రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌
azadi ka amrit mahotsav

ఐసీజీఎస్ అజిత్‌ను భారత తీర రక్షక దళానికి అప్పగించిన గోవా షిప్‌యార్డ్

నాడు పోస్టు చేయడమైనది: 25 AUG 2026 6:20PM by PIB Hyderabad

ప్రముఖ  ప్రభుత్వరంగ రక్షణ సంస్థ - గోవా షిప్‌యార్డ్ లిమిటెడ్ (జీఎస్ఎల్) మరో కీలక మైలురాయిని అధిగమించింది. దేశీయ నౌకా నిర్మాణంలో భాగంగా అత్యాధునిక ఫాస్ట్ పెట్రోల్ వెసల్ (ఎఫ్‌పీవీ) -  ఐసీజీఎస్ అజిత్ (యార్డ్ 1277)ను ఈరోజు భారత తీర రక్షక దళానికి అధికారికంగా అప్పగించింది.

అప్పగింత కార్యక్రమానికి ముందు ఫస్ట్ రీడింగ్ సెర్మనీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జీఎస్ఎల్‌ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ బ్రజేష్ కుమార్ ఉపాధ్యాయ్, డైరెక్టర్ (ఆపరేషన్స్) రియర్ అడ్మిరల్ నెల్సన్ డిసౌజా, ఎన్ఎం, ఐఎన్ (రిటైర్డ్), డైరెక్టర్ (ఫైనాన్స్) శ్రీ జహంగీర్ ఆలం అన్సారీ, డైరెక్టర్ (సీపీపీ అండ్ బీడీ) శ్రీ నాగేశ్ దాస్ పాయ్, డీఐజీ వి.కె. పర్మార్, టీఎం, పీడీ (ఎంఏటీ),  ఐసీజీఎస్ అజిత్ కమాండింగ్ ఆఫీసర్ కమాండెంట్ (జీజీ) మనీష్ తలాన్‌తో పాటు భారత తీర రక్షక దళం, జీఎస్ఎల్‌కు చెందిన పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

 

65 శాతానికి పైగా దేశీయ పరిజ్ఞానంతో నిర్మించిన ఐసీజీఎస్ అజిత్, భారత స్వదేశీ రక్షణ నౌకా నిర్మాణ రంగం పెరుగుతున్న సామర్థ్యాలకు, కేంద్ర ప్రభుత్వ ఆత్మనిర్భర్ భారత్ దార్శనికతకు ప్రతిబింబంగా నిలుస్తోంది.

51.43 మీటర్ల పొడవు, 8 మీటర్ల వెడల్పు కలిగిన ఈ నౌక 2.5 మీటర్ల డ్రాఫ్ట్ వద్ద 330 టన్నుల డిస్ప్లేస్‌మెంట్‌ కలిగి ఉంది. నియంత్రించగల పిచ్ ప్రొపెల్లర్లను నడిపించే రెండు మెరైన్ డీజిల్ ఇంజిన్లతో ఇది పనిచేస్తుంది. ఈ తరహా ఫాస్ట్ పెట్రోల్ వెసల్స్‌లో తొలిసారిగా ఈ సాంకేతికతను వినియోగించారు. దీని ద్వారా ప్రొపల్షన్ సామర్థ్యం, నిర్వహణ తీరు మరింత మెరుగుపడుతుంది.

గంటకు 27 నాటికల్ మైళ్లకు పైగా గరిష్ట వేగంతో ప్రయాణించగల ఈ నౌక 1,500 నాటికల్ మైళ్ల ప్రయాణ సామర్థ్యాన్ని కలిగి ఉంది. కార్యకలాపాల సంసిద్ధత, సామర్థ్యం, సుస్థిరతను మరింత పెంపొందించేందుకు ఇందులో అధునాతన సమగ్ర యంత్రాంగ నియంత్రణ వ్యవస్థను ఏర్పాటు చేశారు.

 

ఐసీజీఎస్ అజిత్‌ను ఆరుగురు అధికారులు, 35మంది నావికులతో కూడిన సిబ్బంది నిర్వహించనున్నారు. మత్స్య సంపద పరిరక్షణ, ప్రత్యేక ఆర్థిక మండలి పర్యవేక్షణ, తీర ప్రాంత గస్తీ, అక్రమ రవాణా నిరోధక, సముద్ర దోపిడీ నిరోధక కార్యకలాపాలతో పాటు గాలింపు, రక్షణ చర్యలు వంటి కీలక సముద్ర భద్రతా విధులను నిర్వహించేలా ఈ నౌకను రూపొందించారు.

ఐసీజీఎస్ అజిత్‌ ప్రవేశంతో భారత తీర ప్రాంతాలు, సముద్రతీరానికి దూరంగా ఉన్న ప్రాంతాల భద్రతను పరిరక్షించడంలో భారత తీర రక్షక దళం సామర్థ్యాలు మరింత బలోపేతం కానున్నాయి. దేశ సముద్ర భద్రతా వ్యవస్థను పటిష్టం చేయడంలో కూడా ఇది కీలకం కానుంది.

ఈ నౌకను అప్పగించడం ద్వారా భారత రక్షణ దళాల కోసం అత్యాధునిక, అధిక సామర్థ్యం కలిగిన నౌకలను అందించడంలో గోవా షిప్‌యార్డ్ లిమిటెడ్‌ (జీఎస్ఎల్) నిబద్ధత మరోసారి స్పష్టమైంది. మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం కింద దేశీయ నౌకా నిర్మాణాన్ని అభివృద్ధి చేయడం, రక్షణ రంగంలో స్వావలంబనను ప్రోత్సహించడం, ప్రపంచ స్థాయి నౌకా నిర్మాణ కేంద్రంగా భారత్‌ను తీర్చిదిద్దాలన్న లక్ష్యానికి మద్దతు ఇవ్వడంలో జీఎస్ఎల్‌ పాత్రను ఇది మరింత బలోపేతం చేస్తుంది

సాంకేతికత, ఆవిష్కరణలు, స్వదేశీకరణపై నిరంతర దృష్టి సారిస్తూ, భారత సముద్ర సామర్థ్యాలను మరింత బలోపేతం చేయడంతో పాటు దేశ నీలి ఆర్థిక వ్యవస్థ (బ్లూ ఎకానమీ)   అభివృద్ధికి దోహదపడేందుకు జీఎస్ఎల్‌ కట్టుబడి ఉంది. 

 

***


(రిలీజ్ ఐడి: 2303437) సందర్శకుల సూచీ సంఖ్య : : 2
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , हिन्दी , Marathi