కమ్యూనికేషన్లు- సమాచార సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
నాడు పోస్టు చేయడమైనది:
31 JUL 2026 7:43PM by PIB Hyderabad
భారత ప్రభుత్వ కమ్యూనికేషన్స్ మంత్రిత్వ శాఖకు చెందిన టెలికమ్యూనికేషన్స్ విభాగం (డీఓటీ) ఆధ్వర్యంలోని ప్రముఖ టెలికాం పరిశోధన, అభివృద్ధి సంస్థ అయిన సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ టెలిమాటిక్స్ (సీ-డాట్.. మేధో సంపత్తి (ఐపీ) రంగంలో తన ఢిల్లీ క్యాంపస్ అందించిన అత్యుత్తమ కృషిని గుర్తించి, అభినందించేందుకు 'వార్షిక ఐపీ అవార్డుల ప్రదానోత్సవం-2026'ను నిర్వహించింది.
భారత స్వదేశీ టెలికాం సాంకేతిక వ్యవస్థను బలోపేతం చేయడం, సాంకేతిక ఆధారిత వృద్ధి దిశగా దేశ దృక్పథాన్ని ముందుకు తీసుకెళ్లడంలో విశేష కృషి చేస్తున్న సీ-డాట్ పరిశోధకులు, ఆవిష్కర్తలను ఈ వేడుకలో సత్కరించారు.
సీ-డాట్ ఢిల్లీ క్యాంపస్‌లో జరిగిన కార్యక్రమంలో 47 పేటెంట్లు, 3 కాపీరైట్లు, 8 పరిశోధనా పత్రాలను గుర్తించి అభినందించారు. నూతన ఆవిష్కరణలు, శ్రేష్ఠత విషయంలో చేసిన కృషికి గుర్తిస్తూ ఈ క్యాంపస్‌కు చెందిన మొత్తం 64 మందికి అవార్డులను ప్రదానం చేశారు. సీ-డాట్ మేధో సంపత్తి పోర్ట్‌ఫోలియోను గణనీయంగా బలోపేతం చేసిన పరిశోధకులు, ఇంజనీర్లు, విషయ నిపుణుల అసాధారణ కృషిని ఈ వేడుక కొనియాడింది. స్థిరంగా విస్తరిస్తున్న పేటెంట్ పోర్ట్‌ఫోలియో, గుర్తింపు పొందుతోన్న శ్రేష్ఠమైన ఆవిష్కర్తలు పెరగటంతో స్వదేశీ సాంకేతిక ఆవిష్కరణలను నడిపించే అగ్రగామి టెలికాం ఆర్-డీ సంస్థగా సీ-డాట్ తన స్థానాన్ని మరింత పటిష్ఠం చేసుకుంటోంది. భారత సాంకేతిక స్వావలంబన, డిజిటల్ రూపాంతర దృక్పథానికి తోడ్పడే పరిశోధన శ్రేష్ఠత, మేధో సంపత్తి సృష్టి, ప్రపంచవ్యాప్తంగా పోటీపడే సాంకేతికతల అభివృద్ధి పట్ల సంస్థ నిరంతర నిబద్ధతను ఈ విజయాలు చాటుతున్నాయి.
అవార్డు గ్రహీతలను అభినందించిన సీ-డాట్ సీఈఓ డాక్టర్ రాజ్‌కుమార్ ఉపాధ్యాయ్ మాట్లాడుతూ... "దేశం కోసం స్వదేశీ, సురక్షితమైన, భవిష్యత్తుకు సిద్ధంగా ఉన్న టెలికాం సాంకేతికతలను రూపొందించాలనే సీ-డాట్ మిషన్‌కు ఆవిష్కరణే ప్రధాన ఆధారం. మా పరిశోధకులు సృష్టించిన ప్రతి పేటెంట్, ప్రచురణ, మేధో సంపత్తి భారతదేశ సాంకేతిక సార్వభౌమత్వాన్ని బలోపేతం చేస్తాయి.. 'ఆత్మనిర్భర్ భారత్' దృక్పథం పట్ల మా నిబద్ధతను మరింత బలపరుస్తాయి. ఈ అవార్డులు అసాధారణమైన సాంకేతిక నైపుణ్యాన్నే కాకుండా సీ-డాట్ పరిశోధనా వ్యవస్థను నడిపించే జిజ్ఞాస, పట్టుదల, ఆవిష్కరణ స్ఫూర్తిని కూడా గుర్తిస్తాయి. అవార్డు గ్రహీతలందరికీ నా అభినందనలు. భారత్ గ్లోబల్ టెలికాం ఆవిష్కరణ లీడర్‌గా అవతరించడానికి దోహదపడే పరివర్తనాత్మక సాంకేతికతలను అభివృద్ధి చేయడాన్ని వారు కొనసాగించాలని నేను కోరుతున్నాను" అని అన్నారు.
గత కొన్నేళ్లుగా సీ-డాట్ భవిష్యత్తరం కమ్యూనికేషన్ సాంకేతికతలు, సైబర్ భద్రత, క్వాంటం కమ్యూనికేషన్స్, విపత్తు నిర్వహణ వ్యవస్థలు, ఏఐ ఆధారిత టెలికాం పరిష్కారాలు, డిజిటల్ ప్రజా మౌలికసదుపాయాలు వంటి రంగాల్లో బలమైన మేధో సంపత్తిని సాధించింది. జాతీయ ప్రాధాన్యతలను పరిష్కరించే, ప్రపంచ టెలికమ్యూనికేషన్స్ రంగంలో భారత్ పోటీతత్వాన్ని పెంపొందించే ప్రభావవంతమైన సాంకేతికతలుగా పరిశోధన శ్రేష్ఠతను అనువదించడానికి సీ-డాట్ కట్టుబడి ఉంది.
ఇటీవల సీ-డాట్ బెంగళూరు క్యాంపస్‌లో కూడా 'వార్షిక ఐపీ అవార్డుల ప్రదానోత్సవం-2026'ను నిర్వహించారు. మేధో సంపత్తి సృష్టికి అందించిన అసాధారణమైన కృషికి గాను ఈ వేడుకలో 78 మంది ఆవిష్కర్తలను సత్కరించారు. ఈ కార్యక్రమంలో 36 పేటెంట్లు, 18 కాపీరైట్లు, 9 ట్రేడ్‌మార్క్‌లు, 3 పరిశోధన పత్రాలను గుర్తించారు. ఇది సంస్థ మొత్తంగా ఆవిష్కరణల లోతు, వైవిధ్యాన్ని ప్రతిబింబిస్తుంది. ఢిల్లీ, బెంగళూరు క్యాంపస్‌లలో నిర్వహించిన ఐపీ అవార్డుల వేడుకలు రెండూ కలిసి ఆవిష్కరణలు, మేధో సంపత్తి సృష్టి, టెలికమ్యూనికేషన్స్ రంగంలో పెరుగుతున్న భారత్ నాయకత్వానికి దోహదపడే స్వదేశీ సాంకేతికతల అభివృద్ధి పట్ల సీ-డాట్ నిరంతర నిబద్ధతను ప్రధానంగా తెలియజేస్తున్నాయి.
కొంతమంది అవార్డు గ్రహీతలు
సీ-డాట్ ఢిల్లీ క్యాంపస్‌లో అవార్డు గ్రహీతలతో పాటు సీ-డాట్ సీఈఓ డాక్టర్ రాజ్‌కుమార్ ఉపాధ్యాయ్, సీ-డాట్ కార్యనిర్వాహక వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ పంకజ్ దలేలా, ఇతర అధికారులు.
***