కమ్యూనికేషన్లు- సమాచార సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
80వ స్వాతంత్య్ర దినోత్సవ సందర్భంగా బీఎస్‌ఎన్‌ఎల్ శుభాకాంక్షలు
వినియోగదారులే లక్ష్యంగా కొత్త డిజిటల్ సేవల ప్రారంభం
प्रविष्टि तिथि:
14 AUG 2026 6:31PM by PIB Hyderabad
భారత 80వ స్వాతంత్య్ర దినోత్సవ శుభ సందర్భంగా భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్‌ఎన్‌ఎల్) తమ విలువైన వినియోగదారులకు, దేశ పౌరులందరికీ, వ్యాపార భాగస్వాములకు, సహచరులకు, ఉద్యోగులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపింది.
దేశంలో విశ్వసనీయమైన ప్రభుత్వ రంగ టెలికాం సేవా సంస్థగా ఉన్న బీఎస్ఎన్ఎల్, క్లిష్టమైన భౌగోళిక, వాతావరణ పరిస్థితుల్లో కూడా నాణ్యమైన సేవలను అందిస్తోంది. దేశవ్యాప్తంగా నమ్మకమైన, సురక్షితమైన, సరసమైన, అందరికీ అందుబాటులో ఉండే డిజిటల్ అనుసంధానాన్ని అందించేందుకు కట్టుబడి ఉందని స్పష్టం చేసింది. స్వదేశీ సాంకేతికతలు, వినియోగదారుల-కేంద్రీకృత ఆవిష్కరణలతో ఆత్మనిర్భర్ భారత్, డిజిటల్ ఇండియా దార్శనికతకు అనుగుణంగా భవిష్యత్తుకు తగిన టెలికాం వ్యవస్థను నిర్మించేందుకు కృషి చేస్తోంది. డిజిటల్ ఇండియా ఫలాలు దేశంలోని ప్రతి ఒక్క పౌరుడికి అందేలా నిబద్ధత కలిగిన సిబ్బంది సేవలు అందిస్తున్నారు.
స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా వినియోగదారుల అనుభవాన్ని మెరుగుపరచడానికి, డిజిటల్ సేవలను విస్తరించడానికి బీఎస్ఎన్ఎల్ కొత్త కార్యక్రమాలను ప్రకటించింది. దేశవ్యాప్తంగా పౌరులకు అధునాతన అనుసంధానం, వినోద సేవలను మరింత సులభంగా అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా ఈ ప్రత్యేక ఆఫర్లు, వినియోగదారు కేంద్రీకృత డిజిటల్ సేవలను ఆవిష్కరించినట్లు సంస్థ తెలిపింది.
నెట్‌వర్క్ విస్తరణ-దేశవ్యాప్తంగా 4జీ సేవలు, వినియోగదారులకు మెరుగైన అనుభవం
ప్రపంచ స్థాయి, స్వదేశీ సాంకేతికతతో కూడిన అనుసంధానాన్ని అందించే దిశగా బీఎస్ఎన్ఎల్ తమ మొబైల్ నెట్‌వర్క్‌ను మరింత బలోపేతం చేసింది. దేశవ్యాప్తంగా 4జీ నెట్‌వర్క్‌ను పట్టణాలు, గ్రామాలు, సుదూర ప్రాంతాలకు వేగంగా విస్తరించేందుకు మరో 26,300 కి పైగా కొత్త 4జీ బీటీఎస్ (బేస్ ట్రాన్సీవర్ స్టేషన్) సైట్‌లను ఏర్పాటు చేయడానికి ఆర్డర్ ఇచ్చింది. ఈ విస్తరణతో పాటు బీఎస్‌ఎన్‌ఎల్ 4జీ నెట్‌వర్క్ నాణ్యతను పెంచింది. పూర్తి స్వదేశీ, 5జీ కి అప్‌గ్రేడ్ చేయగల సాంకేతికత ఆధారంగా విస్తృతమైన నెట్‌వర్క్ కవరేజ్, వేగవంతమైన డేటా, మెరుగైన కాల్ పనితీరుతో వినియోగదారులకు నాణ్యమైన సేవలను అందిస్తోంది.
స్వాతంత్య్ర దినోత్సవ ప్రత్యేక ప్రకటనలు
1. రూ. 1 ఫ్రీడమ్ 2.0 ఆఫర్
స్వాతంత్య్ర దినోత్సవ సందర్భంగా కొత్త వినియోగదారుల కోసం బీఎస్‌ఎన్‌ఎల్ కేవలం రూ. 1తో ఫ్రీడమ్ 2.0 ఆఫర్‌ను ప్రవేశపెట్టింది. దీని ద్వారా కొత్త కస్టమర్లు కేవలం ఒక్క రూపాయికే బీఎస్‌ఎన్‌ఎల్ మొబైల్ నెట్‌వర్క్ సేవలను పొందవచ్చు.
దేశం తన 80వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని, స్వాతంత్య్రం, అభివృద్ధి, పురోగతి విశిష్ట ప్రయాణాన్ని జరుపుకుంటున్న ఈ వేళ ప్రజలను అనుసంధానించడానికి, సమాజాలను సాధికారపరచడానికి, నమ్మకమైన టెలికాం సేవల ద్వారా సమగ్ర అభివృద్ధిని అందించడానికి బీఎస్ఎన్ఎల్ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుంది.
ఈ గర్వించదగ్గ సందర్భంలో నిబద్ధతతో దేశానికి సేవ చేస్తామని, డిజిటల్ అనుసంధానాన్ని బలోపేతం చేస్తూ దేశ డిజిటల్ భవిష్యత్తుకు తమ వంతు సహకారం అందిస్తామని బీఎస్ఎన్ఎల్ మరోసారి స్పష్టం చేసింది.
పౌరులందరికీ బీఎస్ఎన్ఎల్ తరపున 80వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు..
జై హింద్, జై భారత్..
***
(रिलीज़ आईडी: 2299740)
आगंतुक पटल : 5