గృహ నిర్మాణం మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

మిషన్‌ జీరో: పాత వ్యర్థాల నిర్మూలనలో దేపాల్‌పూర్ ఘన విజయం

నాడు పోస్టు చేయడమైనది: 31 AUG 2026 2:05PM by PIB Hyderabad

ఇండోర్ నగర పాలక సంస్థ దేపాల్‌పూర్‌ బాధ్యతను తన పరిధిలోకి తీసుకుంది. కఠినమైన 4-బిన్‌ వ్యర్థాలను వేరు చేసే విధానాన్ని విజయవంతంగా అమలు చేయడం నుంచి, ఏళ్లుగా పేరుకుపోయిన 1,250 టన్నుల పాత వ్యర్థాలను పూర్తిగా తొలగించడం వరకు సాగిన ఈ మార్పు నిజంగా అద్భుతమైనది.

 

స్వచ్ఛతా హీ సేవా 2025 సందర్భంగా ప్రారంభించిన ‘స్వచ్ఛ షెహర్‌ జోడీ’ కార్యక్రమంతో కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సామర్థ్య నిర్మాణానికి, పరస్పర అభ్యాసానికి మరింత ఊతమిచ్చింది. ఈ కార్యక్రమం కింద 72 మార్గదర్శక నగరాలు, 200 నేర్చుకునే నగరాలు పట్టణ వ్యర్థాల నిర్వహణ రంగంలో 1,600కు పైగా కార్యక్రమాలను చేపట్టాయి.  ప్రతి ఒక్కరు మరొకరికి నేర్పడం నమూనాపై ఆధారపడిన ఈ 100 రోజుల ప్రత్యేక కార్యాచరణ... స్వచ్ఛ భారత్ మిషన్-అర్బన్ (ఎస్‌బీఎం-యూ) కింద పట్టణ వ్యర్థాల నిర్వహణలో చేపట్టిన అతిపెద్ద నిర్దిష్ట సమయ పరిమితి గల మార్గదర్శక వ్యవస్థ. సాంకేతిక పరిజ్ఞాన బదిలీ, పరస్పర అభ్యసనం, ఉత్తమ విధానాల అమలును ప్రోత్సహించడానికి మార్గదర్శక, భాగస్వామ్య నగరాలు అవగాహన ఒప్పందాలపై సంతకాలు చేశాయి. ప్రస్తుతం ఈ నగరాలు క్షేత్రస్థాయి పర్యటనలు, మార్గదర్శక నగరాల  ఉత్తమ విధానాల వ్యాప్తి ద్వారా ఘన వ్యర్థాల నిర్వహణ (ఎస్‌డబ్ల్యూఎం), పట్టణ వ్యర్థాల నిర్వహణలోని (యూడబ్ల్యూఎం) లోపాలను సరిదిద్దుతున్నాయి.

 

స్వచ్ఛ భారత్ మిషన్-అర్బన్ 2.0 కింద దేపాల్‌పూర్ ‘‘జీరో లెగసీ వేస్ట్’’ (ఏళ్లుగా ఉన్న వ్యర్థాల సమగ్ర తొలగింపు) దిశగా సాగించిన ప్రయాణం... ప్రజా సంకల్పానికి, శాస్త్రీయ పద్ధతులకు లభించిన విజయానికి నిదర్శనంగా నిలిచింది. ‘స్వచ్ఛ షెహర్ జోడీ’ కార్యక్రమం కింద ఇండోర్ మున్సిపల్ కార్పొరేషన్, దేపాల్‌పూర్ నగర పరిషత్తు‌లు చేతులు కలిపి ప్రజా భాగస్వామ్యంతో కూడిన వ్యర్థాల నిర్వహణ వ్యవస్థను నిర్మించాయి. ఇంటింటికీ వెళ్లి చెత్తను సేకరించడం, దానిని నాలుగు రకాలుగా వర్గీకరించడం అక్కడ ఇప్పుడు దైనందిన ప్రక్రియగా మారింది. 100 శాతం సేకరణ లక్ష్యం పూర్తయ్యాక, ఏళ్లుగా పేరుకుపోయిన వ్యర్థాల తొలగింపు వంటి క్లిష్టమైన సవాలుపై దృష్టి సారించారు.

దీని ఫలితంగా చారిత్రాత్మక సూరజ్‌కుండ్ బావిని పునరుద్ధరించారు. వీధులు రంగురంగుల గోడ చిత్రాలతో ముస్తాబయ్యాయి. ప్లాస్టిక్ రహిత ప్రాంతాలు సాధారణమ్యాయి. మరోవైపు ఇండోర్ కూడా ‘బస్తీ బెమిసల్’ అనే స్ఫూర్తిదాయకమైన మురికివాడల రూపాంతరీకరణ ప్రచారంతో తన ప్రాథమిక వసతులను మెరుగుపరుచుకుంటోంది.

 

మేయర్ శ్రీ పుష్యమిత్ర భార్గవ్‌, కమిషనర్ ఐఏఎస్‌ క్షితిజ్ సింఘాల్ నాయకత్వంలో దేపాల్‌పూర్ దాదాపు 5 ఏళ్లుగా పేరుకుపోయిన 1,250 మెట్రిక్ టన్నుల చెత్తను పూర్తిస్థాయిలో శుద్ధి చేసి, తన డంప్ యార్డును వ్యర్థ రహితంగా మార్చి సరికొత్త మైలురాయిని సాధించింది.

 

దేపాల్‌పూర్‌లో చేపట్టిన ఈ కార్యక్రమం స్థాయి సాధారణమైనది కాదు. ఇండోర్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌కు చెందిన 500 మందికి పైగా చెత్త సేకరించే కార్మికులు రంగంలోకి దిగి, దేపాల్‌పూర్‌ నగర్‌ పరిషత్‌కు చెందిన డంపర్లు, జేసీబీలు, లోడర్ల వంటి భారీ యంత్రాల సాయంతో ఎంతో కృషి చేసి ఏళ్లుగా పేరుకుపోయిన వ్యర్థాలను తొలగించారు. ఇందుకోసం పక్కా ప్రణాళికతో వ్యర్థాలను అక్కడికక్కడే వివిధ రకాలుగా వేరు చేసి, ప్రతి వ్యర్థాన్ని దాని సరైన గమ్యస్థానానికి తరలించారు. ఈ ప్రక్రియలో ప్లాస్టిక్‌, లోహం, గాజు వంటి 4.5 టన్నుల పునర్వినియోగ వ్యర్థాలను సేకరించి, అధీకృత రీసైక్లర్లకు విక్రయించారు. మరోవైపు 50–60 టన్నుల రిఫ్యూజ్‌ డెరైవ్డ్‌ ఫ్యూయల్‌ (ఆర్‌డీఎఫ్‌)ను ఇండోర్‌లోని నెప్రా ప్లాంటు‌కు తరలించి, అక్కడ దానిని ముక్కలు చేసిన అనంతరం సిమెంట్‌ కర్మాగారాలకు కో-ప్రాసెసింగ్‌ కోసం పంపించారు. సేకరణ, విభజన, శాస్త్రీయ పద్ధతిలో ప్రాసెసింగ్‌, అధీకృత మార్గాల్లో తరలింపు ఇలా ప్రతి దశలోనూ కనిపించిన క్రమశిక్షణ, సమర్థత, సుస్థిరత పట్ల నిబద్ధత ఈ కార్యక్రమానికి ప్రత్యేక గుర్తింపునిచ్చాయి.

  

 

వ్యర్థాల శుద్ధీకరణ పూర్తయిందని ప్రకటించే సమయానికి ఒకప్పుడు భూమిపై మచ్చలా కనిపించిన ఆ డంప్‌ యార్డ్‌.. పునరుజ్జీవనానికి వేదికగా మారింది. భూమికి కొత్త జీవం పోస్తున్న సంకేతంగా అధికారులు, ప్రజాప్రతినిధులు కలిసి 200 మొక్కలను నాటారు. అనంతరం స్థానిక ప్రజలతో కలిసి నిర్వహించిన ‘పోహా పార్టీ’ ఈ విజయాన్ని అందరి గర్వానికి, భాగస్వామ్యానికి ప్రతీకగా మార్చింది. ఇకపై ఈ ప్రదేశాన్ని క్రికెట్‌ మ్యాచ్‌లు, పౌరుల భాగస్వామ్య కార్యక్రమాలు, ‘టిఫిన్‌ పార్టీ’ వంటి సామాజిక సమావేశాలకు వేదికగా ఉండే ప్రజా స్థలంగా తీర్చిదిద్దనున్నారు. ఒకప్పుడు వ్యర్థాల కుప్పగా ఉన్న ప్రదేశం ఇప్పుడు పచ్చదనం, సందడితో నిండిన సామాజిక వేదికగా మారబోతోంది. సంకల్పం, ప్రణాళిక, సమష్టి భాగస్వామ్యంతో డంప్‌యార్డ్‌ను పౌర విజయానికి ప్రతీకగా ఎలా మార్చవచ్చో దేపాల్‌పూర్‌ చాటి చెప్పింది. స్వచ్ఛ షెహర్‌ జోడీ కార్యక్రమం కింద ‘జీరో లెగసీ వేస్ట్‌’ (పాత వ్యర్థాలను పూర్తిగా తొలగించడం) సాధించిన తొలి నగరంగా దేపాల్‌పూర్‌ నిలిచింది. ఇది కేవలం పారిశుధ్య రంగంలో ఒక మైలురాయి మాత్రమే కాదు.. నాయకత్వం, ప్రణాళిక, ప్రజల భాగస్వామ్యం కలిస్తే వ్యర్థాల మచ్చను చెరిపేసి, పచ్చని భవిష్యత్తుకు బాటలు వేయవచ్చని చాటి చెప్పిన విజయగాథ.

 

***


(రిలీజ్ ఐడి: 2304974) సందర్శకుల సూచీ సంఖ్య : : 8
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Tamil