ప్రధాన మంత్రి కార్యాలయం
ఉజ్బెకిస్తాన్ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి ఉన్నత స్థాయి చర్చలు
నాడు పోస్టు చేయడమైనది:
30 AUG 2026 5:47PM by PIB Hyderabad
ఉజ్బెకిస్తాన్ అధికార పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ఉజ్బెకిస్తాన్ అధ్యక్షుడు షవ్కత్ మిర్జియోయెవ్‌తో చర్చలు జరిపారు. కుక్సారోయ్ అధ్యక్ష భవనానికి చేరుకున్న ప్రధానికి అధ్యక్షుడు మిర్జియోయెవ్ అధికార లాంఛనాలతో స్వాగతం పలికారు. ఉజ్బెకిస్తాన్ 35వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆ దేశ ప్రజలకు ప్రధాని శ్రీ మోదీ శుభాకాంక్షలు తెలిపారు.
వాణిజ్యం, పెట్టుబడులు, ఆవిష్కరణలు, అంకురపరిశ్రమలు, డిజిటల్ మౌలిక సదుపాయాలు, పబ్లిక్ యూపీఐ, రక్షణ, భద్రత, వైద్య ఆరోగ్యం, ఔషధాలు, కీలక ఖనిజాలు, వ్యవసాయం, విద్య, పర్యాటకం, అంతరిక్షం, ప్రజల మధ్య సంబంధాలతో సహా సమగ్ర ద్వైపాక్షిక వ్యూహాత్మక భాగస్వామ్యంపై ఇరుదేశాల నాయకులు ప్రతినిధి బృందాల స్థాయిలో విస్తృతంగా చర్చించారు. ఉజ్బెకిస్తాన్ నుంచి భారత్ కు యురేనియం సరఫరా కోసం కుదిరిన సుదీర్ఘకాల ఒప్పందంలో సాధించిన పురోగతిని ప్రధాని అభినందించారు. కీలక ఖనిజాల రంగంలో సహకారాన్ని బలోపేతం చేయవలసిన అవసరాన్ని పునరుద్ఘాటించారు. ఇరుదేశాల మధ్య ఉన్న ప్రగాఢ సంబంధాలు, ప్రాధాన్యతలను ప్రతిబింబిస్తూ ద్వైపాక్షిక వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం స్థాయికి పెంచాలని వారు నిర్ణయించారు. 2030 నాటికి ద్వైపాక్షిక వాణిజ్య లక్ష్యాన్ని 5 బిలియన్ అమెరికన్ డాలర్లుగా నిర్దేశించుకోవడానికి అంగీకరించారు. ఆర్థిక, పెట్టుబడి సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు వాణిజ్య శిఖరాగ్ర సదస్సును నిర్వహించాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని అర్థవంతమైన రీతిలో ముందుకు తీసుకెళ్లడానికి విదేశాంగ మంత్రుల నేతృత్వంలో యంత్రాంగాన్ని ఏర్పాటు చేయడానికి, అంతర్ ప్రభుత్వ కమిషన్‌ను మంత్రివర్గ స్థాయికి పెంచడానికి ఇద్దరు నాయకులు అంగీకరించారు.
ప్రాచీన నాగరికతల అనుబంధం, నేటి ప్రజల మధ్య ఉన్న సంబంధాలు రెండు దేశాల ద్వైపాక్షిక భాగస్వామ్యానికి నిరంతరం కొత్త ఉత్తేజాన్ని అందిస్తున్నాయని నాయకులు గుర్తించారు. ఉజ్బెకిస్తాన్‌లో యోగాకు ఉన్న ఆదరణను ప్రధాని అభినందించారు. ఈ రోజు ఉదయం ఉజ్బెకిస్తాన్ యోగా ఫెడరేషన్ నిర్వహించిన యోగా కార్యక్రమాన్ని ఆయన తిలకించారు. భారత మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి 60వ వర్ధంతిని పురస్కరించుకుని, ఉజ్బెక్ విద్యార్థుల కోసం హిందీ భాషలో లాల్ బహదూర్ శాస్త్రి ఉపకారవేతనాన్ని ప్రధాని శ్రీ మోదీ ప్రకటించారు. ఉజ్బెకిస్తాన్ ప్రారంభించిన “యాశిల్ మకోన్” హరిత కార్యక్రమానికీ, భారతదేశ “ఏక్ పేడ్ మా కే నామ్” ప్రచారానికి మధ్య ఉన్న సారూప్యాన్ని గుర్తిస్తూ... ఆరల్ సముద్ర ప్రాంతంలో జరుగుతున్న పర్యావరణ పునరుద్ధరణ ప్రయత్నాలలో ఉజ్బెకిస్తాన్‌తో భారతదేశ భాగస్వామ్యాన్ని ప్రధాని శ్రీ మోదీ ప్రకటించారు. ఈ ప్రాజెక్ట్ కోసం పది లక్షల అమెరికన్ డాలర్ల గ్రాంట్‌ను మంజూరు చేస్తున్నట్లు వెల్లడించారు. అనంతరం ఇద్దరు నాయకులు కలిసి అధ్యక్ష భవన ప్రాంగణం తోటలో మొక్కను నాటారు.
చర్చల అనంతరం, సంస్కృతి, ఉన్నత విద్య, పరిశోధన, సామర్థ్య పెంపు, ఆర్కైవ్స్, ఆర్థిక సహకారం, పర్యావరణం, పర్యాటకం, మైనింగ్, ఆయుర్వేదం, సోదర రాష్ట్రాలతో సంబంధాలు సహా పలు విస్తృత రంగాలకు సంబంధించిన అవగాహనా ఒప్పందాలను మార్చుకున్నారు. ఉజ్బెకిస్తాన్‌లోని ఫయాజ్ తేపా, కారా తేపా బౌద్ధ క్షేత్రాల పునరుద్ధరణ కోసం కూడా ఉద్దేశ పత్రాలను (లెటర్ ఆఫ్ ఇంటెంట్) ఖరారు చేశారు. తాష్కెంట్ స్టేట్ యూనివర్సిటీ ఆఫ్ ఓరియంటల్ స్టడీస్‌లో ఐసీసీఆర్ సంస్కృత పీఠాన్ని ఏర్పాటు చేసేందుకు అవగాహన ఒప్పందం కుదిరింది.
భారత ప్రధానమంత్రి గౌరవార్థం అధ్యక్షుడు మిర్జియోయెవ్ విందు ఏర్పాటు చేశారు. అధ్యక్షుడు మిర్జియోయెవ్ అందించిన ఆత్మీయ ఆతిథ్యానికి ప్రధాని ధన్యవాదాలు తెలిపారు. భారతదేశాన్ని సందర్శించాల్సిందిగా ఆయనను ఆహ్వానించారు.
***
(రిలీజ్ ఐడి: 2304789)
సందర్శకుల సూచీ సంఖ్య : : 8