పర్యావరణం, అడవులు, మరియు వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

పార్లమెంటు ప్రశ్న: రిజర్వు అడవుల్లో విస్తరిస్తున్న స్థానికేతర జాతుల తొలగింపు

నాడు పోస్టు చేయడమైనది: 10 AUG 2026 6:44PM by PIB Hyderabad

ప్రమాదకర స్థాయిలో విస్తరించే స్థానికేతర మొక్కల జాతులను (ఏఐపీఎస్) పర్యావరణం, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వశాఖ (ఎంవోఈఎఫ్‌సీసీ), దాని అనుబంధ సంస్థలు ఎప్పటికప్పుడు గుర్తించి, పర్యవేక్షిస్తున్నాయి. ఈ తరహా స్థానికేతర మొక్కలను గుర్తించేందుకు భారత అటవీ సర్వే విభాగం (ఎఫ్ఎస్ఐ) 45 రకాల విదేశీ జాతులతో కూడిన ఒక ప్రత్యేక ఆల్బమ్‌ను తయారుచేసింది. ఎఫ్ఎస్ఐ ప్రకారం, రిజర్వు అటవీ ప్రాంతాల్లో ఈ మొక్కలు చాలా దట్టంగా, మోస్తరు నుంచి దట్టంగా, అలాగే అక్కడక్కడా విస్తరించి కనిపిస్తాయి. విదేశీ జాతుల కోసం జాతీయ నిర్వహణ ప్రణాళికను తయారు చేసే వీలు కల్పించేలా అటవీ, అటవీయేతర ప్రాంతాల్లో విస్తరించిన స్థానికేతర జాతులకు సంబంధించి సమగ్రమైన, రాష్ట్రాల వారీ జాబితాను జాతీయ బయోడైవర్సిటీ అథారిటీ (ఎన్‌బీఏ)కి బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా (బీఎస్ఐ) సమర్పించింది.

స్థానిక అవసరాలకు, ఆమోదించిన అటవీ, వన్యప్రాణి నిర్వహణ ప్రణాళికల నిబంధనలకు అనుగుణంగా రిజర్వు అడవులు, రక్షిత అటవీ ప్రాంతాల్లో విదేశీ జాతుల మొక్కల నిర్వహణ, తొలగింపుతో పాటు దేశీయ జాతి మొక్కల సాగును ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు/కేంద్రపాలిత ప్రాంతాల పాలనా యంత్రాంగాలు, సంబంధిత సంస్థలు చేపడతాయి.

సుస్థిర అటవీ నిర్వహణ పద్ధతుల ద్వారా దేశీయ/స్థానిక వృక్ష జాతుల పరిరక్షణ, పునరుత్పత్తి, పెంపకాన్ని ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది. స్థానిక/దేశీయ వృక్ష జాతులను ఉపయోగించి అటవీకరణ, పునరుత్పత్తి చేయడం ద్వారా పర్యావరణ స్థిరత్వాన్ని కాపాడటం, జీవావరణ సమతుల్యతను పునరుద్ధరించడం, అటవీ/వృక్ష విస్తీర్ణాన్ని పెంచాలని జాతీయ అటవీ విధానం-1988 లక్ష్యంగా నిర్దేశించింది. అదేవిధంగా, స్థానిక పర్యావరణ పరిస్థితులను పరిగణనలోకి తీసుకొని జీవావరణ వ్యవస్థ ఆధారిత అటవీ నిర్వహణను జాతీయ కార్యాచరణ ప్రణాళిక నియమాలు -2023 అందిస్తాయి. దీనిలో స్థానికేతర జాతుల నిర్వహణ, క్షీణించిన అటవీ ప్రాంతాలను పునరుద్ధరించడం, మట్టి, తేమ పరిరక్షణ చర్యలు, నీటి నిర్వహణ చేపట్టడం, పునరుత్పత్తి, పునరుద్ధరణ కార్యకలాపాల్లో నిర్దేశిత ప్రాంతానికి చెందిన దేశీయ/స్థానిక జాతులకు ప్రాధాన్యం ఇవ్వడం లాంటివి ఉన్నాయి. నేలలో తేమను, భూగర్భ నీటి స్థాయులను, నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచడానికి, మొత్తంగా జీవావరణ వ్యవస్థను బలోపేతం చేయడానికి ఈ చర్యలు దోహదపడతాయి.

లోక్‌సభలో ఈ రోజు లిఖితపూర్వకంగా అందించిన సమాధానంలో పర్యావరణం, అటవీ, వాతావరణ మార్పుల సహాయ మంత్రి శ్రీ కీర్తి వర్ధన్ సింగ్ ఈ సమాచారాన్ని వెల్లడించారు.

 

***


(రిలీజ్ ఐడి: 2297405) సందర్శకుల సూచీ సంఖ్య : : 58
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी