పౌర విమానయాన మంత్రిత్వ శాఖ
విమానాల లీజింగ్, ఫైనాన్సింగ్‌పై కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి
రామ్మోహన్ నాయుడు అధ్యక్షతన సమావేశమైన ఉన్నత స్థాయి కమిటీ
నాడు పోస్టు చేయడమైనది:
02 SEP 2026 8:56PM by PIB Hyderabad
కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి శ్రీ రామ్మోహన్ నాయుడు అధ్యక్షతన విమాన లీజింగ్, ఫైనాన్సింగ్‌పై ఉన్నత స్థాయి కమిటీ (హెచ్‌ఎల్‌సీ) మొదటి సమావేశం జరిగింది. దేశ విమానయాన రంగం వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో... దేశంలో పటిష్ఠమైన, ప్రపంచంతో పోటీపడగల విమాన లీజింగ్, ఫైనాన్సింగ్ వ్యవస్థను అభివృద్ధి చేయడానికి అవసరమైన చర్యలను ఈ కమిటీ చర్చించింది.
ఈ సమావేశానికి పౌర విమానయాన మంత్రిత్వశాఖ కార్యదర్శి శ్రీ సమీర్ కుమార్ సిన్హా, పౌర విమానయాన మంత్రిత్వశాఖ అదనపు కార్యదర్శి శ్రీ పునీత్ కన్సల్ సహా పౌర విమానయాన మంత్రిత్వశాఖ, ఆర్థిక మంత్రిత్వశాఖ, వాణిజ్య విభాగం, డీజీసీఏ, ఆర్‌బీఐ, ఐఎఫ్‌ఎస్‌సీఏలకు చెందిన ఉన్నతాధికారులు, పారిశ్రామిక సంఘాల ప్రతినిధులు హాజరయ్యారు.
“గత సంవత్సరం, మేం గిఫ్ట్ సిటీలో మొదటి ఎయిర్‌క్రాఫ్ట్ లీజింగ్ సమ్మిట్ నిర్వహించాం. కేప్‌టౌన్ కన్వెన్షన్‌ను ఆమోదించడం ఆ సమావేశంలో భాగస్వాముల నుంచి వచ్చిన కీలక సూచనల్లో ఒకటి. మేం ‘ప్రొటెక్షన్ ఆఫ్ ఇంటరెస్ట్స్ ఇన్ ఎయిర్‌క్రాఫ్ట్ ఆబ్జెక్ట్స్ యాక్ట్’ను రూపొందించడం ద్వారా దానిని పరిష్కరించాం. ఈ సంవత్సరం, రెండో ఎయిర్‌క్రాఫ్ట్ లీజింగ్ సమ్మిట్ సందర్భంగా పరిశ్రమ నుంచి అందిన సూచనల్లో ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేయడం ఒకటి. ఈ రోజు ఆ కమిటీ ఏర్పాటు చేసి, మొదటి సమావేశాన్ని నిర్వహిస్తున్నందుకు నేను సంతోషిస్తున్నాను” అని కేంద్ర మంత్రి శ్రీ రామ్మోహన్ నాయుడు అన్నారు.
విమాన లీజింగ్ సుస్థిరమైన, వాణిజ్యపరంగా లాభదాయకమైన వ్యాపారమనీ, ఈ రంగంతో ముడిపడి ఉన్న నష్టాలను తగిన చట్టపరమైన, నియంత్రణ చర్యల ద్వారా క్రమంగా పరిష్కరిస్తున్నారని కేంద్ర మంత్రి తెలిపారు. విమానయాన రంగానికి బ్యాంకు రుణాల కేటాయింపును పెంచే యంత్రాంగాలను అన్వేషించాలనీ... విమాన లీజింగ్‌లో సాంకేతిక, నైపుణ్యాల అభివృద్ధి కోసం జాయింట్ వెంచర్లను గుర్తించాలనీ ఆయన సూచించారు.
విమానాల లీజింగ్‌ను ప్రోత్సహించడానికి, లీజుకు ఇచ్చేవారి విశ్వాసాన్ని పెంచడానికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు సత్ఫలితాలనిస్తున్నాయి. ఇందులో భాగంగా... 250 విమానాలు, 87 ఇంజిన్‌లు సహా 422 అసెట్‌లను ఐఎఫ్ఎస్‌సీ లీజుకు ఇవ్వగా, 474 లీజింగ్ ఒప్పందాలపై సంతకాలు జరిగాయి.
విమానాల లీజింగ్ ప్రాముఖ్యతను స్పష్టం చేస్తూ... ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత విమానయాన రంగం అనూహ్య వృద్ధిని సాధిస్తోందని కేంద్ర మంత్రి తెలిపారు. భారత్ తన విమానాశ్రయ మౌలిక సదుపాయాలను వేగంగా విస్తరిస్తున్నప్పటికీ, ప్రతి 45 రోజులకో విమానాశ్రయం కార్యకలాపాలు ప్రారంభిస్తున్నప్పటికీ, విమానాల లభ్యత ఒక కీలకమైన అడ్డంకిగా మిగిలిపోయింది. భారతీయ విమానయాన సంస్థల విమానాల సముదాయంలో 85 శాతం కంటే ఎక్కువ లీజుకు తీసుకున్నవే. అందుకే ఈ లీజింగ్ వ్యవస్థ బలోపేతం కోసం భాగస్వాములతో నిరంతర సంప్రదింపుల ప్రాముఖ్యతనూ ఆయన స్పష్టం చేశారు.
విమానాల లీజింగ్, ఫైనాన్సింగ్‌కు అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించడం లక్ష్యంగా... పన్నులు, నియంత్రణ విధానాలు, ఫైనాన్స్ లభ్యత, వ్యాపార నిర్వహణ సౌలభ్యం వంటి అనేక అంశాలను కమిటీ చర్చించింది. విమానాల కోసం రూపాయి-ఆధారిత ఫైనాన్సింగ్ అవకాశం, జీఏఏఆర్ వర్తింపుపై మరింత స్పష్టత, ఐర్లాండ్‌తో ద్వంద్వ పన్నుల నివారణ ఒప్పంద విధానాన్ని తిరిగి సమీక్షించేందుకు అవకాశం వంటి అంశాలు ఈ చర్చల్లో భాగంగా ఉన్నాయి.
చర్చలను ముగిస్తూ... గుర్తించిన నియంత్రణపరమైన, ఆర్థికపరమైన, పన్నులకు సంబంధించిన సమస్యలను పరిష్కరించడానికి సమన్వయంతో కూడిన, కాలపరిమితితో కూడిన విధానం అవసరమని శ్రీ రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు. దేశంలో విమానాల లీజింగ్, ఫైనాన్సింగ్ కోసం అంచనా వేయదగిన విధాన ప్రణాళికను రూపొందించడంపై దృష్టి సారిస్తూ... సంబంధిత మంత్రిత్వ శాఖలు, విభాగాలు, భాగస్వాములతో సంప్రదించి ప్రతిపాదిత చర్యలను పరిశీలించడానికి కమిటీ అంగీకరించింది.
*****
(రిలీజ్ ఐడి: 2306211)
సందర్శకుల సూచీ సంఖ్య : : 13