గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

దేశవ్యాప్తంగా ‘లక్షాధికారి సోదరి’లతో రక్షాబంధన్ వేడుక

మహిళా సాధికారత.. గ్రామీణ సౌభాగ్యంపై ప్రభుత్వ నిబద్ధతను పునరుద్ఘాటించిన కేంద్ర మంత్రి శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్

గ్రామీణ రూపాంతరీకరణకు స్వయం సహాయ సంఘాలే వెన్నెముక

మీ శక్తిసామర్థ్యాలు.. మీ విజయాలే భారత్‌ విజయాలకు ప్రతీకలు

నాడు పోస్టు చేయడమైనది: 27 AUG 2026 6:56PM by PIB Hyderabad

   క్షాబంధన్ పర్వదినం నేపథ్యంలో దేశవ్యాప్తంగా గల స్వయం సహాయ సంఘాల (ఎస్‌హెచ్‌జీ) సభ్యులు, ‘లక్షాధికారి సోదరి’లతో సంయుక్తంగా కేంద్ర గ్రామీణాభివృద్ధి-వ్యవసాయం-రైతు సంక్షేమశాఖల మంత్రి శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్ ఇవాళ వేడుకల్లో పాల్గొన్నారు. వారి సాధికారత, సౌభాగ్యం, సంక్షేమంపై ప్రభుత్వ నిబద్ధతను ఈ సందర్భంగా ఆయన పునరుద్ఘాటించారు. దీన్‌దయాళ్‌ అంత్యోదయ యోజన-జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్ (డే-ఎన్‌ఆర్‌ఎల్‌ఎం) కింద గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యాన దేశంలోని స్వయం సహాయ సంఘాల సభ్యులు వాస్తవిక సాదృశ మాధ్యమం ద్వారా ఈ వేడుకలలో పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో భాగంగా ఆయన ప్రసంగిస్తూ- స్వయం సహాయ సంఘాలతో ముడిపడిన మహిళలకు రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు. విశ్వాసం, బాధ్యత, సామూహిక ప్రగతికి ఈ పండుగ ఒక ప్రతీకని ఆయన అభివర్ణించారు. ఇది కేవలం తోబుట్టువుల మధ్య బంధానికి సంబంధించిన వేడుక మాత్రమే కాదని- మహిళల గౌరవం, భద్రత, సాధికారతపై సమాజానికి గల సమష్టి బాధ్యతను గుర్తుచేసే పర్వదినమని ఆయన పేర్కొన్నారు.

గ్రామీణ రూపాంతరీకరణలో స్వయం సహాయ సంఘాలు వెన్నెముక వంటివని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. సామూహిక కృషి, వ్యవస్థాపకన, సంకల్పం మానవ జీవితాలను, సమాజాలను మార్చగల తీరును ఇవి నిరూపించాయని పేర్కొన్నారు. గ్రామీణ భారతంలో సామాజిక, ఆర్థిక మార్పులు తేవడంలో గ్రామీణ మహిళల ఆర్థిక స్వాతంత్ర్యం, ఆత్మవిశ్వాసం,  నాయకత్వానికి లక్షాధికారి సోదరిల విజయం ఒక ఉజ్వల ఉదాహరణగా నిలుస్తుందన్నారు.

గౌరవనీయ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వాన మహిళ సారథ్యంలో పురోగమనానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని శ్రీ శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ పునరుద్ఘాటించారు. నైపుణ్యాభివృద్ధి, చౌక రుణాల లభ్యత, డిజిటల్ సాధికారత, పారిశ్రామిక ప్రోత్సాహం, పటిష్ట మార్కెట్ అనుసంధానంతో మంత్రిత్వ శాఖ ఇందుకు తన మద్దతును కొనసాగిస్తుందని మంత్రి హామీ ఇచ్చారు. ప్రతి స్వయం సహాయ సంఘం సభ్యురాలు స్వయంసమృద్ధికి ప్రతీకగా నిలవాలని, దేశ సార్వజనీన ప్రగతికి ప్రతి గ్రామ సౌభాగ్యం కీలకంగా నిలిచేలా చూడటమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో మంత్రిత్వశాఖ సీనియర్ అధికారులు, సంయుక్త కార్యదర్శి శ్రీ అమిత్ శుక్లా, గ్రామీణ జీవనోపాధి విభాగం సంయుక్త కార్యదర్శి శ్రీమతి స్వాతి శర్మ, ‘డే-ఎన్ఆర్ఎల్ఎం’  డైరెక్టర్ డాక్టర్ మోలిశ్రీ, ఇతర అధికారులు కూడా పాల్గొన్నారు. శ్రీమతి స్వాతి శర్మ ఈ సందర్భంగా అందరికీ స్వాగతం పలుకుతూ ఆప్యాయత, సాధికారత, స్వావలంబనల వేడుకగా ఈ పర్వదినాన్ని అభివర్ణించారు. అలాగే, ఆర్థిక-సామాజిక పరిణామం దిశగా స్వయం సహాయ సంఘాల మహిళల అద్భుత పురోగమనాన్ని ఆమె ప్రముఖంగా ప్రస్తావించారు.

ఈ వేడుకలలో భాగంగా ఉత్తరాఖండ్, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాల ‘లక్షాధికారి సోదరి’ మహిళలు మంత్రులకు రాఖీ కట్టారు. అలాగే దేశంలోని వివిధ ప్రాంతాల గ్రామీణ సంఘాలు, సాముదాయిక సమాఖ్యలు, స్వయం సహాయ సంఘాల వేలాది సభ్యులు ఇందులో ఆన్‌లైన్‌ మాధ్యమం ద్వారా పాల్గొన్నారు. మహిళా సాధికారత, జీవనోపాధి మెరుగుదలకు ప్రభుత్వ నిరంతర మద్దతుకు కృతజ్ఞతలు తెలుపుతూ, వారి తరఫున వందన సమర్పణ చేశారు.

గ్రామీణ ప్రాంతాల్లోని 10 కోట్ల మందికి పైగా మహిళలను స్వయం సహాయ సంఘాలుగా సమీకరించడం ద్వారా ప్రపంచంలోనే అతిపెద్ద మహిళా సారథ్య సామాజిక సంస్థాగత నెట్‌వర్కులలో ఒకదాన్ని భారత్‌ సృష్టించింది. ఆర్థిక సహాయం, సామర్థ్య వికాసం, జీవనోపాధి వైవిధ్యీకరణ, డిజిటల్ సార్వజననీత, మార్కెట్ సౌలభ్యం తదితర కార్యక్రమాల ద్వారా, మహిళల సారథ్యంలోని సంస్థలను ఈ మిషన్ బలోపేతం చేసింది. అలాగే, సుస్థిర గ్రామీణ జీవనోపాధిని ప్రోత్సహిస్తోంది. స్వయం సహాయ సంఘాల సోదరీమణులతో కలసి రక్షాబంధన్ వేడుక నిర్వహించుకోవడం ద్వారా ప్రభుత్వానికి-గ్రామీణ మహిళలకు మధ్య గల బలమైన విశ్వసనీయ బంధం స్పష్టమైంది. మహిళల సారథ్యంలో అభివృద్ధి ద్వారా స్వయంసమృద్ధ, వికసిత, సుసంపన్న భారత్‌ను సాకారం చేయాలన్న ప్రభుత్వ నిబద్ధతను ఇది ప్రస్ఫుటం చేసింది.

 

***


(రిలీజ్ ఐడి: 2303978) సందర్శకుల సూచీ సంఖ్య : : 6
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , Marathi