ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌ ఫ‌ర్మేశన్‌ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

భారతదేశ ఏఐ నైపుణ్య వ్యవస్థను బలోపేతం చేయడానికి చిత్కారా విశ్వవిద్యాలయంలో

‘ఏఐకోష్ విశ్వవిద్యాలయ కార్యక్రమాన్ని’ నిర్వహించిన ఇండియాఏఐ మిషన్‌

చిత్కారా యూనివర్సిటీలో నిర్వహించిన ‘ఏఐకోష్ విశ్వవిద్యాలయ భాగస్వామ్య కార్యక్రమం' ద్వారా విద్యా రంగాన్ని మరింత క్రియాశీల భాగస్వామిగా మార్చిన ‘ఇండియాఏఐ మిషన్’

నాడు పోస్టు చేయడమైనది: 06 AUG 2026 7:00PM by PIB Hyderabad

కేంద్ర ప్రభుత్వంలోని ఎలక్ట్రానిక్స్- ఐటీ మంత్రిత్వ శాఖ (మైటీ) ఆధ్వర్యంలోని 'ఇండియాఏఐ మిషన్' 2026 ఆగస్టు 6న రాజ్‌పురాలోని చిత్కారా యూనివర్సిటీలో 'ఏఐకోష్ విశ్వవిద్యాలయ భాగస్వామ్య కార్యక్రమాన్ని (యూఈపీ)' నిర్వహించింది. ఏఐపై అవగాహనను పెంపొందించడం, ఏఐ వనరులను అందరికీ అందుబాటులోకి తేవడం, వేగంగా విస్తరిస్తున్న భారతదేశపు కృత్రిమ మేధ రంగంలో భాగస్వాములు కావడానికి విద్యార్థులకు అవసరమైన పరిజ్ఞానం, పరికరాలను అందించాలనే ప్రధాన లక్ష్యంగా ఈ కార్యక్రమం రూపుదిద్దుకుంది.

2024 మార్చిలో కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన 'ఇండియాఏఐ మిషన్'.. నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించడం, బాధ్యతాయుతమైన ఏఐ అభివృద్ధికి బాటలు వేయడం, స్వదేశీ ఏఐ సామర్థ్యాలను బలోపేతం చేయడం, ఏఐ ఫలాలను సమాజంలోని ప్రతి వర్గానికి అందించడం ద్వారా కృత్రిమ మేధ రంగంలో భారత్‌ను ప్రపంచ నాయకత్వ స్థానంలో నిలబెట్టే దిశగా దేశాన్ని ముందుకు నడిపిస్తోంది.

ఇండియాఏఐ మిషన్‌లో ఒక ముఖ్యమైన ఆధారంగా నిలిచే 'ఏఐకోష్'.. నాణ్యమైన డేటాసెట్లు, ఏఐ మోడళ్లు, టూల్‌కిట్లు, ప్రమాణాలు, ఇతర కీలక వనరులను ఒకే చోట అందిస్తూ భారతదేశపు ఏకీకృత డేటా వేదికగా పనిచేస్తోంది. ఇది పరిశోధనలు, ఏఐ అప్లికేషన్ల అభివృద్ధికి ఎంతో తోడ్పడుతుంది. ఏఐకోష్ విశ్వవిద్యాలయ భాగస్వామ్య కార్యక్రమం ద్వారా విద్యార్థులు, విద్యాసంస్థలను ఈ జాతీయ ఏఐ వనరులకు పరిచయం చేయడంతో పాటు ప్రత్యక్ష శిక్షణ, ఆవిష్కరణలను ప్రోత్సహించాలనే లక్ష్యంతో ఇండియాఏఐ మిషన్ పనిచేస్తోంది. 

కార్యక్రమంలో భాగంగా చిత్కారా యూనివర్సిటీకి చెందిన 250 మందికి పైగా విద్యార్థులు.. నిపుణుల సమావేశాలు, లైవ్ ప్రదర్శనలు, ప్రత్యక్ష కార్యకలాపాల్లో పాల్గొన్నారు. వీటిని 'ఏఐకోష్'తో పాటు విస్తృతమైన భారత ఏఐ వ్యవస్థపై వారికి అవగాహన పెంచేందుకు రూపొందించారు. సహజమైన భాషను ఉపయోగించి డేటాసెట్‌లు, ఏఐ మోడళ్లను తెలుసుకునేందుకు వినియోగదారులకు తోడ్పడే 'ఏఐకోష్ ఎంసీపీ' (మోడల్ కాంటెక్స్ట్ ప్రోటోకాల్), 'ఏఐకోష్ ఎస్‌డీకే'ల (సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ కిట్) గురించి కూడా కార్యక్రమంలో పాల్గొన్నవారు తెలుసుకున్నారు. ఇవి జాతీయ ఏఐ వనరుల లభ్యతను సులభతరం చేయడంతో పాటు డెవలపర్లు, డెవలపర్లు కానివారికి ఉన్న అడ్డంకులను తొలగిస్తాయి.

ఈ కార్యక్రమంలో ఇండియాఏఐ మిషన్ డైరెక్టర్ శ్రీ మొహమ్మద్ వై. సఫీరుల్లా కే మాట్లాడుతూ ఈ విధంగా వ్యాఖ్యానించారు:

"కృత్రిమ మేధను (ఏఐ) అందరికీ అందుబాటులోకి తీసుకురావాలనే ప్రధానమంత్రి గారి ఆలోచనకు అనుగుణంగా దాని ప్రయోజనాలు దేశంలోని ప్రతి ఒక్కరికీ చేరేలా చూడటానికి మేం కట్టుబడి ఉన్నాం. ఈ నిబద్ధత.. ప్రజలు, గ్రహం, ప్రగతి అనే మూడు ప్రాథమిక అంశాలపై ఆధారపడి ఉంది. ఈ తత్వాన్ని 2026 ఫిబ్రవరిలో జరిగిన 'ఇండియాఏఐ ఇంపాక్ట్ సదస్సు'లో ప్రముఖంగా ప్రదర్శించాం. మా విశ్వవిద్యాలయ భాగస్వామ్య కార్యక్రమంలో భాగంగా ఈ సంవత్సరం దేశవ్యాప్తంగా ఉన్న విద్యా సంస్థల్లో భారత్‌లో వేగంగా పెరుగుతున్న ఏఐ వ్యవస్థలోని విభిన్న అంశాలను ప్రదర్శించడానికి కృషి చేస్తాం."

ఈ భాగస్వామ్యాన్ని స్వాగతించిన చిత్కారా విశ్వవిద్యాలయం అధ్యక్షుడు, సహ వ్యవస్థాపకులు డాక్టర్ మధు చిత్కారా ఈ విధంగా పేర్కొన్నారు:

"కృత్రిమ మేధ మనం నేర్చుకునే, నూతన ఆవిష్కరణలు చేసే, సంక్లిష్టమైన సవాళ్లను పరిష్కరించే విధానాన్ని పూర్తిగా మారుస్తోంది. భవిష్యత్తును రూపుదిద్దే సాంకేతికతలకు మా విద్యార్థులను సమర్థులుగా తీర్చిదిద్దాలని చిత్కారా విశ్వవిద్యాలయంలో మేం ఎల్లప్పుడూ నమ్ముతాం. 'ఏఐకోష్ విశ్వవిద్యాలయ భాగస్వామ్య కార్యక్రమం' ద్వారా ఇండియాఏఐ మిషన్‌తో మేం చేసుకున్న ఈ భాగస్వామ్యం ఏఐ విషయంలో విజ్ఞానం, నైపుణ్యాలు, బాధ్యతాయుతమైన అవగాహన కలిగిన భవిష్యత్ నిపుణులను తీర్చిదిద్దాలనే మా నిబద్ధతను ప్రతిబింబిస్తుంది. ఈ కార్యక్రమం మా విద్యార్థులకు అత్యాధునిక ఏఐ వనరులను వినియోగించుకునేలా సాధికారత కల్పిస్తుంది.. ప్రపంచ ఏఐ నాయకుడిగా ఎదగాలనే భారతదేశ ఆశయానికి గణనీయంగా సహకరించేలా చేస్తుంది."

తదుపరి దశ ‘ఏఐకోష్ విశ్వవిద్యాలయ భాగస్వామ్య కార్యక్రమం'లో భాగంగా ఏఐకోష్ ఓపెన్ సోర్స్ కమ్యూనిటీ, విశ్వవిద్యాలయం అధికారిక ప్రొఫైల్ ద్వారా డేటాసెట్‌లను అందించేలా విద్యార్థులను ప్రోత్సహిస్తారు. ప్రస్తుతం ఉన్న డేటాసెట్‌లను మరింత మెరుగుపరచడం.. ప్రజారోగ్యం, ప్రజా సంక్షేమం వంటి రంగాల్లో వాస్తవిక పరిష్కారాల కోసం నిరూపితమైన ఏఐ అప్లికేషన్లను అభివృద్ధి చేసేలా కూడా వారిని నిపుణులు ప్రోత్సహిస్తారు. అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన విద్యార్థులను భవిష్యత్తులో ప్రత్యేకంగా గుర్తించే అంశాన్ని కూడా పరిగణనలోకి తీసుకుంటారు. ఇది ఏఐ అవగాహన, డేటాసెట్ పరిశోధన నుంచి ఆవిష్కరణలు, వాస్తవ సవాళ్ల పరిష్కారం దిశగా ఒక మార్గాన్ని సుగమం చేస్తుంది.

దేశవ్యాప్తంగా ఉన్న ఉన్నత విద్యాసంస్థల్లో ఏఐ వినియోగాన్ని మరింత విస్తరించడానికి రూపకల్పన చేసిన ఒక జాతీయ స్థాయి కార్యక్రమమే 'ఏఐకోష్ విశ్వవిద్యాలయ భాగస్వామ్య కార్యక్రమం'. ఇది విద్యార్థులు, పరిశోధకులు, అధ్యాపకులకు భారతదేశ జాతీయ ఏఐ మౌలిక సదుపాయాలను అందిస్తుంది. ప్రస్తుతం ఏఐకోష్ పోర్టల్‌లో 14,000 కంటే ఎక్కువ డేటాసెట్‌లు, 300కి పైగా ఏఐ మోడళ్లు, 30కి పైగా టూల్‌కిట్‌లు అందుబాటులో ఉన్నాయి. ఇవి పరిశోధకులు, అంకురాలు, డెవలపర్‌లు, విద్యార్థులు నమ్మకమైన జాతీయ వనరులను ఉపయోగించి ఏఐ పరిష్కారాలను రూపొందించడానికి దోహదపడతాయి.

చిత్కారా విశ్వవిద్యాలయంలో ప్రారంభమైన ఈ కార్యక్రమం ఏఐ సాంకేతికతకు సిద్ధంగా ఉండే ప్రతిభావంతులైన సమూహాన్ని తయారుచేయడంలోనూ.. దేశం కోసం సమ్మిళిత, బాధ్యతాయుతమైన, ఆవిష్కరణలతో కూడిన ఏఐ వ్యవస్థను సృష్టించాలనే ఇండియాఏఐ మిషన్ ఆశయాన్ని ముందుకు తీసుకెళ్లడంలోనూ మరొక కీలక అడుగు. ఏఐకోష్ విశ్వవిద్యాలయ భాగస్వామ్య కార్యక్రమం ద్వారా ఈ మిషన్ దేశవ్యాప్తంగా ఉన్న విద్యా సంస్థలను భాగస్వాములను చేయడాన్ని కొనసాగిస్తుంది. డేటాసెట్‌లు, మోడళ్లు, అప్లికేషన్‌లు, పరిశోధన, బాధ్యతాయుతమైన ఏఐ వినియోగానికి తోడ్పడే క్యాంపస్ స్థాయి ఏఐ కమ్యూనిటీలను పెంపొందిస్తుంది.

 

***


(రిలీజ్ ఐడి: 2295943) సందర్శకుల సూచీ సంఖ్య : : 57
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Punjabi