బొగ్గు మంత్రిత్వ శాఖ
బొగ్గు ఉత్పత్తిలో, నిర్వహణ సంబంధిత ప్రావీణ్యంలో కొత్త ప్రమాణాలు నెలకొల్పుతున్న సోన్‌పూర్ బాజారీ ఓసీపీ
प्रविष्टि तिथि:
03 AUG 2026 4:05PM by PIB Hyderabad
పశ్చిమ బెంగాల్‌లోని పశ్చిమ బర్ధమాన్ జిల్లాలో నెలకొన్న రాణీగంజ్ బొగ్గు గనికి తూర్పు దిక్కున సోన్‌పూర్ బాజారీ ఓపెన్‌కాస్ట్ గని (ఓసీపీ) ఉంది. ఇది ఈస్ట్రన్ కోల్‌ఫీల్డ్‌స్ (ఈసీఎల్)కు చెందిన ప్రధాన గనుల్లో ఒకటి. అంతేకాదు, ఇది కోల్ ఇండియా (సీఐఎల్)కు అన్నింటి కన్న ఎక్కువ బొగ్గును అందిస్తున్న ఉపరితల గనుల (ఓపెన్‌కాస్ట్ మైన్స్)లో ఒకటి. కొన్ని దశాబ్దాలుగా, ఈ గని ఎన్‌టీపీసీ, డబ్ల్యూబీపీడీసీఎల్, డీవీసీ, సీఈఎస్‌సీ వంటి ప్రధాన విద్యుత్తు ప్లాంటులకు నాణ్యమైన థర్మల్ కోల్‌ను సరఫరా చేస్తూ, భారత ఇంధన భద్రతను సమకూర్చడంలో ఓ కీలక పాత్రను పోషిస్తోంది. పటిష్ఠమైన మౌలిక సదుపాయాలు, శాస్త్రీయ పద్ధతిలో బొగ్గు గనుల తవ్వకానికి సంబంధించిన పథక రచన, కార్యకలాపాల నిర్వహణలో నైపుణ్యంతో సోనేపూర్ బాజారీ.. దేశంలో అంతకంతకు పెరుగుతున్న ఇంధన అవసరాలను తీర్చడంలో ప్రముఖ భూమికను నిర్వహిస్తోంది.
2026-27 ఆర్థిక సంవత్సరంలో అసాధారణ పనితీరు
సోన్‌పూర్ బాజారీ ఓసీ 2026-27 ఆర్థిక సంవత్సరాన్ని నిర్వహణ పరంగా చెప్పుకోదగిన ఫలితాలతో మొదలుపెట్టింది. దీనిలో భాగంగా పక్కా ప్రణాళికలను రూపొందించడంతో పాటు వాటిని క్షేత్రస్థాయిలో చక్కగా అమలు చేస్తున్నారు. 120 లక్షల టన్నుల బొగ్గును ఉత్పత్తి చేయాలన్న వార్షిక కార్యాచరణ ప్రణాళిక (ఏఏపీ)ను నిర్దేశించుకొని, ఆ లక్ష్య సాధన దిశగా ఎప్పటికప్పుడు ముందుకు సాగుతున్నారు.
27.74 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యాన్ని నిర్ధారించుకుని, ఇంతవరకు 29.22 లక్షల టన్నుల ఉత్పత్తిని సాధించారు.
ఇది అనుకున్న లక్ష్యంతో పోలిస్తే 105.34 శాతం ఎక్కువ. వనరులను సమర్థంగా ఉపయోగించుకోవడం, క్రమశిక్షణతో కూడిన గనుల సంబంధిత ప్రణాళికా రచన, క్షేత్ర స్థాయిలో బలమైన కార్యాచరణకు ఈ మెరుగైన ప్రదర్శన ఒక నిదర్శనంగా నిలుస్తోంది.
భూమి పై పొర మీద ఉండే మట్టిని, రాళ్లని భారీ యంత్రాలతో, పేలుడు పదార్థాల సహాయంతో తొలగించి, కింద ఉన్న బొగ్గును సేకరించడం (ఓవర్‌బర్డెన్ రిమూవల్.. ఓబీఆర్) లోనూ ఈ గని చెప్పుకోదగ్గ పనితీరును కనబరుస్తోంది. ఇది బొగ్గు ఉత్పత్తి స్థాయులు నిలకడగా పురోగమిస్తుండటానికి వెన్నుదన్నుగా నిలిచింది. 2067.20 లక్షల ఘనపు మీటర్ల ఓబీఆర్ లక్ష్యాన్ని పెట్టుకోగా, ఈ ఓసీపీ 253.40 లక్షల ఘనపు మీటర్ల స్థాయికి చేరి 122.89 శాతం ప్రదర్శనను నమోదు చేసింది. ఓవర్‌బర్డెన్‌ను శీఘ్రంగా తొలగిస్తుండటంతో, బొగ్గు లభ్యత గణనీయంగా పెరిగింది. ఫలితంగా ఆర్థిక సంవత్సరంలో మిగిలి ఉన్న కాలానికి ఉత్పత్తి పరంగా గట్టి పునాదిని వేసినట్లయింది.
వెలికితీసిన బొగ్గును తరలించడంలోనూ ఈ గని విశిష్ట పనితీరును కనబరిచింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో బొగ్గు సరఫరాలు 39.94 లక్షల టన్నులకు చేరాయి. ఇది ఇంతకు ముందు సంవత్సరంలోని ఇదే కాలం సరఫరాల కన్నా 16 శాతం ఎక్కువ. ఇది ఆధునిక వస్తు రవాణా వ్యవస్థను సమర్థంగా నిర్వహించడం, తరలింపు వ్యవస్థల పర్యవేక్షణను మెరుగుపరచడం, ఉత్పత్తికీ, తరలింపు కార్యకలాపాలకీ మధ్య ఎలాంటి అంతరాయాలకీ తావు ఇవ్వని విధంగా సమన్వయాన్ని నెలకొల్పడాన్ని సూచిస్తోంది.
వార్షిక లక్ష్యాన్ని సాధించడానికి ప్రధానంగా దోహదపడుతున్న అంశాలు
ఈ గని చక్కనైన నిర్వహణ సామర్థ్యాన్ని చాటడానికి అనేక అనుకూల అంశాలు అండదండలను అందిస్తున్నాయి. అవి ఈ గని ఉత్పాదక సామర్థ్యాన్ని గణనీయంగా బలోపేతం చేశాయి.
ఓపెన్ కాస్ట్ మైనింగుకు అన్నింటి కన్న ముఖ్య అంశం భూమి లభ్యత. ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకుంటూ, సోన్‌పూర్ బాజారీ పునరావాసం, పునరాశ్రయ కల్పనలో చెప్పుకోదగిన ప్రగతిని సాధించింది. బొగ్గు నిక్షేపాలు ఉన్న ప్రాంతాల గ్రామస్తులకు వేరే చోట్ల ఆశ్రయాన్ని విజయవంతంగా చూపించ గలిగారు. దీంతో గని తవ్వకాల కోసం ఒక పెద్ద ప్రాంతం అందుబాటులోకి వచ్చింది. బొగ్గు లభ్యత పటిష్ఠమైంది. నిరంతరాయంగా ఉత్పత్తి చేయడానికి తగినంత కార్యక్షేత్రం సిద్ధమైంది. దీంతో పాటే, అదనపు బొగ్గు గని క్షేత్రాలూ అందుబాటులోకి వచ్చాయి. వాటిలో కార్యకలాపాలను కొనసాగించ గలుగుతున్నారు. వార్షిక కార్యాచరణ ప్రణాళిక లక్ష్యాన్ని సాధించడానికి నిర్వహణపరమైన సౌలభ్యం తగినంత స్థాయిలో సమకూరింది.
బొగ్గు తరలింపునకు ఒక పక్కా వ్యవస్థను ఏర్పాటు చేయడం ఈ గనికి మరో ప్రధాన అనుకూలాంశమైంది. 2021లో ప్రారంభించిన 12 మిలియన్ టన్నుల వార్షిక సామర్థ్యం కలిగిన ఆధునిక కోల్ హ్యాండ్లింగ్ ప్లాంటు (సీహెచ్‌పీ)లో త్వరిత గతిన సరుకును నింపే వ్యవస్థల్నీ, ట్విన్ సైలోల్నీ, తగినంత స్థాయిలో బంకర్ సామర్థ్యాన్నీ సమకూర్చారు. ఇవి అన్నీ కలిసి.. రోజుకు 10 నుంచి 12 రైల్వే రేక్స్‌ను నింపి తరలించడానికి తోడ్పడుతున్నాయి. దీనివల్ల దేశంలో వివిధ ప్రాంతాల సంస్థలకు బొగ్గును ఎలాంటి అడ్డంకులూ ఎదురవకుండా సాఫీగా సరఫరా చేస్తున్నారు. అవసరమైన చట్టపర ఆమోదాలు సులభంగా లభిస్తుండటం కూడా ఉత్పత్తి రీత్యా గని సర్వసన్నద్ధంగా ఉండటానికి దోహదపడుతోంది.
ఉత్పత్తిని పెంపొందిస్తున్నసాంకేతికత, మౌలిక సదుపాయాలు
సోన్‌పూర్ బాజారీకి ఈస్ట్రన్ కోల్‌ఫీల్డ్‌స్ లోనే అన్నింటి కన్న విస్తృత శ్రేణి హెవీ ఎర్త్ మూవింగ్ యంత్రాలు (హెచ్ఈఎమ్ఎమ్) ఉన్నాయి. గని తవ్వకం కార్యకలాపాల్లో భాగంగా నేలను తవ్వి పైకి ఎత్తి వేరే చోటులో పోయడానికి ఉన్నత సామర్థ్యం కలిగిన తాళ్లు, బకెట్ వంటి సాధనాలను ఉపయోగించే భారీ యంత్రాలు (డ్రాగ్‌లైన్స్), రాళ్ళనీ, మట్టినీ ఎత్తడానికి ఉపయోగించే విద్యుచ్ఛక్తి ఆధారిత తవ్వకం యంత్రాలు, నేలను తవ్వడానికి ఉపయోగించే భారీ యంత్రాలు, భారీ సామర్థ్యం కలిగిన డంపర్ ట్రక్కులు, తదితర సహాయక సామగ్రిని ఈ బహిరంగ గనిలో ఉపయోగిస్తున్నారు. సొంత వాహనాలకు బదులు బయటి వ్యక్తుల (కాంట్రాక్టర్లు లేదా ఇతర కంపెనీల) నుంచి అద్దెకు తీసుకున్న లేదా ఒప్పందం కుదుర్చుకున్న వాహనాల సమూహాన్ని ఉపయోగించి కూడా డిపార్ట్‌మెంటు పనులను పూర్తి చేస్తున్నారు. దీంతో కార్యకలాపాల నిర్వహణలో సౌలభ్యం, పరికరాలను సమర్థంగా వినియోగించుకోవడంతో పాటు అధికోత్పత్తి సాధనకు మార్గం సుగమం అవుతోంది.
గని ఉత్పాదకతను పెంచడానికీ, మన్నికైన గని తవ్వక పద్ధతులను ప్రోత్సమించడానికీ గని తవ్వకానికి సంబంధించిన ఆధునిక సాంకేతికతను అనుసరిస్తున్నారు. రంధ్రాలు చేయడంతోనో, పేలుళ్ల పద్ధతిలోనో కాకుండా నేలను, రాళ్లను నేరుగా కత్తిరించే అధిక సామర్థ్యం కలిగిన పెద్ద యంత్రాలతో భూమి లోపలి నుంచి బొగ్గును బయటకు తీసే ప్రక్రియను చేపట్టి ఉత్పాదకతను మెరుగు పరుస్తున్నారు. బొగ్గు ఆకారం ఒకే విధంగా ఉంటోంది. వీటివల్ల పర్యావరణంపై ప్రభావం పెద్దగా పడట్లేదు. ఆధునిక డ్రిల్లింగ్ వ్యవస్థలు, నియంత్రణతో కూడిన పేలుడు పరిజ్ఞానం, ధూళి నియంత్రణ చర్యలూ.. ఇవన్నీ గని తవ్వకం కార్యకలాపాల్ని సురక్షితంగానూ, పర్యావరణం పట్ల మరింత ఎక్కువ బాధ్యత కలిగి ఉండేవిగానూ మార్చుతున్నాయి.
ఉత్పాదనకు పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉన్న గని
కోల్ ఇండియా గని తవ్వకం కార్యకలాపాల్లో చోటు చేసుకుంటున్న మార్పులకు సోన్‌పూర్ బాజారీ ఓసీపీ ఒక చక్కని ఉదాహరణగా నిలుస్తోంది. విశిష్ట ఉత్పత్తి సాధన, అసాధారణ ఓవర్‌బర్డెన్ విజయాలు, బొగ్గు లభ్యత పెంపు, మెరుగైన భ లభ్యత, ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాల కల్పన, ఆధునిక సాంకేతికతలను ఉపయోగించడం.. ఇవన్నీ గనిని మరో విజయవంతమైన సంవత్సరం లక్ష్యాలను సాధించడానికి సన్నద్ధం చేశాయి.
అన్ని ప్రధాన అనుకూల పరిస్థితులూ చోటుచేసుకోవడంతో, 2026-27 ఆర్థిక సంవత్సరానికి నిర్దేశించిన 120 లక్షల టన్నుల బగ్గు ఉత్పత్తి లక్ష్యాన్ని సాధించడానికి సోన్‌పూర్ బాజారీ పూర్తి స్థాయిలో సమాయత్తమైంది. గని తవ్వకానికి సంబంధించిన సరైన
ప్రణాళిక రూపకల్పన, సమయానుకూల కార్యాచరణ, సాంకేతిక ఆధునికీకరణ, అంకితభావంతో విధులను నిర్వహించే సిబ్బంది జతపడితే కార్యకలాపాల నిర్వహణను నిరంతర ప్రాతిపదికన అత్యుత్తమ స్థాయికి చేర్చవచ్చని ఇది సూచిస్తోంది. ఈసీఎల్‌కు చెందిన ప్రధాన గనుల్లో ఒకటైన సోన్‌పూర్ బాజారీ ఉత్పాదకతలో సరికొత్త ప్రమాణాలను నెలకొల్పుతూనే, దేశం కోసం విశ్వసనీయమైన, తక్కువ ఖర్చుతో కూడిన, నిరంతర ప్రాతిపదిక కలిగిన ఇంధన భద్రతకు పూచీ పడాలన్న కోల్ ఇండియా మిషన్‌ను సాకారం చేయడంలో తన వంతు కీలక పాత్రను పోషిస్తోంది.
***
(रिलीज़ आईडी: 2294213)
आगंतुक पटल : 6