శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

చెన్నై ఏకాభిప్రాయంతో బ్రిక్స్‌ ఎస్‌టీఐ సహకారంలో ప్రజా కేంద్రీకృత, మానవతా ప్రథమ దృక్పథానికి ప్రాధాన్యం


బ్రిక్స్‌ శాస్త్ర, సాంకేతిక కార్యక్రమంలో అభివృద్ధి చెందుతున్న, యువ ఆవిష్కర్తలు, సహకార పరిశోధనలకు కీలక స్థానం


పరిశోధన మౌలిక వసతులు, జ్ఞాన భాగస్వామ్యం, ఆవిష్కరణల ద్వారా శాస్త్ర భాగస్వామ్యాన్ని బలోపేతం చేస్తున్న బ్రిక్స్‌

प्रविष्टि तिथि: 22 AUG 2026 4:44PM by PIB Hyderabad

భారత్‌ అధ్యక్షతన జరిగిన 14వ బ్రిక్స్‌ సైన్స్‌ మంత్రుల సమావేశం ముగింపు సదస్సులో కేంద్ర శాస్త్ర-సాంకేతిక శాఖ, భౌగోళిక విజ్ఞాన శాఖల సహాయ మంత్రి (స్వతంత్ర హోదా), పీఎంవో- అణు ఇంధన-అంతరిక్ష విభాగం-సిబ్బంది, ప్రజా వ్యవహారాలు, పింఛన్ల శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్రసింగ్ ‘చెన్నై డిక్లరేషన్‌’ను ఏకగ్రీవంగా ఆమోదించినట్లు ప్రకటించారు. శాస్త్ర, సాంకేతికత, ఆవిష్కరణల రంగాల్లో సమర్థవంతమైన, స్థిరమైన, భవిష్యత్తు అవసరాలకు అనుగుణమైన వ్యవస్థను నిర్మించేందుకు బ్రిక్స్‌ దేశాల నిబద్ధతను ఈ ప్రకటన మరోసారి ధ్రువీకరిస్తుంది.

 

భారత్‌ బ్రిక్స్‌ అధ్యక్షతలో ఆమోదించిన ‘చెన్నై ఏకాభిప్రాయం (చెన్నై కాన్సెన్సస్)’ శాస్త్ర, సాంకేతికత, ఆవిష్కరణల (ఎస్‌టీఐ) సహకారంలో ప్రజా కేంద్రీకృత, మానవతా ప్రథమ దృక్పథానికి అత్యంత ప్రాధాన్యం ఇచ్చింది. సుస్థిర అభివృద్ధి, స్థిరమైన, నాణ్యమైన వృద్ధి, సామాజిక సమ్మిళితత్వంతో పాటు బ్రిక్స్‌ దేశాల ప్రజల సంక్షేమం, జీవన నాణ్యతను మెరుగుపరిచేందుకు ఆవిష్కరణలు, సాంకేతికతను వినియోగించడంపై ప్రత్యేకంగా దృష్టి సారించింది.

 

కేంద్ర శాస్త్ర-సాంకేతిక శాఖ, భౌగోళిక విజ్ఞాన శాఖల సహాయ మంత్రి (స్వతంత్ర హోదా), పీఎంవో- అణు ఇంధన - అంతరిక్ష విభాగం - సిబ్బంది, ప్రజా వ్యవహారాలు, పింఛన్ల శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్రసింగ్ ప్రసంగిస్తూ..మరింత పటిష్టమైన, సమ్మిళితమైన, సుస్థిరమైన భవిష్యత్తును నిర్మించడంలో శాస్త్ర, సాంకేతిక, ఆవిష్కరణలు కీలక పాత్ర పోషిస్తాయని సమావేశంలో జరిగిన చర్చలు మరోసారి స్పష్టం చేశాయని అన్నారు. కృత్రిమ మేధ, హై-పెర్ఫార్మెన్స్ కంప్యూటింగ్ నుంచి క్వాంటం సాంకేతికతలు, అధునాతన పదార్థాలు, బయోటెక్నాలజీ, ఆరోగ్యం, వాతావరణం, సుస్థిరత వరకు జరిగిన ఈ చర్చల విస్తృతి, బ్రిక్స్ దేశాలు సమష్టి చర్యల ద్వారా పరిష్కరించగల ఉమ్మడి అవకాశాలను, సవాళ్లను ప్రతిబింబిస్తోందని ఆయన అన్నారు.

 

బ్రిక్స్‌ శాస్త్ర, సాంకేతిక, ఆవిష్కరణల (ఎస్‌టీఐ) సహకారం మరింత పరిపక్వత, లోతును సాధిస్తోందని చెన్నై ఏకాభిప్రాయం పేర్కొంది. 14 అంశాలపై పనిచేస్తున్న వర్కింగ్‌ గ్రూపుల ద్వారా నిరంతర సహకారం కొనసాగుతోందని తెలిపింది. 11 బ్రిక్స్‌ యువ శాస్త్రవేత్తల వేదిక, బ్రిక్స్ యువ ఆవిష్కర్తల పురస్కారం తొమ్మిది సంచికలు,  పరిశోధన, ఆవిష్కరణలు, ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టుల దరఖాస్తుల ఆహ్వానాలతో కూడిన తొమ్మిది బ్రిక్స్‌ ఎస్‌టీఐ విధానాల కార్యక్రమాలను నిర్వహించినట్లు పేర్కొంది. బ్రిక్స్‌ ఎస్టీఐ భాగస్వామ్యంలో పెరుగుతున్న బలం, పెట్టుబడులు, నిరంతర భాగస్వామ్యానికి ఈ పురోగతి నిదర్శనమని డిక్లరేషన్‌ పేర్కొంది.

 

డాక్టర్‌ జితేంద్ర సింగ్‌ మాట్లాడుతూ.. భారత్‌ బ్రిక్స్‌ అధ్యక్షతకు నిర్దేశించిన “స్థితిస్థాపకత, ఆవిష్కరణ, సహకారం, సుస్థిరత కోసం నిర్మాణం”  ఇతివృత్తం కార్యరూపంలో కనిపించే భాగస్వామ్యాలు, బలమైన పరిశోధనా వ్యవస్థలు, శాస్త్రవేత్తల రాకపోకలకు మరిన్ని అవకాశాలు, ఉమ్మడి పరిశోధన మౌలిక వసతులు, యువ పరిశోధకులు, ఆవిష్కర్తలకు మరిన్ని అవకాశాలుగా మారాలని అన్నారు. బ్రిక్స్‌ శాస్త్ర, సాంకేతికత, ఆవిష్కరణల (ఎస్‌టీఐ) ప్రాధాన్యతలను సమీక్షించి, వాటిని మరింత సమర్థవంతంగా తీర్చిదిద్దేందుకు భారత్‌ చేస్తున్న ప్రయత్నాలను ‘చెన్నై ఏకాభిప్రాయం’ స్వాగతించింది. అలాగే భవిష్యత్తు‌ అవసరాలకు అనుగుణమైన ఎస్‌టీఐ సహకార వ్యవస్థ కోసం జరుగుతున్న సంప్రదింపుల ప్రక్రియను కూడా నమోదు చేసింది. 

 

మంత్రివర్గ సమావేశం నుంచి వెలువడిన ప్రధాన సహకార రంగాల్లో ఉమ్మడి పరిశోధనా మౌలిక వసతులు, మెగా-సైన్స్‌ ప్రాజెక్టులు ఉన్నాయి. పరిశోధనా మౌలిక వసతులు, మెగా-సైన్స్‌ ప్రాజెక్టులపై బ్రిక్స్‌ కార్యాచరణ బృందం సాధించిన ఫలితాలను చెన్నై ఏకాభిప్రాయం స్వాగతించింది. ఇందులో కార్యాచరణ ప్రణాళిక, టాస్క్‌ఫోర్స్‌ విధివిధానాలతోపాటు బ్రిక్స్‌ గ్లోబల్‌ రీసెర్చ్‌ అడ్వాన్స్‌డ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ నెట్‌వర్క్‌ (బ్రిక్స్‌ గ్రేయిన్‌)ను కార్యచరణలోకి తీసుకురావడంలో సాధించిన పురోగతిని కూడా పేర్కొంది. ఈ వ్యవస్థ ద్వారా పరిశోధన సదుపాయాలకు మెరుగైన ప్రాప్యత, వాటి వినియోగానికి ఉమ్మడి విధానాలు, పరిశోధకుల రాకపోకలు, భారీ స్థాయి పరిశోధనా మౌలిక వసతులపై మరింత బలమైన సహకారం సాధ్యమవుతుందని తెలిపింది.

 

ఈ కార్యాచరణ ప్రణాళిక ద్వారా పరిశోధన మౌలిక వసతులకు మెరుగైన ప్రాప్యత, సంయుక్త పరిశోధనలు, అధునాతన సాంకేతికతల అభివృద్ధి, పరిశోధకుల రాకపోకలు, సామర్థ్య నిర్మాణానికి ఆచరణాత్మక ప్రణాళికను అందిస్తుంది. ఇందులో బ్రిక్స్‌ గ్లోబల్‌ రీసెర్చ్‌ అడ్వాన్స్‌డ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ నెట్‌వర్క్‌ (బ్రిక్స్‌ గ్రేయిన్‌) ద్వారా చేపట్టే కార్యక్రమాలు కూడా ఉన్నాయి.

  

బ్రిక్స్‌ దేశాల మధ్య జ్ఞానాన్ని నిల్వ చేయడం, పంచుకోవడం కోసం ఒక క్రమబద్ధమైన వేదికగా బ్రిక్స్‌ శాస్త్ర, పరిశోధనల భాండాగారాన్ని కూడా చెన్నై ఏకాభిప్రాయం స్వాగతించింది. దీనికి సంబంధించిన ముసాయిదా రూపకల్పనలో శాస్త్రీయ సంస్థలు, పరిశోధకులు, పరిశోధన ఫలితాలు, డేటాసెట్లు, పరిశోధనా మౌలిక వసతులు, సహకార అవకాశాలను గుర్తించే డిజిటల్‌ ప్రజా వనరును ప్రతిపాదించారు. జాతీయ నిబంధనలు, డేటా పాలనకు సంబంధించిన అవసరాలకు అనుగుణంగా జ్ఞాన మార్పిడి, ఓపెన్‌ సైన్స్‌, బ్రిక్స్‌ దేశాల పరిశోధనా సామర్థ్యాలకు మరింత గుర్తింపును ప్రోత్సహిస్తుంది.

 

బ్రిక్స్‌ శాస్త్ర, సాంకేతికత, ఆవిష్కరణల (ఎస్‌టీఐ) సహకారంలో ప్రజలు, ప్రతిభావంతుల అంశానికి కూడా ప్రత్యేక ప్రాధాన్యం లభించింది. యువ శాస్త్రవేత్తల మధ్య మరింత విస్తృతమైన పరస్పర మార్పిడులను చెన్నై ఏకాభిప్రాయం ప్రోత్సహించింది. అలాగే బ్రిక్స్‌ యువ శాస్త్రవేత్తల వేదిక, బ్రిక్స్ యువ ఆవిష్కర్తల పురస్కారం కింద కొనసాగుతున్న కార్యక్రమాలను స్వాగతించింది. బ్రిక్స్‌ ఎస్‌టీఐ పారిశ్రామిక భాగస్వామ్యం ద్వారా ఇంక్యుబేటర్లు, యాక్సిలరేటర్లు, ప్రారంభ దశ పెట్టుబడిదారుల మధ్య మరింత బలమైన భాగస్వామ్యం, యువ ఆవిష్కర్తలు, పరిశోధకుల రాకపోకలకు ఎక్కువ అవకాశాలు, సంబంధిత మార్కెట్లకు మెరుగైన ప్రాప్యత కల్పించడంలో పురోగతిని కూడా గుర్తించింది. 

 

డిక్లరేషన్‌లో బ్రిక్స్‌ యువ అంకుర సంస్థల‌ వేదికను కూడా స్వాగతించారు. ప్రారంభ, అభివృద్ధి దశలో ఉన్న అంకుర సంస్థలకు ఆర్థిక సహకారాన్ని మరింత అందుబాటులోకి తీసుకురావాల్సిన అవసరాన్ని గుర్తించారు. అలాగే అవసరమైన సందర్భాల్లో శాస్త్ర, సాంకేతికత, ఆవిష్కరణల విభాగంతో సమన్వయం చేసుకుంటూ బ్రిక్స్‌ అంకుర సంస్థల ఆవిష్కరణల నిధిని ఏర్పాటు చేసే అంశాన్ని బ్రిక్స్‌ పరిశ్రమల మంత్రుల డిక్లరేషన్‌లో పరిశీలిస్తున్నట్లు పేర్కొన్నారు. 

           

డాక్టర్‌ జితేంద్ర సింగ్‌ మాట్లాడుతూ.. బ్రిక్స్‌ శాస్త్ర, సాంకేతికత, ఆవిష్కరణల భాగస్వామ్యం నిరంతర చర్చలకు మాత్రమే పరిమితం కాకుండా, స్పష్టమైన ఫలితాలను అందించే దిశగా ముందుకు సాగాలని అన్నారు. సంయుక్త ప్రాజెక్టులు, ఉమ్మడి వేదికలు, సమన్వయంతో కూడిన పరిశోధనా ప్రతిపాదనల ఆహ్వానాలు, అందరికీ అందుబాటులో ఉండే పరిశోధనా మౌలిక వసతుల కోసం మరింత బలమైన వ్యవస్థలను ఏర్పాటు చేయాలని సూచించారు. బ్రిక్స్‌ విస్తరిస్తూ పరిణామం చెందుతున్న నేపథ్యంలో, దాని శాస్త్ర, సాంకేతిక సహకారం అభివృద్ధఙ చెందుతున్న దేశాల ప్రాధాన్యతలకు అనుగుణంగా, సమ్మిళితంగా, స్పందనాత్మకంగా ఉండాలని అన్నారు. అత్యాధునిక సాంకేతికతలు అందరికీ అందుబాటులో, తక్కువ ధరల్లో, బాధ్యతాయుతంగా ఉండేలా చూడటంతో పాటు ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచే దిశగా వాటిని వినియోగించాలని పేర్కొన్నారు.

 

చెన్నై ఏకాభిప్రాయం ఈ దృక్పథాన్ని పలు అభివృద్ధి చెందుతున్న, వ్యూహాత్మక రంగాలకు విస్తరించింది. హై-పెర్ఫార్మెన్స్‌ కంప్యూటింగ్‌, కృత్రిమ మేధ, బయోటెక్నాలజీ, మానవ ఆరోగ్యం, పదార్థ శాస్త్రం, నానో సాంకేతికత, ఫోటోనిక్స్‌, ఖగోళ శాస్త్రం, భౌగోళిక సమాచార సాంకేతికతలు, పునరుత్పాదక ఇంధనం, సముద్ర, ధ్రువ శాస్త్రం, ప్రకృతి వైపరీత్యాల నిర్వహణ, సామాజిక శాస్త్రాలు, మానవీయ శాస్త్రాలు ఇందులో ఉన్నాయి. క్వాంటమ్‌ సాంకేతికతలలో కొనసాగుతున్న సహకారాన్ని కూడా డిక్లరేషన్‌ స్వాగతించింది. శాస్త్రవేత్తలు, విద్యాసంస్థలు, ఆవిష్కరణల రంగానికి చెందిన వర్గాల మధ్య ఆచరణాత్మక భాగస్వామ్యం, సంయుక్త పరిశోధన ప్రాజెక్టులను ప్రోత్సహించింది.

 

ఈ మంత్రివర్గ సమావేశం 2026–2027 సంవత్సరాలకు గానూ బ్రిక్స్ ఎస్టీఐ  కార్యకలాపాల క్యాలెండర్‌ను ఆమోదించింది. ఇది వర్కింగ్ గ్రూప్‌లు, స్టీరింగ్ కమిటీ, సీనియర్ అధికారుల సమీక్షలు, యువ శాస్త్రవేత్తల వేదిక, బ్రిక్స్ యువ ఆవిష్కర్తల పురస్కారం వంటి వివిధ విభాగాలు, కార్యక్రమాల నిరంతర నిర్వహణకు సహకరిస్తుంది. చెన్నై ఏకాభిప్రాయం ద్వారా తదుపరి బ్రిక్స్ ఎస్టీఐ మంత్రుల బాధ్యతల బదిలీ నమోదు కాగా, 2027లో చైనా అధ్యక్షతన తదుపరి సమావేశం జరగనుంది.

బ్రిక్స్‌ మంత్రులు, ప్రతినిధి బృందాలు, నిపుణులు, సహచరులు మంత్రి స్థాయి సమావేశానికి అందించిన సహకారాన్ని డాక్టర్‌ జితేంద్ర సింగ్‌ ప్రశంసించారు. భారత్‌ బ్రిక్స్‌ శాస్త్ర, సాంకేతికత, ఆవిష్కరణల అధ్యక్షతను అర్థవంతంగా, ఫలితాల ఆధారంగా తీర్చిదిద్దడంలో శాస్త్ర, సాంకేతిక శాఖ, భాగస్వామ్య సంస్థలు చేసిన కృషిని ఆయన అభినందించారు.స్థితిస్థాపకత, ఆవిష్కరణ, సహకారం, సుస్థిరత అనే స్ఫూర్తి  బ్రిక్స్‌ను  శాస్త్రీయ ప్రతిభ, సాంకేతిక పురోగతి, సమష్టి సుసంపన్నతకు వేదికగా ముందుకు నడిపించాలని డాక్టర్‌ జితేంద్ర సింగ్‌ ఆకాంక్షించారు. 

చెన్నై ఏకాభిప్రాయం ఆమోదం పొందడం ద్వారా ఉమ్మడి పరిశోధనలు, శాస్త్రీయ మౌలిక వసతులు, ఆవిష్కరణల వ్యవస్థ, ప్రతిభావంతుల మార్పిడి, ప్రపంచ సవాళ్లను కలిసికట్టుగా ఎదుర్కోవడంలో బ్రిక్స్ ఎస్టీఐ సహకారం మరింత బలపడింది. భారత అధ్యక్షతన, ఈ భాగస్వామ్యం భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా రూపాంతరం చెందింది. ఈ క్రమంలో అభివృద్ధి చెందుతున్న దేశాల వ్యాప్తంగా శాస్త్ర, సాంకేతిక, ఆవిష్కరణల రంగాలు సుస్థిరాభివృద్ధికి, ఉమ్మడి పురోగతికి శక్తిమంతమైన సాధనాలుగా నిలుస్తున్నాయి.

 

***


(रिलीज़ आईडी: 2302455) आगंतुक पटल : 5
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Tamil , Malayalam