సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పింఛన్ల మంత్రిత్వ శాఖ
ఉద్యోగులు, వారి కుటుంబాలకు సేవా నిబంధనలు మరింత ప్రయోజనకరంగా రూపొందించేందుకు నిరంతర కృషి అవసరం: కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్
కేంద్ర సచివాలయ సేవల ఫోరం (సీఎస్‌ఎస్) చేపట్టిన ‘సీఎస్‌ఎస్ షీల్డ్’ కార్యక్రమాన్ని స్వాగతించిన డాక్టర్ జితేంద్ర సింగ్
సమష్టి సహకారంతో ఆపద సమయంలో కుటుంబాలకు అండగా నిలిచే కొత్త సంస్కృతికి నాంది పలకవచ్చు: కేంద్ర మంత్రి
కష్ట సమయంలో కుటుంబమంతా ఒక్కటిగా నిలిచే స్ఫూర్తిని ప్రతిబింబిస్తున్న ‘సీఎస్‌ఎస్ షీల్డ్’: డాక్టర్ జితేంద్ర సింగ్
మృతిచెందిన సీఎస్‌ఎస్ అధికారుల కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించనున్న సీఎస్‌ఎస్ ఫోరం ‘సీఎస్‌ఎస్ షీల్డ్’ కార్యక్రమం
మృతిచెందిన ఉద్యోగుల కుటుంబాలకు సహాయాన్ని విస్తరించడంతోపాటు వారి పిల్లలకు స్కాలర్‌షిప్‌లు అందించేందుకు సీఎస్‌ఎస్ ఫోరం ప్రణాళిక
నాడు పోస్టు చేయడమైనది:
05 SEP 2026 2:22PM by PIB Hyderabad
ఉద్యోగులు, వారి కుటుంబాల అవసరాలకు మరింత అనుగుణంగా సేవా నిబంధనలను మార్చేందుకు నిరంతర కృషి అవసరమని కేంద్ర శాస్త్ర, సాంకేతిక, భూ విజ్ఞాన శాఖల సహాయ మంత్రి (స్వతంత్ర బాధ్యత), ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంఓ), సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పింఛన్లు, అణుశక్తి, అంతరిక్ష శాఖల సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ నేడు పిలుపునిచ్చారు.
కేంద్ర సచివాలయ సేవల (సీఎస్‌ఎస్) ఫోరం చేపట్టిన ‘సీసీఎస్ షీల్డ్’ కార్యక్రమాన్ని డాక్టర్ జితేంద్ర సింగ్ స్వాగతించారు. ఇలాంటి సమష్టి ప్రయత్నాలు ఆకస్మిక విషాద సమయంలో కుటుంబాలకు అండగా నిలిచే కొత్త సంస్కృతికి నాంది పలుకుతాయని అన్నారు. ఈ కార్యక్రమ ప్రారంభోత్సవంలో ఆయన మాట్లాడుతూ.. ఈ విధానాన్ని అమలు చేయడం కష్టమేమీ కాదని, అయితే అందుకు సమష్టి సంకల్పం, సహకరించాలనే సుముఖత ముఖ్యమని పేర్కొన్నారు. సహచరులు ఒక కుటుంబంలా కలిసి దుఃఖంలో ఉన్న కుటుంబానికి అండగా నిలిచినప్పుడు, అది సంస్థకు మించి ఒక గొప్ప సందేశాన్ని అందిస్తుందని ఆయన అన్నారు.
మరణించిన సీఎస్‌ఎస్ అధికారుల కుటుంబాలకు పరస్పర సహకారం అందించేందుకు కేంద్ర సచివాలయ సేవల ఫోరం ‘సీఎస్‌ఎస్ షీల్డ్’ పేరుతో చేపట్టిన కార్యక్రమ ప్రారంభోత్సవంలో కేంద్ర మంత్రి మాట్లాడారు. ఈ కార్యక్రమానికి సీఎస్‌ఎస్ ఫోరం కార్యనిర్వాహకులు, సభ్యులు, విధుల్లో ఉన్న సీఎస్‌ఎస్ అధికారులు, సహచరులతో పాటు దివంగత శ్రీ మోహన్ చంద్ర భట్, దివంగత శ్రీ రాజేంద్ర చంద్ర కుటుంబ సభ్యులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో భాగంగా మరణించిన ఇద్దరు అధికారుల కుటుంబాలకు డాక్టర్ జితేంద్ర సింగ్ ఆర్థిక సహాయాన్ని అందించారు.
ఉద్యోగులు, వారి కుటుంబాల అవసరాలకు ప్రభుత్వ సేవా వ్యవస్థలను మరింత స్పందించేలా మార్చేందుకు కేంద్ర సిబ్బంది మంత్రిత్వ శాఖ చేస్తున్న విస్తృత కృషిలో భాగంగానే ఈ కార్యక్రమం చేపట్టినట్లు డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. సమకాలీన అవసరాలకు అనుగుణంగా ఇటీవలి సంవత్సరాల్లో అనేక సేవల సంబంధిత నిబంధనల్లో మార్పులు చేశామని ఆయన అన్నారు. వ్యవస్థను మరింత స్పందించేలా చేయగలిగే చోట కొత్త నిబంధనలను ప్రవేశపెట్టడానికి లేదా ప్రస్తుత నిబంధనలను సవరించడానికి ప్రభుత్వం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉందని పేర్కొన్నారు.
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వ విధానాన్ని ప్రస్తావిస్తూ డాక్టర్ జితేంద్ర సింగ్ మాట్లాడారు. నిబంధనలు, విధానాలను నిరంతరం సమీక్షించి, ప్రస్తుత వ్యవస్థలను మరింత మెరుగుపరచగలిగే చోట అవసరమైన మార్పులు చేయాలని ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని అన్నారు. ఉద్యోగులు, వారి కుటుంబాల అవసరాలకు ప్రభుత్వ వ్యవస్థలు సున్నితంగా, స్పందించేలా ఉండేలా చూడటమే దీని లక్ష్యమని తెలిపారు.
సీఎస్‌ఎస్ షీల్డ్ కార్యక్రమంలో భాగస్వామ్యం, నిధుల సమీకరణ పెరిగే కొద్దీ ఈ కార్యక్రమం మరింత విస్తృత రూపాన్ని సంతరించుకోవచ్చని మంత్రి సూచించారు. మరణించిన సీఎస్‌ఎస్ అధికారుల పిల్లలకు స్కాలర్‌షిప్‌లు అందించడాన్ని కూడా ఈ కార్యక్రమం ద్వారా అందించే సహాయంలో భాగంగా పరిగణించవచ్చని ఆయన అన్నారు. తద్వారా విషాదం సంభవించిన తర్వాత కూడా కుటుంబాలకు ఆసరా లభిస్తుందని పేర్కొన్నారు.
“కుటుంబం కోసం సహకరించండి, గౌరవంతో అండగా నిలవండి” అనే సూత్రం ఆధారంగా సీఎస్‌ఎస్ షీల్డ్ కార్యక్రమాన్ని రూపొందించారు. సీఎస్‌ఎస్ అధికారుల మృతితో విషాదంలో ఉన్న కుటుంబాలకు సమిష్టిగా ఆర్థిక సహాయం అందించడమే దీని లక్ష్యం. సేవా సమాజంలోని సభ్యులు తమ సహచరుల కుటుంబాలకు అండగా నిలిచేలా మరింత క్రమబద్ధమైన, విశ్వసనీయమైన వ్యవస్థను ఏర్పాటు చేయడమే ఈ కార్యక్రమం ఉద్దేశం.
ఈ కార్యక్రమం రూపుదిద్దుకున్న తీరును వివరిస్తూ సీఎస్‌ఎస్ ఫోరం ప్రతినిధులు మాట్లాడారు. సీఎస్‌ఎస్ షీల్డ్ అధికారికంగా ప్రారంభించకముందే మరణించిన సీఎస్‌ఎస్ అధికారుల కుటుంబాలకు స్వచ్ఛంద విరాళాల ద్వారా ఫోరం సహాయం అందిస్తూ వచ్చిందని తెలిపారు. కోవిడ్ 19 కాలంలో పలువురు సీఎస్‌ఎస్ అధికారులు ప్రాణాలు కోల్పోయిన సమయంలో ఎదురైన అనుభవాలు, పరస్పర సహకారానికి ఒక క్రమబద్ధమైన వ్యవస్థ అవసరాన్ని మరింత బలపరిచాయని వారు పేర్కొన్నారు.
2020 నుంచి సుమారు 65 నుంచి 70 మంది మరణించిన అధికారుల కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించేందుకు సీఎస్‌ఎస్ అధికారులు సమష్టిగా సుమారు రూ.1.30 కోట్లను విరాళంగా అందించారని ఫోరం తెలిపింది. ఈ సహాయంలో మరింత స్థిరత్వం, ముందస్తు అంచనా ఉండేలా చేయడానికి ఇప్పుడు సీఎస్‌ఎస్ షీల్డ్ కార్యక్రమాన్ని అధికారికంగా ప్రారంభించారు.
కొత్త కార్యక్రమం కింద విషాదంలో ఉన్న ప్రతి కుటుంబానికి కనీసం రూ.15 లక్షల ఆర్థిక సహాయం అందించాలని ఫోరం లక్ష్యంగా పెట్టుకుంది. కార్యక్రమంలో భాగస్వామ్యం పెరిగే కొద్దీ ఈ సహాయాన్ని క్రమంగా మరింత పెంచడం దీని విస్తృత లక్ష్యంగా ఉంది. కేంద్ర సచివాలయ సేవలకు చెందిన సుమారు 13,000 మంది సభ్యులు ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావడంతో, భవిష్యత్తులో అందించే సహాయాన్ని గణనీయంగా పెంచాలని ఫోరం భావిస్తోంది.
ఈ కార్యక్రమంలో దివంగత శ్రీ మోహన్ చంద్ర భట్, దివంగత శ్రీ రాజేంద్ర చంద్రలకు నివాళులర్పించారు. వారి సేవలను, అందించిన సేవలను ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. శ్రీ భట్ కేంద్ర సచివాలయ సేవలు, ఇతర ప్రభుత్వ సంస్థల్లో వివిధ హోదాల్లో పనిచేశారు. శ్రీ రాజేంద్ర చంద్ర ఆదాయ శాఖ పరిపాలనా విభాగంలో సుమారు రెండు దశాబ్దాల పాటు సేవలందించారు.
సీఎస్‌ఎస్ షీల్డ్ కార్యక్రమం ప్రారంభంతో కష్ట పరిస్థితుల్లో తన సభ్యులకు, వారి కుటుంబాలకు అండగా నిలవడం, “కలిసి సేవ చేస్తాం, కలిసి సహకరిస్తాం” అనే స్ఫూర్తిని మరింత బలోపేతం చేయడం పట్ల సీఎస్‌ఎస్ ఫోరం తన నిబద్ధతను ప్రకటించింది.
***
(రిలీజ్ ఐడి: 2307107)
సందర్శకుల సూచీ సంఖ్య : : 11