రక్షణ మంత్రిత్వ శాఖ
సీఈఎన్‌జేవోడబ్ల్యూఎస్ రెండో వార్షిక ట్రైడెంట్ లెక్చర్‌లో రక్షణ శాఖ సహాయ మంత్రి ప్రత్యేక ప్రసంగం
“ఆవిష్కరణ, ఆత్మనిర్భరత, పౌర - సైనిక సమన్వయం ద్వారా భవిష్యత్ యుద్ధ పరిస్థితులను ఎదుర్కొనేందుకు భారత్ సంసిద్ధంగా ఉండాలి’’: రక్షణ శాఖ సహాయమంత్రి
నాడు పోస్టు చేయడమైనది:
01 SEP 2026 5:05PM by PIB Hyderabad
2026 సెప్టెంబరు 1న న్యూఢిల్లీలోని మానెక్ షా సెంటర్‌లో నిర్వహించిన సంయుక్త యుద్ధ అధ్యయన కేంద్ర (సీఈఎన్‌జేవోడబ్ల్యూఎస్) రెండో వార్షిక ‘ట్రైడెంట్ ఉపన్యాస’ కార్యక్రమానికి రక్షణ శాఖ సహాయ మంత్రి శ్రీ సంజయ్ సేత్ హాజరై.. ‘దేశ నిర్మాణం కోసం తదుపరి తరం సామర్థ్యాన్ని వినియోగించుకోవడం’ అన్న ఇతివృత్తంపై ప్రత్యేక ప్రసంగం చేశారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మారుతున్న అంతర్జాతీయ భద్రతా వాతావరణం నేపథ్యంలో త్రివిధ దళాల ఉమ్మడి కార్యాచరణ, సమన్వయం, పౌర-మిలిటరీ సహకారం, బలమైన, ఆత్మనిర్భరత కలిగిన రక్షణ వ్యవస్థ ఎంతైనా అవసరమని శ్రీ సేత్ వ్యాఖ్యానించారు. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ మార్గనిర్దేశంలో, రక్షణ మంత్రి శ్రీ రాజ్‌నాథ్ సింగ్ నాయకత్వంలో.. భారత్ తన రక్షణ సామర్థ్యాలను నిరంతరం బలోపేతం చేసుకుంటూ ఆత్మనిర్భర, వికసిత భారత్ ఆశయాల సాధన దిశగా వేగంగా అడుగులు వేస్తోందని ఆయన పేర్కొన్నారు. సాయుధ దళాల అంకితభావం, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడం, త్రివిధ దళాల మధ్య మరింత మెరుగైన సమన్వయాలే.. బలమైన, భద్రమైన భారత్‌కు పునాది అని ఆయన స్పష్టం చేశారు.

భారత యువత శక్తిసామర్థ్యాన్ని శ్రీ సేత్ కొనియాడారు. రక్షణ, పరిశ్రమలు, అంకుర సంస్థలు, అంతరిక్షం, వ్యవసాయం, సాంకేతికత, క్రీడలు సహా విభిన్న రంగాలలో నేటి యువత విశేషంగా రాణిస్తోందన్నారు. ‘దేశంలో తయారు చేద్దాం (మేక్ ఇన్ ఇండియా)’ అన్న స్థాయిని దాటి.. ‘ప్రపంచానికి అందిద్దాం (మేక్ ఫర్ ది వరల్డ్)’ అనే స్థితికి దేశ ఆలోచన పరిధి విస్తరించిందని ఆయన వ్యాఖ్యానించారు. దిగుమతులపై ఆధారపడే స్థితి నుంచి అంతర్జాతీయ స్థాయి పోటీతత్వం కలిగిన ఉత్పత్తులు, సాంకేతికతలను తయారుచేస్తూ, ఇతర దేశాలకు ఎగుమతి చేసే స్థాయికి భారత్ ఎదిగిన తీరును ఇది ప్రతిబింబిస్తోందన్నారు.
_20260901170718_301ccd.jpeg)
భారతీయ ఎంఎస్ఎంఈలు, దేశీయ పరిశ్రమల పాత్ర పెరుగుతుండడం హర్షణీయమన్న శ్రీ సేత్... భవిష్యత్తులో తలెత్తగల యుద్ధాలను ఎదుర్కొనేందుకు వీలుగా సెమీకండక్టర్లు, ఎలక్ట్రానిక్స్, అత్యాధునిక సాంకేతికతల్లో దేశ సామర్థ్యాలను మరింత బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు.
సభనుద్దేశించి మాట్లాడుతూ.. దేశ భద్రత ఇప్పుడు ప్రాదేశిక రక్షణకే పరిమితం కాదనీ, ఆర్థిక భద్రత, సాంకేతిక పోటీతత్వం, సముద్ర తీర స్థిరత్వం, కీలక మౌలిక సదుపాయాలు, సరఫరా వ్యవస్థలు, సమాచార సమగ్రత వంటివన్నీ ఇందులో భాగమయ్యాయనీ సీఐఎస్సీ, ఎయిర్ మార్షల్ తేజిందర్ సింగ్ పేర్కొన్నారు. ఆపరేషన్ సిందూర్ సహా ఇటీవల చేపట్టిన మిలిటరీ ఆపరేషన్లను ఉదాహరణగా పేర్కొంటూ.. సమన్వయంతో కూడిన ప్రణాళిక, సమగ్ర నిర్వహణ అత్యంత ప్రధానమైనవని ఆయన స్పష్టం చేశారు.
వైస్ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ లెఫ్టినెంట్ జనరల్ సందీప్ జైన్, విశ్రాంత లెఫ్టినెంట్ జనరల్ రాజ్ శుక్లా తదితర ప్రముఖ వక్తలు కూడా ఈ కార్యక్రమంలో మాట్లాడారు. పౌర - మిలిటరీ సమన్వయం, బహమాధ్యమ యుద్ధ తంత్రం, అత్యాధునిక సాంకేతికతలు, త్రివిధ దళాల సమన్వయం, భవిష్యత్తు భద్రతా సవాళ్లకు భారత్ సన్నద్ధత వంటి కీలక అంశాలపై వారు విస్తృతంగా చర్చించారు. ‘వికసిత భారత్ @2047’ ఆశయాల సాధన దిశగా భారత్ పురోగమిస్తున్న తరుణంలో.. జాతీయ భద్రతకు సంబంధించి భవిష్యత్ దృష్టి, సమగ్ర ఆలోచన, ఆవిష్కరణలతో కూడిన విధానం అత్యంత ఆవశ్యకమని ఈ చర్చలు పునరుద్ఘాటించాయి.
‘యాన్ ఎరా ఇన్ ఆలివ్ గ్రీన్: జనరల్ అనిల్ చౌహాన్, డ్యూటీ, లీడర్షిప్ అండ్ లెగసీ’ గ్రంథాన్ని కూడా ఈ కార్యక్రమం సందర్భంగా ఆవిష్కరించారు. ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ స్టాఫ్ (డాక్ట్రిన్, ఆర్గనైజేషన్ అండ్ ట్రైనింగ్) డిప్యూటీ చీఫ్ వైస్ అడ్మిరల్ రాజేశ్ ధన్‌కర్ ముగింపు ప్రసంగంతో రెండో వార్షిక ట్రైడెంట్ ఉపన్యాసం ముగుస్తుంది.
***
(రిలీజ్ ఐడి: 2305839)
సందర్శకుల సూచీ సంఖ్య : : 5