నౌకారవాణా మంత్రిత్వ శాఖ
విశాఖపట్నం ఓడరేవులో కార్గో తరలింపు సౌలభ్యం కోసం రూ.334.89 కోట్ల ఫ్లైఓవర్ నిర్మాణానికి నౌకాశ్రయాలు, నౌకాయానం, జలరవాణా మంత్రిత్వశాఖ ఆమోదం
రహదారి, రైలు ట్రాఫిక్‌ను వేరు చేయడం ద్వారా తొమ్మిది లెవెల్ క్రాసింగ్‌ల వద్ద రద్దీ తగ్గింపు లక్ష్యంగా కాన్వెంట్ జంక్షన్ నుంచి డాక్ ఏరియా వరకు 3.584 కిలోమీటర్ల ఎలివేటెడ్ కారిడార్
प्रविष्टि तिथि:
11 AUG 2026 8:08PM by PIB Hyderabad
సరుకు రవాణాను మెరుగుపరచడం, ట్రాఫిక్ రద్దీని తగ్గించడం, ఓడరేవు ప్రాంగణంలో రాకపోకలను క్రమబద్ధీకరించడం కోసం విశాఖపట్నం పోర్ట్ అథారిటీ వద్ద రూ. 334.89 కోట్ల అంతర్గత ఫ్లైఓవర్ నిర్మాణానికి నౌకాశ్రయాలు, నౌకాయానం, జలరవాణా మంత్రిత్వశాఖ ఆమోదం తెలిపింది.
కేంద్ర నౌకాశ్రయాలు, నౌకాయానం, జలరవాణా శాఖ మంత్రి శ్రీ సర్బానంద సోనోవాల్ ఆమోదించిన ఈ ప్రాజెక్టును... సదరు మంత్రిత్వ శాఖ కార్యదర్శి అధ్యక్షతన 'డెలిగేటెడ్ ఇన్వెస్ట్‌మెంట్ బోర్డ్' (డీఐబీ) పరిశీలించి, అంచనా వేసింది.
ఈ సందర్భంగా శ్రీ సర్బానంద సోనోవాల్ మాట్లాడుతూ, “ఈ ప్రాజెక్టు విశాఖపట్నం పోర్టులో కీలకమైన అడ్డంకిని తొలగించి, సరుకు రవాణాను వేగవంతం చేయడంతో పాటు మొత్తం కార్యాచరణ సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో ఆధునికమైన, నిరాటంకమైన, ప్రపంచంతో పోటీపడగల నౌకాశ్రయ మౌలిక సదుపాయాలను నిర్మించడానికి మేం కట్టుబడి ఉన్నాం” అని అన్నారు.
కాన్వెంట్ జంక్షన్‌ను డాక్ ప్రాంతంతో అనుసంధానిస్తూ ప్రతిపాదించిన 3.584 కిలోమీటర్ల ఈ ఎలివేటెడ్ కారిడార్... పోర్టు పరిధిలో రహదారి, రైలు రద్దీని వేరు చేస్తుంది. అధిక సంఖ్యలో రైళ్ల రాకపోకల కారణంగా రోజుకు సుమారు 18 సార్లు గేట్లు మూసివేయాల్సి వస్తున్న తొమ్మిది ప్రధాన రైల్వే లెవల్ క్రాసింగ్‌ల వద్ద జాప్యం సమస్యను పరిష్కరించడం ఈ ప్రాజెక్టు లక్ష్యం.
తరచుగా గేటు మూయడం కారణంగా... రద్దీకి, వాహనాలు ఎక్కువ సేపు వేచి ఉండటానికి, అధిక ఇంధన వినియోగానికి, వాహన నిర్వహణ ఖర్చుల పెరుగుదలకు ఇవి కారణమవుతున్నాయి. ఇవి సరుకు రవాణా సామర్థ్యాన్ని ప్రభావితం చేస్తాయి. ఎలివేటెడ్ రోడ్ కారిడార్‌ను అందించడం ద్వారా ఈ ప్రాజెక్టు రహదారి, రైలు ట్రాఫిక్ కలిసిపోయే ఇబ్బందిని తగ్గిస్తూ... వాహనాలు, సరుకుల రవాణాను సులభతరం చేస్తుంది. ఈ ప్రాజెక్టులో అనుబంధ సివిల్, ఎలక్ట్రికల్ పనులు, యుటిలిటీ మార్పిడి, భద్రతా సంస్థాపనలు, ఐదేళ్ల నిర్వహణ భాగంగా ఉంటాయి. ముఖ్యంగా కీలకమైన డాక్ ప్రాంతాల్లో కొనసాగుతున్న పోర్టు కార్యకలాపాలకు అంతరాయాన్ని తగ్గించే విధంగా నిర్మాణ ప్రణాళికను రూపొందిస్తారు.
ఈ సందర్భంగా శ్రీ సర్బానంద సోనోవాల్ మాట్లాడుతూ, "ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ భారత నౌకా వాణిజ్య రంగాన్ని ఆర్థిక వృద్ధి, స్వయం-సమృద్ధి, జాతీయ అభివృద్ధికి కీలక చోదక శక్తిగా మార్చారు. బలమైన మౌలిక సదుపాయాలు, ప్రగతిశీల సంస్కరణలు, ఆధునిక సాంకేతికత, మన నౌకా వాణిజ్య సామర్థ్యాలపై భారీ పెట్టుబడులతో... మేం ప్రపంచంతో పోటీపడగల సామర్థ్యం కలిగిన, స్వయం-సమృద్ధమైన నౌకా వాణిజ్య వ్యవస్థను నిర్మిస్తున్నాం. 'స్వయం-సమృద్ధ భారత్', 'వికసిత్ భారత్-2047' దిశగా భారత్ ప్రయాణానికి ఇది ఊతమిస్తుంది," అని అన్నారు.
ప్రధానమంత్రి గతిశక్తి విధాన ప్రణాళిక కింద సమీకృత మౌలిక సదుపాయాల ప్రణాళికపై ప్రభుత్వం దృష్టి సారించిన నేపథ్యంలో ఈ పెట్టుబడి దానికి అనుగుణంగా ఉంది. పోర్టులో మారుమూల ప్రాంతాలకూ కనెక్టివిటీని మెరుగుపరచడం, సరుకుల తరలింపును వేగవంతం చేయడం ద్వారా ఈ ఎలివేటెడ్ కారిడార్... భారత సముద్ర రవాణా, వాణిజ్య నెట్‌వర్క్‌లో విశాఖపట్నం పోర్టు పాత్రను బలోపేతం చేస్తుందని భావిస్తున్నారు.
ఈ ప్రాజెక్టును పనులు ప్రారంభమైన 30 నెలల్లోపు పూర్తి చేసేలా షెడ్యూల్ చేశారు.
***
(रिलीज़ आईडी: 2297979)
आगंतुक पटल : 16