృద్ధి చేయడానికి మనం ఫిన్‌టెక్ సామర్థ్యాన్ని ఉపయోగించుకోవాలి. మూలధనం, రుణ రంగానికి సంబంధించి నేను మీకు ఒక ఉదాహరణ చెబుతాను. ఒక చిన్న దుకాణం నడుపుతున్న ఒక సోదరి ప్రతిరోజూ డిజిటల్ చెల్లింపులు స్వీకరిస్తున్నారు. ఇప్పుడు ఆమె ఆదాయం, ఖర్చుల్లో ఒక స్పష్టమైన విధానం కనిపిస్తోంది. ఆమె వ్యాపారం బాగా సాగుతోంది. చిన్నపాటి మూలధనం సరిపోయే స్థాయి నుంచి ఆమె ఇప్పుడు మరింత ముందుకు ఎదిగారు. ఇప్పుడు తన వ్యాపారాన్ని మరింత విస్తరించుకోవడానికి వస్తువులు, పరికరాలు కావాలి. అందుకోసం ఆమెకు కొంచెం ఎక్కువ డబ్బు అవసరమవుతోంది. ఇది పెద్ద మొత్తంలోని రుణం కాదు. అలా అని సంప్రదాయ రుణ నమూనాలు ఆమెకు సమర్థవంతంగా సేవలు అందించలేనంత చిన్న వ్యాపారం ఆమెది. ఫిన్‌టెక్ ద్వారా సులభంగా విశ్లేషించగలిగే, ముందుగానే ఊహించగలిగే, పరిష్కరించగలిగే అవసరాలు ఉన్న ఇటువంటి వ్యాపారాలు కోకొల్లలుగా ఉన్నాయి.

మిత్రులారా,

అటువంటి వ్యాపారాల ఆర్థిక కార్యకలాపాలను అధ్యయనం చేయడానికి, వాటి కోసం ప్రత్యేక నమూనాలను రూపొందించడానికి సాంకేతికత మనకు సహాయపడుతుంది. ఫిన్‌టెక్ రంగంలో తదుపరి అధ్యాయం ఇక్కడే ప్రారంభమవుతుందని నేను గట్టిగా నమ్ముతున్నాను. చెల్లింపుల విషయంలో మనం వేగాన్ని, స్థాయిని చూపించాం. ఇప్పుడు మనం చెల్లింపులు కానటువంటి ఇతర లావాదేవీల వాటాను పెంచడానికి సహాయం చేయాలి. ఉదాహరణకు ఒక డెలివరీ భాగస్వామి లేదా ఏదైనా చిన్న పని చేసే వ్యక్తి ప్రతి నెల సంపాదిస్తాడు. కానీ అతనికి పొదుపు, పింఛను వంటి సేవలు అందించాల్సిన అవసరం ఉంది. ఫిన్‌టెక్ ఇటువంటి వారి అవసరాలను సులభంగా తీర్చగలదు. అదేవిధంగా బీమా ఉత్పత్తులు, ఇతర ఆర్థిక సేవలను మరింత సులభంగా పొందేలా ఫిన్‌టెక్ చేయగలదు. ఈ సేవలన్నింటినీ ఈ రోజు క్యూఆర్ కోడ్ ద్వారా చెల్లింపు చేయడం ఎంత సులభమో అంతే సులభంగా సులభతరం చేయవచ్చు.

మిత్రులారా,

21వ శతాబ్దపు మొదటి త్రైమాసికం ముగిసింది. ఇప్పుడు మనం 2026వ సంవత్సరంలో ఉన్నాం. రెండో త్రైమాసికం మనకు మరింత నూతన అవకాశాలను తెచ్చిపెట్టింది. ఏజెంటిక్ ఏఐ, టోకెనైజేషన్, క్వాంటమ్ సాంకేతికత.. ఇటువంటి సాంకేతికతలు ఆర్థిక రంగంలో అపూర్వమైన అవకాశాలకు కొత్త ద్వారాలు తెరుస్తున్నాయి. ఇప్పుడు మన ముందున్న సవాలు ఏంటంటే.. ఈ అవకాశాలను వాస్తవ ప్రపంచంలో ఎలా ప్రభావం చూపేలా మార్చుకోవాలి. ఇందుకోసం మన ఫిన్‌టెక్ కంపెనీలు కొన్ని లక్ష్యాలను నిర్దేశించుకోవాలని నేను కోరుకుంటున్నాను. మీ ముందు కొన్ని సూచనలను ఉంచాలనుకుంటున్నాను. మొదటిది… భారత్‌లో సైబర్ భద్రతను అత్యుత్తమ స్థాయికి తీసుకువెళ్లాలి. రెండోది.. మన పరిశ్రమకు తగినట్లుగా సొంత నైతికపరమైన డేటా రక్షణ ప్రమాణాలు ఉండాలి. మూడోది.. బలమైన ఫిన్‌టెక్ నియంత్రణ-ఇండస్ట్రీ ఆవిష్కరణల వ్యవస్థను మనం నిర్మించుకోవాలి. నాలుగోది.. ఒక ఫిన్‌టెక్ వినియోగదారుల రక్షణ సూచీ ఉండాలి. దీని ఆధారంగా ప్రతి కంపెనీకి ఒక పారదర్శక రేటింగ్ లభిస్తుంది. ఈ ప్రమాణాలను మనం పరీక్షించుకుంటే భారత ఫిన్‌టెక్ రంగం అనంతమైన అవకాశాలకు ప్రవేశ ద్వారంగా మారుతుంది. మన వద్ద అనుభవం ఉంది. దాన్ని క్షేత్రస్థాయిలో అమలు చేసే విధానం కూడా ఉంది. కాబట్టి మనం వేగంగా పని చేయాలి.

మిత్రులారా,

డిజిటల్ ఇండియా విజయగాథ ఇప్పుడు ఒక కొత్త అధ్యాయానికి సిద్ధంగా ఉంది. ఇప్పటివరకు మన ఫిన్‌టెక్ విజయానికి ప్రధాన కారణాలు.. విస్తృతి, పరిధి, సురక్షితమైన వ్యవస్థలు, సాంకేతికత ప్రజాస్వామ్యీకరణ, ప్రజల విశ్వాసం. ఈ మూల సూత్రాలను దృష్టిలో ఉంచుకొని ఫిన్‌టెక్ రంగం తదుపరి తరం ఆవిష్కరణలపై దృష్టి పెట్టాలి. ఇదే విన్నపంతో మీ అందరికీ మరోసారి నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.

ధన్యవాదాలు.

 

***


(రిలీజ్ ఐడి: 2308111) సందర్శకుల సూచీ సంఖ్య : : 4
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , हिन्दी , Gujarati