వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

టోక్యోలో సెమీకండక్టర్లు, కృత్రిమ మేధ అంశంపై నిర్వహించిన భారత్-జపాన్ ఇండస్ట్రీ రౌండ్‌టేబుల్‌కు అధ్యక్షత వహించిన కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ పీయూష్ గోయల్


జపాన్ ఆర్థిక, వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రితో శ్రీ పీయూష్ గోయల్ ద్వైపాక్షిక సమావేశం

సీఈపీఏ సమీక్ష వేగవంతానికి అంగీకరించిన ఇరువురు మంత్రులు

నాడు పోస్టు చేయడమైనది: 25 AUG 2026 8:11PM by PIB Hyderabad

భారత్-జపాన్ ఆర్థిక, సాంకేతిక సహకారాన్ని బలోపేతం చేయడంలో అభివృద్ధి చెందుతున్న సెమీకండక్టర్లు, కృత్రిమ మేధ రంగాల ప్రాముఖ్యతను స్పష్టం చేస్తూ... టోక్యో వేదికగా ఈ రోజు నిర్వహించిన ప్రముఖ జపనీస్, భారతీయ పరిశ్రమ ప్రతినిధుల రౌండ్‌టేబుల్ సమావేశానికి కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ పీయూష్ గోయల్ అధ్యక్షత వహించారు.

వార్షిక శిఖరాగ్ర సమావేశంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, జపాన్ ప్రధాని సనాయే తకైచిలు అంచనా వేసిన ఆర్థిక భద్రతా భాగస్వామ్యానికి సెమీకండక్టర్లు, ఏఐ వంటి రంగాలు కీలక సహకారం అందిస్తున్నాయని శ్రీ గోయల్ పేర్కొన్నారు. ఈ వ్యూహాత్మక రంగాల్లో భారత్-జపాన్‌ మధ్య పరస్పర సహకారాన్ని మరింతగా పెంపొందించడానికి, విస్తరించడానికి భారత ప్రభుత్వం పూర్తి మద్దతునిస్తుందని ఆయన పారిశ్రామిక ప్రతినిధులకు హామీ ఇచ్చారు.

భారత సెమీకండక్టర్ల రంగంలో వేగంగా విస్తరిస్తున్న అవకాశాలను కేంద్ర మంత్రి ప్రముఖంగా ప్రస్తావించారు. 2032 నాటికి దేశీయ సెమీకండక్టర్ల డిమాండ్ 150 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని అంచనా వేస్తున్నట్లు ఆయన తెలిపారు. చిప్ డిజైన్, సెమీకండక్టర్ యంత్రాలు, సామాగ్రి, ఫ్యాబ్రికేషన్, ఏటీఎంపీ/ఓఎస్ఏటీ, పరిశోధనాభివృద్ధి, మెరుగైన ప్రతిభ వంటి అంశాలను కవర్ చేస్తూ ప్రభుత్వం రూపొందించిన సమగ్ర సెమీకండక్టర్ వ్యూహాన్ని ఆయన వివరించారు. భారీ స్థాయి పెట్టుబడులను ప్రోత్సహించడానికి, దేశంలో ఒక సమగ్ర సెమీకండక్టర్ వ్యవస్థను నిర్మించడం కోసం 'సెమికాన్ ఇండియా 1.0' కింద 10 బిలియన్ డాలర్లు, 'సెమికాన్ ఇండియా 2.0' కింద అదనంగా 15 బిలియన్ డాలర్ల కేటాయింపులకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన తెలిపారు.

దేశంలోని విస్తారమైన నైపుణ్యం, ప్రతిభ కలిగిన నిపుణులను... జపాన్ అధునాతన సాంకేతికత, ఇంజనీరింగ్ సామర్థ్యాలు, పారిశ్రామిక నైపుణ్యంతో అనుసంధానించ గల గణనీయ సామర్థ్యాన్ని శ్రీ గోయల్ స్పష్టం చేశారు. ఇటువంటి పరస్పర సహకారాలు ఇరు దేశాల మధ్య పెట్టుబడి, ఆవిష్కరణ, తయారీ, సాంకేతిక భాగస్వామ్యాలకు కొత్త అవకాశాలను సృష్టించగలవని ఆయన పేర్కొన్నారు.

టోక్యో ఎలక్ట్రాన్, డైఫుకు, ప్రిఫర్డ్ నెట్‌వర్క్స్, ఏబీఈజేఏ, మైన్‌బియామిత్సుమి, తనాకా ప్రెషియస్ మెటల్స్ టెక్నాలజీస్, ఫుజిఫిల్మ్ హోల్డింగ్స్, టోరే ఇండస్ట్రీస్, నిప్పాన్ ఎక్స్‌ప్రెస్ హోల్డింగ్స్, మిజుహో ఫైనాన్షియల్ గ్రూప్, క్యోసెరా కార్పొరేషన్, ఫుజి ఎలక్ట్రిక్, టీవోకే, ఎయిర్ వాటర్ ఐఎన్‌సీ, రోమ్, టోమోగావా కార్పొరేషన్, ఎంయుఎఫ్‌జి బ్యాంక్ లిమిటెడ్, ఎన్‌ఇసి కార్పొరేషన్, యమయా ఎలక్ట్రానిక్స్, ఏఎన్‌ఏ ట్రేడింగ్, జెట్రో సహా సుమారు 21 ప్రముఖ జపనీస్ కంపెనీల ప్రతినిధులు ఈ రౌండ్‌టేబుల్‌కు హాజరయ్యారు. వివిధ భారతీయ బిజినెస్ ఛాంబర్స్, వ్యాపారవేత్తల ప్రతినిధి బృందాలూ ఈ రౌండ్‌టేబుల్‌లో పాల్గొన్నాయి.

పాల్గొన్న జపనీస్ కంపెనీలు భారత్‌లో సెమీకండక్టర్లు, ఏఐ రంగాల్లో పెరుగుతున్న అవకాశాలపై విశ్వాసం వ్యక్తం చేశాయి. మేక్ ఇన్ ఇండియా, డిజైన్ ఇన్ ఇండియా, డెవలప్ ఇన్ ఇండియాల పట్ల తమ నిబద్ధతను పునరుద్ఘాటించాయి. ఆయా రంగాల్లో తమ కార్యకలాపాలు, సామర్థ్యాలు, ప్రాజెక్టుల అమలు గురించీ ఆ కంపెనీలు కేంద్ర మంత్రికి వివరించాయి.

జపాన్ పరిశ్రమ ప్రతినిధులు ప్రస్తావించిన సూచనలు, ఆందోళనలకు స్పందిస్తూ... భారత ప్రభుత్వం ఈ సమస్యలను ప్రాధాన్యత ప్రాతిపదికన పరిష్కరిస్తుందని శ్రీ గోయల్ హామీ ఇచ్చారు. ఈ వ్యూహాత్మక రంగాల్లో భారత్-జపాన్ భాగస్వామ్య గణనీయ సామర్థ్యం గురించి భారత్ సంపూర్ణ అవగాహన కలిగి ఉందన్నారు. వేగవంతమైన పద్ధతిలో ఫలవంతమైన ఫలితాలను సాధించేందుకు గానూ టోక్యోలోని భారత రాయబార కార్యాలయం, న్యూఢిల్లీలోని సంబంధిత మంత్రిత్వ శాఖలు, విభాగాల ద్వారా పరిశ్రమతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు కొనసాగించనున్నట్లు ఆయన స్పష్టం చేశారు.

రౌండ్‌టేబుల్‌కి ముందు... జపాన్ ఆర్థిక, వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ అకాజావా ర్యోసేతో శ్రీ గోయల్ ద్వైపాక్షిక సమావేశం నిర్వహించారు.

ఈ ద్వైపాక్షిక సమావేశంలో ఇరువురు మంత్రులు ద్వైపాక్షిక వాణిజ్యం, పెట్టుబడులు సహా ద్వైపాక్షిక ఆర్థిక సహకారాన్నీ సమీక్షించారు. సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం (సీఈపీఏ)ను మరింత దూరదృష్టితో కూడినదిగా, అభివృద్ధి చెందుతున్న ఆర్థిక అవకాశాలకు అనుగుణంగా ఉండేలా చేసేందుకు దాని సమీక్షను వేగవంతం చేయాల్సిన అవసరాన్ని వారు చర్చించారు.

నూతన, అభివృద్ధి చెందుతున్న రంగాలు, తదుపరి తరం పరిశ్రమలు, తయారీ, సాంకేతికత, ఆవిష్కరణ రంగాల్లో ద్వైపాక్షిక సహకారంపై ఇరువురు మంత్రులు చర్చించారు. జపాన్ నుంచి భారత్‌కు 10 ట్రిలియన్ జపాన్ యెన్ల ప్రైవేట్ పెట్టుబడుల లక్ష్యాన్ని సాధించే దిశగా స్థిరమైన పురోగతిని వారు గుర్తించారు. ఇది భారత్-జపాన్ ప్రత్యేక వ్యూహాత్మక, ప్రాపంచిక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేస్తుందని వారు పేర్కొన్నారు.

 

***


(రిలీజ్ ఐడి: 2303443) సందర్శకుల సూచీ సంఖ్య : : 4
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , Marathi , हिन्दी , Gujarati