వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
భారత్-జపాన్ సంబంధాల పటిష్ఠంలో ప్రవాసులదే కీలక పాత్ర
కేంద్ర వాణిజ్య-పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ పీయూష్ గోయల్
భారత్‌పై ఇనుమడిస్తున్న ప్రపంచ విశ్వాసాన్ని జపాన్‌లోని 200 మందికి పైగా మన వ్యాపార ప్రతినిధులు ప్రతిబింబిస్తున్నారు
నాడు పోస్టు చేయడమైనది:
25 AUG 2026 7:30PM by PIB Hyderabad
కేంద్ర వాణిజ్య-పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ పీయూష్ గోయల్ ఈ రోజు జపాన్‌లోని టోక్యోలో ప్రవాస భారతీయులను ఉద్దేశించి ప్రసంగించారు. భారత్-జపాన్ సంబంధాల బలోపేతంలో వారి పాత్ర ఎంతో కీలకమని ఈ సందర్భంగా కొనియాడారు. ఈ మేరకు జపాన్‌లో నివసించే సుమారు 60,000 మంది ప్రవాసులను “భారత బ్రాండ్ అంబాసిడర్లు”గా ఆయన అభివర్ణించారు. వారి వ్యవహార శైలి, వృత్తి నైపుణ్యం, వివిధ రంగాల్లో వారి సహకారం తదితరాలు భారత్‌ను జపాన్ ప్రజలకు చేరువ చేసే ముఖ్యమైన ఉపకరణంగా మారారని పేర్కొన్నారు.
జపాన్ తన ప్రస్తుత పర్యటన సందర్భంగా వారిలో కనిపించిన ఉత్తేజం, ఉత్సాహం, విశ్వాసం వంటివి భారత్-జపాన్ సంబంధాలు బలపడుతున్న తీరుకు ప్రతీకలుగా నిలుస్తున్నాయిన శ్రీ గోయల్ అన్నారు. భారత్‌కు “జపాన్ సాదర స్వాగతం’, స్థానిక సమాజంతో వారి భాగస్వామ్యం, పనితీరు ద్వారా సద్భావనను పెంచుతున్నందుకు ప్రవాసులందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
జపాన్ పర్యటనకు తనతోపాటు వచ్చిన ప్రతినిధి బృందంలో భారత వాణిజ్య-పారిశ్రామిక రంగాల్లోని 200 మందికి పైగా సభ్యులుగా ఉన్నారని ఆయన పేర్కొన్నారు. తన సారథ్యంలో జపాన్ పర్యటనకు వచ్చిన అతి పెద్ద వ్యాపార ప్రతినిధి బృందం ఇదేనని శ్రీ గోయల్ చెప్పారు. వ్యాపార-వాణిజ్య సంబంధాలతోపాటు పెట్టుబడి అవకాశాల విస్తరణలో ఉభయ పక్షాలకూ విశేషాసక్తి ఉన్నదనే వాస్తవాన్ని ఈ బలమైన భాగస్వామ్యం ప్రతిబింబిస్తోందని తెలిపారు.
గడచిన దశాబ్దంలో భారత్ అంతర్జాతీయ స్థాయిల సాధించిన పరిణామశీల మార్పును మంత్రి ప్రముఖంగా ప్రస్తావించారు. దేశాభివృద్ధి, ప్రపంచంలో ఇనుమడిస్తున్న భారత్ ప్రతిష్ట, ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వం తదితరాలు ప్రపంచవ్యాప్తంగా భారత్‌పైనా, దాని పౌరుల మీదా విశ్వాసం-గౌరవాన్ని పెంచేందుకు దోహదం చేశాయన్నారు.
దేశం 2047 నాటికి వికసిత భారత్‌గా రూపొందాలన్న సంకల్ప సాకారం ప్రధానంగా స్వయంసమృద్ధి, ఆత్మగౌరవం, ఆత్మవిశ్వాసంపై ఆధారపడి ఉందని శ్రీ గోయల్ అన్నారు. ప్రపంచవ్యాప్త భారతీయులు సహా 140 కోట్ల మంది దేశపౌరుల సమష్టి నిబద్ధతే ఈ పరిణామశీల మార్పును స్పష్టం చేస్తున్నదని తెలిపారు.
భారత్‌కు గల జనసంఖ్య లబ్ధిని ప్రముఖంగా ప్రస్తావిస్తూ, సుమారు 29 ఏళ్ల సగటు వయసుగల దేశ యువ జనాభా మనకు కీలక బలమని శ్రీ గోయల్ అన్నారు. కష్టపడి పనిచేసే, ఉన్నతాకాంక్షలుగల సాంకేతిక పరిజ్ఞాన సంపన్నులైన భారత యువత ఉపాధి కోసం అన్వేషించడం కాకుండా ఉద్యోగావకాశాలను సృష్టిస్తున్నారని ఆయన పేర్కొన్నారు.
పెట్టుబడులకే కాకుండా వ్యాపార గమ్యంగానూ భారత్‌కు ప్రపంచమంతటా ఆకర్షణ పెరుగుతోందని మంత్రి చెప్పారు. విస్తరిస్తున్న భారత ఆర్థిక వ్యవస్థ, యువ జనాభా, అంకుర సంస్థలు, సాంకేతిక సామర్థ్యం, వ్యవస్థాపన వాతావరణం వంటివి ప్రపంచ వాణిజ్య సంస్థలకు, పెట్టుబడిదారులకు గణనీయ అవకాశాలను సృష్టిస్తున్నాయని ఆయన అన్నారు.
ప్రపంచ దేశాలతో భారత్ వాణిజ్య ఒప్పందాల నెట్‌వర్క్ విస్తృతం కావడాన్ని శ్రీ గోయల్ ప్రముఖంగా ప్రస్తావించారు. ఇటీవల అనేక దేశాలతో వాణిజ్య ఒప్పందాలను కుదుర్చుకోవడంలో భారత్ విశేష ప్రగతి సాధించిందని తెలిపారు. భారత ఆర్థిక వ్యవస్థ, దాని భవిష్యత్ సామర్థ్యంపై ప్రపంచ భాగస్వాములలో పెరిగే విశ్వాసాన్ని ఇది ప్రతిబింబిస్తుందని ఆయన అన్నారు.
అత్యాధునిక సాంకేతికతలు, సెమీకండక్టర్లు, కృత్రిమ మేధ, రంగాల్లో పనిచేస్తున్న కంపెనీలు సహా జపాన్ సంస్థలతో చర్చలను బట్టి, భారత్‌పై వారిలో ఇనుమడిస్తున్న ఆసక్తి స్పష్టమవుతున్నదని మంత్రి అన్నారు. జపాన్ వ్యాపార సంస్థలు భారత్‌తో తమ సంబంధాల విస్తరణకు ఆసక్తిగా చూపుతున్నాయని, అంతేగాక ఆధునిక-ఉన్నత సాంకేతిక రంగాల్లో అవకాశాలను అన్వేషిస్తున్నాయని పేర్కొన్నారు.
జపాన్‌లో భారత నిపుణులకుగల అవకాశాలను కూడా శ్రీ గోయల్ ప్రముఖంగా ప్రస్తావించారు. సంరక్షకులు, నర్సులు, వెల్డర్లు, వడ్రంగులు, ఎలక్ట్రీషియన్లు, ప్లంబర్లు, డ్రైవర్లు, ఇంజనీర్లు, కృత్రిమ మేధ నిపుణులు, చార్టర్డ్ అకౌంటెంట్లు, నావికులు వివిధ రంగాల్లో వారికి గణనీయ డిమాండ్ ఉందన్నారు. ఈ పరిస్థితుల నడుమ స్థానిక అవసరాలను ప్రవాస భారతీయులు అర్థం చేసుకోవాలని, ఇందులో భాగంగా జపాన్ భాష-సంస్కృతులను అనుసరించాలని పిలుపునిచ్చారు. రెండు దేశాలతో పాటు ప్రజల మధ్య ఆర్థిక సంబంధాలను బలోపేతానికి దోహదపడాలని ఆయన సూచించారు.
జపాన్‌లోని భారతీయులు మాతృభూమితో బలమైన బంధాన్ని కొనసాగించడంతోపాటు ఈ గడ్డను కూడా “కర్మభూమి”గా పరిగణించాలని మంత్రి పిలుపునిచ్చారు. ప్రత్యేకించి ఇక్కడి చట్టాలు, నిబంధనలతోపాటు జీవన విధానాన్ని గౌరవించాలని సూచించారు. డిజిటల్ విద్య, ఆన్‌లైన్ శిక్షణ, విజ్ఞాన ఆదానప్రదానం వంటి కార్యక్రమాల ద్వారా స్వదేశంలోని తమ పట్టణాలు, గ్రామాల అభివృద్ధికీ తోడ్పడాలని కోరారు.
ప్రవాస భారతీయులు పంపే డబ్బు ద్వారా భారత ఆర్థిక వ్యవస్థకు లభిస్తున్న తోడ్పాటును శ్రీ గోయల్ ప్రముఖంగా ప్రస్తావించారు. ఈ సొమ్ము వారి కుటుంబాలకు అండనివ్వడమే కాకుండా ఆర్థిక కార్యకలాపాలకు తోడ్పడతూ పొదుపు, పెట్టుబడులకూ దోహదం చేస్తుందన్నారు. తద్వారా భారత ప్రగతి ప్రయాణంలో ప్రవాస భారతీయులు కీలక భాగస్వాములుగా నిలుస్తారని ఆయన అన్నారు.
విదేశాల్లోని భారతీయుల సంక్షేమం, భద్రతపైనా ప్రభుత్వ శ్రద్ధ వహిస్తున్నదని కూడా ఆయన చెప్పారు. ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో సంక్షోభం తలెత్తినపుడు పౌరులను సురక్షితంగా తరలించడమే కాకుండా చేయూతనివ్వడానికి భారత్ చేస్తున్న కృషిని ప్రస్తావించారు. భారతీయులు ఎక్కడున్నా వారి భద్రత, సంక్షేమానికి ప్రభుత్వం సదా కట్టుబడి ఉంటుందని ఆయన అన్నారు.
రష్యా-ఉక్రెయిన్ సంఘర్షణ సందర్భంగా భారత్ చేపట్టిన తరలింపు ప్రయత్నాలను ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు. భారతీయ విద్యార్థులనే కాకుండా ఇతర దేశాల పౌరులను సురక్షితంగా బయటకు తేవడంలో ప్రభుత్వం వివిధ దేశాలతో కలిసి, విస్తృత కృషితోపాటు సమన్వయ ప్రయత్నాలు కూడా చేసిందని శ్రీ గోయల్ పేర్కొన్నారు.
పశ్చిమాసియాలో ఇటీవలి యుద్ధం సందర్భంగా అక్కడ చిక్కుకుపోయిన భారతీయ మత్స్యకారులకు తోడ్పాటును కూడా మంత్రి ప్రస్తావించారు. పౌర నమోదు, వారి రాకపోకల సమన్వయం, వారిని సురక్షితంగా మాతృభూమికి తిరిగి తీసుకురావడంలో భారత దౌత్య కార్యాలయాలు, స్థానిక అధికారులు, ప్రవాస భారతీయుల పాత్రను ఆయన ప్రముఖంగా ప్రస్తావించారు.
మాతృభూమితో ప్రవాస భారతీయులకు గల బలమైన బంధాన్ని ఈ ప్రయత్నాలన్నీ ప్రతిబింబిస్తున్నాయని శ్రీ గోయల్ అన్నారు. విదేశాల్లోని ప్రవాసులు భారత పురోగమనంలో అంతర్భాగంగా ఉన్నారని, వారికి అవసరమైనప్పుడల్లా ప్రభుత్వం అండగా నిలుస్తుందని ఆయన పునరుద్ఘాటించారు.
జపాన్‌లోనే కాకుండా, ప్రపంచవ్యాప్తంగా గల భారతీయుల సేవలను ప్రశంసిస్తూ- మాతృభూమిని మరచిపోకండి… మేమూ మిమ్మల్ని సదా గుర్తుంచుకుంటాం” అని శ్రీ గోయల్ భరోసా ఇచ్చారు.
***
(రిలీజ్ ఐడి: 2303441)
సందర్శకుల సూచీ సంఖ్య : : 8