పౌర విమానయాన మంత్రిత్వ శాఖ
భారత్-నార్వే విమానయాన సంస్థలు పవన్ హన్స్-‘నోయెమి ఏరోస్పేస్’ మధ్య అవగాహన ఒప్పందం
పౌర విమానయాన శాఖ మంత్రి శ్రీ రామ్మోహన్ నాయుడు సమక్షంలో సంతకాలు
ఎలక్ట్రిక్ సీప్లేన్ సాంకేతకతలు సహా సుస్థిర విమానయానంలో సహకార విస్తరణ ఈ ఒప్పందం లక్ష్యాలు
प्रविष्टि तिथि:
05 AUG 2026 9:24PM by PIB Hyderabad
భారత్-నార్వే విమానయాన సంస్థలు పవన్ హన్స్(పీహెచ్‌ఎల్)-‘నోయెమి ఏరోస్పేస్’ (ఎల్‌ఫ్లై ఏఎస్) మధ్య పౌర విమానయాన శాఖ మంత్రి శ్రీ కింజరాపు రామ్మోహన్ నాయుడు సమక్షంలో అవగాహన ఒప్పందంపై ఇవాళ సంతకాలు పూర్తయ్యాయి. ఎలక్ట్రిక్ సీప్లేన్ సాంకేతికతలు సహా భావితరం సుస్థిర విమానయాన సహకారం విస్తరణ ఈ నిర్నిబంధ ఒప్పందం లక్ష్యాలు. ‘పీహెచ్‌ఎల్’ లిమిటెడ్ చైర్మన్-మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ సునీల్ కుమార్ నాగ్డావ్నే, ‘ఎల్‌ఫ్లై ఏఎస్’ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీ ఎరిక్ ఫ్రాంకోయిస్ లిథున్ దీనిపై సంతకాలు చేశారు. ఈ కార్యక్రమంలో విమానయాన మంత్రిత్వశాఖ కార్యదర్శి శ్రీ సమీర్ కుమార్ సిన్హా కూడా పాల్గొన్నారు.
ఎలక్ట్రిక్ సీప్లేన్ సాంకేతికతలు, నైపుణ్యాభివృద్ధి, సామర్థ్య వికాసం, సాంకేతిక పరిజ్ఞాన భాగస్వామ్యం, వర్క్‌షాప్‌లు, సాధ్యాసాధ్యాల అధ్యయనాలు తదితరాల్లో సంభావ్య సహకార విస్తృతికి నిర్దిష్ట చట్రం ఏర్పాటు ధ్యేయంగా ఈ ఒప్పందం కుదిరింది.
ప్రాంతీయ అనుసంధానం, కాలుష్య రహిత విమానయానం, ఆవిష్కరణాధారిత వృద్ధి, ద్వీపాల అనుసంధానం, ఆధునిక విమానయాన సాంకేతికతలకు ప్రోత్సాహంపై కేంద్ర ప్రభుత్వ దృక్కోణానికి అనుగుణంగా ఈ కార్యక్రమం అమలు చేస్తారు.
ఈ సందర్భంగా శ్రీ రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ- “పౌర విమానయాన రంగంలో స్వదేశీ సామర్థ్య బలోపేతాన్ని ప్రోత్సహించడం, ఆధునిక సాంకేతికతల అన్వేషణపై మా విస్తృత దార్శనికతను ఈ ఒప్పందం ప్రతిబింబిస్తుంది” అన్నారు.
అలాగే, “దేశంలో సీప్లేన్‌ల నిర్వహణకు మాత్రమే మా దృక్కోణం పరిమితం కాదు. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నిర్దేశిత ‘మేక్ ఇన్ ఇండియా’ దార్శనికత మేరకు వాటిని భారత్‌లోనే నిర్మించాలన్నది మా అభిమతం. దీంతోపాటు సీప్లేన్ కార్యకలాపాలను ప్రోత్సహించడంలో ప్రభుత్వ దృఢ సంకల్పాన్ని కేంద్ర బడ్జెట్-2026 ముందుకు తెచ్చింది. సీప్లేన్‌ల తయారీ దేశీయీకరణకు ప్రోత్సాహకాలివ్వడాన్ని ఈ బడ్జెట్ ప్రతిపాదించింది. అలాగే, సీప్లేన్ కార్యకలాపాలకు మద్దతు దిశగా ‘వీజీఎఫ్’ పథకాన్ని కూడా అమలు చేస్తుంది. భారతీయ తయారీ సామర్థ్యాన్ని ప్రపంచ సాంకేతిక భాగస్వామ్యాలతో జోడిస్తే, సీప్లేన్‌లకుగల స్థానిక-ప్రాంతీయ డిమాండ్‌ను మనం తీర్చగలం” అని శ్రీ రామ్మోహన్ నాయుడు అన్నారు.
ఈ అంశాన్ని మరింత విశదీకరిస్తూ- “దేశంలో సీప్లేన్‌లను ప్రోత్సహించడంపై రెండేళ్లుగా భారత ప్రభుత్వం అనేక పటిష్ట చర్యలు తీసుకుంది. ఇందులో భాగంగా ప్రత్యేక సీప్లేన్ ఆపరేషన్స్ మార్గదర్శకాలను మేం రూపొందించాం. నియంత్రణ చట్రాన్ని సరళీకరించడమే కాకుండా భాగస్వాములను ప్రోత్సహించడానికి దేశవ్యాప్తంగా ఒక ప్రదర్శనాత్మక విమానయాన కార్యక్రమాన్ని కూడా నిర్వహించాం” అని వెల్లడించారు.
నార్వేలోని బెర్గెన్‌లో ప్రధాన కార్యాలయంగల నోయెమి ఏరోస్పేస్ సంస్థ ప్రస్తుతం భవిష్యత్తరం ఎలక్ట్రిక్ సీప్లేన్ సాంకేతికతల రూపకల్పన కోసం కృషి చేస్తోంది. ఈ కార్యక్రమానికి నార్వే ప్రభుత్వం ఆర్థిక సహాయం అందిస్తోంది.
ఈ నేపథ్యంలో రెండు దేశాల సంస్థల మధ్య అవగాహన ఒప్పందం అన్వేషణాత్మకతకు పరిమితం కాదు. ఎలాంటి ఆర్థిక, కొనుగోలు, పెట్టుబడి, ఇతరత్రా ప్రత్యేక ఒడంబడికలతో నిమిత్తం లేని నిర్నిబంధ ఒప్పందమిది. కేంద్ర ప్రభుత్వ విధానాల ప్రకారం ఈ చర్చల సందర్భంగా తీసుకున్న నిర్ణయాలపై భవిష్యత్ సహకారం, చట్టాలు, ప్రత్యేక నిర్ణయాత్మక ఒప్పందాలు వంటివన్నీ సముచిత అధికార సంస్థల ఆమోదాలకు లోబడి ఉంటాయి.
ఆవిష్కరణలు, కార్యాచరణ నైపుణ్యం, వ్యూహాత్మక అంతర్జాతీయ భాగస్వామ్యాల ద్వారా భారత్‌లో పురోగమిస్తున్న విమానయాన వ్యవస్థకు మద్దతివ్వడంలో పౌర విమానయాన మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో పీహెచ్‌ఎల్ లిమిటెడ్ నిబద్ధతను ఈ ఒప్పందం ప్రతిబింబిస్తుంది.
***
(रिलीज़ आईडी: 2295296)
आगंतुक पटल : 20