ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌ ఫ‌ర్మేశన్‌ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఎస్ఐటీఏసీ ద్వైపాక్షిక చర్చల కింద కృత్రిమ మేధస్సు, డిజిటలైజేషన్‌లో వ్యూహాత్మక సహకారం గురించి చర్చించిన ఇండియాఏఐ మిషన్, స్వీడన్ దేశాలు


భారతదేశ ఏఐ వ్యవస్థ, స్వీడిష్ పారిశ్రామిక- సాంకేతిక సామర్థ్యాల మధ్య ఉన్న పరస్పర సహకారంపై దృష్టి సారించిన ద్వైపాక్షిక చర్చలు

నాడు పోస్టు చేయడమైనది: 07 SEP 2026 7:28PM by PIB Hyderabad

'స్వీడన్-ఇండియా టెక్నాలజీ అండ్ ఏఐ కారిడార్' (ఎస్ఐటీఏసీ) కింద ఢిల్లీలోని ఎలక్ట్రానిక్స్ నికేతన్‌లో స్వీడన్ ప్రతినిధి బృందంతో ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ (మైటీ) ఆధ్వర్యంలోని ఇండియాఏఐ మిషన్ ద్వైపాక్షిక చర్చలు చేపట్టింది. 

భారతదేశంలో అభివృద్ధి చెందుతున్న ఏఐ వ్యవస్థ, డిజిటలైజేషన్ ప్రాధాన్యతలు, కృత్రిమ మేధ (ఏఐ) రంగంలో మరింత బలమైన ద్వైపాక్షిక భాగస్వామ్య అవకాశాలపై చర్చించడానికి ఈ సమావేశం మైటీ, ఇండియాఏఐ మిషన్, భారతదేశంలోని స్వీడన్ రాయబార కార్యాలయం, బిజినెస్ స్వీడన్, ప్రముఖ స్వీడిష్ కంపెనీలకు చెందిన సీనియర్ ప్రతినిధులను ఒకచోట చేర్చింది.

మైటీ అంతర్జాతీయ సహకార విభాగం జాయింట్ సెక్రటరీ శ్రీ అజిత్ కుమార్ స్వాగతోపన్యాసంతో ఈ సదస్సు ప్రారంభమైంది. ఆ తర్వాత ఇండియాఏఐ మిషన్ సీఈఓ శ్రీ సౌరభ్ విజయ్ ఐఏఎస్ ప్రారంభోపన్యాసం చేశారు. భారతదేశంలోని స్వీడన్ రాయబార కార్యాలయం మినిస్టర్ కౌన్సెలర్, డిప్యూటీ హెడ్ ఆఫ్ మిషన్ ఆగ్నెస్ జులిన్ కూడా ఈ సమావేశంలో ప్రసంగించారు.

"స్వీడన్ దేశం పారిశ్రామిక, పరిశోధన, అధునాతన తయారీ రంగాలలో అపారమైన నైపుణ్యాన్ని కలిగి ఉంది. అలాగే భారతదేశం సాటిలేని స్థాయిలో డిజిటల్ ప్రజా మౌలికసదుపాయాలు (డీపీఐ), విస్తృతమైన ఏఐ నైపుణ్య- టెస్టింగ్ వాతావరణాన్ని అందిస్తోంది." – శ్రీ సౌరభ్ విజయ్ ఐఏఎస్, సీఈఓ, ఇండియాఏఐ మిషన్.

"వాణిజ్యం, నిబంధనలు, వినూత్న అంకురాలను అనుసంధానించడంపై దృష్టి సారించిన స్పష్టమైన రోడ్‌మ్యాప్‌తో ఈ టెక్ విప్లవంలో మనం కలిసి ముందుకు సాగుతున్నప్పుడు భారత్, స్వీడన్ మధ్య ఏఐ, ఎలక్ట్రానిక్స్ రంగాల్లో వ్యాపార అవకాశాల కోసం తలుపులు ఎప్పుడూ తెరిచి ఉంచడమే మన ఉమ్మడి లక్ష్యం." – ఆగ్నెస్ జులిన్, మినిస్టర్ కౌన్సెలర్, డిప్యూటీ హెడ్ ఆఫ్ మిషన్, భారతదేశంలోని స్వీడన్ రాయబార కార్యాలయం.

సమావేశంలో భాగంగా భారతదేశపు ఏఐ వ్యవస్థ, డిజిటల్ రోడ్‌మ్యాప్‌పై ఒక అవలోకనాన్ని ఇండియాఏఐ అందించింది. వేగంగా విస్తరిస్తున్న భారతదేశ ఏఐ రంగంలో స్వీడిష్ కంపెనీలకు అందుతున్న అవకాశాలను ఇది ప్రముఖంగా తెలియజేసింది. కంప్యూట్ సామర్థ్యం, డేటాసెట్లు, మోడల్‌లు, స్వదేశీ- డొమైన్ నిర్దిష్ట ఏఐ, అప్లికేషన్ల అభివృద్ధి, భవిష్యత్ నైపుణ్యాలు, అంకుర ఫైనాన్సింగ్, సురక్షిత- విశ్వసనీయ ఏఐ వంటి ఇండియాఏఐ మిషన్ ప్రధాన ప్రాధాన్యతలను ఈ ప్రెజెంటేషన్ వివరించింది.

భారతదేశం ఏఐ మౌలికసదుపాయాలు, ఆవిష్కరణ వ్యవస్థ, బాధ్యతాయుతమైన ఏఐ స్వీకరణ మార్గాలను నిరంతరం బలోపేతం చేస్తున్నందున అంతర్జాతీయ సాంకేతిక, పారిశ్రామిక కంపెనీలకు వస్తున్న అవకాశాల గురించి కూడా ఈ ప్రెజెంటేషన్ తెలియజేసింది.

డేటా గవర్నెన్స్, స్థానికీకరణ, బాధ్యతాయుతమైన ఏఐ, మార్కెట్ యాక్సెస్‌తో సహా భారత్‌లో ఎంటర్‌ప్రైజ్ ఏఐ స్వీకరణను రూపుదిద్దే విధాన, మౌలికసదుపాయాలు, పరిపాలన పరిస్థితులపై ఈ చర్చలు దృష్టి సారించాయి.

బిజినెస్ స్వీడన్ మార్కెట్ మేనేజర్ శ్రీ జానీ ఎరిక్సన్ నేతృత్వంలోని స్వీడిష్ ప్రతినిధి బృందం ఎస్ఐటీఏసీ గురించి, ఏఐ- డిజిటలైజేషన్‌లో స్వీడన్ ప్రాధాన్యతలను వివరించింది. ఆటోలివ్, కాన్సాట్, ఐకియా, సాబ్, సాండ్‌విక్ ఏఐ, సాండ్‌విక్ ఇంటెలిజెంట్ మ్యానుఫ్యాక్చరింగ్, ఎస్‌కేఎఫ్, వోల్వో గ్రూప్ వంటి ప్రముఖ స్వీడిష్ కంపెనీల ప్రతినిధులు ఈ చర్చలలో పాల్గొన్నారు.

టెక్ మహీంద్రా, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్), జెంటెయిక్, అవతార్ఏఐ, ఇన్నెఫు, కోరోవర్.ఏఐ, గ్నాని, గ్లోబల్స్ ఐటీఈఎస్ వంటి భారతదేశపు ప్రముఖ ఏఐ, సాంకేతికత కంపెనీల ప్రతినిధులతో పాటు స్వీడిష్ కంపెనీలు ఈ సంభాషణపూర్వక చర్చల్లో పాల్గొన్నాయి. పారిశ్రామిక ఏఐ, విశ్వసనీయ డేటా, కంప్యూట్, నైపుణ్యాలు, బాధ్యతాయుతమైన ఏఐ వంటి రంగాల్లో స్వీడిష్ పారిశ్రామిక సామర్థ్యాలకు, భారతీయ ఏఐ ప్రాధాన్యతలకు మధ్య ఉన్న ఏకరూపతలపై ఈ చర్చలు దృష్టి సారించాయి. ఉమ్మడి ఆసక్తులను ఆచరణాత్మక భాగస్వామ్యాలుగా మలచడంపై ఇందులో ప్రధానంగా మాట్లాడారు. 

భారతీయ ఏఐ, సాంకేతికత కంపెనీల భాగస్వామ్యం ద్వారా భారతదేశపు ఎంటర్‌ప్రైజ్ ఏఐ సామర్థ్యాలు, సాంకేతిక పరిష్కారాలు, ఉపయోగించేందుకు సిద్ధంగా ఉన్న ఆవిష్కరణల గురించి తెలుసుకునే అవకాశం స్వీడిష్ ప్రతినిధి బృందానికి లభించింది. నిర్దిష్ట పారిశ్రామిక అవసరాల ఆధారంగా పైలట్ ప్రాజెక్ట్‌లు, సహాభివృద్ధి, వాణిజ్య భాగస్వామ్యాలు, ఇతర పరిశ్రమ సహకార మార్గాలను గుర్తించడానికి ఈ సమావేశం దోహదపడింది.

ఎస్ఐటీఏసీ కింద జరిగిన ఈ చర్చలు ఏఐ, డిజిటలైజేషన్‌లో స్వీడన్-ఇండియా సంబంధాలను మరింత బలోపేతం చేయడానికి సహాయపడతాయని భావిస్తున్నారు. ఇందులో భాగంగా భవిష్యత్తులో పైలట్ ప్రాజెక్ట్‌లు, టెస్ట్‌బెడ్‌లు, వ్యవస్థల భాగస్వామ్యాలు, నిరంతర సహకారానికి ఇతర మార్గాలు సుగమం కానున్నాయి.

బిజినెస్ స్వీడన్ మార్కెట్ మేనేజర్ శ్రీ జానీ ఎరిక్సన్ ధన్యవాదాల సమర్పణతో ఈ సదస్సు ముగిసింది. అనంతరం ఇండియాఏఐ మిషన్ ముగింపు ప్రసంగం చేసింది.

ఆవిష్కరణలు, సంస్థలు స్థాయిలో ఉపయోగించటం, సాంకేతికత ఆధారిత వృద్ధిని పెంపొందించడంలో.. బాధ్యతాయుతమైన, విశ్వసనీయమైన ఏఐ వ్యవస్థలను నిర్మించడంలో భారత్, స్వీడన్ దేశాల ఉమ్మడి నిబద్ధతను ఈ ద్వైపాక్షిక చర్చ తెలియజేస్తోంది.

 

***


(రిలీజ్ ఐడి: 2307708) సందర్శకుల సూచీ సంఖ్య : : 8
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी