ఎలక్ట్రానిక్స్ విడిభాగాల తయారీ పథకం (ఈసీఎంఎస్) కింద రూ.6,844 కోట్ల అంచనా వ్యయంతో కూడిన 31 ప్రతిపాదనలకు ఎలక్ట్రానిక్స్-సమాచార సాంకేతిక మంత్రిత్వశాఖ ఆమోదం తెలిపింది. దీనికి సంబంధించి ఈ రోజు న్యూఢిల్లీలో ‘ఎలక్ట్రానిక్ ఇండస్ట్రీస్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా’ (ఎల్సినా) సహకారంతో నిర్వహించిన కార్యక్రమంలో ఆ శాఖ మంత్రి శ్రీ అశ్వనీ వైష్ణవ్ ఆమోదపత్రాలను అందజేశారు. ఈ పథకం కింద రూ.61,671 కోట్ల పెట్టుబడితో ప్లాంట్ల ఏర్పాటుకు ఉద్దేశించిన 75 దరఖాస్తులకు ఇంతకుముందే ఆమోదముద్ర పడింది. ఈ నేపథ్యంలో నిర్వహించిన తాజా కార్యక్రమంలో ఎలక్ట్రానిక్స్-ఐటీ శాఖ సహాయ మంత్రి శ్రీ జితిన్ ప్రసాద సహా ఆ శాఖ కార్యదర్శి శ్రీ ఎస్.కృష్ణన్, సంయుక్త కార్యదర్శి శ్రీ సుశీల్ పాల్, ‘ఎల్సినా’ అధ్యక్షుడు శ్రీ శశికుమార్ గెంధం తదితరులు కూడా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కేంద్ర ఎలక్ట్రానిక్స్-ఐటీ, రైల్వేలు, సమాచార-ప్రసార శాఖ మంత్రి శ్రీ అశ్వనీ వైష్ణవ్ మాట్లాడుతూ- భారత ఎలక్ట్రానిక్స్ రంగం విడిభాగాల కూర్పు దశను అధిగమించిందని పేర్కొన్నారు. ఈ మేరకు కీలక విడిభాగాలు, అవసరమైన ముడి సరుకుల దేశీయ తయారీ దిశగా పయనిస్తోందని చెప్పారు. తద్వారా సుదృఢ, సుస్థిర ‘స్వదేశీ’ ఎలక్ట్రానిక్స్ విలువ శ్రేణి పురోగమనాన్ని ఈసీఎంఎస్ వేగిరపరుస్తున్నదని తెలిపారు. ఈ నేపథ్యంలో ఇప్పటిదాకా (నేటి 31 సహా) ఆమోదించిన 106 ప్రాజెక్టులలో 38 ఇప్పటికే తయారీ దశకు చేరాయన్నారు. మరో 16 ప్రాజెక్టుల నిర్మాణం లేదా యంత్రాల అమరిక వేగంగా సాగుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. తాజాగా ఆమోద పత్రాలు అందజేసిన ప్లాంట్లకు సంబంధించి ఫిల్టర్లు, కాయిల్స్, స్పీకర్ల వంటి వివిధ కీలక విడిభాగాలతో పాటు ఎసిటిలీన్ బ్లాక్, ఎలక్ట్రోలైట్ అడిటివ్స్ వంటి నిత్యావసర ముడి పదార్థాల దేశీయ తయారీని కూడా తొలిసారి జాబితాలో చేర్చినట్లు వివరించారు.
స్వయంసమృద్ధితోపాటు ఆర్థిక వృద్ధికి ఈ పథకం ఇతోధికంగా తోడ్పడుతుండటంతో ప్రస్తుత ఉత్పత్తి సామర్థ్యం దేశీయ డిమాండ్ మొత్తాన్నీ తీరుస్తోంది. వాస్తవానికి, యానోడ్ మెటీరియల్ (~110%), ఆప్టికల్ ట్రాన్స్‌సీవర్-ఎస్‌ఎప్‌పి (350%), రిలే (200%) వంటి కీలక రంగాల్లో డిమాండ్‌ను మించిన ఉత్పాదన సాగుతోంది.
మొత్తంమీద 106 ఆమోదిత ప్రాజెక్టుల ద్వారా 15 రాష్ట్రాల్లో రూ.69,548 కోట్ల పెట్టుబడితో 74,628 ప్రత్యక్ష ఉద్యోగాలు సహా 2.5 లక్షల పరోక్ష ఉపాధి అవకాశాలు లభిస్తాయని అంచనా. ఇందులో నేడు ఆమోదం పొందిన 31 ప్రాజెక్టుల ద్వారానే 9,588 ప్రత్యక్ష ఉద్యోగాల సృష్టి సాధ్యం కాగలదని, తద్వారా స్వయంసమృద్ధితోపాటు అంతర్జాతీయ పోటీతత్వం గల ఎలక్ట్రానిక్స్ తయారీ వ్యవస్థ దిశగా భారత్ ప్రస్థానం మరింత వేగం పుంజుకోగలదని భావిస్తున్నారు.
ప్రస్తుత ఆమోదాల ద్వారా రూ.7,877 కోట్ల పెట్టుబడి, రూ.82,243 కోట్ల అంచనా ఉత్పత్తితో పాటు 9,588 ప్రత్యక్ష ఉపాధి అవకాశాలు లభిస్తాయని అంచనా. అంతేకాకుండా ఇప్పటికే ఆమోదం పొందిన దరఖాస్తుదారులలో విప్రో గ్లోబల్ ఇంజనీరింగ్ అండ్ ఎలక్ట్రానిక్ మెటీరియల్స్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా లామినేట్ (కాపర్ క్లాడ్) తయారీ కోసం వెచ్చించే రూ.1,033 కోట్ల అదనపు పెట్టుబడికి కూడా ఆమోదం లభించింది.
ప్రస్తుత ఆమోదాలు ఉప-కూర్పు, బేర్ కాంపోనెంట్లు, సప్లయ్ చెయిన్ ఉత్పత్తులు, మూలధన వస్తువులు సహా 20 నిర్దిష్ట విభాగాల్లో ఉత్పత్తుల తయారీని ప్రోత్సహిస్తాయి. ఈ జాబితా కింది విధంగా ఉంది:
- 3 ఉప-కూర్పు విభాగాలు: కెమెరా మాడ్యూల్, డిస్‌ప్లే మాడ్యూల్, ఆప్టికల్ ట్రాన్స్‌సీవర్-ఎస్‌ఎఫ్‌పీ
- 10 కాంపోనెంట్లు: ఎన్‌క్లోజర్లు, కనెక్టర్లు, ట్రాన్స్‌డ్యూసర్లు, స్పీకర్లు-మైక్రోఫోన్లు, రిలేలు, యాంటెన్నా, కాయిల్స్, ఫిల్టర్లు, కెపాసిటర్లు, మెటల్ షీల్డింగ్ కవర్లు
- 6 సరఫరా శ్రేణి ఉత్పత్తులు: యానోడ్ మెటీరియల్, రేర్ ఎర్త్ శాశ్వత అయస్కాంతాలు, ఎసిటిలీన్ బ్లాక్, ఎలక్ట్రోలైట్ సంకలితాలు, కెపాసిటర్లు, హెర్మెటిక్ టెర్మినల్స్ కోసం మెటలైజ్డ్ ఫిల్ములు
· మూలధన వస్తువులు - వాటి భాగాలు
దేశంలోని తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, గోవా, గుజరాత్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, మహారాష్ట్ర, ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్ వంటి 10 రాష్ట్రాల్లో ఆమోదిత ఈసీఎంఎస్ ప్రాజెక్టులు ఏర్పాటవుతున్నాయి. తద్వారా ఎలక్ట్రానిక్స్ విడిభాగాల తయారీ రంగం భౌగోళిక పరిధి మరింత విస్తరిస్తుండగా, కొందరు దరఖాస్తుదారులు బహుళ ప్రదేశాలు/రాష్ట్రాల్లో పెట్టుబడులు పెడతామని ప్రతిపాదనలు పంపారు.
ఉప-కూర్పు విభాగంలో, డిస్‌ప్లే మాడ్యూల్ సబ్-అసెంబ్లీ తయారీ కోసం మిండా ఇన్‌స్ట్రుమెంట్ లిమిటెడ్’, టిఎక్స్‌బీ ఆప్టిక్స్ ప్రైవేట్ లిమిటెడ్’లకు ఆమోదం లభించింది. కెమెరా మాడ్యూల్ ఉప-కూర్పు తయారీ కోసం స్కైక్వాడ్ ఎలక్ట్రానిక్స్ అండ్ అప్లయన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్‌కు ఆమోదం లభించింది.
ఆప్టికల్ ట్రాన్స్‌సీవర్-ఎస్‌ఎఫ్‌పీ తయారీ కోసం ఎస్‌ఎఫ్‌ఓ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్, జీఎక్స్ క్వాంటం ఫోటోనిక్స్ ప్రైవేట్ లిమిటెడ్, హ్యూబర్ సుహ్నర్ ఎలక్ట్రానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్‌లకు అనుమతి మంజూరైంది.
కాంపోనెంట్స్ విభాగంలో తయారీ కోసం కింది అనుమతులు మంజూరయ్యాయి:
- కనెక్టర్ల తయారీ కోసం ఆంఫెనాల్ ఇంటర్‌కనెక్ట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, ఎన్నోవి మొబిలిటీ సొల్యూషన్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ మరియు రోసెన్‌బర్గర్ ఇంటర్‌కనెక్ట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్
- రిలేల తయారీ కోసం అలైడ్ ఇంజనీరింగ్ వర్క్స్ లిమిటెడ్, గ్రూనర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్
- ట్రాన్స్‌డ్యూసర్ల తయారీ కోసం సెంటమ్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, సెన్సాటా టెక్నాలజీస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్
- ఫిల్టర్ల తయారీ కోసం సెంటమ్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్
- కెపాసిటర్ల తయారీ కోసం గ్లోబ్ కెపాసిటర్స్ ప్రైవేట్ లిమిటెడ్
- కాయిల్స్ కోసం సిర్మా ఎస్‌జీఎస్ టెక్నాలజీ లిమిటెడ్
- మెటా షీల్డింగ్ కవర్స్ కోసం వాంగ్డా టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్
- స్పీకర్లు-మైక్రోఫోన్ల కోసం బ్రాండ్ వర్క్స్ ప్రెసిషన్ మాన్యుఫాక్చరింగ్ ప్రైవేట్ లిమిటెడ్
- యాంటెన్నాల తయారీ కోసం బ్రిటానియా ఆర్‌ఎఫ్‌ఐడి టెక్నాలజీస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్
· ఎంక్లోజర్ల కోసం మైక్రోమాక్స్ ప్రెసిషన్ మోల్డింగ్ ప్రైవేట్ లిమిటెడ్, దాని అనుబంధ సంస్థలు
దీంతోపాటు ఎలక్ట్రానిక్స్ తయారీ సరఫరా వ్యవస్థను మరింత బలోపేతం చేసే లక్ష్యంతో కింది ఉత్పత్తుల తయారీ కోసం వివిధ సంస్థలకు ఆమోదం లభించింది:
- లి-అయాన్ సెల్స్‌కు కీలక యానోడ్ మెటీరియల్ కోసం ఎప్సిలాన్ సి2జిఆర్ ప్రైవేట్ లిమిటెడ్
- రేర్ ఎర్త్ పర్మనెంట్ మాగ్నెట్స్ కోసం క్వాంటం మాగ్నెటిక్స్ ప్రైవేట్ లిమిటెడ్
- లి-అయాన్ సెల్స్‌కు వాహక సంకలితమైన ఎసిటిలీన్ బ్లాక్ కోసం పీసీబీఎల్ కెమికల్ లిమిటెడ్
- ఎలక్ట్రోలైట్ సంకలితాల కోసం అక్యూటాస్ కెమికల్స్ లిమిటెడ్
- కెపాసిటర్లకు మెటలైజ్డ్ ఫిల్లుల కోసం క్యాప్‌ఫిల్మ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్
· సీల్డ్ బారియర్ ద్వారా లీక్-ప్రూఫ్ విద్యుత్ మార్గాల సృష్టికి వాడే కీలక భాగాల తయారీ కోసం హెర్మెటిక్ టెర్మినల్స్‌ను జెజె గ్లాస్ట్రానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్
వీటన్నిటితో పాటు లామినేట్ (కాపర్ క్లాడ్) తయారీ కోసం ఇప్పటికే ఆమోదం పొందిన దరఖాస్తుదారు విప్రో గ్లోబల్ ఇంజనీరింగ్ అండ్ ఎలక్ట్రానిక్ మెటీరియల్స్ ప్రైవేట్ లిమిటెడ్ సమర్పించిన రూ.1,033 కోట్ల అదనపు పెట్టుబడి ప్రతిపాదనకూ ఆమోదముద్ర పడింది.
అలాగే, మూలధన వస్తువులు, వాటి విడిభాగాల తయారీలో దేశీయ ఉత్పాదక సామర్థ్యం పెంపు దిశగా ప్రస్తుత ఆమోదాలు దృష్టి పెట్టాయి. ఈ మేరకు 5 సంస్థలు- జ్యోతి సీఎన్‌సీ ఆటోమేషన్ లిమిటెడ్, వివిడీఎన్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్, అక్యురేట్ గేజింగ్ అండ్ ఇన్‌స్ట్రుమెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్, మిత్సుబిషి ఎలక్ట్రిక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, ఇండ్ స్ఫింక్స్ ప్రెసిషన్ లిమిటెడ్లకూ ఆమోదం లభించింది.
ఈ ప్రక్రియ ద్వారా ఈసీఎంఎస్ కింద 30 ఉత్పత్తులకు సంబంధించి 15 రాష్ట్రాల్లో మొత్తం 106 దరఖాస్తులకు ఆమోదం మంజూరైంది. దీంతో రూ.69,548 కోట్ల దాకా పెట్టుబడులు, రూ.5,34,101 కోట్ల మేర ఉత్పాదన సహా 74,628 మందికి ప్రత్యక్ష ఉపాధి లభిస్తుందని అంచనా.
మరోవైపు ఈ దరఖాస్తులకు ఆమోదంతో దేశీయ సరఫరా వ్యవస్థలు బలోపేతమై విలువ జోడింపు పెరిగి, దిగుమతి పరాధీనత తగ్గి, ఆధునిక తయారీ సామర్థ్యం విస్తరిస్తుంది. దీనివల్ల ప్రపంచ ఎలక్ట్రానిక్స్ తయారీ కూడలిగా ఆవిర్భవించే దిశగా భారత్ ప్రస్థానం మరింత వేగం పుంజుకుంటుంది.
ఎలక్ట్రానిక్స్ విడిభాగాల తయారీ పథకం (ఈసీఎంఎస్)
దేశవ్యాప్తంగా పటిష్ట ఎలక్ట్రానిక్స్ విడిభాగాల తయారీ వ్యవస్థ వృద్ధి, సరఫరా వ్యవస్థ బలోపేతం లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ‘ఈసీఎంఎస్’కు శ్రీకారం చుట్టింది.
ఎలక్ట్రానిక్స్ తయారీకి అవసరమైన ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డులు, పాసివ్ కాంపోనెంట్లు, ఎలక్ట్రో-మెకానికల్ కాంపోనెంట్లు, సబ్-అసెంబ్లీలు, కెమెరా మాడ్యూళ్లు, ఆప్టికల్ ట్రాన్స్‌సీవర్లు, మూలధన వస్తువులు వంటి కీలక విభాగాల్లో పెట్టుబడులను ఆకర్షించడం దీని ధ్యేయం.
ఒకనాటి విడిభాగాల కూర్పు దశను అధిగమించడం ద్వారా కీలక విడిభాగాలు, నిత్యావసర ముడి పదార్థాల దేశీయ తయారీ వైపు పయనిస్తూ, ‘స్వదేశీ’ ఎలక్ట్రానిక్స్ విలువ వ్యవస్థ వృద్ధికి ఈ పథకం తోడ్పడుతుంది. ఇవాళ ఆమోదముద్ర వేసిన 31 ప్రాజెక్టులు సహా ఇప్పటిదాకా ఆమోదించిన 106 ప్రాజెక్టులలో 38 ప్లాంట్లు ఇప్పటికే ఉత్పత్తిని ప్రారంభించాయి. మరో 16 ప్రాజెక్టులు నిర్మాణం లేదా యంత్రాల అమరికలో వేగంగా పురోగమిస్తున్నాయి. తాజా ఆమోదాలలో ఫిల్టర్లు, కాయిల్స్-స్పీకర్ల వంటి కీలక భాగాలతో పాటు ఎసిటిలీన్ బ్లాక్, ఎలక్ట్రోలైట్ సంకలితాల వంటి అత్యవసర ముడి పదార్థాల దేశీయ తయారీని కూడా తొలిసారి ఈ జాబితాలో చేర్చారు.
స్వావలంబనతోపాటు ఆర్థిక వృద్ధిని కూడా ఈ పథకం మరింతగా ప్రోత్సహిస్తుంది. ఇందులో భాగంగా ఎన్‌క్లోజర్లకు దేశీయ డిమాండ్‌లో దాదాపు 100 శాతాన్ని ఇది తీరుస్తోంది. ఈసీఎంఎస్ కింద ఆమోదించిన పెట్టుబడులు తొలి అంచనా మొత్తం ₹59,350 కోట్ల నుంచి ఇప్పుడు ₹69,548 కోట్లకు పెరిగాయి.
ఎలక్ట్రానిక్స్ హార్డ్‌వేర్‌కు తోడ్పడే భారత తొలి పారిశ్రామిక సంస్థగా 1967లో ఎలక్ట్రానిక్ ఇండస్ట్రీస్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఎల్సినా) ఏర్పాటైంది. దేశంలో ఎలక్ట్రానిక్స్ తయారీని ప్రోత్సహించడమే కాకుండా ప్రభుత్వం, ఇతర భాగస్వాముల సమక్షంలో పరిశ్రమ ప్రయోజనాలకు ప్రాతినిధ్యం వహించే సంస్థగా ఇది సుదీర్ఘకాలం నుంచి కీలక పాత్ర పోషిస్తోంది.