ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ఐఐటీ ఢిల్లీ 57వ స్నాతకోత్సవ వేడుకల విశేషాలను ప్రజలతో పంచుకున్న ప్రధాని

నాడు పోస్టు చేయడమైనది: 08 AUG 2026 8:57PM by PIB Hyderabad

ఐఐటీ ఢిల్లీ 57వ స్నాతకోత్సవ వేడుకల విశేషాలను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు పంచుకున్నారు. ఈ కార్యక్రమానికి ఉన్న లోతైన భావోద్వేగాన్ని ప్రస్తావిస్తూ.. క్యాంపస్‌లో నెలకొన్న ఉత్సాహభరితమైన, కలలతో నిండిన వాతావరణాన్ని ప్రధాని గుర్తుచేసుకున్నారు. కోవిడ్ మహమ్మారి సమయంలో వర్చువల్‌గా హాజరైన విషయాన్ని ప్రస్తావిస్తూ.. గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న విద్యార్థుల మధ్య నేరుగా ఉండటం తనకు ఎంతో సంతృప్తినిచ్చిందని పేర్కొన్నారు. “ఈ రోజు ఈ క్యాంపస్‌లో మీతో కలిసి ఈ అద్భుతమైన అనుభవాన్ని పంచుకోవడం నాకు కూడా చాలా ప్రత్యేకమైంది” అని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.

'ఎక్స్' వేదికగా వరుస పోస్టుల ద్వారా ఈ కార్యక్రమ విశేషాలను పంచుకుంటూ శ్రీ నరేంద్ర మోదీ ఈ విధంగా పేర్కొన్నారు:

“ఐఐటీ ఢిల్లీ స్నాతకోత్సవ వేడుకల్లో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభిస్తున్న పట్టభద్రులైన విద్యార్థులకు నా శుభాకాంక్షలు. వారు పెద్ద కలలు కనాలని, సవాళ్లను స్వీకరించాలని, 'వికసిత భారత్' నిర్మాణంలో భాగస్వాములు కావాలని ఆశిస్తున్నాను.”

“ఐఐటీ ఢిల్లీలో ఓరియంటేషన్ నుంచి స్నాతకోత్సవం వరకు సాగిన ప్రత్యేకమైన ప్రయాణం గురించి మాట్లాడాను. హాస్టల్ జ్ఞాపకాల నుంచి స్నేహాలు, ఇష్టమైన క్యాంపస్ అడ్డాల వరకు.. ఈ అనుభవాలు జీవితాంతం నిలిచిపోతాయి.

మన యువ గ్రాడ్యుయేట్లు కొత్త అధ్యాయంలోకి అడుగుపెడుతున్న తరుణంలో ఈ ప్రయాణంలో భాగమైన ప్రతి ఒక్కరినీ.. అంటే తమ స్నేహితులు, ఉపాధ్యాయులు, మార్గదర్శకులు, సహాయ సిబ్బందిని ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలని, గౌరవించాలని నేను కోరాను. జీవితం వారిని ఎక్కడికి తీసుకెళ్లినా వారు తమ సంస్థతో ఎల్లప్పుడూ అనుబంధాన్ని కలిగి ఉండాలని కోరుకుంటున్నాను.”

“అపూర్వమైన వేగంతో మారుతున్న ఈ ప్రపంచం కోసం సిద్ధమవ్వడం చాలా ముఖ్యం. సాంకేతికత పరిశ్రమలను, వృత్తులను, మరెన్నో రంగాలను మార్చివేస్తోంది. సవాళ్లు ఎదురవుతాయి కానీ కొత్త పరిష్కారాలను కనుగొనే ధైర్యం ఉన్నవారు ఆ సవాళ్లను అవకాశాలుగా మలచుకుంటారు!”

“ ‘పరీక్షలకు సిలబస్ ఉంటుంది కానీ జీవితానికి ఉండదు’.. అనేది నేను ఐఐటీ ఢిల్లీ విద్యార్థులకు చెప్పిన విషయాలలో ఒకటి. జీవితం చాలా తరచుగా పూర్తిగా 'సిలబస్ వెలుపల’ ఉంటుంది!”

“గత తరం భారతదేశ స్వాతంత్ర్య పోరాటానికి తమను తాము అంకితం చేసుకుంది. నేటి యువత ముందు ఉన్న బాధ్యత వేరైనప్పటికీ అంతే ప్రాముఖ్యమైనది. ఆర్థిక, సాంకేతిక స్వయంసమృద్ధి నుంచి పారిశ్రామిక సామర్థ్యం వరకు.. 'వికసిత్ భారత్' నిర్మాణంలో వారి పాత్ర అత్యంత కీలకమైంది.”

“ఈనాడు ఎంతోమంది యువకులు గర్వంగా చెబుతున్నారు.. ‘నా వంశంలో రాకెట్, చిప్, డ్రోన్ తయారు చేసిన మొదటి వ్యక్తిని నేనే!’ అని.”


(రిలీజ్ ఐడి: 2296891) సందర్శకుల సూచీ సంఖ్య : : 36