సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పింఛన్ల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ప్రత్యేక కార్యక్రమం-3లో దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న 2,306 పెన్షన్ ఫిర్యాదుల పరిష్కారం

ప్రత్యేక కార్యక్రమం-3 ముగిసే నాటికి లక్ష్యంగా నిర్దేశించిన ఫిర్యాదుల్లో 72 శాతం పరిష్కారం



సీపీఈఎన్‌జీఆర్‌ఏఎంఎస్‌ వేదిక ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో అధిక సంఖ్యలో ఫిర్యాదుల పరిష్కారంతో డిజిటల్ అంతరాన్ని తగ్గించిన ప్రత్యేక కార్యక్రమం-3



దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న పెన్షన్ ఫిర్యాదుల పరిష్కారంతో పాలనపై ప్రజల విశ్వాసాన్ని చాటిన ప్రత్యేక కార్యక్రమం-3

నాడు పోస్టు చేయడమైనది: 04 SEP 2026 2:00PM by PIB Hyderabad

కేంద్ర ప్రభుత్వ పెన్షనర్ల సంక్షేమం కోసం పెన్షన్, పెన్షనర్ల సంక్షేమ శాఖ నిరంతరం కృషి చేస్తోంది. ఇందులో భాగంగా వారి ఫిర్యాదులను అర్థవంతంగా, సులభంగా పరిష్కరించేందుకు చర్యలు చేపడుతోంది. 2024 నుంచి ప్రతి ఏడాది ప్రత్యేక ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తోంది. మూడో విడతలో భాగంగా దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న పెన్షన్ ఫిర్యాదులు, క్లెయిమ్‌లు, సమస్యలను సకాలంలో, నాణ్యమైన రీతిలో పరిష్కరించేందుకు 2026 జూలై 7న ప్రత్యేక కార్యక్రమం-3ను మంత్రిత్వ శాఖ ప్రారంభించింది. ఇందులో సన్నాహక దశ, అమలు దశ ఉండగా, 2026 ఆగస్టు 31న కార్యక్రమం ముగిసింది.

 

సన్నాహక దశలో అన్ని మంత్రిత్వ శాఖలు, విభాగాలు, వాటికి అనుబంధంగా లేదా అధీనంలో ఉన్న కార్యాలయాలు ఆన్‌లైన్, భౌతిక మార్గాల్లో అందిన దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ఫిర్యాదులు, క్లెయిమ్‌లు, సమస్యలను గుర్తించాలని ఆదేశించారు. ఈ దశలో మంత్రిత్వ శాఖలు, విభాగాలు 1,062 కేసులను గుర్తించాయి. అదనంగా సీపీఈఎన్‌జీఆర్‌ఏఎంఎస్‌ వేదికలో ఒక నెలకు పైగా పెండింగ్‌లో ఉన్న 2,131 ఫిర్యాదు కేసులను కూడా ఈ దశలో పరిష్కారం కోసం స్వీకరించారు.

 

అమలు దశలో ఈ కేసుల పరిష్కారం కోసం శాఖ మంత్రిత్వ శాఖలు, విభాగాలతో చురుగ్గా సమన్వయం చేసింది.  రెండు సమీక్షా సమావేశాలు నిర్వహించడంతో పాటు, ఈ కేసుల పెండింగ్ స్థితిపై క్రమం తప్పకుండా వివరాలను సేకరించారు.

 

40 మంత్రిత్వ శాఖలు, విభాగాల సమన్వయంతో చేపట్టిన చర్యల ఫలితంగా, పరిష్కారానికి స్వీకరించిన మొత్తం 3,193 కేసుల్లో 2,306 కేసులు విజయవంతంగా పరిష్కరించారు. దీంతో 72 శాతం పరిష్కార రేటు నమోదైంది. మిగిలిన ఫిర్యాదులను కూడా పరిష్కరించేందుకు చురుకైన పర్యవేక్షణ చర్యలు కొనసాగుతున్నాయి.

 

పరిష్కరించిన ఫిర్యాదుల భౌగోళిక పంపిణీని పరిశీలిస్తే, ఎక్కువ భాగం గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్న పెన్షనర్లు, కుటుంబ పెన్షనర్లకు సంబంధించినవిగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇదొక సానుకూల పరిణామం. ఎందుకంటే వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాలు నిర్వహిస్తున్న వేదికలతో పాటు సీపీఈఎన్‌జీఆర్‌ఏఎంఎస్‌ వేదిక ద్వారా గ్రామీణ ప్రాంతాల నుంచి ఆన్‌లైన్‌లో ఫిర్యాదులను పంపడం వల్ల డిజిటల్ అంతరం తగ్గుతోంది.

 

సమష్టిగా చేపట్టిన చర్యల ఫలితంగా దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న కొన్ని కేసులు విజయవంతంగా పరిష్కరించారు.

 

ప్రధానంగా విజయవంతంగా పరిష్కరించిన కేసులు.. 

·       రక్షణ శాఖ పింఛనుదారునిపై ఆధారపడిన దివ్యాంగ కుమార్తె శ్రీమతి జయలక్ష్మి కర్ణన్‌కు 2013 జూన్ నుంచి అమల్లోకి వచ్చేలా రూ.16.70 లక్షల కుటుంబ పెన్షన్ బకాయిలను విడుదల చేశారు.

·       రక్షణ శాఖ పెన్షనర్ శ్రీ ఇదాన్ సింగ్‌కు 16.09.2016 నుంచి అమల్లోకి వచ్చేలా రూ.30 లక్షల దివ్యాంగ పెన్షన్ బకాయిలను పరిష్కరించారు.

·       రక్షణ శాఖ పెన్షనర్ శ్రీ కపూర్ సింగ్‌కు 01.01.2006 నుంచి అమల్లోకి వచ్చేలా రూ.26.12 లక్షల యుద్ధ గాయం సంబంధిత బకాయిలను చెల్లించారు.

·       రక్షణ శాఖ పెన్షనర్ జీవిత భాగస్వామి శ్రీమతి రుక్మణి నాయర్‌కు 24.09.2012 నుంచి అమల్లోకి వచ్చేలా రూ.19 లక్షల ద్వంద్వ కుటుంబ పెన్షన్ బకాయిలను విడుదల చేశారు.

·       సైనికుడి తల్లి శ్రీమతి సరన్‌జిత్ కౌర్‌కు 28.07.2008 నుంచి అమల్లోకి వచ్చేలా రూ.18.57 లక్షల ప్రత్యేక కుటుంబ పెన్షన్ బకాయిలను వడ్డీతో కలిపి, అలాగే రూ.12.60 లక్షల ఆర్థిక సాయం బకాయిలను వడ్డీతో కలిపి చెల్లించారు.

·       రక్షణ శాఖ పెన్షనర్ కుమార్తె, వితంతువు అయిన శ్రీమతి సునైనా కుమారికి 18.03.2022 నుంచి అమల్లోకికి వచ్చేలా రూ.6.27 లక్షల పెండింగ్ కుటుంబ పెన్షన్ బకాయిలను విడుదల చేశారు.

·       రక్షణ శాఖ పెన్షనర్ జీవిత భాగస్వామి శ్రీమతి సిమార్టోకు 01.01.1996 నుంచి అమల్లోకి వచ్చేలా రూ.10.66 లక్షల సరళీకృత కుటుంబ పెన్షన్ బకాయిలను చెల్లించారు.

·       రక్షణ శాఖ పెన్షనర్ జీవిత భాగస్వామి శ్రీమతి అంగూరి దేవికి 01.01.1996 నుంచి అమల్లోకి వచ్చేలా సాధారణ కుటుంబ పెన్షన్, ప్రత్యేక కుటుంబ పెన్షన్ మధ్య వ్యత్యాసానికి సంబంధించిన రూ.37.40 లక్షల కుటుంబ పెన్షన్ బకాయిలను చెల్లించారు.

·       రక్షణ శాఖ పెన్షనర్ శ్రీ రంజిత్ సింగ్‌కు 2004 అక్టోబర్ నుంచి 2023 డిసెంబర్ వరకు కాలానికి సంబంధించిన కాలపరిమితి ముగిసిన సేవా పెన్షన్ బకాయిల కింద రూ.25.99 లక్షలను చెల్లించారు.

·        రక్షణ శాఖ పెన్షనర్ జీవిత భాగస్వామి శ్రీమతి కొరంగా లక్ష్మికి 2011 జూన్ నుంచి 2026 ఫిబ్రవరి వరకు కాలానికి సంబంధించిన కుటుంబ పెన్షన్ బకాయిల కింద రూ.30.15 లక్షలను చెల్లించారు.

 

****


(రిలీజ్ ఐడి: 2306715) సందర్శకుల సూచీ సంఖ్య : : 8
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: हिन्दी , English , Urdu