మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ
జాతీయ సంస్థాగత ర్యాంకింగ్ చట్రం(ఎన్‌ఐఆర్‌ఎఫ్)లో ఉన్నత విద్యాసంస్థల (హెచ్‌ఈఐ) ప్రగతి
నాడు పోస్టు చేయడమైనది:
10 AUG 2026 3:53PM by PIB Hyderabad
ఉన్నత విద్యాసంస్థల (హెచ్‌ఈఐ)లో విద్యా రంగంలో నాణ్యత మెరుగుదలను జాతీయ విద్యా విధానం-2020(ఎన్‌ఈపీ) స్పష్టం చేసింది. బహుళ కోర్సుల అభ్యాసానికి ప్రాధాన్యం, విమర్శనాత్మక దృక్పథం, విశ్లేషణాత్మక సామర్థ్య వికాసం, పరిశోధన-ఆవిష్కరణలకు ప్రోత్సాహం, మౌలిక సదుపాయాల నాణ్యత పెంపు, సమర్థ-నాణ్యమైన ఉపాధ్యాయ శిక్షణ తదితరాలు ఇందులో భాగంగా ఉన్నాయి.
ఈ నేపథ్యంలో దేశంలోని ఉన్నత విద్యాసంస్థలు, విశ్వవిద్యాలయాల మధ్య ఆరోగ్యకర పోటీ ద్వారా వార్షిక ర్యాంకింగ్‌తో (ఇండియా ర్యాంకింగ్స్) గుర్తింపు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం 2015లో జాతీయ సంస్థాగత ర్యాంకింగ్ చట్రం (ఎన్‌ఐఆర్‌ఎఫ్) రూపొందించింది. దీనికింద “బోధన-అభ్యసనం-వనరులు, పరిశోధన-వృత్తిగత విధానాలు, స్నాతకోత్సవ ఫలితాలు, విస్తరణ-సార్వజనీనత, సహ సంస్థల దృక్పథం” పేరిట ఐదు విస్తృత అంశాల ప్రాతిపదికన ర్యాంకులు ఇస్తుంది. ఈ గుర్తింపు నిమిత్తం 2021లో 6,272 దరఖాస్తులు రాగా, 2025 నాటికి వాటి సంఖ్య 14,163కు పెరగడం గమనార్హం. అలాగే, ‘ఎన్‌ఐఆర్‌ఎఫ్’ కింద పోటీపడే ప్రత్యేక సంస్థల సంఖ్య కూడా 2021-2025 మధ్యకాలంలో 4,030 నుంచి 7,692కు చేరడం విశేషం.
‘ఎన్‌ఐఆర్‌ఎఫ్’ను ప్రారంభించిన తర్వాతి నుంచి ‘క్వాక్వరెల్లి సైమండ్స్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ (క్యూఎస్ డబ్ల్యూయూఆర్) జాబితాలోకెక్కే భారత ఉన్నత విద్యాసంస్థల సంఖ్య కూడా పెరుగుతోంది. ఈ మేరకు ‘క్యూఎస్ డబ్ల్యూయూఆర్-2015’లో 11 ‘హెచ్‌ఈఐ’లకు అందులో చోటు లభించగా 2027 ర్యాంకింగ్స్ జాబితాలో వాటి సంఖ్య 52కు చేరింది.
దేశవ్యాప్తంగా విద్యానాణ్యత మెరుగు దిశగా కేంద్ర నిధులతో నడిచే సంస్థలు అనేక కార్యక్రమాలను సంస్థాగతీకరించాయి. మరోవైపు ఉన్నత విద్య ప్రగతి లక్ష్యంగా రాష్ట్రీయ ఉన్నత విద్యా కార్యక్రమం (ఆర్‌యూఎస్‌ఏ) పరిధిలో ప్రధానమంత్రి ఉన్నత విద్యా కార్యక్రమం (పీఎం యూఎస్‌హెచ్‌ఏ) కింద కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఈ మేరకు “ఎంపిక చేసిన రాష్ట్ర విశ్వవిద్యాలయాలలో నాణ్యత-నైపుణ్యం పెంపు”, “విశ్వవిద్యాలయాలకు మౌలిక సదుపాయాల గ్రాంట్లు”, “బహుళ కోర్సుల విద్యా-పరిశోధన విశ్వవిద్యాలయాలు (ఎంఈఆర్‌యు)” పేరిట మూడు విభాగాల క్రింద రాష్ట్ర ప్రభుత్వాలకు ఆర్థిక సహాయం చేస్తోంది.
దీంతోపాటు అంతర్జాతీయ స్థాయి సంస్థల పథకం (ఇనిస్టిట్యూషన్స్ ఆఫ్ ఎమినెన్స్ (ఐఓఈ) కింద విద్య, పరిపాలన, ఆర్థికాంశాల్లో ఉన్నతస్థాయి స్వయంప్రతిపత్తితో 2017లో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసింది. తద్వారా అవి సహేతుక వ్యవధిలో అంతర్జాతీయ స్థాయి విద్యా-పరిశోధన సంస్థలుగా ఎదిగే వీలు కల్పిస్తోంది.
దేశంలో 2014 నుంచి 43 కొత్త ప్రధాన ఉన్నత విద్యాసంస్థలను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. వీటిలో 7 ‘ఐఐటీ’లు, 8 కేంద్రీయ విశ్వవిద్యాలయాలు, 9 ‘ఐఐఎం’లు ఉన్నాయి. అస్సాంలోని గువహటిలో ఈ ఏడాది ఫిబ్రవరిలోనే 22వ ‘ఐఐఎం’ ప్రారంభం కాగా, ఇది ప్రస్తుతం కామరూప్ జిల్లాలోని తాత్కాలిక ప్రాంగణం నుంచి పనిచేస్తోంది. దీని పురోగమనం లక్ష్యంగా ఈ ప్రాంగణంతో ఏర్పాటు సహా శాశ్వత భవన సముదాయం నిర్మాణం, తొలి ఐదేళ్లలో కార్యకలాపాల కొనసాగింపు నిమిత్తం రూ.555 కోట్లు కేటాయించింది.
దేశంలోని 4 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతం- ఆంధ్రప్రదేశ్ (తిరుపతి), కేరళం (పాలక్కాడ్), ఛత్తీస్‌గఢ్ (భిలాయ్), కర్ణాటక (ధార్వాడ్) జమ్మూకాశ్మీర్ (జమ్మూ)లలో ఏర్పాటు చేసిన 5 కొత్త ‘ఐఐటీ’లలో (పరిశోధన కేంద్రం లేదా ‘రీసెర్చ్ పార్క్’ సహా) విద్యా-మౌలిక సదుపాయాల సామర్థ్య విస్తరణకు ఆమోదముద్ర వేసింది. తదనుగుణంగా 2025 మే నెలలో కేంద్ర ప్రభుత్వం రూ.11,828.79 కోట్లు కేటాయించింది.
దేశంలోని పాఠశాలలు-కళాశాలల్లో పారిశ్రామిక అవసరాలకు తగిన నైపుణ్య సహిత విద్యాబోధనను ప్రోత్సహించేందుకు కేంద్ర విద్యా మంత్రిత్వశాఖ చేపట్టిన కార్యక్రమాల జాబితా ఇదే:
· పాఠశాల పాఠ్యప్రణాళికల ఉన్నతీకరణ దిశగా కేంద్రీయ మాధ్యమిక విద్యా సంస్థ (సీబీఎస్‌ఈ) సహకారంతో జాతీయ విద్యా పరిశోధన-శిక్షణ మండలి(ఎన్‌సీఈఆర్‌టీ) 3 నుంచి 8వ తరగతి దాకా ఉపాధ్యాయులు-విద్యార్థుల కోసం ‘కంప్యుటేషనల్ థింకింగ్-ఏఐ’ పాఠ్యప్రణాళిక సంబంధిత వనరులను రూపొందించింది.
· సాంకేతికత సద్వినియోగంలో ఉపాధ్యాయుల సామర్థ్యం పెంపు లక్ష్యంగా ప్రత్యేక కార్యక్రమాల నిర్వహణకూ ‘ఎన్‌సీఈఆర్‌టీ’ విశిష్ట కృషి చేసింది. తద్వారా 96,000 మందికి పైగా లబ్ధిదారులకు ప్రయోజనం చేకూరింది. బోధన, అభ్యసనం, మూల్యాంకనంలో ఏఐ ఉపకరణాల వినియోగం, విద్యా నిర్వహణ-పరిపాలనలో వాటి ప్రాధాన్యంపై ఉపాధ్యాయులలో అవగాహన దిశగా ‘సీబీఎస్‌ఈ’ సామర్థ్య వికాస కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఈ మేరకు గడచిన మూడేళ్లలో 1,234 కార్యక్రమాలను నిర్వహించగా, ‘సీబీఎస్‌ఈ’ అనుబంధ పాఠశాలల్లోని 64,775 మంది ఉపాధ్యాయులు లబ్ధి పొందారు.
· ఉపాధి అవకాశాల మెరుగుదల, పరిశోధనపై ఆసక్తి పెంపు, ఆధునిక సాంకేతికతలపై అవగాహన కల్పన సహా “అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థుల కోసం ఇంటర్న్‌షిప్-రీసెర్చ్ ఇంటర్న్‌షిప్ మార్గదర్శకాల” యూజీసీ అమలులోకి తెచ్చింది.
· విశ్వవిద్యాలయ పాఠ్యప్రణాళికలో పారిశ్రామిక అవసరాలకు తగిన అర్హతలకు స్థానం కల్పిస్తూ ఉన్నత విద్యా సంస్థలలో “అప్రెంటిస్‌షిప్ ఎంబెడెడ్ డిగ్రీ ప్రోగ్రామ్ (ఏఈడీపీ)ని అమలు చేసేందుకు మార్గదర్శకాల”ను కూడా యూజీసీ రూపొందించింది.
· విద్యార్థులకు ఉపాధి అవకాశాల మెరుగు లక్ష్యంగా నేషనల్ క్రెడిట్ ఫ్రేమ్‌వర్క్ (ఎన్‌సీఆర్‌ఎఫ్)ను ప్రవేశపెట్టింది. విద్యా రంగంతో నైపుణ్య విద్యను ఏకీకృతం చేసేందుకు ఇది వీలు కల్పిస్తుంది. తద్వారా నైపుణ్యాధారిత కోర్సులతో పొందాల్సిన మొత్తం క్రెడిట్స్‌లో గరిష్ఠంగా 50 శాతం దాకా సాధించవచ్చు.
· పరిశ్రమల అవసరాలు, కృత్రిమ మేధ (ఏఐ), డేటా సైన్స్, మెషిన్ లెర్నింగ్, సైబర్ సెక్యూరిటీ, రోబోటిక్స్, క్వాంటం కంప్యూటింగ్ వంటి సాంకేతికతలు-విభాగాలు సహా ఇతర ఆధునిక విజ్ఞానాల సంబంధిత ఆదర్శ పాఠ్యప్రణాళికను విద్యాసంస్థలు, పరిశ్రమలు, వృత్తిగత సంస్థలు జాతీయ ప్రాధాన్య సంస్థలతో సంప్రదింపుల ద్వారా ‘ఏఐసీటీఈ’ ఎప్పటికప్పుడు సవరిస్తోంది.
· అలాగే, సాంకేతిక విద్యలో నైపుణ్యాభివృద్ధి ఏకీకృతం చేస్తూ దాన్ని చురుగ్గా బలోపేతం చేస్తోంది. తద్వారా సాధారణ పాఠ్యప్రణాళికకు అనుగుణంగా ఆన్‌లైన్ నైపుణ్య కోర్సులు, నైపుణ్య కేంద్రక కార్యక్రమాలు సహా తప్పనిసరి ఇంటర్న్‌షిప్, వృత్తివిద్యా డిగ్రీల ప్రదానం కోసం పరిశ్రమలు-సంస్థలతో ఏఐసీటీఈ భాగస్వామ్యం కుదుర్చుకుంటుంది.
· విద్యార్థులకు ఆచరణాత్మక పరిశ్రమానుభవం, ఉపాధి అవకాశాల మెరుగుదల కోసం ఇంటర్న్‌షిప్‌లను సాంకేతిక విద్యలో అంతర్భాగం చేసింది.
· యువత ఉపాధి అవకాశాల మెరుగుదల లక్ష్యంగా ఉద్యోగార్థి శిక్షణ ఇచ్చేందుకు పరిశ్రమల సహకారంతో జాతీయ అప్రెంటిస్‌షిప్ శిక్షణ పథకాన్ని విద్యా మంత్రిత్వశాఖ అమలు చేస్తోంది.
· పరిశ్రమలు-విద్యాసంస్థల అనుసంధాన బలోపేతంతో పాటు అభ్యాసకుల ఉపాధి అవకాశాల మెరుగుదల కోసం ప్రముఖ పారిశ్రామిక భాగస్వాములతో ‘స్వయం ప్లస్’ పేరిట ఒక వేదికను కూడా విద్యా మంత్రిత్వశాఖ ప్రారంభించింది. దీనిద్వారా 89 పరిశ్రమల సహకారంతో 15 రంగాల్లో 500కు పైగా ఉపాధి కేంద్రక కోర్సులను అందుబాటులో ఉంచింది.
కేంద్ర విద్యా శాఖ సహాయ మంత్రి డాక్టర్ సుకాంత మజుందార్ ఈ రోజు లోక్‌సభలో ఒక ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానమిస్తూ ఈ సమాచారం వెల్లడించారు.
***
(రిలీజ్ ఐడి: 2297372)
సందర్శకుల సూచీ సంఖ్య : : 38