గృహ నిర్మాణం మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

భల్స్వా డంప్‌సైట్‌ పునరుద్ధరణ ప్రక్రియను తనిఖీ చేసిన కేంద్ర మంత్రి మనోహర్ లాల్; పాత వ్యర్థాల నిర్మూలన పనుల పురోగతిపై సమీక్ష


2026 జూలై 31 నాటికి 99.07 లక్షల మెట్రిక్ టన్నుల పాత వ్యర్థాల నిర్మూలన పూర్తి

మిగిలిన వ్యర్థాలను 2026 అక్టోబర్ 15 నాటికి పూర్తిగా తొలగించాలని లక్ష్యం

శానిటరీ ల్యాండ్‌ఫిల్‌లో తాజా వ్యర్థాల ప్రాసెసింగ్‌ను వేగవంతం చేసి, డంప్‌సైట్ నిర్మూలన పనులను మరింత
వేగంగా పూర్తి చేయాలి: కేంద్ర మంత్రి శ్రీ మనోహర్ లాల్

प्रविष्टि तिथि: 01 AUG 2026 2:58PM by PIB Hyderabad

కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ మనోహర్ లాల్ ఈ రోజు భల్స్వా డంప్‌సైట్‌ వద్ద ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (ఎంసీడీ) చేపట్టిన పాత వ్యర్థాల నిర్మూలన పనుల పురోగతిని సమీక్షించారు. పాత వ్యర్థాల నిర్మూలనను వేగవంతం చేయడంతో పాటు పనుల పురోగతిని నిరంతరం పర్యవేక్షించాలన్న కేంద్ర ప్రభుత్వ సంకల్పాన్ని ఈ సందర్భంగా ఆయన పునరుద్ఘాటించారు. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్, కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (ఎంఓహెచ్‌యూఏ) పట్టణాభివృద్ధి విభాగానికి చెందిన సీనియర్ అధికారులు ఈ తనిఖీలో పాల్గొన్నారు.

 

ఈ సమీక్ష సందర్భంగా, 2026 జూలై 31 నాటికి భల్స్వా డంప్‌సైట్‌లో 99.07 లక్షల మెట్రిక్ టన్నుల పాత వ్యర్థాల నిర్మూలన పూర్తయిందని ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (ఎంసీడీ) కేంద్ర మంత్రికి తెలియజేసింది. మిగిలిన పాత వ్యర్థాల గుట్టను 2026 అక్టోబర్ 15 నాటికి పూర్తిగా తొలగించే లక్ష్యంతో పనులు కొనసాగుతున్నాయని తెలిపింది. 2026 మార్చి వరకు పేరుకుపోయిన మొత్తం వ్యర్థాలను 2026 డిసెంబర్ 31 నాటికి పూర్తిగా తొలగించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించింది.

ల్యాండ్‌ఫిల్ ప్రాంతానికి ప్రతిరోజూ చేరుతున్న తాజా వ్యర్థాల ప్రాసెసింగ్‌ కోసం ఇటీవల అప్పగించిన పనులను వేగవంతం చేయాలని ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (ఎంసీడీ) అధికారులను కేంద్ర మంత్రి  ఆదేశించారు. దీంతో డంప్‌సైట్ నిర్మూలన పనులు మరింత వేగంగా సాగడంతో పాటు, కొత్తగా వచ్చే వ్యర్థాలను ఎలాంటి జాప్యం లేకుండా శాస్త్రీయ పద్ధతిలో నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

ఈ తనిఖీ ద్వారా పాత వ్యర్థాలను నిర్దేశిత గడువులో పూర్తిగా తొలగించి భల్స్వా డంప్‌సైట్‌ను సమగ్రంగా పునరుద్ధరించడానికి  కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఇస్తున్న ప్రాధాన్యత స్పష్టమవుతోంది. 

 

***


(रिलीज़ आईडी: 2293119) आगंतुक पटल : 5
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Tamil