రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌
azadi ka amrit mahotsav

నావికా దళ కార్యకలాపాల డైరెక్టర్ జనరల్‌గా బాధ్యతలు స్వీకరించిన ఏవీఎస్ఎం, వీఎస్ఎం వైస్ అడ్మిరల్ మనీష్ చద్దా

నాడు పోస్టు చేయడమైనది: 03 AUG 2026 7:07PM by PIB Hyderabad

నావికా దళ కార్యకలాపాల డైరెక్టర్ జనరల్‌గా ఏవీఎస్ఎం, వీఎస్ఎం వైస్ అడ్మిరల్ మనీష్ చద్దా 2026 ఆగస్టు 3న బాధ్యతలు స్వీకరించారు.

ఖడాక్వాస్లాలోని జాతీయ డిఫెన్స్ అకాడమీ 78వ కోర్సు పూర్వ విద్యార్థి అయిన ఫ్లాగ్ ఆఫీసర్ వైస్ అడ్మిరల్ మనీష్ చద్ధా భారతీయ నౌకా సేనలో 1991 జులై 1న నియమితులయ్యారు. ఆయన కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్ యుద్ధ రంగ నిపుణులు. ఆయన వెల్లింగ్టన్‌లోని 61వ డిఫెన్స్ సర్వీసెస్ స్టాఫ్ కాలేజీ పూర్వ విద్యార్థి. అమెరికాలోని వాషింగ్టన్‌లోని జాతీయ రక్షణ విశ్వవిద్యాలయం నుంచి హయ్యర్ కమాండ్ కోర్సును పూర్తి చేశారు.

35 ఏళ్లకు పైగా సాగిన తన విశిష్ట సేవా కాలంలో సముద్రంలో నౌకలపైనా, భూభాగంలోని నౌకాదళ స్థావరాల్లోనూ కమాండ్, కార్యాచరణ, శిక్షణ, సిబ్బంది నిర్వహణకు సంబంధించిన పలు బాధ్యతలను నిర్వహించారు. కోస్ట్ గార్డ్ ఇంటర్‌సెప్టర్ బోట్ సీజీఎస్–05, వీర్, కిర్పాన్, మైసూర్‌ నౌకలకు కమాండ్‌గా వ్యవహరించడంతో సహా నౌకాదళంలో ఆయన అనేక కీలక బాధ్యతలు చేపట్టారు.

మాస్కోలోని భారత రాయబార కార్యాలయంలో నౌకాదళ ప్రతినిధిగా కూడా పని చేశారు. నౌకాదళ ప్రధాన కార్యాలయంలో విధులు నిర్వర్తిస్తున్న సమయంలోనూ వీఎల్‌ఎఫ్, శాటిలైట్ కమ్యూనికేషన్లతో సహా పలు కీలకమైన ప్రాజెక్టులకు ఆయన నాయకత్వం వహించారు. అలాగే అంతర్జాతీయ ఫ్లీట్ రివ్యూ – 2016కు డైరెక్టర్‌గా పనిచేశారు.

ఫ్లాగ్ ర్యాంకుకు పదోన్నతి పొందిన తర్వాత గుజరాత్ నౌకాదళ ప్రాంత  ఫ్లాగ్ ఆఫీసర్ కమాండింగ్‌గా, అసిస్టెంట్ చీఫ్ ఆఫ్ పర్సనల్‌గా (పరిపాలన, పౌర సిబ్బంది), మహారాష్ట్ర నౌకాదళ ప్రాంత ఫ్లాగ్ ఆఫీసర్ కమాండింగ్‌గా, అసిస్టెంట్ చీఫ్ ఆఫ్ పర్సనల్‌గా (మానవ వనరుల అభివృద్ధి) బాధ్యతలను నిర్వహించారు.

వైస్ అడ్మిరల్ హోదాకు పదోన్నతి పొందిన అనంతరం ఇండియన్ నేవల్ అకాడమీకి కమాండెంట్‌గా నియమితులయ్యారు. అక్కడ ఆయన ‘నౌకాదళ నాయకత్వ భవిష్యత్తును తీర్చిదిద్దే’ బాధ్యతను చేపట్టారు.

విశిష్ట సేవకు గుర్తింపుగా 2025లో అతి విశిష్ట సేవా పతకాన్ని, 2017లో విశిష్ట సేవా పతకాన్ని ఈ ఫ్లాగ్ ఆఫీసర్ అందుకున్నారు. 


(రిలీజ్ ఐడి: 2294212) సందర్శకుల సూచీ సంఖ్య : : 39
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , Marathi , हिन्दी