జల శక్తి మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

సుజలాం భారత్ డిజిటల్ మౌలిక సదుపాయాల ద్వారా డేటా షేరింగ్, వివిధ వ్యవస్థల మధ్య అనుసంధానత, భాగస్వాములను ఆమోదించే విధానాన్ని ప్రకటించిన జల శక్తి మంత్రిత్వ శాఖ

నాడు పోస్టు చేయడమైనది: 20 AUG 2026 5:04PM by PIB Hyderabad

జల శక్తి మంత్రిత్వ శాఖ పరిధిలోని తాగునీరు, పారిశుద్ధ్య విభాగం (డీడీడబ్ల్యూఎస్), సుజలాం భారత్ డిజిటల్ మౌలిక సదుపాయాల (డీపీఐ) ద్వారా డేటా షేరింగ్, వివిధ వ్యవస్థల మధ్య అనుసంధానత, భాగస్వాముల ఆమోద విధానాన్ని ఇవాళ ప్రకటించింది. ఇది రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, స్థానిక పాలనా సంస్థలు, ఆమోదించిన భాగస్వాముల మధ్య గ్రామీణ తాగునీటి డేటాను పంచుకునేందుకు, నిర్వహణకు... సురక్షితమైన, సమగ్ర, పరస్పర అనుసంధాన, జవాబుదారీతనంతో కూడిన వ్యవస్థను ఏర్పాటు చేస్తుంది.

ఈ విధానం... భారతదేశ గ్రామీణ తాగునీటి రంగాన్ని కేవలం మౌలిక వసతుల కల్పన స్థాయి నుంచి భరోసాతో కూడిన, బాధ్యతాయుత, సేవల ఆధారిత తాగునీటి సరఫరా దిశగా నడిపించటంలో కీలక ఘట్టాన్ని సూచిస్తుంది. ఇది మౌలిక సదుపాయాల జీవితకాల నిర్వహణ, వనరుల స్థిరత్వం, సేవల భరోసా, పౌర-కేంద్రీకృత జవాబుదారీతనం, సాక్ష్యాధారిత నిర్ణయాలను సమర్థించేందుకు సమగ్ర వ్యవస్థను అందిస్తుంది. పాలనా సూత్రాలను అందిస్తుంది. సంస్థాగత జవాబుదారీతనం, గోప్యత, సైబర్ భద్రతను కాపాడుకుంటూనే సమాచారాన్ని సజావుగా మార్చుకునేందుకు వీలుగా సాధారణ గుర్తింపులు, ప్రామాణిక మెటాడేటా, పరస్పరం అనుసంధానించగల రిజిస్ట్రీలు, సురక్షిత డిజిటల్ సేవలను ప్రోత్సహిస్తుంది.

తాగునీరు, పారిశుద్ధ్య విభాగం (డీడీడబ్ల్యూఎస్), రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, గ్రామ పంచాయతీలు, ప్రభుత్వ సంస్థలు, అధికారిక భాగస్వాముల మధ్య నిబంధనలతో, పరస్పర సహకారంతో పనిచేసే డేటా మార్పిడిని సాధ్యం చేయటమే ఈ విధాన ముఖ్య ఉద్దేశం. పంచాయతీ-కేంద్రీకృత పాలన, పౌరుల భాగస్వామ్యం, ఫిర్యాదుల పరిష్కారం, భాగస్వామ్య ఆస్తుల పర్యవేక్షణ, గ్రామీణ తాగునీటి వ్యవస్థలో సేవల జవాబుదారీతనాన్ని ఈ వ్యవస్థ బలపరుస్తుంది. ఆమోదించిన, నిర్దిష్ట ప్రయోజన ఆధారిత ప్రవేశ వ్యవస్థల ద్వారా నిర్వహణ, మరమ్మతులు, నీటి నాణ్యతా పర్యవేక్షణ, మౌలిక సదుపాయాల నిర్వహణ, ముందస్తు నిర్వహణ, భౌగోళిక, స్థానిక ప్రణాళిక, డిజిటల్ ట్విన్స్, కృత్రిమ మేధ ఆధారిత అనలిటిక్స్, నిర్ణయ మద్దతు వ్యవస్థలకు సంబంధించిన వినూత్న పరిష్కారాలను భాగస్వాములు అభివృద్ధి చేయవచ్చు.

డిజిటల్ వ్యవస్థలో విశ్వసనీయత ప్రాముఖ్యతను గుర్తిస్తూ... ఈ పాలసీ గోప్యత, వ్యక్తిగత డేటా రక్షణ, సైబర్‌ భద్రత, డేటా వర్గీకరణ, అందుబాటులో పాలన, ప్రజా ప్రయోజన భద్రతలకు సంబంధించిన బలమైన నిబంధనలను పొందుపరిచింది. ఇది సున్నితమైన మౌలిక సదుపాయాలు, వ్యక్తిగత డేటాను కాపాడేటప్పుడు సురక్షితమైన, బాధ్యతాయుతమైన, నిర్దిష్ట ప్రయోజనాలతో కూడిన సమాచార వినియోగాన్ని తెలుసుకునేందుకు బహుళ స్థాయిలో డేటా సేకరణ విధానాన్ని అవలంబిస్తుంది.

ఈ విధానం గ్రామీణ నీటి వనరుల నిర్వహణకు దీర్ఘకాలిక ప్రజా డిజిటల్ మౌలిక సదుపాయంగా సుజలాం భారత్‌ను మరింత బలోపేతం చేస్తుంది. ఇది పారదర్శకత, నూతన ఆవిష్కరణలు, నిర్వహణ సామర్థ్యం, స్థిరమైన సేవలందించటంలో తోడ్పడుతుంది. ఈ విధాన ప్రకటనతో గ్రామీణ తాగునీటి పరిపాలనకు విశ్వసనీయమైన డిజిటల్ పునాదిని నిర్మించటంలో దేశవ్యాప్తంగా గ్రామీణ ప్రజలకు విశ్వసనీయ, స్థిరమైన, జవాబుదారీతనంతో కూడిన నీటి సేవలను అందించటంలో ఈ విభాగం కీలక ముందడుగు వేసింది.

 

***


(రిలీజ్ ఐడి: 2301755) సందర్శకుల సూచీ సంఖ్య : : 63
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Gujarati , Kannada