ప్రధాన మంత్రి కార్యాలయం
ఖేలో ఇండియా చర్చలో పాల్గొన్న ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ
దేశవ్యాప్తంగా ప్రతిభావంతులైన క్రీడాకారులను ప్రోత్సాహాన్నిచ్చే అద్భుత వేదికగా ‘ఖేలో ఇండియా’.. యువ క్రీడాకారులకు విస్తృత అవకాశాలు, వారి కలల సాకారానికి అండ
క్రీడలంటే పతకాలు గెలవడమే కాదు.. వికసిత భారత్ నిర్మాణం దిశగా భారత క్రీడాశక్తినీ, యువ సామర్థ్యాన్నీ ఏకం చేసే ఉద్యమం
భారత్ కనీసం పాల్గొనని క్రీడల్లోనూ ఇతర దేశాలు పతకాలు గెలుస్తున్నాయి.. ఈ క్రీడల్లోనూ మనం తప్పక ప్రావీణ్యం సాధించాలి
ఛాంపియన్లుగా నిలవడమే కాదు.. అత్యుత్తమ పోటీదార్లుగా ఎదగడాన్నీ క్రీడలు బోధిస్తాయి
ఎదగడమూ, పడిపోవడమూ, పడిపోయి మళ్లీ లేవడమూ... ఇవన్నీ క్రీడలు నేర్పిస్తాయి
స్క్రీన్ల కన్నా క్రీడా కేంద్రాలు ముఖ్యం.. ప్లేస్టేషన్ల కన్నా ఆటస్థలాలు ముఖ్యం: ప్రధాని
నాడు పోస్టు చేయడమైనది:
27 AUG 2026 2:01PM by PIB Hyderabad
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ‘ఖేలో ఇండియా చర్చలో పాల్గొన్నారు. ఇంతటి బృహత్తరమైన కార్యక్రమ నిర్వాహకులనూ, కేంద్ర మంత్రివర్గ సభ్యులనూ, ముఖ్యమంత్రులనూ, లక్షలాది మంది మై భారత్ స్వచ్ఛంద కార్యకర్తలనూ ప్రధానమంత్రి ఈ సందర్భంగా అభినందించారు. ఆగస్టు 29న జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకుని.. దేశవ్యాప్తంగా ఉన్న యువతకూ, క్రీడా రంగంతో అనుబంధమున్న ప్రతి ఒక్కరికీ ఆయన ముందుగా శుభాకాంక్షలు తెలిపారు. “అలాగే ఈ రోజు భరతమాత ముద్దుబిడ్డ మేజర్ ధ్యాన్‌చంద్‌ను కూడా స్మరించుకోవాలి” అని శ్రీ మోదీ అన్నారు.
శతాబ్దం కిందటి భారత ఆర్మీ హాకీ జట్టు చరిత్రాత్మక న్యూజిలాండ్ పర్యటనను ప్రధానమంత్రి గుర్తుచేసుకున్నారు. రెండు దేశాల మధ్య క్రీడా సంబంధాలను నెలకొల్పడంలో మేజర్ ధ్యాన్‌చంద్ కీలక పాత్ర పోషించిన తీరును కొనియాడారు. ఇటీవల తాను న్యూజిలాండ్‌లో పర్యటించిన సమయంలో ఆ మహనీయుడి స్మృతికి నివాళి అర్పించిన విషయాన్ని ప్రస్తావిస్తూ.. నాటి చరిత్రాత్మక సంబంధాలను మరింత బలోపేతం చేసుకునేందుకు భారత్ ఎప్పుడూ కట్టుబడి ఉంటుందన్నారు. “మేజర్ ధ్యాన్‌చంద్ వేసిన ఆ సంబంధాల పునాదులను.. మరింత బలోపేతం చేసుకుంటూ ముందుకు తీసుకెళ్లడానికి భారత్ నేడు నిరంతరం కృషి చేస్తోంది” అని శ్రీ మోదీ స్పష్టం చేశారు.
స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎర్రకోట వేదికగా తాను ప్రకటించిన క్రీడా సంకల్పాన్ని ప్రధానమంత్రి గుర్తుచేసుకున్నారు. క్రీడల ప్రాధాన్యం పతకాలు గెలవడానికి మాత్రమే పరిమితం కాదని ఆయన స్పష్టం చేశారు. వికసిత భారత్ నిర్మాణం దిశగా దేశంలోని క్రీడా శక్తినీ, యువశక్తినీ ఏకం చేసే దిశగా ముఖ్యమైన సాధనంగా క్రీడలను అభివర్ణించారు. ‘ఆడే వారే రాణిస్తారు’ అని తానెప్పుడూ చెబుతుంటానని శ్రీ మోదీ ఈ సందర్భంగా గుర్తుచేశారు.
క్రీడల్లో విజయానికి ఉన్న విస్తృతమైన అర్థాన్ని ప్రధానమంత్రి వివరించారు. ఈ విజయం వ్యక్తిత్వాన్నీ, కుటుంబ గౌరవాన్నీ, దేశ ప్రతిష్ఠనూ ఇనుమడింపజేస్తుందన్నారు. ఒక్క ఆటగాడి విజయం.. వారి పాఠశాల, జిల్లా, రాష్ట్రం ప్రతిష్ఠను పెంచుతుందనీ, స్థానిక ప్రాంతాలకు ప్రపంచ పటంలో సముచిత స్థానాన్ని కల్పిస్తుందనీ ఆయన వ్యాఖ్యానించారు. “ప్రపంచ క్రీడా పటంలో తనదైన ముద్ర వేసే సామర్థ్యం ప్రతి జిల్లాకూ ఉంది. ఈ అపారమైన సామర్థ్యాన్ని అవగతం చేసుకుంటూ.. మనం ఈ చర్చా కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలి” అని శ్రీ మోదీ ఆకాంక్షించారు.
స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో తాను లేవనెత్తిన ఒక ముఖ్యమైన సవాలును శ్రీ మోదీ ప్రస్తావించారు. దాదాపు సగం ఒలింపిక్స్ క్రీడల్లో భారత్ ఇంతవరకు కనీసం పాల్గొనలేకపోవడం పట్ల విచారం వ్యక్తం చేశారు. 2012 ఒలింపిక్స్‌ను ఉదాహరణగా చూపుతూ.. అందులో భారత్ 13 క్రీడల్లో మాత్రమే పోటీపడిందని గుర్తుచేశారు. ప్రపంచవ్యాప్తంగా ఆదరణ ఉన్న 20కి పైగా క్రీడలను విస్మరించడం వల్లే పతకాల పట్టికలో దేశం వెనుకబడుతోందన్నారు. “మన పతకాల సంఖ్యను పెంచుకోవాలంటే.. ఆ క్రీడల్లో కూడా మనం కచ్చితంగా ప్రావీణ్యం సాధించి తీరాలి” అని శ్రీ మోదీ స్పష్టం చేశారు.
దేశంలోని అపారమైన సామర్థ్యాన్ని విస్తృతంగా వినియోగించుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని ప్రధానమంత్రి అన్నారు. సర్ఫింగ్, స్పోర్ట్స్ క్లైంబింగ్, శీతాకాల క్రీడల వంటి ఆటలకు ఎంతో అనువైన విస్తారమైన తీరప్రాంతాలు, పర్వత ప్రాంతాలు ఉన్నప్పటికీ.. ఆయా క్రీడల్లో అంతర్జాతీయ వేదికలపై భారత్ ఇంకా గుర్తింపును పొందలేకపోతోందన్నారు. దేశవ్యాప్తంగా వివిధ జిల్లాల్లో.. ఆయా ప్రాంతాలకు తగిన విధంగా ప్రత్యేక క్రీడా వ్యవస్థలపై పరిశోధించి, వాటి అభివృద్ధి దిశగా నిర్దిష్ట ప్రణాళికతో ముందుకు సాగాలని ఆయన పిలుపునిచ్చారు.
2036 ఒలింపిక్స్ కోసం దీర్ఘకాలిక వ్యూహాన్ని వివరిస్తూ.. అనేక క్రీడల్లో అర్హత సాధించగల సామర్థ్యమున్న అథ్లెట్లను తక్షణమే గుర్తించి, వారిని సన్నద్ధులను చేయడం అత్యావశ్యకమని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. 5 నుంచి 15 సంవత్సరాల వయస్సున్న చిన్నారులు లక్ష్యంగా.. జాతీయస్థాయిలో విస్తృతంగా ‘ప్రతిభావంతుల అన్వేషణ’ను ప్రారంభించబోతున్నట్టు ఆయన తెలిపారు. ఆయా క్రీడల పట్ల ఆసక్తీ, నిర్దేశిత దేహ దారుఢ్యమూ ప్రధాన ప్రాతిపదికలుగా ఎంపిక ప్రక్రియ ఉండాలని స్పష్టం చేశారు. “దీని కోసం ప్రభుత్వం నుంచి ఎలాంటి మద్దతు కావాలన్నా అదిస్తాం. ప్రభుత్వం మీకు తోడుగా ఉంటుంది. మీతో భుజం భుజం కలిపి నడుస్తుంది” అని శ్రీ మోదీ భరోసా ఇచ్చారు.
ఆధునిక, 21వ శతాబ్దపు అవసరాలకు తగిన క్రీడా వ్యవస్థను నిర్మించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధానమంత్రి పునరుద్ఘాటించారు. ఇందులో భాగంగా ప్రత్యేక క్రీడా విశ్వవిద్యాలయాలూ, అధునాతన శిక్షణ కేంద్రాల ఏర్పాటును ఆయన వివరంగా పేర్కొన్నారు. క్రీడా విజ్ఞానం, శిక్షణల్లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న అత్యుత్తమ విధానాలను అందిపుచ్చుకునేలా.. అంతర్జాతీయ సహకారాన్ని ప్రభుత్వం క్రమంగా విస్తరించుకుంటోందని ఆయన గుర్తుచేశారు. “ప్రతిభను గుర్తించడం నుంచి.. దానిని అంతర్జాతీయ వేదికపై నిలిపే వరకు.. ప్రతి స్థాయిలోనూ పూర్తి మద్దతు లభించే ఒక బలమైన వ్యవస్థను దేశంలో నిర్మిస్తున్నాం” అని శ్రీ మోదీ వివరించారు.
క్రీడారంగ అభివృద్ధికి తమ ప్రభుత్వం స్పష్టంగా కట్టుబడి ఉందని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. ‘ఖేలో ఇండియా డైలాగ్’.. ఒక చర్చ మాత్రమే కాదనీ, దేశ క్రీడా దృక్పథానికి క్రియాశీలకంగా రూపుదిద్దే కీలకమైన వేదిక అనీ ఆయన అభివర్ణించారు. దేశ స్వప్నాలతో వ్యక్తిగత లక్ష్యాలను అనుసంధానించుకునేలా.. ఈ చర్చా కార్యక్రమాన్ని యువత సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ప్రతిభను ఆవిష్కరించే విధానాలు, క్రీడాపాలనపై యువత అభిప్రాయాలు.. ప్రభుత్వ విధాన రూపకల్పనను నేరుగా ప్రభావితం చేయగలవని భరోసా ఇచ్చారు. “యువశక్తి అందించే ఈ వినూత్న ఆలోచనలే.. ‘వికసిత భారత్’ స్వప్నాన్ని సాకారం చేసే శక్తిగా నిలుస్తాయి” అని శ్రీ మోదీ స్పష్టం చేశారు.
క్రీడల వల్ల సమాజానికి విస్తృత ప్రయోజనాలున్నాయని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ఆరోగ్యకరమైన సమాజాన్నీ, బలమైన కుటుంబ వ్యవస్థలనూ, అత్యుత్తమ పని సంస్కృతినీ పెంపొందించడానికి నిజమైన క్రీడాస్ఫూర్తి అత్యావశ్యకమని ఆయన వ్యాఖ్యానించారు. కేవలం విజేతలుగా నిలవడం మాత్రమే కాకుండా.. వైఫల్యాలను తట్టుకుని తిరిగి ఏ విధంగా నిలదొక్కుకోవాలో ప్రత్యేకించి నేర్పేది క్రీడారంగం ఒక్కటేనని ఆయన స్పష్టం చేశారు. “ఛాంపియన్లుగా నిలవడమే కాదు.. అత్యుత్తమ పోటీదారుగా ఎదగడాన్ని కూడా క్రీడలు మనకు నేర్పిస్తాయి” అని శ్రీ మోదీ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.
విప్లవాత్మకమైన పరివర్తన శక్తి క్రీడల సొంతమని శ్రీ మోదీ అన్నారు. అద్భుత ప్రదర్శనతో మన దివ్యాంగ అథ్లెట్లు సత్తా చాటారనీ, జీవితంపైనా, ప్రతికూల పరిస్థితులపైనా సమాజ ఆలోచనా ధోరణిలో సమూల మార్పును వారు తెచ్చారనీ కొనియాడారు. దివ్యాంగ క్రీడాకారుడి విజయం వారి కుటుంబంలో నవోత్తేజాన్ని నింపుతుందన్నారు. కెరీర్ తొలి రోజుల్లో వారి పోరాటానికి అండగా నిలిచిన తల్లిదండ్రులు, తోబుట్టువుల్లో ధైర్యాన్నీ, వారి ఆశయాలనూ ఎన్నో రెట్లు పెంచుతుందనీ ఆయన స్పష్టం చేశారు.
అసామాన్య విజయాలతో పారా అథ్లెట్లు స్ఫూర్తిదాయకంగా నిలిచారని ప్రధానమంత్రి ప్రశంసించారు. విలువిద్యా క్రీడాకారిణి శీతల్, రెండుసార్లు పారాలింపిక్స్‌లో పతకం గెలిచిన అవనీ లేఖరా, సుమిత్ అంతిల్, నితేవ్ కుమార్, ఝండూ కుమార్ వంటి పారా అథ్లెట్లను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. ఈ విజయాలు వారి రాష్ట్రాలకూ, మొత్తం దేశానికి ఎనలేని కీర్తిప్రతిష్ఠలను అందించాయని శ్రీ మోదీ అన్నారు. “అవనిని కలిసినప్పుడు ఎంతో గర్వంగా ఉంటుంది. ఇలాంటి క్రీడాకారులందరూ మనలో ఎంతో స్ఫూర్తిని నింపుతారు” అని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు.
అత్యుత్తమ జీవన ప్రమాణానికి భరోసానిచ్చేవిగా క్రీడలను ప్రధానమంత్రి అభివర్ణించారు. జీవితకాలపు దేహదారుఢ్యానికీ, క్రీడా తృష్ణకూ అత్యుత్తమ నిదర్శనంగా.. శతాధిక వృద్ధుడైన దిగ్గజ అథ్లెట్ ఫౌజా సింగ్‌ను ఉదాహరించారు. శారీరక శ్రమకూ, సంపూర్ణ ఆరోగ్యానికీ మధ్య బలమైన సంబంధం ఉందనేందుకు ఫౌజాసింగ్ జీవితాన్ని ప్రత్యక్ష ఉదాహరణగా పేర్కొన్నారు. “క్రీడలూ, జీవన ప్రమాణాలూ ఏ విధంగా పరస్పరం అనుసంధానమై ఉన్నాయో చెప్పడానికి ఆయన జీవితమే గొప్ప స్ఫూర్తి” అని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు.
మాదకద్రవ్యాల వ్యసనం సమాజానికి తీవ్రమైన సవాలుగా పరిణమించిందని ఆందోళన వ్యక్తం చేసిన శ్రీ మోదీ - క్రీడల్లో మనస్ఫూర్తిగా లీనమవడం వల్ల లభించే ఆత్మస్థైర్యం.. మత్తు పదార్థాలకు దూరంగా ఉండడానికి కావాల్సిన మానసిక శక్తిని అందిస్తుందన్నారు. యువతలో ఈ వ్యసనాన్ని నిర్మూలించడంలో క్రీడలు ఎంతో అర్థవంతమైన పాత్ర పోషిస్తున్నాయన్నారు. “నేడు యువతకు ఈ వ్యసనం అతిపెద్ద సవాలుగా నిలిచిన ఈ తరుణంలో.. దాని నిర్మూలనలో కూడా క్రీడలు అత్యంత అర్థవంతమైన పాత్రను పోషిస్తాయి” అని శ్రీ మోదీ స్పష్టం చేశారు.
భారత్‌లో క్రీడలు అత్యంత గౌరవప్రదమైన వృత్తిగా ఎదుగుతుండడం పట్ల ప్రధానమంత్రి హర్షం వ్యక్తం చేశారు. ప్రజలు నేడు ట్రయాథ్లాన్లు, 5కే, 10కే రన్నింగ్ రేసులూ, హైరాక్స్ వంటి దేహదారుఢ్య సవాళ్లలో ఉత్సాహంగా పాల్గొంటూ.. ఒక సాంస్కృతిక మార్పునకు శ్రీకారం చుట్టారన్నారు. శీర్షాసనాన్ని సాధన చేయడం నుంచి సరదాగా పికిల్‌బాల్ ఆడడం వరకు... చదువులు, ఉద్యోగ బాధ్యతలతోపాటు క్రీడలు కూడా ప్రజల దైనందిన జీవితంలో భాగంగా విజయవంతంగా స్థిరపడుతుండడం హర్షణీయమన్నారు. “ఇదొక మార్పు, ఇదొక గొప్ప పరివర్తన. దీని వల్లే దేశ క్రీడా రంగ భవిష్యత్తుపై నమ్మకం కూడా పెరుగుతోంది” అని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు.
ఈ దిశగా క్షేత్రస్థాయి నుంచి ప్రజలు భాగస్వాములవడం అత్యావశ్యకమని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. పాఠశాలల్లో క్రీడలను సహపాఠ్య కార్యకలాపంగానే కాకుండా.. జీవితంలో ప్రధానమైన అంశంగా ఈ వ్యాయామ విద్యను గురించినప్పుడే నిజమైన క్రీడా సంస్కృతి రూపుదిద్దుకుంటుందని ఆయన వ్యాఖ్యానించారు. ప్రాథమిక స్థాయిలోనే క్రీడలను ఒక క్రమబద్ధమైన వ్యవస్థగా మార్చడం వల్ల.. జాతీయ స్థాయిలో ప్రతిభావంతుల సంఖ్య పెరగడమే కాకుండా, యువ అథ్లెట్లకు కుటుంబం అండ కూడా లభిస్తుందని ఆయన వివరించారు. “స్క్రీన్ల కన్నా క్రీడా కేంద్రాలు ముఖ్యమైనవి. ప్లేస్టేషన్ల కంటే క్రీడా మైదానాలు ముఖ్యమైనవి” అని శ్రీ మోదీ అన్నారు.
దేశ యువత సామర్థ్యంపై తమకు అపారమైన నమ్మకముందని ప్రధానమంత్రి పునరుద్ఘాటించారు. మైదానంలోనైనా, సమాజంలోనైనా యువత క్రియాశీల భాగస్వామ్యమే దేశానికి అసలైన శక్తి అని ఆయన ప్రకటించారు. కొత్తరకం క్రీడా పరికరాల రూపకల్పన, అధునాతన క్రీడా సాంకేతికత, స్పోర్ట్స్ మెడిసిన్, పోషకాహారం, సైకాలజీ, అనలిటిక్స్ వంటి రంగాలతో క్రీడా రంగంలో ఉపాధి అవకాశాలు భారీగా విస్తరిస్తున్న విషయాన్ని ప్రముఖంగా ప్రస్తావించారు. “మీరు ఈ అవకాశాలను ఎట్టి పరిస్థితుల్లోనూ జారవిడుచుకోవద్దు. అందుకే ఈ సంవాదం ద్వారా మీ ఆలోచనలను స్వేచ్ఛగా వ్యక్తం చేయండి” అని శ్రీ మోదీ పిలుపునిచ్చారు.
***
(రిలీజ్ ఐడి: 2303857)
సందర్శకుల సూచీ సంఖ్య : : 7
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
Marathi
,
Bengali-TR
,
Bengali
,
English
,
Urdu
,
हिन्दी
,
Assamese
,
Manipuri
,
Gujarati
,
Odia
,
Kannada
,
Malayalam