వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
న్యూఢిల్లీలో బ్రిక్స్ దేశాల ఐపీ కార్యాలయాల అధిపతుల 18వ సమావేశం
మేధో హక్కుల్లో బహుపాక్షిక సహకారాన్ని బలోపేతం చేయడానికి తమ చిత్తశుద్ధిని పునరుద్ఘాటించిన సభ్యులు
సహకారాన్ని, ఆవిష్కరణను బలోపేతం చేసేలా మెరుగుపరిచిన కార్యాచరణ మార్గదర్శకాలను స్వీకరించిన ఐపీ బ్రిక్స్ సమావేశం
నాడు పోస్టు చేయడమైనది:
02 SEP 2026 9:54PM by PIB Hyderabad
బ్రిక్స్ దేశాల మేధో సంపత్తి (ఐపీ) కార్యాలయాల అధిపతుల 18వ సమావేశంలో రెండో రోజు 2026, సెప్టెంబర్ 2న న్యూఢిల్లీలో జరిగింది. భారత ప్రభుత్వ వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ పరిధిలోని డీపీఐఐటీకి చెందిన పేటెంట్లు, డిజైన్లు, ట్రేడ్ మార్కుల కంట్రోలర్ జనరల్ కార్యాలయం (సీజీపీడీటీఎం కార్యాలయం) ఆధ్వర్యంలో 2026 సెప్టెంబర్ 1 నుంచి 3 వరకు మూడు రోజుల పాటు ఈ సమావేశం జరుగుతోంది. వర్చువల్, భౌతిక విధానాల్లో జరిగిన ఈ సమావేశంలో సుమారుగా 35 మంది ప్రతినిధులు పాల్గొన్నారు. రష్యా, ఇరాన్, ఇథియోపియా ప్రతినిధులు ఆన్‌లైన్ ద్వారా హాజరు కాగా, మిగిలిన సభ్యదేశాల అధికారులు నేరుగా సభకు హాజరయ్యారు. అంతర్జాతీయ ఆవిష్కరణకు, సృజనాత్మకతకు, ఆర్థిక అభివృద్ధికి కీలకంగా మారిన మేధో హక్కుల్లో బహుపాక్షిక సహకారాన్ని విస్తరించాలనే ఉమ్మడి నిబద్ధతను బ్రిక్స్ సభ్యదేశాల ఐపీ కార్యాలయాల అధిపతులు పునరుద్ఘాటించారు.
బ్రిక్స్‌కు భారత్ అధ్యక్షత వహిస్తున్న నేపథ్యంలో ‘‘స్థిరత్వం, ఆవిష్కరణ, సహకారం, సుస్థిరత కోసం నిర్మాణం’’ అనే ఇతివృత్తానికి అనుగుణంగా ఈ చర్చలు జరిగాయి. ఇవి సాంకేతిక స్థిరత్వాన్ని, సుస్థిరమైన ఆర్థిక వృద్ధిని ఐపీ నిబంధనలు ఎలా పెంపొందిస్తాయో స్పష్టం చేశాయి.
ఫలితాల ఆధారిత సహకారానికి మార్గనిర్దేశం చేయడానికి, సరిహద్దులను అధిగమించి ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి, అంతర్జాతీయ ఐపీ ప్రమాణాలను రూపొందించడంలో ఉమ్మడి ప్రయత్నాలను బలోపేతం చేయడానికి మెరుగుపరిచిన కార్యాచరణ మార్గదర్శకాలను ఈ సమావేశం స్వీకరించింది. ఇది కొనసాగుతున్న ఐపీ బ్రిక్స్ చర్చల్లో సాధించిన ప్రధాన విజయం.
ఉమ్మడి సాంస్కృతిక, మేధో వారసత్వంలో భాగంగా ఉన్న సంప్రదాయ విజ్ఞానం, సంప్రదాయ వైద్య విధానాల ప్రాముఖ్యంతో పాటు వాటిని రక్షించి, పరిరక్షించాల్సిన ఆవశ్యకతను ఐపీ బ్రిక్స్ కార్యాలయాల అధిపతులు గుర్తించారు. ప్రక్రియలను క్రమబద్ధీకరించడానికి, జాప్యాలను తగ్గించడానికి, ఫలితాల ఆదానప్రదానాలను మెరుగుపరచడానికి బ్రిక్స్ దేశాల్లో పటిష్టమైన పేటెంట్ పరిశీలన సహకారంపై అధ్యయనం పరిధిలో సాధించిన పురోగతిని కూడా ఈ సమావేశం గుర్తించింది. పేటెంట్ విశ్లేషణలు, ప్రాకృతిక అధ్యయనాల ద్వారా సాంకేతిక వృద్ధికి మద్దతు ఇవ్వడంలో ఐపీ బ్రిక్స్ కార్యాలయాల పాత్రను తెలియజేసింది. అలాగే బ్రిక్స్ దేశాల మార్కెట్లు అంతటా సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి, జీఐ ఉత్పత్తుల భద్రత, వాణిజ్యాన్ని బలోపేతం చేయడానికి పేటెంట్ విశ్లేషణలు, భౌగోళిక సూచిక (జీఐ)ల్లో కనుగొన్న విషయాలనూ ఈ సమావేశం గుర్తించింది.
ఐపీ బ్రిక్స్ కూటమి ప్రాజెక్టులను సమర్థంగా అమలు చేయడానికి, సహకారాన్ని కొనసాగించడానికి సమన్వయ వ్యవస్థలు, క్రమబద్ధమైన ప్రగతి సమీక్షల ప్రాధాన్యాన్ని ఐపీ బ్రిక్స్ కార్యాలయాల అధిపతులు స్పష్టం చేశారు. ఈ సమావేశాన్ని విజయవంతంగా నిర్వహించిన భారత ప్రభుత్వం వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని పేటెంట్లు, డిజైన్లు, ట్రేడ్ మార్కుల కంట్రోలర్ జనరల్ కార్యాలయాన్ని ఐపీ బ్రిక్స్ కార్యాలయాల అధిపతులతో సహా ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతినిధులు ప్రశంసించారు. అంతర్జాతీయంగా విస్తరిస్తున్న భారతీయ ఐపీ ప్రభావాన్ని ప్రతిబింబిస్తూ... 2026లో భారత్ అధ్యక్షతన ఈ సమావేశానికి ఆతిథ్యం ఇవ్వడం సీజీపీడీటీఎం కార్యాలయానికి గర్వకారణంగా నిలిచింది.
***
(రిలీజ్ ఐడి: 2306334)
సందర్శకుల సూచీ సంఖ్య : : 4