వినియోగదారు వ్యవహారాలు, ఆహార మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ
వినియోగదారులకు అందుబాటు ధరలో ఉల్లిపాయలు లభించేలా తగిన మార్కెట్ జోక్యంతో చర్యలు
ఢిల్లీ - ఎన్‌సీఆర్‌లో కిలో ఉల్లిపాయలు రూ.35కే విక్రయం; మార్కెట్‌లో తగినంతగా అందుబాటులో ఉల్లి నిల్వలు
కాందా ఎక్స్‌ప్రెస్ (ప్రత్యేక రైలు) ద్వారా అధిక రవాణా, బఫర్ నిల్వలతో ధరల స్థిరత్వానికి మద్దతు
నాడు పోస్టు చేయడమైనది:
27 AUG 2026 7:37PM by PIB Hyderabad
వినియోగదారులకు అందుబాటు ధరల్లో తగినంత పరిమాణంలో ఉల్లిపాయలు లభించేలా ప్రభుత్వం పలు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఢిల్లీ - ఎన్‌సీఆర్ పరిధిలో రిటైల్ ఔట్‌లెట్లు, మొబైల్ పంపిణీ కేంద్రాల ద్వారా బఫర్ నిల్వల నుంచి ఉల్లిపాయలను కిలో రూ. 35 చొప్పున అందుబాటులోకి తీసుకొస్తోంది. ప్రస్తుత మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా ఈ చర్యలు చేపట్టారు. వినియోగదారులకు ఉల్లిపాయలు సులభంగా అందుబాటులో ఉండేలా చూడటం, ధరల ఒత్తిడిని నియంత్రించడం, మార్కెట్‌లో తగినంత పరిమాణంలో ఉల్లిపాయలు అందుబాటులో ఉండేలా చూడటం ఈ చర్యల ప్రధాన ఉద్దేశం.
‘ కాందా ఎక్స్‌ప్రెస్’ రైలు ద్వారా ఉత్పత్తి ప్రాంతాల నుంచి ప్రధాన వినియోగ కేంద్రాలకు బఫర్ నిల్వల్లోని ఉల్లిపాయలను తరలించడం ద్వారా రవాణా వ్యవస్థను ప్రభుత్వం మరింత బలోపేతం చేసింది. 2024-25లో 14 రైల్వే రేక్‌ల ద్వారా దాదాపు 12,000 మెట్రిక్ టన్నుల బఫర్ ఉల్లిపాయలను ఐదు నగరాలకు తరలించారు. 2025-26లో ఈ కార్యక్రమాన్ని గణనీయంగా విస్తరించి, 86 రైల్వే రేక్‌ల ద్వారా సుమారు 88,000 మెట్రిక్ టన్నుల ఉల్లిపాయలను దేశవ్యాప్తంగా 16 నగరాలకు తరలించారు.
ఈ తాత్కాలిక జోక్యంలో భాగంగా, ఉల్లి నిల్వలను రైలు, రోడ్డు మార్గాల ద్వారా రవాణా చేస్తున్నారు. బఫర్ ఉల్లి నిల్వలను శాస్త్రీయ పద్ధతుల్లో భద్రపరచడానికీ , సమర్థవంతంగా పంపిణీ చేయడానికీ సెంట్రల్ వేర్‌హౌసింగ్ కార్పొరేషన్ సేవలను కూడా ఈ వ్యవస్థలో భాగస్వామ్యం చేశారు.
***
(రిలీజ్ ఐడి: 2303984)
సందర్శకుల సూచీ సంఖ్య : : 7