ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
డబ్ల్యూహెచ్‌ఓ ఆర్‌సీ79 సమావేశంలో వైద్య, నర్సింగ్, అనుబంధ ఆరోగ్య సిబ్బందిని భారీగా విస్తరించనున్నట్లు ప్రకటించిన భారత్
గ్రామీణ, గిరిజన, వెనుకబడిన ప్రాంతాల ప్రజలకు ప్రత్యేక వైద్య సేవలు సమానంగా అందేలా చూసే విషయంలో నిబద్ధతను పునరుద్ఘాటించిన భారత్
79వ డబ్ల్యూహెచ్‌ఓ ప్రాంతీయ కమిటీ సమావేశంలో మంత్రివర్గ రౌండ్‌టేబుల్ సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగించిన కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ జేపీ నడ్డా
2014 నుంచి రెట్టింపు కంటే ఎక్కువగా పెరిగిన వైద్య కళాశాలలు.. 175 శాతానికి పైగా వృద్ధి చెందిన ఎంబీబీఎస్, పీజీ సీట్లు: శ్రీ జేపీ నడ్డా
ప్రత్యేక వైద్య సేవల్లో సమానత్వంపై డిల్లీ ప్రకటనను ఆమోదించిన డబ్ల్యూహెచ్ఓ ఆగ్నేయాసియా ప్రాంతం
మాతృ ఆరోగ్యం, అసంక్రమిత వ్యాధుల (ఎన్‌సీడీ) నిర్వహణలో భారత్ సాధించిన నిరంతర నాయకత్వాన్ని గుర్తించిన డబ్ల్యూహెచ్ఓ.. రెండు డబ్ల్యూహెచ్ఓ ఆగ్నేయాసియా ప్రాంతీయ అవార్డులతో సత్కారం
నాడు పోస్టు చేయడమైనది:
08 SEP 2026 7:01PM by PIB Hyderabad
తూర్పు టైమూర్‌లో జరిగిన 79వ ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) ఆగ్నేయాసియా ప్రాంతీయ కమిటీ సమావేశం (ఆర్‌సీ79) సందర్భంగా ‘ఆరోగ్యం కోసం మానవ వనరులు: ప్రత్యేక వైద్య సేవల్లో సమానత్వం’ అంశంపై జరిగిన మంత్రివర్గ రౌండ్‌టేబుల్‌లో కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి శ్రీ జగత్ ప్రకాష్ నడ్డా ప్రసంగించారు. ఈ సమావేశంలో పాల్గొన్న డబ్ల్యూహెచ్ఓ ఆగ్నేయాసియా ప్రాంత సభ్య దేశాల ఆరోగ్య మంత్రులు, ఉన్నతాధికారులు.. ఆరోగ్య సిబ్బంది సామర్థ్యాన్ని బలోపేతం చేయడం, ప్రత్యేక వైద్య సేవలను సమానంగా అందించడంపై చర్చించారు.
రౌండ్‌టేబుల్‌నుద్దేశించి మాట్లాడిన శ్రీ జేపీ నడ్డా.. సార్వత్రిక ఆరోగ్య కవరేజ్ (యూహెచ్‌సీ) సాధించడంలో సమానంగా ప్రత్యేక వైద్య సేవలు అందుబాటులో ఉండటం అత్యంత కీలకమని చెప్పారు. దీని కోసం వైద్య ఆరోగ్య సిబ్బందికి విద్య, శిక్షణ, నియామకం, ఉద్యోగంలో కొనసాగింపు, నిరంతర వృత్తిపరమైన అభివృద్ధిని సమగ్రంగా సమకూర్చే విధానం అవసరమని ఆయన పేర్కొన్నారు.
గ్రామీణ, గిరిజన, వెనుకబడిన, మారుమూల ప్రాంతాల ప్రజల కోసం ఆరోగ్య సంరక్షణ సిబ్బంది సామర్థ్యాన్ని విస్తరించడం, ప్రత్యేక వైద్య సేవలను బలోపేతం చేయడంలో భారత్ సాధించిన గణనీయమైన పురోగతిని కేంద్ర ఆరోగ్య మంత్రి ప్రముఖంగా చెప్పారు.
కొత్త వైద్య కళాశాలల ఏర్పాటు, ఇప్పటికే ఉన్న ప్రభుత్వ వైద్య కళాశాలల అప్‌గ్రేడేషన్ ద్వారా భారత ప్రభుత్వం వైద్య విద్యా మౌలిక సదుపాయాలను గణనీయంగా విస్తరించిందని.. దీనివల్ల అండర్‌గ్రాడ్యుయేట్, పోస్ట్‌గ్రాడ్యుయేట్ వైద్య సీట్లు భారీగా పెరిగాయని శ్రీ జేపీ నడ్డా పేర్కొన్నారు.
2014 నుంచి దేశంలో వైద్య కళాశాలల సంఖ్య 387 నుంచి 858కి రెట్టింపు కంటే ఎక్కువగా పెరిగింది. ఈ విషయంలో 121.71 శాతం వృద్ధి నమోదైంది. ఎంబీబీఎస్ సీట్లు 51,348 నుంచి 1,42,464కి పెరిగాయి (177.45 శాతం వృద్ధి). పోస్ట్‌గ్రాడ్యుయేట్ సీట్లు 31,185 నుంచి 86,287కి పెరిగాయి (176.69 శాతం వృద్ధి).
పోస్ట్‌గ్రాడ్యుయేట్ (పీజీ) వైద్య విద్యా సీట్లను పెంచడానికి చేపట్టిన నిర్దిష్ట చర్యలను కూడా మంత్రి ప్రస్తావించారు. వెనుకబడిన ప్రాంతాలకు అత్యవసర వైద్యం (ఎమర్జెన్సీ మెడిసిన్), వృద్ధుల వైద్యం (జెరియాట్రిక్స్), సైకియాట్రి, ఫ్యామిలీ మెడిసిన్ వంటి ప్రత్యేక విభాగాలకు ప్రాధాన్యతనిస్తూ 2028-29 నాటికి అదనంగా 10,000 పీజీ సీట్లను సృష్టించే లక్ష్యంతో 2025 సెప్టెంబర్‌లో వైద్య సీట్ల పెంచే పథకాల అమలును పొడిగించారు.
బలమైన, వైవిధ్యమైన ఆరోగ్య సంరక్షణ సిబ్బంది ప్రాముఖ్యత గురించి మాట్లాడిన కేంద్ర మంత్రి.. ఇప్పటికే ఉన్న వైద్య కళాశాలలతో పాటు 157 కొత్త నర్సింగ్ కళాశాలలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. వెనుకబడిన జిల్లాలు, రాష్ట్రాలు లేదా కేంద్రపాలిత ప్రాంతాల్లో నాణ్యమైన, సరసమైన ధరలో నర్సింగ్ విద్యను మెరుగుపరచడమే లక్ష్యంగా ఏర్పాటవుతున్న ఈ సంస్థల ద్వారా వార్షికంగా సుమారు 15,700 మంది నర్సింగ్ గ్రాడ్యుయేట్లు అందుబాటులోకి రానున్నారు.
జాతీయ నర్సింగ్, మిడ్‌వైఫరీ కమిషన్ చట్టం- 2023 మద్దతుతో 10 కీలక ప్రత్యేక విభాగాలలో 'నర్స్ ప్రాక్టిషనర్ కార్యక్రమాలను' ప్రవేశపెట్టినట్లు ఆయన తెలిపారు.
అనుబంధ, ఆరోగ్య సంరక్షణ సిబ్బందిని విస్తరించడానికి భారత్ చేస్తున్న ప్రయత్నాలను కూడా కేంద్ర మంత్రి ప్రముఖంగా చెప్పారు. నేషనల్ కమిషన్ ఫర్ అలైడ్ అండ్ హెల్త్‌కేర్ ప్రొఫెషన్స్ యాక్ట్- 2021, 2024లో జాతీయ కమిషన్ ఏర్పాటు సహకారంతో రాబోయే ఐదేళ్లలో 1,00,000 మంది అనుబంధ, ఆరోగ్య సంరక్షణ నిపుణులను తీర్చిదిద్దనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ కమిషన్ 57 విభిన్న అనుబంధ, ఆరోగ్య సంరక్షణ వృత్తులను ఒక క్రమబద్ధమైన నియంత్రణ పరిధిలోకి తెస్తుంది.
పరీక్షలు, ముందస్తు గుర్తింపు, రెఫరల్ సేవలతో సహా సమగ్ర ప్రాథమిక ఆరోగ్య సంరక్షణను అందించడంలో ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ల పాత్రను శ్రీ జేపీ నడ్డా ప్రస్తావించారు. ఆయుష్మాన్ ఆరోగ్య శిబిరాలు వెనుకబడిన వర్గాలకు వ్యాధి నిర్ధారణ పరీక్షలు, ప్రత్యేక వైద్యుల సంప్రదింపులను మరింత విస్తృతంగా అందిస్తున్నాయి.
ప్రత్యేక వైద్య సేవలు, రెఫరల్ సేవలను అందించడంలో సామాజిక ఆరోగ్య కేంద్రాలు, ఫస్ట్ రెఫరల్ యూనిట్ల పాత్రను ఆయన కొనియాడారు. కష్టతరమైన ప్రాంతాల్లో ప్రత్యేక వైద్యుల లభ్యతను, వారి సేవలను నిలబెట్టుకోవడానికి పోటీ పారితోషికాలు, కష్టతరమైన ప్రాంతాల్లో పనిచేసేవారికి ప్రత్యేక భత్యాలు, ప్రత్యేక సేవల ఇన్‌సోర్సింగ్, పనితీరు ఆధారిత ప్రోత్సాహకాలు, నిర్దిష్ట కాలపరిమితి పోస్టింగ్‌లతో కూడిన సౌకర్యవంతమైన విధానాలను భారత్ అనుసరిస్తోంది.
భౌగోళిక అడ్డంకులను అధిగమించి ప్రత్యేక వైద్య సేవలందించేందుకు భారత్ డిజిటల్ ఆరోగ్య సాంకేతికతలను ఉపయోగిస్తోందని కేంద్ర మంత్రి చెప్పారు. ముఖ్యంగా మారుమూల, వెనుకబడిన ప్రాంతాల ప్రజలకు టెలికన్సల్టేషన్, రెఫరల్స్, నిరంతర ఆరోగ్య సంరక్షణ అందించడంలో 'ఈ-సంజీవని', 'ఆభా అనుసంధాన డిజిటల్ ఆరోగ్య రికార్డులు’ వంటి వేదికలు ఎంతగానో దోహదపడుతున్నాయని తెలిపారు.
వెనుకబడిన ప్రాంతాలు, ప్రత్యేక నిపుణుల కొరత ఉన్న విభాగాలపై నిరంతరం దృష్టి సారిస్తూ మరింత విస్తృతమైన, వైవిధ్యమైన, భౌగోళికంగా సమతుల్యంగా ఉండే ఆరోగ్య సిబ్బందిని తయారుచేసే దిశగా భారత్ అడుగులు వేస్తోందని శ్రీ జేపీ నడ్డా స్పష్టం చేశారు. ప్రత్యేక వైద్య సేవల్లో సమానత్వాన్ని సాధించేందుకు ఈ చర్యలు ఒక బృందం ఆధారిత, నిరంతర ఆరోగ్య సంరక్షణ విధానాన్ని తెలియజేస్తున్నాయని ఆయన పేర్కొన్నారు.
డబ్ల్యూహెచ్ఓ ఆగ్నేయాసియా ప్రాంతీయ కమిటీ (ఆర్‌సీ79) సమావేశంలో సభ్య దేశాల ఆరోగ్య మంత్రులు ‘ఆరోగ్యం కోసం మానవ వనరులు: ప్రత్యేక వైద్య సేవల్లో సమానత్వంపై డిల్లీ ప్రకటన’ ఆమోదించటం ఈ సమావేశంలోని అత్యంత కీలక పరిణామాల్లో ఒకటిగా నిలిచింది.
ఆరోగ్య సిబ్బందిలో కొరత, అసమతుల్యత, పెరుగుతున్న ప్రత్యేక వైద్య సేవల అవసరాలను పరిష్కరించడానికి ఈ ప్రకటన ద్వారా సమగ్రమైన చర్యలకు కట్టుబడి ఉన్నట్లు సభ్య దేశాలు ప్రకటించాయి.
ప్రస్తుత- భవిష్యత్ జనాభా, అసంక్రమిత వ్యాధుల తీరు తెన్నులు (ఎపిడెమిలాజికల్), ఆరోగ్య అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనే సన్నద్ధతకు తగినట్లుగా ఆరోగ్య సిబ్బంది ప్రణాళిక, విద్య, నిధులను సమకూర్చుకోవాలని ఈ ప్రకటన పిలుపునిచ్చింది. డబ్ల్యూహెచ్‌ఓ గ్లోబల్ కోడ్ ఆఫ్ ప్రాక్టీస్ మార్గదర్శకాలకు అనుగుణంగా ముఖ్యంగా గ్రామీణ, వెనుకబడిన ప్రాంతాల్లో ప్రత్యేక వైద్య నిపుణులను ఆకర్షించడానికి, నియమించడానికి, వారి సేవలను సమర్థవంతంగా వినియోగించుకోవడానికి, నిలబెట్టుకోవడానికి తగిన విధానాలు ఉండాలని ఇది తెలియజేస్తోంది.
సంప్రదాయ, పరిపూరక, సమగ్ర వైద్య నిపుణులతో సహకారంతో పాటు పనుల విభజన, మార్గదర్శకత్వం, రొటేషనల్ ఔట్‌రీచ్, విజిటింగ్ స్పెషలిస్ట్ కార్యక్రమాల ద్వారా ఉన్న ఆరోగ్య సిబ్బందిని మరింత మెరుగ్గా ఉపయోగించుకోవడంపై ఈ ప్రకటన ప్రత్యేకంగా దృష్టి సారించింది.
ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ బృందాలు, ప్రత్యేక ఔట్‌రీచ్ సేవలు, టెలికన్సల్టేషన్ నెట్‌వర్క్‌లు, సమన్వయ రెఫరల్ ఆసుపత్రుల ద్వారా సమగ్ర రెఫరల్ వ్యవస్థలను, నిరంతర ఆరోగ్య సంరక్షణను బలోపేతం చేయడానికి కూడా సభ్య దేశాలు అంగీకరించాయి.
గ్రామీణ, మారుమూల, వెనుకబడిన ప్రాంతాల ప్రజలకు ప్రత్యేక వైద్య సేవలందించే పరిధిని విస్తరించడానికి టెలిమెడిసిన్, టెలికన్సల్టేషన్, ఏఐ సహాయక క్లినికల్ టూల్స్‌తో సహా డిజిటల్ ఆరోగ్య సాంకేతికతలను సురక్షితంగా, సమానంగా స్వీకరించడాన్ని వేగవంతం చేస్తూనే ప్రజా ఆరోగ్య సిబ్బంది సామర్థ్యాన్ని, అవసరమైన ప్రజా ఆరోగ్య విధులను బలోపేతం చేయాలని ఈ ప్రకటన తెలియజేస్తోంది.
సంప్రదాయ, పరిపూరక, సమగ్ర వైద్య సేవలతో పాటు మొబైల్, ఔట్‌రీచ్ స్పెషలిస్ట్ బృందాలు, కమ్యూనిటీ-ఆధారిత ప్రత్యేక వైద్య సంరక్షణ వంటి వినూత్న సేవా డెలివరీ నమూనాలను ఇది మరింత ప్రోత్సహిస్తోంది.
సిబ్బంది నైపుణ్యాభివృద్ధి, మల్టీడిసిప్లినరీ బృందాలు, కమ్యూనిటీ-ఆధారిత సేవలు, బలోపేతం చేసిన రెఫరల్ మార్గాల ద్వారా అన్ని స్థాయిలలోని ఆరోగ్య వ్యవస్థలలో ఉపశమన వైద్యాన్ని (పాలియేటివ్ కేర్) అనుసంధానించడానికి సభ్య దేశాలు అంగీకరించాయి.
క్యాన్సర్, గుండె సంబంధిత వైద్యం, అత్యవసర ప్రమాద వైద్యం (ట్రామా), మాతా శిశు సంరక్షణ, మానసిక ఆరోగ్యం, వృద్ధుల వైద్యం (జెరియాట్రిక్స్), పునరావాస వైద్యంతో సహా అత్యంత ప్రాధాన్యత కలిగిన ప్రత్యేక సేవలకు సంబంధించి జాతీయ సామర్థ్యాన్ని బలోపేతం చేయడంపై ఈ ప్రకటన ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. ఫలితాల ఆధారిత విధాన రూపకల్పనకు మద్దతుగా జాతీయ ఆరోగ్య సిబ్బంది సమాచార వ్యవస్థలను బలోపేతం చేయాలని కూడా ఇది పిలుపునిచ్చింది.
ప్రాంతీయ సహకారానికి ఉన్న ప్రాముఖ్యతను గుర్తిస్తూ ఆరోగ్య వృత్తి నిపుణుల నియంత్రణ సంస్థలు, విధానకర్తల ప్రాంతీయ నెట్‌వర్క్ ద్వారా సమాచార మార్పిడి, సంయుక్త శిక్షణ, క్లినికల్ మెంటరింగ్, ప్రాంతీయ సహకారాన్ని సులభతరం చేయడానికి సభ్య దేశాలు అంగీకరించాయి.
ప్రాథమిక ఆరోగ్య సంరక్షణను బలోపేతం చేయడంపై 2023లో జరిగిన 'ఢిల్లీ ప్రకటన'లోని నిబద్ధతలను 'డిల్లీ ప్రకటన' గుర్తుచేస్తుంది. ఈ ప్రాంతంలో వేగంగా జరుగుతున్న జనాభా, అసంక్రమిత వ్యాధుల తీరుతెన్నుల మార్పులు (డెమోగ్రాఫిక్ అండ్ ఎపిడెమిలాజికల్ ట్రాన్సిషన్), సంక్లిష్టమైన- దీర్ఘకాలిక అనారోగ్యాల విషయంలో పెరుగుతున్న భారం, ప్రత్యేక వైద్య నిపుణుల కొరత, అసమతుల్యత వంటి సవాళ్లను ఎదుర్కొనేందుకు ఇది దోహదపడుతుంది.
ఈ నిబద్ధతల అమలుకు సాంకేతిక సహాయం, సామర్థ్య పెంపుదల, విధానపరమైన మార్గదర్శకత్వం, బలోపేతం చేసిన ప్రాంతీయ సహకార యంత్రాంగాల ద్వారా మద్దతు అందించాలని సభ్య దేశాలు ప్రపంచ ఆరోగ్య సంస్థను కోరాయి.
ప్రత్యేక వైద్య సేవలను సమానంగా అందుబాటులో ఉంచటం, సార్వత్రిక ఆరోగ్య కవరేజ్‌ను (యూహెచ్‌సీ) ముందుకు తీసుకెళ్లడం, ఆగ్నేయాసియా ప్రాంతంమంతా 'అందరికీ ఆరోగ్యం' లక్ష్యాన్ని సాధించడంలో 'డిల్లీ ప్రకటన' ఆమోదం ఒక కీలకమైన అడుగుగా భారత్ స్వాగతించింది. ఈ ప్రకటనలోని నిబద్ధతలను కార్యరూపంలోకి తీసుకురావడానికి సభ్య దేశాలు డబ్ల్యూహెచ్ఓతో కలిసి పనిచేయాలన్న తన నిబద్ధతను భారతదేశం పునరుద్ఘాటించింది.
డబ్ల్యూహెచ్ఓ ఆగ్నేయాసియా ప్రాంతీయ కమిటీ 79వ సమావేశంలో ప్రజారోగ్య రంగంలోని కీలక విభాగాలలో దేశం సాధించిన నిరంతర విజయాలను గుర్తుగా భారత్‌కు రెండు డబ్ల్యూహెచ్ఓ ఆగ్నేయాసియా ప్రాంతీయ అవార్డులు లభించాయి.
గడచిన దశాబ్ద కాలంగా మాతా-శిశు ధనుర్వాతాన్ని ప్రాంతీయ స్థాయిలో పూర్తిగా నివారించడంలో నిరంతరం కృషి చేసినందుకు భారత్‌కు గుర్తింపు లభించింది.
ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ ద్వారా అసంక్రమిత వ్యాధుల (ఎన్‌సీడీ) నివారణలో బలమైన నాయకత్వాన్ని ప్రదర్శించడంతో పాటు రక్తపోటు, మధుమేహం బాధితులకు ప్రోటోకాల్-ఆధారిత చికిత్సను అందించడంలో జాతీయ లక్ష్యాలను విజయవంతంగా సాధించినందుకు ఈ పురస్కారం దక్కింది.
ప్రాథమిక ఆరోగ్య సంరక్షణను బలోపేతం చేయడం, వ్యాధి నివారణ, ముందస్తు గుర్తింపు, అత్యవసర ఆరోగ్య పరిస్థితుల సమర్థవంతమైన నిర్వహణ పట్ల భారతదేశం నిరంతర నిబద్ధతను ఈ గుర్తింపు ప్రతిబింబిస్తుంది.
భారతదేశ ఆరోగ్య వ్యవస్థను బలోపేతం చేయడంలో, మెరుగైన ఆరోగ్య ఫలితాలను సాధించడంలో కీలకపాత్ర పోషించిన దేశవ్యాప్తంగా ఉన్న ఫ్రంట్‌లైన్ ఆరోగ్య కార్యకర్తలకు కేంద్ర ఆరోగ్య మంత్రి ఈ పురస్కారాలను అంకితం చేశారు.
ఆరోగ్య మౌలిక సదుపాయాలు, మానవ వనరులు, ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ, డిజిటల్ ఆరోగ్యం, ఆరోగ్య వ్యవస్థ దృఢత్వం రంగాల్లో పెట్టుబడులు పెట్టడం ద్వారా సార్వత్రిక ఆరోగ్య కవరేజ్‌ను (యూహెచ్‌సీ) మరింత ముందుకు తీసుకెళ్లడానికి భారత ప్రభుత్వం కట్టుబడి ఉంది.
***
(రిలీజ్ ఐడి: 2308070)
సందర్శకుల సూచీ సంఖ్య : : 6