జౌళి మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఐఐటీ ఢిల్లీలో హ్యాండ్లూమ్ టెక్నాలజీ ఎక్సలెన్స్ సెంటర్‌ను ప్రారంభించిన కేంద్ర మంత్రి శ్రీ గిరిరాజ్ సింగ్


భారత చేనేత రంగంలో ఆవిష్కరణను, సుస్థిరతను, డిజిటల్ పరివర్తనను ప్రోత్సహించడానికి అయిదు ప్రతిష్ఠాత్మక కార్యక్రమాల ప్రారంభం

प्रविष्टि तिथि: 03 AUG 2026 7:37PM by PIB Hyderabad

ఐఐటీ ఢిల్లీలో హ్యాండ్లూమ్ టెక్నాలజీ ఎక్సలెన్స్ సెంటర్ (సీవోఈ–హెచ్‌టీ)ను కేంద్ర జౌళి శాఖ మంత్రి శ్రీ గిరిరాజ్ సింగ్ ఈ రోజు ప్రారంభించారు. సాంకేతిక, ఆవిష్కరణ, పరిశోధన ద్వారా భారతీయ చేనేత రంగాన్ని ఆధునీకరించేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాల్లో ఈ కార్యక్రమం ముఖ్యమైనదిగా నిలుస్తుంది.

 

ఈ కార్యక్రమంలో జౌళి మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీమతి నీలం షమీ రావు, అభివృద్ధి కమిషనర్ (చేనేత) డాక్టర్ ఎం బీనా, అభివృద్ధి కమిషనర్ (హస్తకళలు) శ్రీమతి అమృత్ రాజ్, ఐఐటీ ఢిల్లీ డైరెక్టర్–ఇన్–ఛార్జ్ ప్రొఫెసర్ అరవింద్ కె.నీమా, ఐఐటీడీ డీన్ ప్రొఫెసర్ అశ్వనీ అగర్వాల్, జౌళి మంత్రిత్వ శాఖకు చెందిన ఉన్నతాధికారులు, బోధనా సిబ్బంది, పరిశోధకులు, అంకుర సంస్థల వ్యవస్థాపకులు, చేనేత పరిశ్రమ ప్రతినిధులు, చేనేత కార్మికులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

 

ఈ సందర్భంగా శ్రీ గిరిరాజ్ సింగ్ మాట్లాడుతూ… భవిష్యత్తు అవసరాలకు తగిన చేనేత వ్యవస్థను రూపొందించడానికి సుసంపన్నమైన భారతీయ చేనేత వారసత్వాన్ని అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో మేళవించాలనే ప్రభుత్వ దార్శనికతకు ఈ ఎక్సలెన్స్ సెంటర్ ప్రతీక అన్నారు. ఉత్పాదకతను పెంచడంలో, మార్కెట్ అవకాశాలను విస్తరించడంలో, చేనేత కార్మికులకు మెరుగైన జీవనోపాధిని కల్పించడంలో ఆవిష్కరణలు, డిజిటల్ సాంకేతిక పరిజ్ఞానాలు, సుస్థిరత, ఔత్సాహిక పారిశ్రామిక రంగం కీలక పాత్ర పోషిస్తాయని తెలియజేశారు.

చేనేత రంగంలో ఆచరణాత్మక సాంకేతిక పరిష్కారాలను అభివృద్ధి చేసేందుకు విద్యాసంస్థలు, పరిశ్రమలు, ప్రభుత్వ సంస్థల మధ్య బలమైన సహకారం అవసరమని శ్రీమతి నీలం షమీ రావు తెలియజేశారు.

 

చేనేత సరఫరా వ్యవస్థ అంతటా చేనేత కార్మికులు, డిజైనర్లు, వ్యాపారవేత్తలు, అంకుర సంస్థలకు నూతన అవకాశాలను సష్టిస్తూ, పరిశోధన, జ్ఞాన వినిమయం, నైపుణ్యాభివృద్ధి, ఆవిష్కరణలకు ఈ కేంద్రం ఉత్ప్రేరకంగా మారుతుందని డాక్టర్ ఎం బీనా చెప్పారు.

ఈ సందర్భంగా ఈ కేంద్రానికి చెందిన అయిదు ప్రతిష్ఠాత్మక కార్యక్రమాలను ప్రారంభించారు:

 

- హ్యాండ్లూమ్ 4.0 మొబైల్ యాప్: మగ్గం ఉత్పాదకత, నాణ్యత, నిర్వహణ, స్థిరత్వాన్ని డిజిటల్‌గా పర్యవేక్షించే వీలు కల్పిస్తుంది.

 

- హ్యాండ్లూమ్ ఈ–విద్య: చేనేత రంగంలో సామర్థ్య నిర్మాణానికి ఉపకరించే సమగ్ర డిజిటల్ అభ్యాసం, విజ్ఞాన వేదిక.

 

- హ్యాండ్లూమ్ ఎక్స్: మంత్రిత్వ శాఖకు చెందిన 5ఎఫ్ విలువ ఆధారిత వ్యవస్థలో పనిచేస్తున్న అంకుర సంస్థలు, ఆవిష్కర్తలకు తోడ్పాటును అందించే యాక్సిలరేటర్, ఇంక్యుబేషన్ వేదిక.

 

- కళాగృహ హ్యాండ్లూమ్ స్టూడియో (జెన్ జీ డిజైన్ స్టూడియో): కస్టమైజేషన్, విజువలైజేషన్ ద్వారా ఆధునిక వినియోగదారులకు ప్రామాణిక చేనేత ఉత్పత్తులను చేరువ చేసేందుకు డిజిటల్ సాంకేతిక పరిజ్ఞానాలను ఉపయోగిస్తుంది.

 

- థ్రెడ్స్ ఆఫ్ వాలర్: శాస్త్రీయపరమైన రీసైక్లింగ్, హస్తకళా నైపుణ్యం ద్వారా రీసైకిల్ చేసిన రక్షణ రంగానికి చెందిన వస్త్రాలను ప్రీమియం చేనేత వస్త్రాలుగా మార్చే సుస్థిర కార్యక్రమం.

 

మగ్గాల ఆధునికీకరణ, ఎర్గోనామిక్స్, కృత్రిమమేధ, సుస్థిరత, పనితీరును మెరుగుపరిచే ఆవిష్కరణలు, డిజిటల్ సాంకేతిక పరిజ్ఞానాల్లో ఈ ఎక్సలెన్స్ సెంటర్ పరిశోధనలు చేపడుతుంది. ఇది వచ్చే అయిదేళ్లలో చేనేత విజ్ఞానానికి సంబంధించిన జాతీయ భాండాగారాన్ని అభివృద్ధి చేయడం, ఏఐ–ఆధారిత సాధనాలను రూపొందించడం, సాంకేతిక బదిలీని సులభతరం చేయడం, అంకుర సంస్థలకు తోడ్పాటు అందించడం, కనీసం 1,000 మంది చేనేత కార్మికులు, అధ్యాపకులు, చేనేత నిపుణులకు శిక్షణ ఇవ్వడం లాంటివి కూడా చేస్తుంది.

 

సుసంపన్నమైన భారతీయ చేనేత వారసత్వాన్ని పరిరక్షించడంతో పాటు అధునాతన సాంకేతిక పరిజ్ఞానాలు, పరిశోధనా సామర్థ్యాలు, ఆవిష్కరణ ఆధారిత పరిష్కారాలతో ఈ రంగాన్ని సన్నద్ధం చేయాలనే జౌళి మంత్రిత్వ శాఖ అంకితభావాన్ని ఈ కేంద్రం ఏర్పాటు బలోపేతం చేస్తుంది. విద్యాసంస్థలు, పరిశ్రమలు, అంకుర సంస్థలు, చేనేత సంస్థలను ఒక్కచోట చేర్చడం ద్వారా మొత్తం చేనేత రంగాన్ని ఈ కేంద్రం బలోపేతం చేస్తుందని భావిస్తున్నారు. అలాగే అంతర్జాతీయంగా పోటీనిచ్చే విధంగా తీర్చిదిద్దుతుందని కూడా అంచనా వేస్తున్నారు.

 

***

 

 

 


(रिलीज़ आईडी: 2294155) आगंतुक पटल : 4
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Urdu , English , हिन्दी