కమ్యూనికేషన్లు- సమాచార సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

దేశవ్యాప్తంగా పోగొట్టుకున్న, చోరీ అయిన మొబైల్ ఫోన్‌ల రికవరీలో భారీ విజయం


'సంచార్ సాథీ' ద్వారా నెలలోనే 75,000కు పైగా మొబైల్ ఫోన్‌ల రికవరీ పట్ల కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ మంత్రి శ్రీ జ్యోతిరాదిత్య ఎం. సింధియా హర్షం

డీవోటీ, రాష్ట్రాలు-కేంద్రపాలిత ప్రాంతాల పోలీసుల సమష్టి కృషిని... మెరుగైన రికవరీలకు కారణమైన సంచార్ సాథీ ఫీచర్లను ప్రశంసించిన శ్రీ సింధియా

నాడు పోస్టు చేయడమైనది: 28 AUG 2026 6:01PM by PIB Hyderabad

పోగొట్టుకున్న, చోరీ అయిన మొబైల్ హ్యాండ్‌సెట్‌లను తిరిగి స్వాధీనం చేసుకోవడంలో టెలికమ్యూనికేషన్ల శాఖ (డీవోటీ) ప్రతిష్ఠాత్మక పౌర కేంద్రిత కార్యక్రమం 'సంచార్ సాథీ' ఇటీవల కీలక విజయం సాధించింది. ప్రారంభమైనప్పటి నుంచి తొలిసారిగా... ఒక నెలలోనే 75,000 కంటే ఎక్కువ మొబైల్ హ్యాండ్‌సెట్‌లను తిరిగి స్వాధీనం చేసుకోవడంలో సంచార్ సాథీ విజయం సాధించింది. ఈ కార్యక్రమం పట్ల ప్రజల్లో పెరుగుతున్న విశ్వాసానికి ఈ విజయం నిదర్శనం. సాంకేతికత ఆధారిత పాలన ద్వారా పౌర సాధికారతనూ ఇది ప్రదర్శిస్తుంది. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో డీవోటీ, టెలికాం సర్వీస్ ప్రొవైడర్లు (టీఎస్‌పీలు), పోలీసు విభాగాల మధ్య బలమైన సమన్వయాన్నీ ఇది ప్రతిబింబిస్తుంది. 

రికవరీలను పెంచడంపై దృష్టి సారిస్తూ, ఈ వ్యవస్థలో నిరంతర మెరుగుదల కోసం సంబంధిత వర్గాల అభిప్రాయాలను డీవోటీ సేకరిస్తోంది. ఈ లక్ష్యాన్ని సాధించడానికి చేపట్టిన ప్రధాన చర్యలు కింది విధంగా ఉన్నాయి:

ట్రేసెబిలిటీ నివేదికల ద్వారా పౌరులకు సంబంధిత పోలీస్ స్టేషన్ పేరును ఎస్ఎంఎస్, ఈమెయిల్, పోర్టల్, యాప్ ద్వారా తెలియజేయడం.

రికవరీలను పెంచడం కోసం... పోగొట్టుకున్న/చోరీ అయిన మొబైల్ హ్యాండ్‌సెట్‌లలో కొత్తగా చేర్చిన సిమ్ వివరాలు, ప్రత్యామ్నాయ మొబైల్ నంబరుతో సహా పోలీసు అధికారులకు అందించడం.

ఏదైనా అనుమానిత మాల్వేర్ నుంచి రక్షణ కోసం, తిరిగి పొందిన మొబైల్ హ్యాండ్‌సెట్‌ను ఫ్యాక్టరీ రీసెట్ చేయమని పౌరులకు ఎస్ఎంఎస్ ద్వారా సూచించడం. 

పటిష్ఠ పునాది, వ్యవస్థలో నిరంతర మెరుగుదల ఫలితంగా ఈ విజయం లభించింది. పరికరాలను సమర్థంగా గుర్తించి, వాటి అసలైన యజమానులకు తిరిగి అప్పగించేలా చూసేందుకు డీవోటీ డిజిటల్ ఇంటెలిజెన్స్ యూనిట్, క్షేత్రస్థాయి విభాగాలు... రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ఎల్ఎస్ఏలు, పోలీసు సిబ్బంది సన్నిహిత సమన్వయంతో పనిచేస్తున్నారు. డీవోటీ, రాష్ట్ర-కేంద్రపాలిత ప్రాంత పోలీసుల అంకితభావంతో కూడిన కృషి ఫలితంగా... ఏప్రిల్ 2025 నుంచి జూలై 2026 వరకు నెలవారీ హ్యాండ్‌సెట్ రికవరీలో 201 శాతం గణనీయ పెరుగుదల నమోదైంది. వివరాలు కింద చూడవచ్చు:

పటిష్ఠమైన, స్వదేశీ ప్లాట్‌ఫారమ్... సమీకృత ఆటోమేటెడ్ వర్క్‌ఫ్లోలు... రియల్-టైమ్ డివైస్ ట్రేసెబిలిటీల ఫలితంగా ఈ గణనీయ గుర్తింపు లభించింది. పోగొట్టుకున్న, చోరీ అయిన హ్యాండ్‌సెట్‌ను గురించి పౌరులు వెబ్ పోర్టల్ (www.sancharsaathi.gov.in) లేదా మొబైల్ యాప్ ద్వారా సంచార్ సాథీలో సులభ దశల్లో రిపోర్ట్ చేయవచ్చు. రిపోర్ట్ చేసిన వెంటనే, ఆ పరికరాల దుర్వినియోగాన్ని నివారించడానికి ఆ మొబైల్ హ్యాండ్‌సెట్‌ను భారతీయ టెలికాం నెట్‌వర్క్‌లో బ్లాక్ చేస్తారు. పోగొట్టుకున్న, చోరీ అయిన హ్యాండ్‌సెట్‌ను ఉపయోగించడానికి చేసే ఏ ప్రయత్నాన్నైనా నెట్‌వర్క్ గుర్తించి, దానిని తిరిగి స్వాధీనం చేసుకుని అసలు యజమానికి అప్పగించేందుకు వీలుగా పౌరులకు, పోలీస్ స్టేషన్‌కు హెచ్చరికను పంపిస్తుంది.

ప్రభుత్వ డిజిటల్ ఇండియా దార్శనికతకు అనుగుణంగా... సంచార్ సాథీ ద్వారా పౌరులకు సాధికారత కల్పించడానికి, డిజిటల్ ఆస్తులను పరిరక్షించడానికి డీవోటీ కట్టుబడి ఉంది. పోగొట్టుకున్న లేదా చోరీ అయిన మొబైల్ ఫోన్‌ల గురించి కింది విధంగా అందుబాటులో ఉన్న సంచార్ సాథీ పోర్టల్ లేదా మొబైల్ యాప్ ద్వారా తెలియజేయాలని పౌరులను ప్రోత్సహిస్తున్నాం:

For Android: https://play.google.com/store/apps/details?id=com.dot.app.sancharsaathi

For iOS: https://apps.apple.com/in/app/sanchar-saathi/id6739700695

 

***


(రిలీజ్ ఐడి: 2304417) సందర్శకుల సూచీ సంఖ్య : : 8
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी