సాంఘిక న్యాయం, మరియు సాధికారత మంత్రిత్వ శాఖ
మాదకద్రవ్యాల దుర్వినియోగానికి వ్యతిరేకంగా జాతీయ ప్రతిజ్ఞ
నషా ముక్త్ భారత్ అభియాన్ 6వ వార్షికోత్సవం సందర్భంగా ఈ నెలాఖరులో భారీ జాతీయ కార్యక్రమం
నషా ముక్త్ భారత్ అభియాన్ లక్ష్యాలకు అనుగుణంగా 10 కోట్లమందికి పైగా పౌరులను ప్రతిజ్ఞలో భాగస్వాములను
చేసేందుకు కార్యాచరణ ప్రణాళిక, సమగ్ర వ్యూహంపై చర్చించిన మూడో ఉన్నతస్థాయి సమన్వయ సమావేశం
ఎన్ఎంఎంబీఏ ఈ - ప్రతిజ్ఞకు నమోదు చేసుకునేందుకు వెబ్‌సైట్ https://nashamukt.dosje.gov.in/epledge
నాడు పోస్టు చేయడమైనది:
08 SEP 2026 6:22PM by PIB Hyderabad
మాదకద్రవ్యాల దుర్వినియోగానికి వ్యతిరేకంగా కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఈ నెలాఖరులో జాతీయ సామూహిక ప్రతిజ్ఞ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇందులో ప్రత్యక్షంగా, ఆన్ లైన్ ద్వారా పాల్గొనేలా 10 కోట్ల మందికి పైగా పౌరులను సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. నషా ముక్త్ భారత్ అభియాన్ (ఎన్ఎంబీఏ) ఆరో వార్షికోత్సవం సందర్భంగా ఈ భారీ జాతీయ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.
ఈ కార్యక్రమం కోసం జరుగుతున్న సన్నాహాల్లో భాగంగా, మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి (మాదకద్రవ్యాల నిరోధక విభాగం) డాక్టర్ సందీప్ రేవాజీ రాథోడ్ అధ్యక్షతన ఈ రోజు ఢిల్లీలో మూడో ఉన్నతస్థాయి సమన్వయ సమావేశం జరిగింది. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నిర్దేశించిన నషా ముక్త్ భారత్ అభియాన్ లక్ష్యాలకు అనుగుణంగా ప్రత్యక్షంగా, ఆన్‌లైన్ విధానంలో దేశవ్యాప్తంగా నిర్వహించే ప్రతిజ్ఞ కార్యక్రమంలో 10 కోట్లమందికి పైగా పౌరులను చేర్చేందుకు అనుసరించవలసిన ప్రణాళిక, సమగ్ర వ్యూహంపై సమావేశంలో చర్చించారు.

దేశంలో అన్ని వర్గాలను తీవ్రంగా ప్రభావితం చేస్తున్న మత్తు పదార్థాల వాడకం వల్ల కలిగే ప్రమాదాలు, సవాళ్లపై సామాన్య ప్రజలకు అవగాహన కల్పించే దిశగా ప్రతి ఒక్కరినీ భాగస్వాములను చేయడానికి 'సంపూర్ణ ప్రభుత్వం', 'సంపూర్ణ సమాజం' దృక్పథాన్ని అనుసరించవలసిన ప్రాముఖ్యతను డాక్టర్ రాథోడ్ వివరించారు.
సామాజిక న్యాయం, సాధికారత శాఖ డైరెక్టర్ (మాదకద్రవ్యాల నివారణ) శ్రీ ఆస్తిక్ కుమార్ పాండే, అండర్ సెక్రటరీ శ్రీ అరుణ్ కుమార్ కర్ణతో పాటు మంత్రిత్వ శాఖకు చెందిన ఇతర అధికారులు కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు.
వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాలకు చెందిన ఉన్నతస్థాయి ప్రతినిధులు హాజరైన ఈ సమావేశంలో, సమగ్ర అమలు వ్యూహానికి సంబంధించి కొనసాగుతున్న పనులను సమీక్షించారు. దేశవ్యాప్తంగా నిర్వహించే ప్రతిజ్ఞ కార్యక్రమంలో అధికారులు, సిబ్బంది, విద్యార్థులు, తల్లిదండ్రులు, స్వచ్ఛంద కార్యకర్తలు, ఇతర భాగస్వామ్య వర్గాలను చేర్చడంలో సంబంధిత మంత్రిత్వ శాఖలు, విభాగాల పాత్రపై చర్చించి, సమీక్షించారు.

సంబంధిత మంత్రిత్వ శాఖలు, విభాగాల పరిధిలోని అనుబంధ కార్యాలయాలు, విద్యా సంస్థలు, స్వయం ప్రతిపత్తి సంస్థలు, ప్రభుత్వ రంగ సంస్థలు, క్షేత్రస్థాయి విభాగాలన్నింటిలో ప్రతిజ్ఞ కార్యక్రమాలను నిర్వహించే అంశంపై సమావేశంలో చర్చించారు. రైల్వేలు, రక్షణ, పౌర రక్షణ, యువజన వ్యవహారాలు, క్రీడలు, పాఠశాల విద్య, ఉన్నత విద్య, తపాలా, పోలీసు, కేంద్ర సాయుధ పోలీసు బలగాలు, జాతీయ క్యాడెట్ దళం, ఆయుష్, గ్రామీణాభివృద్ధి, ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం, రెవెన్యూ విభాగాలతో పాటు సామాజిక, స్వచ్ఛంద, ఆధ్యాత్మిక సంస్థలు, సామాజిక ప్రభావశీల వ్యక్తులు ఇందులో భాగస్వాములు కానున్నారు.
పాల్గొనే వారి వివరాలు, కార్యక్రమ విస్తృతిని నమోదు చేసి సమర్పించేందుకు ఒకే విధానాన్ని రూపొందించడంపై కూడా సమావేశంలో చర్చించారు.
కార్యాచరణ ప్రణాళిక, సమన్వయ వ్యూహం పై రూపొందించిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ మీద విస్తృతంగా చర్చించారు. ఈ సందర్భంగా వివిధ శాఖలు, మంత్రిత్వ శాఖల ప్రతినిధులంతా చురుగ్గా పాల్గొని తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు.
ప్రణాళిక, సమన్వయ వ్యూహంపై సమావేశంలో క్షుణ్ణంగా చర్చించారు. సంబంధిత విభాగాలు, మంత్రిత్వ శాఖలకు చెందిన ప్రతినిధులందరూ క్రియాశీల చర్చల్లో పాల్గొన్నారు.
నషా ముక్త్ భారత్ అభియాన్ ప్రతిజ్ఞ మాదకద్రవ్యాల దుర్వినియోగానికి గురైన బాధితులకు చేరువై, వారికి సహాయం అందించేందుకు స్వచ్ఛందంగా ముందుకు రావడాన్ని ప్రోత్సహించే కార్యక్రమం. ప్రజలు మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండేలా బాధ్యతాయుత ప్రవర్తనను ప్రోత్సహించడం, వారిలో బాధ్యతా భావాన్ని పెంపొందించడం ఈ ప్రతిజ్ఞ ప్రధాన ఉద్దేశ్యం. ఉమ్మడి లక్ష్య సాధన దిశగా భాగస్వామ్య వర్గాలన్నీ కలిసి పని చేసేలా ఐక్యత, నిబద్ధత భావాలను ప్రోత్సహించడం, బలోపేతం చేయడం కూడా దీని లక్ష్యం. మాదకద్రవ్యాల రహిత సమాజ నిర్మాణంలో యువత చురుకుగా భాగస్వాములు కావడానికి సాధికారత కల్పించడం కూడా ఈ ప్రతిజ్ఞ ఉద్దేశ్యాల్లో ఒకటి.
ఎన్ఎంఎంబీఏ ఈ-ప్రతిజ్ఞ లో పాల్గొనేవారు https://nashamukt.dosje.gov.in/epledge వెబ్‌సైట్ లో నమోదు చేసుకోవాలి.

మాదకద్రవ్యాల వ్యసనం నుంచి విముక్తి పొందేందుకు సహాయపడే 14446 హెల్ప్ లైన్ గురించి ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేసి, వినియోగాన్ని ప్రోత్సహించాల్సిన ముఖ్యమైన సందేశంపై కూడా సమావేశంలో దృష్టి సారించారు.
సామాజిక న్యాయం, సాధికారత శాఖ అధికారిక వెబ్‌సైట్ https://nashamukt.dosje.gov.in/nasha-mukti-mitr ద్వారా ‘నషా ముక్తి మిత్ర’గా నమోదు చేసుకుని స్వచ్ఛంద కార్యకర్తలుగా సేవలందించేందుకు పౌరుల్లో పెరుగుతున్న ఆసక్తిని మరింత ప్రోత్సహించడంపై కూడా సమావేశంలో చర్చించారు.
కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ దేశంలో మాదకద్రవ్యాల వినియోగాన్ని అరికట్టేందుకు 2020 ఆగస్టు 15న ‘నషా ముక్త్ భారత్ అభియాన్’ను ప్రారంభించింది. సమష్టి చర్యల ఆవశ్యకతను గుర్తించిన మంత్రిత్వ శాఖ, మాదకద్రవ్యాల నివారణ, అంచనా, చికిత్స, పునరావాసం, తదనంతర సంరక్షణ, ప్రజలకు సమాచార వ్యాప్తి, సమాజంలో అవగాహన కల్పించడం వంటి వివిధ కార్యక్రమాలను సమన్వయంతో నిర్వహిస్తోంది.
మాదకకద్రవ్యాల వినియోగం తగ్గింపునకు సంబంధించిన జాతీయ కార్యాచరణ ప్రణాళిక కింద మంత్రిత్వ శాఖ సమగ్ర, ఆధారాలతో కూడిన వ్యూహాన్ని అమలు చేస్తోంది. న్యూఢిల్లీ ఎయిమ్స్‌లోని జాతీయ మాదకద్రవ్య ఆధారిత చికిత్స కేంద్రం దేశంలో మాదకద్రవ్యాల వినియోగం విస్తృతి, తీరుతెన్నులపై నిర్వహించిన తొలి జాతీయ సర్వేలో వెలువడిన అంశాల ఆధారంగా ఈ వ్యూహాన్ని రూపొందించారు.
మాదకకద్రవ్యాల వినియోగం తగ్గింపునకు సంబంధించిన జాతీయ కార్యాచరణ ప్రణాళిక కింద, నివారణ విద్య, అవగాహన కల్పన, కౌన్సెలింగ్, చికిత్స, పునరావాస కార్యక్రమాల కోసం రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు, స్వచ్ఛంద సంస్థలు, ప్రభుత్వ ఆసుపత్రులకు మంత్రిత్వ శాఖ ఆర్థిక సహాయం అందిస్తోంది.
ఇప్పటివరకు దేశవ్యాప్తంగా నిర్వహించిన అవగాహన కార్యక్రమాల ద్వారా ఈ ప్రచారం 34.42 కోట్ల మందికి పైగా ప్రజలకు చేరుకుంది. ఇందులో 13.64 కోట్లకు పైగా యువత, 10.58 కోట్ల మంది మహిళలు ఉన్నారు. సమాజ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు 1.65 లక్షలకు పైగా ‘నషా ముక్తి మిత్రలు’ కూడా ఈ ప్రచారంలో చేరారు.
నషా ముక్త్ భారత్ అభియాన్ అధికారిక వెబ్‌సైట్: https://www.dosje.gov.in/organisation/nasha-mukt-bharat-abhiyaan/
చికిత్స సేవలను ప్రజలకు మరింత సులభంగా అందుబాటులోకి తీసుకురావడానికి, సమీపంలోని మాదకద్రవ్య విముక్తి కేంద్రాన్ని గుర్తించేందుకు వీలు కల్పించే నషా ముక్త్ భారత్ అభియాన్ 2.0 మొబైల్ అప్లికేషన్‌ను కూడా మంత్రిత్వ శాఖ ప్రారంభించింది.
ఈ లింక్ ద్వారా గూగుల్ ప్లే స్టోర్ నుంచి న ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు: https://play.google.com/store/apps/details?id=com.dosje.nmba_app&hl=en_IN
పునరావాస మౌలిక సదుపాయాలను విస్తరించడం, నివారణ చర్యలను పెంచడం, అమలు ప్రక్రియలను సరళీకృతం చేయడం, కేంద్రప్రాయోజిత పథకాలను సమర్థవంతంగా అందించడం ద్వారా మత్తుపదార్థాలు లేని, సామాజికంగా అందరినీ కలుపుకొని పోయే భారతదేశ నిర్మాణం దిశగా ప్రభుత్వం తన కట్టుబాటును మరింత బలోపేతం చేస్తోంది. ప్రజల నిరంతర భాగస్వామ్యం, మెరుగైన పాలన, సాంకేతికత ఆధారిత సేవల ద్వారా బలహీన వర్గాలను రక్షించడానికి, అందరికీ సామాజిక న్యాయాన్ని అందించడానికి మంత్రిత్వ శాఖ నిబద్ధతతో పనిచేస్తోంది.
***
(రిలీజ్ ఐడి: 2308011)
సందర్శకుల సూచీ సంఖ్య : : 5