బొగ్గు మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఎన్ఏ కేటాయించిన తలబిరా II, III బొగ్గు గనులలో 2025-26 ఆర్థిక సంవత్సరానికి రికార్డు ఉత్పత్తిని నమోదు

प्रविष्टि तिथि: 24 AUG 2026 11:25AM by PIB Hyderabad

భారతదేశంలో బొగ్గు ఉత్పత్తిని పెంచటానికి, ఇంధన భద్రతను బలోపేతం చేయటానికి నామినేటెడ్ అథారిటీ (ఎన్ఏ) వ్యవస్థ ద్వారా కేటాయించిన, వేలం వేసిన బొగ్గు గనులు భారత ప్రభుత్వ ప్రయత్నాలకు మరింత ఊతమిస్తున్నాయి. ఈ క్రమంలోబొగ్గు గనుల (ప్రత్యేక నిబంధనల) చట్టం- 2015లోని షెడ్యూల్ III ద్వారా మే 2, 2016న ఎన్‌ఎల్‌సీ ఇండియా లిమిటెడ్ కు కేటాయించిన ఒడిశాలోని తలబిరా II, III ఓపెన్ కాస్ట్ బొగ్గు గని అత్యుత్తమ పనితీరును కనబరుస్తోంది. బొగ్గు ఉత్పత్తి, రవాణా, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడం, భద్రత, పర్యావరణ పరిరక్షణ, స్థానిక ఉపాధి కల్పన, సమాజాభివృద్ధి వంటి విభాగాల్లో ఈ గని విశేష పురోగతిని సాధిస్తోంది.

 

సంబల్‌పూర్, ఝార్సుగూడా జిల్లాల్లో విస్తరించిన ఈ గని దేశీయ బొగ్గు లభ్యతలో కీలక పాత్రను పోషిస్తోంది. గతేడాదితో పోలిస్తే 2025-26 ఆర్థిక సంవత్సరంలో తలబిరా II, III గని 11.28 శాతం వార్షిక వృద్ధితో అత్యధిక వార్షిక బొగ్గు ఉత్పత్తి 19.14 మిలియన్ టన్నులను సాధించింది. మార్చి 21, 2026న అత్యధికంగా ఒకే రోజులో 1,26,138.07 టన్నుల ఉత్పత్తిని, 2026 మార్చి నెలలో అత్యధికంగా 3.39 మిలియన్ టన్నుల నెలవారీ ఉత్పత్తిని నమోదు చేసి రికార్డు సృష్టించింది.

 

ఉత్పత్తి రంగంలో చూపిన ప్రతిభకు బొగ్గు రవాణా కూడా తోడైంది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో 17.69 మిలియన్ టన్నుల అత్యధిక వార్షిక బొగ్గు రవాణాను సాధించి ఈ గని సరికొత్త రికార్డు సృష్టించింది. ఇందులో దాదాపు 10.72 మిలియన్ టన్నులను విద్యుత్ రంగానికి సరఫరా చేయగా, 6.97 మిలియన్ టన్నులను నాన్-రెగ్యులేటెడ్ రంగానికి అందించారు. ఎన్టీపీసీ దార్లీపాలి, ఎన్టీపీసీ గాదర్‌వారా, ఎన్టీపీసీ ఖర్గోన్, ఎన్టీపీసీ కుడ్గిలతో పాటు ఒడిశా, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల్లోని ఇతర విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలకు తలబిరా II, III గనుల నుంచి వెలికితీసే బొగ్గును ఇంధన అవసరాలకు పంపుతారు.

 

ఉత్పత్తి ప్రారంభమైనప్పటి నుంచి ఈ గని స్థిరమైన వృద్ధిని కనబరుస్తోంది. ఆగస్టు 14, 2026 నాటికి ఈ గని నుంచి మొత్తం 72.23 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి, 70.89 మిలియన్ టన్నుల సరఫరా జరిగింది. ప్రభుత్వం చేపట్టిన బొగ్గు గనుల కేటాయింపుల విధానం ద్వారా సాధించిన స్పష్టమైన ప్రగతికి, మెరుగైన ఫలితాలకు ఇది నిదర్శనం.

 

తలబిరా II, III కార్యాచరణ సామర్థ్యాన్ని పెంచటంలో సాంకేతికత కీలక పాత్ర పోషించింది. డిజిటల్ లాజిస్టిక్స్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ (డీఎల్ఎంఎస్), ఆర్ఎఫ్ఐడీ ఆధారిత వాహన ధ్రువీకరణ, ఏఐ కెమెరాలు, సాంకేతికతతో కూడిన ప్రవేశ, నిష్క్రమణ గేట్ల ద్వారా బొగ్గు రవాణా, సరఫరా ప్రక్రియను పూర్తిస్థాయిలో డిజిటల్ పద్ధతిలో పర్యవేక్షించేందుకు వీలు కల్పిస్తుంది. ఈ విధానం అమల్లోకి వచ్చిన తర్వాత ప్రతి వాహనానికి సగటు ప్రవేశ గేటు వద్ద ప్రాసెసింగ్ సమయం 1.42 నిమిషాల నుంచి 0.54 నిమిషాలకు తగ్గింది. ఖాళీ వాహన బరువు తనిఖీ సమయం 1.34 నిమిషాల నుంచి 0.48 నిమిషాలకు తగ్గింది. ఈ గనిలో ధూళి నివారణ వ్యవస్థలతో కూడిన ఉపరితల మైనింగ్ యంత్రాలు, జీపీఎస్ ఆధారిత ఫ్లీట్ మేనేజ్‌మెంట్, జియో-ఫెన్సింగ్, జీఎన్ఎస్ఎస్ రిసీవర్లతో కూడిన 3డీ భూఉపరితల లేజర్ స్కానింగ్, డ్రోన్ ఆధారిత సర్వేలు, యంత్రాల ద్వారా ట్రక్ లోడింగ్, నిరంతర పరిసర గాలి నాణ్యత పర్యవేక్షణ కేంద్రాలు, సీసీటీవీ నిఘా వంటి వ్యవస్థలను వినియోగిస్తున్నారు.

 

 

 

image.pngimage.png

తలబిరా II, III ఓపెన్‌ కాస్ట్ గనుల్లో బొగ్గు రవాణా, సరఫరాలను పూర్తి స్థాయిలో డిజిటల్ విధానంలో పర్యవేక్షించి, నియంత్రించేందుకు డిజిటల్ లాజిస్టిక్స్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ (డీఎల్ఎంఎస్) ఏర్పాటు.

బాధ్యతాయుత, పర్యావరణహిత మైనింగ్ పద్ధతుల ద్వారా ఈ గని కార్యాచరణ పనితీరును మరింత మెరుగుపరుచుకుంది. గని లీజు స్థలంలో 23.43 హెక్టార్ల విస్తీర్ణంలో 64,288 మొక్కలను, లీజు వెలుపల 29.48 హెక్టార్లలో 65,202 మొక్కలను నాటారు. గనికి సంబంధించిన మౌలిక సదుపాయాల పరిధిలో, సమీప గ్రామాల వీధుల్లో సోలార్ దీపాల ఏర్పాటుతో సహా మొత్తం 11.68 కిలోవాట్ల సోలార్ విద్యుత్ సామర్థ్యాన్ని నెలకొల్పారు. ధూళి నివారణ చర్యల్లో భాగంగా వెట్ డ్రిల్లింగ్, వాటర్ స్ర్పింక్లింగ్, ఫాగ్ క్యానన్లు, ఫిక్స్డ్ స్ర్పింక్లింగ్ వ్యవస్థలు, విండ్ బారియర్లు, ట్రక్ వాషింగ్ వ్యవస్థలు, యంత్రాల ద్వారా రోడ్లను శుభ్రపరిచే విధానాలను అమలు చేస్తున్నారు.

 

ఈ గని పనితీరులో భద్రత కీలక అంశంగా నిలవటంతో ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు ఎలాంటి ప్రాణాంతక ప్రమాదాలు జరగలేదు. భద్రత నిర్వహణ ప్రణాళిక, మెరుగైన బొగ్గు రవాణా రహదారులు, ట్రాఫిక్ నిర్వహణ, పీపీఈ వినియోగం, పటిష్ఠమైన పేలుడు విధానాలు, భద్రతా శిక్షణ, అరణ్ స్మార్ట్ యాప్ ద్వారా ప్రమాదకర పరిస్థితుల నివేదన వంటివి ప్రధాన భద్రతా చర్యలు ఈ గని వద్ద చేపడతారు. వార్షిక గనుల భద్రతా పక్షోత్సవాల్లో ఈ గని ఎన్నో పురస్కారాలను అందుకోవటమే కాక, బొగ్గు మంత్రిత్వ శాఖ నిర్వహించే స్టార్ రేటింగ్ మూల్యాంకనంలో 2020-21 ఆర్థిక సంవత్సరం నుంచి 2024-25 వరకు వరుసగా ఫైవ్-స్టార్ రేటింగ్‌ను కైవసం చేసుకుంది.

 

ఈ గని కేవలం బొగ్గు ఉత్పత్తి, విద్యుత్ సరఫరాకే పరిమితం కాకుండా అంతకు మించి విస్తరించింది. తలబిరా II, III గని ద్వారా 3,277 ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి. ఇందులో 1,277 ప్రత్యక్ష ఉపాధి అవకాశాలు ఉండగా... రవాణా, అనుబంధ కార్యకలాపాల ద్వారా సుమారు 2,000 పరోక్ష ఉపాధి అవకాశాలున్నాయి. ప్రాజెక్టు వల్ల ప్రభావితమైన ఐదుగురు వ్యక్తులు భువనేశ్వర్‌లోని స్కిల్ డెవలప్‌మెంట్ ఇనిస్టిట్యూషన్‌లో నైపుణ్యాభివృద్ధి శిక్షణ పొందారు. ఆర్ఎస్ఈటీఐ, పీఎంకేవీవై కేంద్రాల ద్వారా 101 మంది గ్రామీణ యువత, మహిళలు స్థిరమైన జీవనోపాధి కార్యక్రమాల్లో శిక్షణ పొందారు.

 

ఈ ప్రాజెక్టు సానుకూల ప్రభావాల్లో సమాజాభివృద్ధి కీలక భాగంగా నిలిచింది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో కంపెనీల సీఎస్ఆర్ వ్యయం రూ. 5.32 కోట్లు కాగా.. ప్రజారోగ్యం, మంచినీటి సదుపాయం, విద్య, పాఠశాల రవాణా సౌకర్యాలు, గ్రామీణ మౌలిక సదుపాయాలు, క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు, సోలార్ దీపాల ఏర్పాటుకు ఈ మొత్తాన్ని ఉపయోగించారు. ఆరోగ్య, రక్తదాన శిబిరాల నిర్వహణ ద్వారా దాదాపు 1,500 మంది ప్రయోజనం పొందగా... ట్యాంకర్లతో మంచినీటి సరఫరా ద్వారా సుమారు 10,000 మందికి లబ్ధి చేకూర్చింది. ఇక 2026-27 ఆర్థిక సంవత్సరంలో జూలై 2026 నాటికి మంచినీటి సరఫరా, ఆరోగ్య సంరక్షణ, సోలార్ లైటింగ్, పాఠశాలలు, అంగన్వాడీల్లో మౌలిక వసతులు, గ్రామీణ రహదారులు, సామాజిక భవనాలు, జలాశయాల పునరుద్ధరణ వంటి కార్యక్రమాల కోసం అదనంగా రూ. 4.20 కోట్లు వెచ్చించారు.

 

 

 

image.png

ఎన్ఎల్‌సీ ఇండియా లిమిటెడ్, తలబిరా II, III ఓసీపీ నిర్వహించిన మెగా మెడికల్ క్యాంపు

2016లో కేటాయించినప్పటి నుంచి ఇప్పటి వరకు రికార్డు స్థాయిలో బొగ్గు ఉత్పత్తి చేస్తూ, దేశీయ అవసరాలను తీర్చటంలో ఈ గని కీలక పాత్ర పోషిస్తుంది. బొగ్గు ఉత్పత్తి, ఇంధన భద్రత, సాంకేతిక ఆధారిత తవ్వకాలు, భద్రత, పర్యావరణ పరిరక్షణ, ఉపాధి కల్పన, స్థానికాభివృద్ధికి గనులు ఏ విధంగా తోడ్పడతాయో నిరూపించింది.

 

2025-26 ఆర్థిక సంవత్సరంలో రికార్డు స్థాయి ఉత్పత్తి, సరఫరాతో పాటు మొత్తం 72.23 మిలియన్ టన్నుల ఉత్పత్తిని, 70.89 మిలియన్ టన్నుల సరఫరాను సాధించటం, సామాజిక, ఆర్థిక, పర్యావరణ రంగాల్లో స్పష్టమైన ఫలితాలను సాధించటం ద్వారా తలబిరా II, III గని ప్రత్యేకంగా నిలిచింది. భారతదేశ ఇంధన భద్రతను బలపరచటంలో, ఆత్మనిర్భర్ భారత్, వికసిత భారత్ లక్ష్యాలను వేగవంతం చేయటంలో ఎన్ఏ ద్వారా కేటాయించిన బొగ్గు వనరులు ఎంత ప్రభావవంతంగా ఉపయోగపడతాయో తెలిపేందుకు ఇది ఉదాహరణగా నిలుస్తోంది.

 

****


(रिलीज़ आईडी: 2302815) आगंतुक पटल : 10
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Tamil