కంపెనీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ
చండీగఢ్, దాద్రా-నగర్ హవేలీ కేంద్రపాలిత ప్రాంతాల్లో సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ ఆధారిత ప్రత్యక్ష ప్రయోజన బదిలీ (డీబీటీ) విధానాన్ని ప్రారంభించనున్న భారత ప్రభుత్వం
प्रविष्टि तिथि:
12 AUG 2026 7:07PM by PIB Hyderabad
చండీగఢ్, దాద్రా-నగర్ హవేలీ కేంద్రపాలిత ప్రాంతాల్లో 'ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన' (పీఎంజీకేఏవై) కింద, సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ (సీబీడీసీ) ఆధారిత ప్రత్యక్ష ప్రయోజన బదిలీ (డీబీటీ) విధానాన్ని భారత ప్రభుత్వం ఈ నెల 14న ప్రారంభించనుంది. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ శాఖ మంత్రి శ్రీ ప్రహ్లాద్ జోషి... పంజాబ్ గవర్నర్, చండీగఢ్ కేంద్రపాలిత ప్రాంత అడ్మినిస్ట్రేటర్ శ్రీ గులాబ్ చంద్ కటారియా... వ్యవసాయం, రైతు సంక్షేమ శాఖ మంత్రి శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్... వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ శాఖ సహాయ మంత్రి శ్రీమతి నిముబెన్ జయంతిభాయ్ బాంబనియా సహా ఇతర ప్రముఖులు పాల్గొంటారు.
పీఎంజీకేఏవై కింద సీబీడీసీ ఆధారిత డీబీటీ ప్రారంభం... ఆధునిక, పారదర్శక, సాంకేతికత ఆధారిత సంక్షేమ సేవల పంపిణీ వ్యవస్థను నిర్మించే దిశగా భారత్ సాగిస్తున్న ప్రయాణంలో కీలక మైలురాయిగా నిలుస్తుంది.
చండీగఢ్, దాద్రా-నగర్ హవేలీలు ప్రోగ్రామెబుల్ సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ (సీబీడీసీ - డిజిటల్ రూపాయి) టోకెన్‌ల రూపంలో అర్హులైన పీఎంజీకేఏవై లబ్ధిదారులందరికీ ఆహార సంబంధిత రాయితీలను నేరుగా వారి సీబీడీసీ వాలెట్‌లలో జమ చేయడం ద్వారా... ఈ విధానాన్ని అమలు చేస్తున్న దేశంలోని తొలి కేంద్రపాలిత ప్రాంతాలుగా అవతరించబోతున్నాయి.
పుదుచ్చేరి, గుజరాత్‌లలో ఇంతకుముందు అమలు చేసిన పైలట్ ప్రాజెక్టులకు కొనసాగింపుగా... లక్షిత కేంద్రపాలిత ప్రాంతాల వ్యాప్తంగా పూర్తి డిజిటల్ విధానం అమలును, అర్హులైన లబ్ధిదారులందరిలో సంతృప్తిని ఈ విస్తరణ సూచిస్తుంది.
సీబీడీసీ-ఆధారిత డీబీటీ విధానం కింద, అర్హులైన పీఎంజీకేఏవై లబ్ధిదారులు ఆహార సబ్సిడీని వారి సాంప్రదాయిక బ్యాంకు ఖాతాలకు కాకుండా నేరుగా వారి సీబీడీసీ వాలెట్లలో అందుకుంటారు. సురక్షితమైన, గుర్తించ గల, రియల్-టైమ్ డిజిటల్ చెల్లింపు విధానం ద్వారా... ప్యానెల్‌లో ఉన్న వ్యాపారుల నుంచి ఆహార ధాన్యాలను కొనుగోలు చేయడానికి ఈ సబ్సిడీని వారు ఉపయోగించుకోవచ్చు.
సీబీడీసీ-ఆధారిత డీబీటీ నమూనా ద్వారా... సాంప్రదాయిక రాయితీల పంపిణీ విధానాలతో ముడిపడి ఉన్న లీకేజీలు, మళ్లింపులు, నగదు నిర్వహణను తగ్గిస్తూ, ప్రజల నిధులు పారదర్శకమైన, పూర్తిస్థాయిలో గుర్తించదగిన మార్గంలో పంపిణీ అయ్యేలా నిర్ధారించడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఇది సరళమైన వాలెట్-ఆధారిత లావాదేవీల ద్వారా లబ్ధిదారులకు ప్రయోజనాలను తక్షణం, సురక్షితంగా బదిలీ చేయడాన్ని సులభతరం చేస్తుంది. ఆర్థిక సమ్మిళితాన్నీ ఇది ప్రోత్సహిస్తుంది.
ఈ కార్యక్రమం రాయితీ పంపిణీలో జవాబుదారీతనాన్ని, నిరంతర పర్యవేక్షణను మరింత బలోపేతం చేస్తుంది. భవిష్యత్తు చెల్లింపు విధానాల కోసం 'డిజిటల్ రూపాయి' సామర్థ్యాన్ని ఇది నిరూపిస్తుంది.
దేశానికి ఒక ప్రయోగాత్మక నిరూపణగా... ఇతర రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు అనుసరించడానికి వీలుగా విస్తరించగల నమూనాగా ఈ అమలును భావిస్తున్నారు. సంక్షేమ పథకాలతో సీబీడీసీని అనుసంధానించడం విలువైన కార్యాచరణ అనుభవాన్ని అందించడంతో పాటు... డిజిటల్ ప్రజా మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడం, వినూత్న సాంకేతికతల ద్వారా పౌర కేంద్రిత సేవలను అందించాలనే ప్రభుత్వ దార్శనికతకూ ఇది మద్దతునిస్తుందని ఆశిస్తున్నారు.
***
(रिलीज़ आईडी: 2298692)
आगंतुक पटल : 6