నౌకారవాణా మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

భారత ఓడరేవుల వ్యవస్థను విస్తరిస్తున్న నేపథ్యంలో సాంకేతిక ఆధారిత నౌక వాణిజ్య భద్రతా విధానాన్ని ప్రతిపాదించిన కేంద్ర మంత్రి సర్బానంద సోనోవాల్


భవిష్యత్తు అవసరాలకు తగిన నౌక వాణిజ్య భద్రత దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతున్న తరుణంలో సైబర్ స్థిరత్వం, డిజిటల్ మౌలిక వసతులు, అంతర సంస్థల సమన్వయానికి పెరుగుతున్న ప్రాధాన్యం

నాడు పోస్టు చేయడమైనది: 06 AUG 2026 8:43PM by PIB Hyderabad

భారత నౌకా వాణిజ్య భద్రత నిర్మాణంలో సాంకేతిక ఆధారిత మార్పులకు కేంద్ర ఓడరేవులు, నౌక రవాణా, జలమార్గాల శాఖ మంత్రి శ్రీ సర్బానంద సోనోవాల్ పిలుపునిచ్చారు. దేశంలో ఓడరేవుల వ్యవస్థ విస్తరిస్తోందని, ప్రపంచ వ్యాణిజ్యంలో భారత్ పాత్ర కూడా పెరుగుతోందని ఆయన అన్నారు. ఈ నేపథ్యంలో కొత్తగా పుట్టుకొస్తున్న సైబర్, భౌగోళిక రాజకీయ ముప్పులను ఎదుర్కొనేందుకు బలమైన, సమగ్రమైన, సర్వసన్నద్ధమైన భద్రతా వ్యవస్థలు అవసరమని తెలిపారు.

న్యూఢిల్లీలో జరిగిన రెండో జాతీయ ఓడరేవుల భద్రతా సదస్సు–2026లో కేంద్రమంత్రి సర్బానంద సోనోవాల్ ప్రసంగించారు. కేవలం సరకు రవాణా, కార్యాచరణ సామర్థ్యాలతోనే కాకుండా, మారుతున్న భద్రతాపరమైన ప్రమాదాలను తట్టుకొనే సామర్థ్యం ఆధారంగా భారత ఓడరేవులను అంచనా వేయాలన్నారు. నౌక వాణిజ్యంలో దేశ దీర్ఘకాలిక లక్ష్యాలకు తోడ్పడేలా అధునాతన సాంకేతిక పరిజ్ఞానాలను స్వీకరించాలని, సంస్థాగత సమన్వయాన్ని బలోపేతం చేయాలని, భవిష్యత్తు అవసరాలకు తగిన భద్రతా వ్యవస్థలను నిర్మించాలని ఈ రంగంలోని భాగస్వాములకు సూచించారు.

‘‘సురక్షితమైన పోర్టులు బలమైన వాణిజ్యాన్ని సృష్టిస్తాయి. బలమైన వాణిజ్యం దృఢమైన ఆర్థిక వ్యవస్థను ఏర్పాటు చేస్తుంది. దృఢమైన ఆర్థిక వ్యవస్థ శక్తిమంతమైన దేశాన్ని నిర్మిస్తుంది’’ అని కేంద్రమంత్రి సర్బానంద సోనోవాల్ అన్నారు. సైబర్ దాడులు, డ్రోన్ చొరబాట్లు, సరఫరా వ్యవస్థలో లోపాలు, డిజిటల్ మౌలిక వసతులకు ఎదురవుతున్న ముఫ్పుల కారణంగా నౌకావాణిజ్య భద్రత కార్యాచరణ అవసరంగా మాత్రమే కాకుండా.. వ్యూహాత్మక ఆవశ్యకతగా మారిందని తెలిపారు.

నియంత్రణల పర్యవేక్షణను బలోపేతం చేయడానికి, భద్రతా పద్ధతులను ప్రామాణీకరించడానికి, నౌకావాణిజ్య సంస్థల మధ్య సమన్వయాన్ని పెంపొందించడానికి ఒక ప్రత్యేక సంస్థాగత విధానాన్ని మర్చంట్ షిప్పింగ్ చట్టం–2025 ప్రకారం ఏర్పాటు చేసిన బ్యూరో ఆఫ్ పోర్టు సెక్యూరిటీ (బీవోపీఎస్) అందిస్తుందని మంత్రి చెప్పారు. ఈ–సముద్ర, మారిటైమ్ సింగిల్ విండో, వన్ నేషన్ వన్ పోర్ట్ ప్రాసెస్ లాంటి డిజిటల్ కార్యక్రమాల గురించి ఆయన ప్రముఖంగా ప్రస్తావించారు. స్మార్టు పోర్టుల దిశగా భారత్ సాగిస్తున్న ప్రయాణంలో పటిష్టమైన సైబర్ భద్రత, ముప్పు నిర్వహణ వ్యవస్థలకు కూడా సమప్రాధాన్యం ఉండాలన్నారు.

‘‘ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దార్శనిక నాయకత్వంలో, సాగర్ లక్ష్యం అందిస్తున్న మార్గదర్శకత్వంతో సురక్షితమైన, బలమైన, భవిష్యత్తు అవసరాలకు తగిన నౌకావాణిజ్య వ్యవస్థను నిర్మించేందుకు మేం కట్టుబడి ఉన్నాం. ఇది వికసిత్ భారత్–2047 దిశగా భారత్ ప్రయాణాన్ని ముందుకు నడిపిస్తుంది’’ అని కేంద్ర మంత్రి సర్బానంద సోనోవాల్ అన్నారు.

ఈ సదస్సులో 140 మంది పాల్గొన్నారు. వీరిలో ఓడరేవులు, నౌకారవాణా, జల మార్గాల మంత్రిత్వ శాఖకు, హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖకు, భారతీయ నౌకాదళానికి, భారతీయ తీరరక్షక దళానికి చెందిన ఉన్నతాధికారులు ఉన్నారు. అలాగే రాష్ట్రాల నౌకావాణిజ్య బోర్డులు, ప్రధాన పోర్టు అథారిటీలు, చిన్న ఓడరేవులు, పారిశ్రామిక ప్రతినిధులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. భారతదేశ నౌకావాణిజ్య రంగంలో ఎదురవుతున్న భద్రతా సవాళ్లపై ఈ సమావేశంలో చర్చించారు.

‘‘సెక్యూరిటీ బై డిజైన్’’ విధానాన్ని అనుసరించాలని ఓడరేవులు, నౌకారవాణా, జలమార్గాల మంత్రిత్శ శాఖ కార్యదర్శి విజయ్ కుమార్ సూచించారు. నౌకాశ్రయాన్ని అభివృద్ధి చేసే ప్రతి దశలోనూ భద్రతను భాగం చేయాలని పిలుపునిచ్చారు. కొత్తగా పుట్టుకొస్తున్న సైబర్, డ్రోన్, అంతర్జాతీయ నౌక వాణిజ్య ముప్పులను ఎదుర్కొనేందుకు సాంకేతిక పరిజ్ఞాన విస్తృత వినియోగం, అంతర సంస్థల సమన్వయం అవసరమని హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ కార్యదర్శి (సరిహద్దు నిర్వహణ) డాక్టర్ రాజేంద్ర కుమార్ అన్నారు.

ఈ సదస్సులో అంతర్జాతీయ నౌక, నౌకాశ్రయ భద్రత (ఐఎస్‌పీఎస్) కోడ్, సైబర్ భద్రత, అంతర్జాతీయ నౌకారవాణాను ప్రభావితం చేస్తున్న భౌగోళిక ముప్పులు, నౌకా వాణిజ్య భద్రతలో నూతనంగా ఆవిష్కృతమైన ఉత్తమ పద్ధతులపై సాంకేతిక సమావేశాలు జరిగాయి. అలాగే భారత దేశ ఓడరేవుల భద్రతా విధానాన్ని బలోపేతం చేసే సూచనలను ఈ సదస్సులో పాల్గొన్న ప్రతినిధులు అందించారు.

 

***


(రిలీజ్ ఐడి: 2295992) సందర్శకుల సూచీ సంఖ్య : : 41
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Assamese