అంతరిక్ష విభాగం
భారీ సంఖ్యలో భూ నిమ్న కక్ష్య (ఎల్‍ఈఓ) ఉపగ్రహ సమూహాలు లేదా అంతర్జాల ఉపగ్రహ సమూహాలు పెరగటం వల్ల అంతరిక్ష వ్యర్థాలు పేరుకుపోతున్న సమస్యపై దృష్టి సారించిన ఇస్రో: డాక్టర్ జితేంద్ర సింగ్
అంతరిక్ష వ్యర్థాల నివారణ, అరికట్టడానికి సాధ్యమైన అన్ని చర్యలు తీసుకుంటున్న ఇస్రో: డాక్టర్ జితేంద్ర సింగ్
క్రియాశీలకంగా వ్యర్థాలను తొలగించటం (ఏడీఆర్), ఇతర మార్గాల ద్వారా అంతరిక్ష ఆస్తులను పరిరక్షించడంలో, వ్యర్థాల ఉత్పత్తిని మరింత పరిమితం చేయడంలో కీలక పాత్ర పోషించనున్న 'వ్యర్థ రహిత అంతరిక్ష మిషన్': డాక్టర్ జితేంద్ర సింగ్
1996 నుంచి ఇంటర్-ఏజెన్సీ స్పేస్ డెబ్రిస్ కోఆర్డినేషన్ కమిటీలో సభ్యత్వాన్ని కలిగి ఉన్న ఇస్రో: డాక్టర్ జితేంద్ర సింగ్
ఉపగ్రహాల జీవితకాలం ముగిసిన తర్వాత వాటిని తొలగించే విషయంలో అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన మార్గదర్శకాలను తప్పనిసరి చేసిన 'భారత అంతరిక్ష విధానం'
దీర్ఘకాలిక అంతరిక్ష స్థిరత్వానికి అంతరిక్ష స్థితిగతుల అవగాహన, క్రియాశీలకంగా వ్యర్థాలను తొలగించటం, స్వదేశీ పర్యవేక్షణ సామర్థ్యాలు అత్యంత కీలకం
प्रविष्टि तिथि:
13 AUG 2026 4:29PM by PIB Hyderabad
భారీ సంఖ్యలో భూ నిమ్న కక్ష్యలో (ఎల్ఈఓ) ఉపగ్రహ సమూహాలు లేదా అంతర్జాల ఉపగ్రహ సమూహాలు పెరగటం వల్ల అంతరిక్ష వ్యర్థాలు పేరుకుపోతున్న సమస్యపై భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) తీవ్ర దృష్టి సారించిందని సిబ్బంది-ప్రజా ఫిర్యాదులు-పింఛన్లు, ప్రధాని కార్యాలయ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. ఈ సమస్యను నివారించేందుకు, అరికట్టడానికి సాధ్యమైన అన్ని చర్యలూ ఇస్రో తీసుకుంటున్నట్లు ఆయన వెల్లడించారు. ఒక ప్రశ్నకు సమాధానంగా ఇవాళ రాజ్యసభలో ఆయన ఈ సమాచారాన్ని ఇచ్చారు.
అంతరిక్ష ఆస్తులను పరిరక్షించడం, క్రియాశీలకంగా వ్యర్థాలను తొలగించటం (ఏడీఆర్- యాక్టీవ్ డెబ్రీస్ రిమూవల్) తదితర మార్గాల ద్వారా వ్యర్థాల ఉత్పత్తిని మరింత పరిమితం చేయడంలో ఇస్రో చేపట్టిన 'వ్యర్థ రహిత అంతరిక్ష మిషన్' కీలక పాత్ర పోషిస్తుందని మంత్రి తెలిపారు.
అంతర్జాల అనుసంధానత కోసం ఉపయోగించే ఉపగ్రహ సమూహాల్లో సాధారణంగా కొన్ని వేల సంఖ్యలో ఉపగ్రహాలు ఉంటాయని.. ఇది ఆయా కక్ష్య ప్రాంతాల్లో ఒకదానికొకటి ఢీకొనే ప్రమాదాలను గణనీయంగా పెంచుతుందని డాక్టర్ జితేంద్ర సింగ్ పేర్కొన్నారు. ‘అనేక పెద్ద ఉపగ్రహ సమూహాలు ఢీకొనే విషయంలో స్వయంప్రతిపత్త ప్రమాద నివారణ సామర్థ్యాలను కలిగి ఉన్నప్పటికీ కొన్ని ఉపగ్రహాలు కక్ష్యలోనే విఫలమై ప్రమాదాలను నివారించడానికి తగిన విధంగా పని చేయలేకపోవచ్చు.
గుర్తించలేని చిన్న సైజు వ్యర్థాలు అదనపు ముప్పును కలిగిస్తాయి’ అని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. ‘అలాంటి వ్యర్థాల విషయంలో ఢీకొనే ప్రమాదం నుంచి తప్పించటం లేదా తగిన రక్షణ కల్పించడం సాధ్యం కాదు. ఒకవేళ ఇవి ఢీకొంటే మిషన్‌ను ముగించేంత తీవ్రమైన నష్టం వాటిల్లుతుంది. దీనివల్ల ఉపగ్రహం పనిచేయకుండా పోవడమే కాకుండా మరిన్ని వ్యర్థాలు ఉత్పన్నమవుతాయి. భారీ సంఖ్యలో ఉపగ్రహాలు ఉన్నందున వ్యర్థాలు సృష్టించే ప్రమాదం చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఉపగ్రహాలు ఎక్కువగా ఉన్న కక్ష్యలో ఢీకొనడం లేదా అనుకోకుండా ముక్కలైపోవడం వల్ల శకలాలు ఏర్పడే ఏ చిన్న సంఘటన నమోదైనా ఈ ముప్పు మరింత పెరుగుతుంది’ అంటూ ఆయన వివరించారు.
అంతరిక్ష వ్యర్థాల పర్యవేక్షణ, నివారణపై భారత సంస్థాగత భాగస్వామ్యాన్ని ప్రధానంగా ప్రస్తావిస్తూ.. 1993లో ఏర్పడిన ఇంటర్-ఏజెన్సీ స్పేస్ డెబ్రిస్ కోఆర్డినేషన్ కమిటీ (ఐఏడీసీ) అంతరిక్ష వ్యర్థాల పర్యవేక్షణ, నివారణ విషయంలో పనిచేసే గుర్తింపు పొందిన అత్యున్నత సంస్థగా పరిగణిస్తున్నట్లు డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. అంతరిక్ష శాఖ ఆధ్వర్యంలోని ఇస్రో 1996 నుంచి ఐఏడీసీలో సభ్యత్వాన్ని కలిగి ఉంది. అంతరిక్ష కార్యకలాపాల భద్రతతో సహా అంతరిక్ష వ్యర్థాల నివారణ, దీర్ఘకాలిక స్థిరత్వ అంశాలను ఐక్యరాజ్యసమితి శాంతియుత అంతరిక్ష వినియోగ కమిటీ (యూఎన్-సీఓపీయూఓఎస్) పరిష్కరిస్తుందని ఆయన పేర్కొన్నారు.
ఐఏడీసీ, దీర్ఘకాలిక స్థిరత్వంపై పనిచేస్తోన్న ఐక్యరాజ్యసమితి శాస్త్రవిజ్ఞాన- సాంకేతికత సబ్‌కమిటీ (యూఎన్-ఎస్‌టీఎస్‌సీ) వర్కింగ్ గ్రూప్, అంతరిక్ష స్థితిగతులపై అవగాహనకు (ఎస్ఎస్ఏ- స్పేస్ సిచుయేషనల్ అవేర్‌నెస్) సంబంధించిన ఎక్స్‌పర్ట్ గ్రూప్‌తో సహా అంతరిక్ష వ్యర్థాలతో వ్యవహరించే అంతర్జాతీయ వేదికల్లో భారత్‌కు ప్రాతినిధ్యం ఉంది. మారుతున్న అంతరిక్ష వ్యర్థాల స్థితిగతులకు అనుగుణంగా ఐఏడీసీ సభ్యులు క్రమం తప్పకుండా అంతరిక్ష వ్యర్థాలకు సంబంధించిన విషయాలపై చర్చిస్తారని, అంతరిక్ష వ్యర్థాల నివారణ మార్గదర్శకాలను సవరిస్తారని డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. దీర్ఘకాలిక స్థిరత్వం, అంతరిక్ష స్థితిగతులపై అవగాహనకు సంబంధించిన వర్కింగ్ గ్రూప్‌లలో కూడా అంతరిక్ష వ్యర్థాల పర్యవేక్షణ, అంతరిక్ష నౌకల భద్రతా అంశాల గురించి చర్చ జరుగుతోంది.
అంతరిక్ష శాఖ, అంతర్జాతీయ ఏజెన్సీల మధ్య అంతరిక్ష వ్యర్థాల పర్యవేక్షణ, నివారణపై సమన్వయం విషయంలో.. ఐఏఏ అంతరిక్ష వ్యర్థాల వర్కింగ్ గ్రూప్, ఐఎస్ఓ వర్కింగ్ గ్రూప్ 7 వంటి ఇతర అంతర్జాతీయ వేదికలు వివిధ మార్గాలను అందిస్తున్నాయని ఆయన తెలిపారు.
భారత అంతరిక్ష కార్యక్రమంలో జీవితకాలం ముగిసిన తర్వాత వ్యర్థాలను తొలగించే చర్యలతో సహా అంతరిక్ష వ్యర్థాల నివారణపై అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన మార్గదర్శకాలను పాటించాలని భారత అంతరిక్ష విధానం తెలియజేస్తోందని కేంద్ర మంత్రి చెప్పారు. జీవితకాలం ముగిసిన ఉపగ్రహాలను తొలగించటానికి సంబంధించిన మార్గదర్శకాలను అమలు చేసే విషయంలో ఇస్రో చేపట్టిన ఒక క్రియాశీల కార్యక్రమమే 'వ్యర్థ రహిత అంతరిక్ష మిషన్ (డెబ్రిస్ ఫ్రీ స్పేస్ మిషన్)'.
2024లో ఇన్-స్పేస్ విడుదల చేసిన నిబంధనలు, మార్గదర్శకాలు, విధానాలు తగిన మిషన్- అనంతర తొలగింపు చర్యలను అవలంబించాలని లేదా సహజ కక్ష్య క్షీణత ద్వారా అంతరిక్షంలోని ఆస్తులు కక్ష్యలో చాలా పరిమిత జీవితాన్ని కలిగి ఉండేలా చూసుకోవాలని భారతీయ అంతరిక్ష రంగానికి చెందిన వారిని ప్రోత్సహిస్తున్నాయని మంత్రి తెలిపారు.
దీర్ఘకాలిక అంతరిక్ష స్థిరత్వానికి అత్యంత కీలకమైన సాధనాలలో 'అంతరిక్ష స్థితిగతుల అవగాహన (ఎస్ఎస్ఏ)’ ఒకటని డాక్టర్ జితేంద్ర సింగ్ పేర్కొన్నారు. విన్యాసాలు చేసే సామర్థ్యం- ట్రాక్ చేయగలగడం వంటి సాంకేతిక అవసరాలను ఆపరేటర్లు పూర్తి చేయడం, రిజిస్ట్రేషన్- కాంటాక్ట్ పాయింట్ల భాగస్వామ్యం వంటి ప్రాథమిక బాధ్యతలను నెరవేర్చడం, బలమైన నియంత్రణ ఫ్రేమ్‌వర్క్‌ను నిర్ధారించడం వంటివి ఇతర ముఖ్యమైన అవసరాలని ఆయన అన్నారు.
అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన అంతరిక్ష వ్యర్థ నివారణ చర్యలను విస్తృతంగా అమలు చేయడం, 'వ్యర్థ రహిత అంతరిక్ష మిషన్' అవసరాలను మరింత మెరుగ్గా పాటించడం.. అంతరిక్ష ఆస్తులను రక్షించడం, వ్యర్థాల ఉత్పత్తిని అరికట్టడంలో కీలక పాత్ర పోషిస్తుందని మంత్రి తెలిపారు. అంతరిక్ష వ్యర్థాల వృద్ధిని తగ్గించడంలో 'క్రియాశీల వ్యర్థాల తొలగింపు' (ఏడీఆర్) ప్రాముఖ్యతను కూడా ఆయన ప్రధానంగా చెప్పారు. ఏడీఆర్‌కి ముందస్తు కార్యకలాపాలు ఇప్పటికే కక్ష్యలో ప్రదర్శనల ద్వారా ప్రారంభమయ్యాయి. కాలక్రమేణా ఇవి మరింత అభివృద్ధి చెందుతాయన్న అంచనా ఉందని తెలిపారు.
అంతర్జాతీయ సహకారం, స్వదేశీ సామర్థ్యాలు రెండింటి ప్రాముఖ్యతను ప్రధానంగా చెబుతూ.. సమగ్ర అంతరిక్ష స్థితిగతుల అవగాహన (ఎస్ఎస్ఏ), దీర్ఘకాలిక స్థిరత్వానికి అంతర్జాతీయ సహకారం, డేటా షేరింగ్ చాలా ముఖ్యమని డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. ఎదురవుతున్న సవాళ్లను పరిష్కరించేందుకు వినూత్న చర్యలు, పరిశోధన- అభివృద్ధితో (ఆర్-డీ) పాటు అంతరిక్ష వస్తువుల పర్యవేక్షణ కోసం స్వదేశీ సామర్థ్య పెంపు ద్వారా స్వయంసమృద్ధి సాధిస్తామని ఆయన తెలిపారు. దీర్ఘకాలిక స్థిరత్వాన్ని నిర్ధారించడానికి అంతరిక్ష వాతావరణంలోని ఉపయోగకరమైన ప్రాంతాల పెళుసుదనం గురించి అంతరిక్ష రంగంలోని వారికి అవగాహన కల్పించే అంశానికి ఉన్న ప్రాముఖ్యతను కూడా ఆయన చెప్పారు.

***
(रिलीज़ आईडी: 2299166)
आगंतुक पटल : 10