గనుల మంత్రిత్వ శాఖ
‘క్రిటికల్ మినరల్స్ ఇన్నొవేషన్ హ్యాకథాన్ – 2026’ను ప్రారంభించిన కేంద్ర మంత్రి శ్రీ జి. కిషన్ రెడ్డి
కీలక ఖనిజాల అన్వేషణ, సాంకేతిక పరిజ్ఞానంలో వినూత్న మార్గాలను రూపొందించాల్సిందిగా విద్యార్థులు, పరిశోధకులు, పరిశోధన - అభివృద్ధి సంస్థలు, అంకుర సంస్థలు, ఆవిష్కర్తలకు ఆహ్వానం
నాడు పోస్టు చేయడమైనది:
25 AUG 2026 5:49PM by PIB Hyderabad
కీలక ఖనిజాల రంగంలో ఎదురవుతున్న సవాళ్లకు వినూత్న సాంకేతిక పరిష్కారాలను కనుగొనేలా విద్యార్థులు, పరిశోధకులు, విద్యా - పరిశోధనాభివృద్ధి సంస్థలు, అంకుర సంస్థలు, ఆవిష్కర్తలను ప్రోత్సహించే లక్ష్యంతో.. ‘క్రిటికల్ మినరల్స్ ఇన్నొవేషన్ హ్యాకథాన్- 2026' (సీఎంఐహెచ్ - 2026)ను కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి శ్రీ జి. కిషన్ రెడ్డి ఈ రోజు ప్రారంభించారు. నేషనల్ కీలక ఖనిజాల మిషన్ లక్ష్యాలను మరింత బలోపేతం చేయడం లక్ష్యంగా ఈ హ్యాకథాన్‌ను చేపట్టారు.
కార్యక్రమంలో పాల్గొనేవారు తమ ఆలోచనలను ప్రదర్శించడానికి, నిపుణుల మార్గదర్శకత్వాన్ని పొందడానికి, అలాగే దేశంలో పటిష్టమైన, స్వయంసమృద్ధి కలిగిన కీలక ఖనిజాల వ్యవస్థ నిర్మాణంలో భాగమయ్యేలా వారిని ప్రోత్సహించడానికి ఈ హ్యాకథాన్ వేదిక కానుంది. ఇది ప్రధానంగా రెండు సమస్యల పరిష్కారాలపై దృష్టి సారిస్తుంది: - ఓపెన్ డేటా ఆధారంగా ఖనిజ లభ్యత అంచనా మ్యాపింగ్ ద్వారా.. లిథియం లేదా ఆర్‌ఈఈ పెగ్మటైట్ల లభ్యతను అంచనా వేసే 'ప్రాస్పెక్టివిటీ హీట్‌మ్యాప్'ను రూపొందించి, తెలిసిన ఖనిజ నిక్షేపాలతో సరిచూసుకోవడం ఒకటి కాగా.. కీలక ఖనిజాల రంగానికి సంబంధించి సులభంగా ఉపయోగించగల, వెబ్ ఆధారిత అధునాతన పరిశోధన - అభివృద్ధి, పేటెంట్ పర్యవేక్షణ వ్యవస్థను రూపొందించడం కోసం ‘స్మార్ట్ టెక్నాలజీ అండ్ పేటెంట్ ట్రాకర్’ను అభివృద్ధి చేయడం రెండోది.
గనుల మంత్రిత్వశాఖ పరిధిలోని స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థ అయిన నాగ్‌పూర్‌లోని జేఎన్ఏఆర్డీడీసీ ఈ హ్యాకథాన్‌ను నిర్వహించి, ఆతిథ్యమిస్తోంది. ఈ హ్యాకథాన్ నిర్వహణ సంస్థ గా, ఆతిథ్య సంస్థగా వ్యవహరిస్తోంది. అభ్యర్థులు తమ ఐడియాలను సమర్పించడానికి చివరి తేదీ 2026 సెప్టెంబర్ 20. అనంతరం 2026 నవంబరు 15 నుంచి 17 వరకు జరగనున్న ‘ఇండియా మైనింగ్ వీక్ 2026’ సందర్భంగా విజేతలను ప్రకటిస్తారు. ప్రతీ సమస్య పరిష్కారానికి సంబంధించి.. గెలిచిన రెండు జట్లకు బహుమతులను అందిస్తారు (ప్రథమ బహుమతి రూ. 1.50 లక్షలు, ద్వితీయ బహుమతి రూ. లక్ష).
హ్యాకథాన్, సమస్యల వివరాలు, మార్గదర్శకాలు, నమోదుకు సంబంధించిన సమగ్ర సమాచారం జేఎన్ఏఆర్డీడీసీ వెబ్‌సైట్ https://jnarddc.gov.in/లో అందుబాటులో ఉంది.
కీలక ఖనిజాల రంగంలో ఆవిష్కరణలే ధ్యేయంగా సాగే వ్యవస్థను సృష్టించే దిశగా.. క్రిటికల్ మినరల్స్ ఇన్నొవేషన్ హ్యాకథాన్ – 2026 ఒక కీలకమైన ముందడుగు. అంతేకాకుండా దేశ ఖనిజ భద్రత, సాంకేతిక స్వావలంబనకు తమవంతు సహకారాన్ని అందించేలా యువత, పరిశోధకులు, సాంకేతిక ఆవిష్కర్తలను ప్రోత్సహించడంలో ఇదెంతగానో దోహదపడుతుంది.
***
(రిలీజ్ ఐడి: 2303445)
సందర్శకుల సూచీ సంఖ్య : : 4