గనుల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ప్రధాన ఖనిజాల రంగంలో దీర్ఘకాలిక స్థిరత్వాన్ని తీసుకురానున్న ఎంఎండీఆర్ సవరణ

प्रविष्टि तिथि: 14 AUG 2026 8:14PM by PIB Hyderabad

ఆగస్టు 13న పార్లమెంటు ఉభయ సభలు గనులు, ఖనిజాల (అభివృద్ధి, నియంత్రణ) సవరణ బిల్లు- 2026ను ఆమోదించాయి. ప్రధాన ఖనిజాల రంగంలో దీర్ఘకాలిక స్థిరత్వాన్ని తీసుకువచ్చే లక్ష్యంతో ఈ బిల్లు ‘గనులు, ఖనిజాల (అభివృద్ధి, నియంత్రణ) చట్టం- 1957’ను (ఎంఎండీఆర్ చట్టం) సవరిస్తుంది.

ఈ సవరణ బిల్లు భూమి, ఖనిజాలపై రాష్ట్రాల హక్కులను లేదా రాష్ట్రాలు వసూలు చేసే ఖనిజపు పన్నులను ఏమాత్రం హరించదు. ప్రస్తుతం గనుల తవ్వకంతో మొత్తం పన్నులు, చట్టబద్ధమైన చెల్లింపులలో దాదాపు 90 శాతం రాష్ట్రాలకే దక్కుతున్నాయి. సవరణ తర్వాత కూడా ఇది ఇలాగే కొనసాగుతుంది. చిన్న ఖనిజాలను నియంత్రించే, వాటిపై పన్ను విధించే రాష్ట్రాల అధికారాలను ఈ సవరణ ఏమాత్రం తగ్గించదు. 

పైన పేర్కొన్న సవరణలు ఖనిజ రంగంలో ఆర్థిక విధానాల అనిశ్చితిని తొలగించి.. నిశ్చయతను, స్థిరత్వాన్ని, అంచనా వేయదగిన వాతావరణాన్ని అందించడానికి కృషి చేస్తాయి. తద్వారా ఇవి గనుల తవ్వకంలో పెట్టుబడులు పెరగడానికి ఊతమిస్తాయి. ఇది ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యాలను సులభతరం చేస్తుందని, అంతిమంగా 'వికసిత్ భారత్ 2047' దృక్పథాన్ని సాధించడంలో తోడ్పడుతుందన్న అంచనా ఉంది. 

మౌలిక సదుపాయాలు, తయారీ రంగం, ఇంధన భద్రత, మొత్తం ఆర్థికాభివృద్ధికి ఖనిజాలు అత్యంత కీలకం. 2025-26 ఆర్థిక సంవత్సరంలో భారత్ రూ. 10,12,529 కోట్ల విలువైన ఖనిజాలను దిగుమతి చేసుకుంది. పన్నులను అసమతుల్యంగా విధించటం వల్ల దిగుమతి చేసుకున్న ఖనిజాల వైపు పరిశ్రమలు మొగ్గుచూపుతాయి. తద్వారా ప్రభుత్వ ఖజానాపై తీవ్రమైన ప్రభావం ఉంటుంది. 

గనులు, ఖనిజాల (అభివృద్ధి, నియంత్రణ) సవరణ బిల్లు- 2026 (ఎంఎండీఆర్ సవరణ బిల్లు) తర్వాత కూడా ప్రస్తుత రాబడి పద్ధతులు యథావిధిగా కొనసాగుతాయి. రాయల్టీ, వేలం ప్రీమియం, డెడ్ రెంట్, జిల్లా ఖనిజ నిధికి (డీఎంఎఫ్) విరాళం, వస్తు సేవల పన్ను (జీఎస్టీ), ట్రాన్సిట్ ఫీజు వంటి మైనింగ్ కార్యకలాపాలపై ప్రస్తుతం రాయల్టీతో సహా దాదాపు 14 రకాల పన్నులు, ఛార్జీలు, ఫీజులు, ఇతర లెవీలను రాష్ట్రాలు విధిస్తున్నాయి. మొత్తం మైనింగ్ ఆదాయంలో దాదాపు 90 శాతం రాష్ట్రాలకే లభిస్తుంది. 2015-16 ఆర్థిక సంవత్సరం నుంచి 2025-26 ఆర్థిక సంవత్సరం వరకు ప్రధాన మైనింగ్ రాష్ట్రాలకు మొత్తం రూ. 5 లక్షల కోట్లకు పైగా రాబడి సమకూరగా.. అదే కాలంలో కేంద్ర ప్రభుత్వానికి వచ్చిన రాబడి కేవలం రూ. 82,000 కోట్లు మాత్రమే. 

2015లో వేల విధానం ప్రవేశపెట్టిన తర్వాత రాష్ట్రాలకు వేలం ప్రీమియం రూపంలో మరొక ప్రధాన ఆదాయ వనరు లభించింది. 2020-21 నుంచి 2025-26 మధ్య కాలంలో ప్రధాన మైనింగ్ రాష్ట్రాలు రాయల్టీ, డీఎంఎఫ్, జీఎస్టీ వంటి ఇతర ఆదాయ వనరులతో పాటు అదనంగా రూ. 96 వేల కోట్లకు పైగా వేలం ప్రీమియాన్ని వసూలు చేశాయి. తద్వారా వేలంలో, వేలం వేసిన బ్లాకులను కార్యరూపంలోకి తేవడంలో ముందున్న రాష్ట్రాలు తమ ఆదాయంలో విపరీతమైన వృద్ధిని సాధించాయి.

ఖనిజ వనరులు పరిమితంగా ఉండటంతో పాటు భౌగోళికంగా కొన్ని రాష్ట్రాల్లో మాత్రమే కేంద్రీకృతమై ఉన్నాయి. సుస్థిరమైన, సమానమైన, ఏకరీతి ఆర్థిక వృద్ధిని సాధించడానికి వాటి నిర్వహణకు ఒక సమగ్ర జాతీయ వ్యూహం అవసరం. రాష్ట్ర స్థాయి పన్నుల్లో అనియంత్రిత ప్రాంతీయ అసమానతలు దేశీయ ఖర్చులను పెంచడం ద్వారా ఈ విధానాన్ని దెబ్బతీస్తాయి. అపరిమితమైన, అసమానమైన రాష్ట్ర పన్నుల వల్ల దేశీయ ఖనిజాలు పోటీతత్వాన్ని కోల్పోతాయి. దీనివల్ల విరివిగా స్థానిక నిల్వలు ఉన్నప్పటికీ అనవసరమైన విదేశీ దిగుమతులను ప్రోత్సహించినట్లవుతుంది. అంతేకాకుండా జాతీయ మార్కెట్ ముక్కలై ప్రజా ప్రయోజనాలు బలహీనపడతాయి.

 

***


(रिलीज़ आईडी: 2299741) आगंतुक पटल : 13
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी