రహదారి రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

సిల్క్యారా సొరంగం రక్షణ చర్యలలో అసాధారణ ధైర్యసాహసాలు ప్రదర్శించిన 12 మంది ‘ర్యాట్-హోల్’ గని కార్మికులకు ‘సర్వోత్తమ జీవన్ రక్షా పతకం’


పతక ప్రదానం ద్వారా వారిని సత్కరించిన కేంద్ర మంత్రి శ్రీ నితిన్‌ గడ్కరీ

प्रविष्टि तिथि: 05 AUG 2026 8:25PM by PIB Hyderabad

   సిల్క్యారా సొరంగం ప్రమాదం సందర్భంగా రక్షణ సహాయ చర్యలలో అసాధారణ ధైర్యసాహసాలతో నిస్వార్థ సేవాభావం కనబరిచిన 12 మంది ‘రాట్-హోల్‌’ గని కార్మికులను ప్రభుత్వం సత్కరించింది. ఈ మేరకు కేంద్ర రోడ్డు రవాణా-జాతీయ రహదారుల శాఖ మంత్రి శ్రీ నితిన్ గడ్కరీ ఈ రోజు న్యూఢిల్లీలో నిర్వహించిన కార్యక్రమంలో ‘సర్వోత్తమ జీవన్ రక్షా పతకం’ ప్రదానం చేశారు. ఆ శాఖ సహాయ మంత్రి శ్రీ హర్ష్ మల్హోత్రా, కార్యదర్శి-ఎన్‌హెచ్‌ఐడీసీఎల్ మేనేజింగ్ డైరెక్టర్ తదితర ఉన్నతాధికారులు కూడా ఇందులో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా శ్రీ గడ్కరీ మాట్లాడుతూ- సొరంగం కూలిపోయిన నేపథ్యంలో రక్షణ సహాయ కార్యక్రమాలు చేపట్టడం ఇటీవల ఎన్నడూ లేనంత సవాలుగా పరిణమించిందని ఆయన పేర్కొన్నారు. ఈ ప్రమాదం దేశవ్యాప్తంగా తీవ్ర ఆందోళన కలిగించిందని, ఈ రక్షణ చర్యలఫై  అత్యున్నత స్థాయిలో నిరంతరం దృష్టి నిలిపామని తెలిపారు. ప్రధానమంత్రి స్వయంగా అన్ని పరిస్థితులనూ నిశితంగా పర్యవేక్షిస్తూ, కార్మికులందరూ సురక్షితంగా బయట పడటంలో అన్ని వనరులనూ సమీకరించేలా చూశారని వెల్లడించారు.

సమర్థ రక్షణ-సహాయ వ్యూహం రూపకల్పనలో తమ శాఖతోపాటు ఎన్‌హెచ్‌ఐడీసీఎల్‌, సరిహద్దు రహదారుల సంస్థ (బీఆర్‌ఓ), సైనిక సిబ్బంది, ఉత్తరాఖండ్ ప్రభుత్వం, దేశవ్యాప్తంగాగల సాంకేతిక నిపుణులు సహా అనేక ఏజెన్సీల నిపుణులు సన్నిహిత సమన్వయంతో కృషి చేశారని మంత్రి కొనియాడారు. ఈ ఆపరేషన్ సందర్భంగా వర్టికల్ డ్రిల్లింగ్, ఇతర సాంకేతిక చర్యలు వివిధ ఇంజనీరింగ్ పరిష్కారాన్వేషణపై దృష్టి సారించారు.

కూలిన సొరంగ భాగంలోకి పైప్‌లైన్‌ను విజయవంతంగా చొప్పించడంలో కీలక పురోగమనం సాధించినట్లు చెప్పారు. దీనివల్ల సొరంగంలో చిక్కుకున్న కార్మికులకు ఆహారం, నీరు, మందులు, ఇతర నిత్యావసరాల సరఫరా సాధ్యమైందని శ్రీ గడ్కరీ వివరించారు. ఇరుకైన, ప్రమాదకరమైన ప్రదేశంలోకి స్వచ్ఛందంగా ప్రవేశించి, మిగిలిన శిథిలాలను చేతులతో తొలగించి, కార్మికులందర్నీ సురక్షితంగా వెలికి తేవడంలో సాయపడిన ‘రాట్ మైనర్స్’ అసాధారణ కృషితో సహాయక చర్యలలో అత్యంత కీలక దశ విజయవంతంగా పూర్తయిందని ఆయన పేర్కొన్నారు.

అవార్డు గ్రహీతల ధైర్యసాహసాలను ప్రశంసిస్తూ- ఇలాంటి అసాధారణ స్వభావం, త్యాగాలు భవిష్యత్తరాలకు సదా ఉదాహరణలుగా నిలుస్తాయని శ్రీ గడ్కరీ అన్నారు. ఇతరుల రక్షణలో తమ ప్రాణాలను పణంగా పెట్టడం ధైర్యం, ప్రజాసేవ, మానవత్వం వంటి అత్యున్నత ఆదర్శాలను ప్రతిబింబిస్తుందని చెప్పారు. వారి అమూల్య సేవను దేశం ఎన్నటికీ మరువదని ఆయన పేర్కొన్నారు.

వారందర్నీ అభినందిస్తూ- మానవ ప్రాణరక్షణలో వారి అసాధారణ ధైర్యానికి, అకుంఠిత నిబద్ధతకు సర్వోత్తమ జీవన్ రక్షా పతకం ఒక సంపూర్ణ గుర్తింపని మంత్రి అన్నారు. వారి ఆదర్శప్రాయ సేవ, కష్ట సమయాల్లో నిస్వార్థ సేవా స్ఫూర్తిని చాటుకోవడం ఇతరులకు స్ఫూర్తినిస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.

ఈ రక్షణ చర్యలలో పాలుపంచుకున్న భాగస్వాములందరి సమష్టి కృషిని కూడా శ్రీ గడ్కరీ ప్రశంసించారు. ఈ కార్యక్రమం సందర్భంగా అవార్డు గ్రహీతలందరికీ గౌరవ పతకం, ధ్రువీకరణ పత్రాన్ని అందజేశారు. ప్రధాన పతకంతోపాటు ఒక చిన్నపాటి ప్రతిరూప పతకం కూడా బహూకరించారు. అలాగే అవార్డు గ్రహీతలకు తలా ₹2,00,000 వంతున నగదు బహుమతి కూడా అందజేశారు. ఈ మొత్తాన్ని ఆన్‌లైన్ విధానం ద్వారా వారికి బదిలీ చేశారు.

సర్వోత్తమ జీవన రక్షా పతక గ్రహీతలు వీరే:

శ్రీ వకీల్ హసన్

శ్రీ మున్నా

శ్రీ అంకుర్ కుమార్

శ్రీ మోను కుమార్

శ్రీ దేవేంద్ర

శ్రీ మొహద్ రషీద్

శ్రీ ఫిరోజ్ ఖురేషీ

శ్రీ జతిన్ కశ్యప్

శ్రీ షోరభ్ కశ్యప్

శ్రీ మొహద్ ఇర్షాద్

శ్రీ నస్రుద్దీన్

శ్రీ నసీమ్

***


(रिलीज़ आईडी: 2295294) आगंतुक पटल : 6
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Gujarati