వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

సంచార ఆహార పరీక్ష ప్రయోగశాలల కోసం దేశంలో తొలి గుర్తింపు పథకాన్ని ప్రారంభించిన ఎన్‌ఏబీఎల్‌


బహుపాక్షిక అవగాహన ఒప్పందాల మార్పిడితో నియంత్రణ వ్యవస్థల సమన్వయం, సమగ్ర నాణ్యత మౌలిక వసతుల బలోపేతం

నాడు పోస్టు చేయడమైనది: 10 AUG 2026 7:48PM by PIB Hyderabad

 భారత నాణ్యత మండలి (క్యూసీఐ) ఆధ్వర్యంలోని నేషనల్ అక్రిడిటేషన్ బోర్డు ఫర్ టెస్టింగ్ అండ్ కాలిబ్రేషన్ లాబొరేటరీస్ (ఎన్‌ఏబీఎల్‌) సమగ్ర ముల్యాంకన కార్యక్రమం కింద దేశంలోనే తొలిసారిగా సంచార ఆహార పరీక్ష ప్రయోగశాలల కోసం గుర్తింపు విధానాన్ని ప్రారంభించింది. న్యూఢిల్లీలోని హోటల్ అశోకాలో నిర్వహించిన ‘గుణవత్త సమన్వయ- బహుపాక్షిక అవగాహన ఒప్పందాల మార్పిడి కార్యక్రమం’ వేదికగా ఈ నూతన విధానాన్ని అధికారికంగా ఆవిష్కరించారు.

 

సమాజంలో ప్రతి ఒక్కరికీ నమ్మకమైన, నాణ్యమైన, అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ఆహార పరీక్షా సేవలను నేరుగా ప్రజల వద్దకే విస్తరించడమే ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశం. ఈ వేడుకలో పాల్గొన్న వివిధ భాగస్వామ్య సంస్థల మధ్య బహుళపక్ష అవగాహన ఒప్పందాల మార్పిడి జరిగింది. ఇది నియంత్రణ సంస్థల మధ్య సమన్వయాన్ని పెంచడానికి, ఏకీకృత తనిఖీలకు, మరింత సమర్థవంతమైన నాణ్యతా మౌలిక సదుపాయాల ఏర్పాటుకు తోడ్పడుతుందని ప్రతినిధులు తెలిపారు.

 

 ఈ కార్యక్రమంలో కేంద్ర పరిశ్రమల ప్రోత్సాహకం, అంతర్గత వ్యాపార శాఖ (డీపీఐఐటీ) కార్యదర్శి శ్రీ అమర్‌దీప్ సింగ్ భాటియాతో పాటు క్యూసీఐ, ఎన్‌ఏబీఎల్‌ ఉన్నతాధికారులు, వివిధ నియంత్రణ అధికార సంస్థలు, సమగ్ర ముల్యాంకన విధానాలతో అనుసంధానమైన కమోడిటీ బోర్డుల ప్రతినిధులు పాల్గొన్నారు.

 

ఎన్‌ఏబీఎల్‌ రూపొందించిన ఈ ప్రత్యేక గుర్తింపు పధకం ద్వారా సంచార ఆహార పరీక్ష ల్యాబ్‌లకుఅధికారిక గుర్తింపు లభిస్తుంది. దీనివల్ల కేవలం స్థిరమైన ల్యాబ్‌లకే పరిమితం కాకుండా, మొబైల్ వాహనాల ద్వారా సమాజంలో ప్రతి ప్రాంతంలోనూ అంతర్జాతీయ స్థాయి ఆహార తనిఖీ సేవలు అందుబాటులోకి వస్తాయి. ఈ కార్యక్రమం వల్ల దేశంలో ఆహార భద్రతా పర్యవేక్షణ వ్యవస్థ మరింత బలపడటమే కాకుండా, కలుషిత లేదా నాణ్యత లేని ఆహారంపై ప్రభుత్వ నియంత్రణ సంస్థలు వేగంగా చర్యలు తీసుకోవడానికి వీలవుతుంది. అంతిమంగా వినియోగదారుల్లో ఆహార నాణ్యత, భద్రతపై నమ్మకం గణనీయంగా పెరుగుతుందని అధికారులు వెల్లడించారు. 

 

బహుపాక్షిక అవగాహన ఒప్పందాల మార్పిడి కార్యక్రమంలో పాల్గొన్న సంస్థలు సమన్వయంతో కూడిన మూల్యాంకనాలు, నియంత్రణ వ్యవస్థల సమన్వయం, సమగ్ర మూల్యాంకన వ్యవస్థను బలోపేతం చేయడంపై తమ నిబద్ధతను చాటాయి. ఈ కార్యక్రమం ద్వారా మూల్యాంకన ప్రక్రియల్లో పునరావృతిని తగ్గించడం, పరస్పర గుర్తింపును ప్రోత్సహించడం, నియంత్రణ సామర్థ్యాన్ని మెరుగుపరచడం, వ్యాపారం సులభతరం చేయడం లక్ష్యంగా పెట్టుకున్నారు. అదే సమయంలో నాణ్యత, నిబంధనల అమలులో ఉన్నత ప్రమాణాలను కొనసాగించనున్నారు.

 

కార్యక్రమంలో డీపీఐఐటీ కార్యదర్శి శ్రీ అమర్‌దీప్ సింగ్ భాటియా మాట్లాడుతూ.. మొత్తం విలువ వ్యవస్థలో నాణ్యతకు ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరాన్ని వివరించారు. ‘గుణవత్తా సమన్వయ’ వంటి కార్యక్రమాలు నాణ్యత ఆధారిత విధానాలను ప్రోత్సహించడం ద్వారా 2047 నాటికి భారత్‌ అభివృద్ధి ప్రస్థానానికి దోహదపడతాయని ఆయన అన్నారు. 

 

అక్రిడిటేషన్‌ పథకం, సమగ్ర మూల్యాంకన వ్యవస్థ ప్రాధాన్యతను ఎన్‌ఏబీఎల్‌ చైర్‌పర్సన్ డాక్టర్ సందీప్ షా వివరించారు. దేశ అభివృద్ధికి సహకారంతో కూడిన మూల్యాంకన ప్రక్రియలు, విశ్వసనీయ సంస్థలు కీలక పాత్ర పోషిస్తాయని  పేర్కొన్నారు.

 

బలమైన నాణ్యత వ్యవస్థను నిర్మించడంలో సహకారం, సమన్వయం, పరస్పర విశ్వాసం ఎంతో ముఖ్యమని క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (క్యూసీఐ) సెక్రటరీ జనరల్ శ్రీ చక్రవర్తి టీ కన్నన్ అన్నారు. ‘గుణవత్తా సమన్వయ’ కార్యక్రమంతో పాటు మొబైల్ ఆహార పరీక్షా ప్రయోగశాలల కోసం ప్రారంభించిన అక్రిడిటేషన్‌ పథకం దేశ నాణ్యత మౌలిక వసతులను బలోపేతం చేయడంతో పాటు నాణ్యతా ప్రమాణాలతో కూడిన పరీక్షా సేవలను ప్రజలకు మరింత చేరువ చేయడంలో దోహదపడుతుందని తెలిపారు. 

 

‘గుణవత్తా సమన్వయ’ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించడం ద్వారా, సహకారంతో కూడిన నాణ్యత కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లడం, నియంత్రణ ప్రమాణాలను మెరుగుపరచడం, భాగస్వాముల విశ్వాసాన్ని పెంపొందించడం, దేశ నాణ్యత మౌలిక వసతులను బలోపేతం చేయడంలో క్యూసీఐ, ఎన్‌ఏబీఎల్‌ సంస్థల నిబద్ధత మరింత స్పష్టమైంది.

 

***


(రిలీజ్ ఐడి: 2297436) సందర్శకుల సూచీ సంఖ్య : : 71
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Gujarati