ఆయుష్
azadi ka amrit mahotsav

పరిశోధన-భాగస్వామ్యంతో సంప్రదాయ వైద్య ఔచిత్యం ధ్రువీకరణ

प्रविष्टि तिथि: 31 JUL 2026 3:36PM by PIB Hyderabad

   సంప్రదాయ వైద్య పద్ధతులు-మూలికా ఉత్పత్తుల సేకరణ, నమోదులో ‘సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ ఆయుర్వేదిక్ సైన్సెస్’ (సీసీఆర్‌ఏఎస్‌) చురుగ్గా వ్యవహరిస్తోంది. ఈ మేరకు గిరిజన ఆరోగ్య సంరక్షణ పరిశోధన కార్యక్రమం (టీహెచ్‌సీఆర్‌పీ), వైద్య-జాతి-వృక్ష శాస్త్ర సర్వే (ఎంఈబీఎస్‌) కార్యక్రమాలను అమలు చేస్తోంది. ఆయుర్వేద ఆరోగ్య సంరక్షణ సేవల ప్రదానంతోపాటు ఆరోగ్య కార్యక్రమాలు, వ్యాధి నివారణాధారిత దినచర్య, రుతుచర్య, పథ్య-అపథ్య తదితర ఆయుర్వేద జీవనశైలి పద్ధతులపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం వీటి లక్ష్యం. ఇందులో సమాచార-అవగాహన-ప్రచార (ఐఈసీ) సామగ్రి పంపిణీ, స్థానిక ఆరోగ్య సంప్రదాయాలు (ఎల్‌హెచ్‌టీ), జానపద పద్ధతుల నమోదు (ఈఎంపీ) కూడా అంతర్భాగంగా ఉంటాయి. తదనుగుణంగా ఎల్‌హెచ్‌టీ, ఈఎంపీ సహా జానపద విధానాల ప్రత్యేకత-నవ్యత్వం దిశగా మండలి ద్వారా నమోదుతో ధ్రువీకరణ ప్రక్రియను చేపడతారు.

సముచిత శాస్త్రీయ ధ్రువీకరణ, ప్రామాణికత, నైతిక ఆమోదిత జాతి వైద్య పద్ధతులు, గిరిజన-జానపద విధానాధారిత సంప్రదాయ ఆరోగ్య పద్ధతులు, ఇతర సామాజిక ఆరోగ్య సంరక్షణ సంప్రదాయాలపై క్లినికల్, ట్రాన్స్‌లేషనల్ పరిశోధనలను న్యూఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద (ఏఐఐఏ) చేపడుతుంది. ఈ సంప్రదాయ ఆరోగ్య సంరక్షణ పద్ధతుల పరిరక్షణ, సామర్థ్యం, చికిత్స ఫలితాల సంబంధిత నిదర్శనాల దిశగా సుస్థిర శాస్త్రీయ పద్ధతులలో పరిశోధనలు నిర్వహిస్తారు.

సమగ్ర ఆరోగ్య పరిశోధనను ప్రోత్సహించే లక్ష్యంతో ఆయుష్ మంత్రిత్వ శాఖ, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్‌) మధ్య 2023 మే 11న అవగాహన ఒప్పందం కుదిరింది. ఆయుష్ మంత్రిత్వ శాఖ, ఐసీఎంఆర్‌ మధ్య ఆరోగ్య పరిశోధనపై సహకారంతో పాటు సమన్వయాన్ని ప్రోత్సహించడం ఈ ఒప్పందం లక్ష్యం. అలాగే రూపకల్పన, సమగ్ర ఆరోగ్య పరిశోధన దిశగా సహకారం-సమన్వయంపై అవకాశాల అన్వేషణ, రెండింటి పరిధిలోని శాస్త్రవేత్తల పరిశోధన సామర్థ్య బలోపేతంపైనా ఇది దృష్టి సారిస్తుంది.

ఐసీఎంఆర్‌, ఆయుష్ మంత్రిత్వ శాఖ పరిధిలోని ఇతర పరిశోధన మండలాలు, ఎయిమ్స్‌ సహా ఇతర వైద్య, పరిశోధన, విద్యాసంస్థల సహకారంతో సమగ్ర ఆరోగ్య పరిశోధనలో సీసీఆర్‌ఏఎస్‌ పాలుపంచుకుంటోంది. ఆయుష్-ఐసీఎంఆర్ సంయుక్త సహకారంతో, “పునరుత్పత్తి వయసుగల సాధారణ మహిళల్లో మధ్యస్థ ఐరన్ లోప రక్తహీనత చికిత్సలో ఐరన్ ఫోలిక్ యాసిడ్‌తో పోలిస్తే, ‘పునర్నవాది మండుర’ను విడిగా లేదా ద్రాక్షావలేహ్యంతో కలిపి వాడితే లభించే ఉపశమనం, భద్రత: మూడు విభాగాలతో కూడిన సామాజికాధారిత బహుళ-కేంద్రక యాదృచ్ఛిక నియంత్రిత పరీక్ష” పేరిట అధ్యయనం పూర్తయింది.

సంప్రదాయ వైద్య విధానాలకు శాస్త్రీయ ఆధారాల సృష్టి లక్ష్యంగా జైపూర్‌లోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద (ఎన్‌ఐఏ), ఇతర ఆధునిక వైద్య సంస్థల మధ్య సహకారం ద్వారా వివిధ వ్యాధి పరిస్థితులపై సమీకృత చికిత్స విధానాలను ఉపయోగిస్తున్నారు.

షిల్లాంగ్‌లోని నార్త్ ఈస్టర్న్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద అండ్‌ హోమియోపతి సంస్థ (ఎన్‌ఈఐఏహెచ్‌) రోగుల ప్రయోజనార్థం సమగ్ర ఆరోగ్య సంరక్షణ దిశగా తమ ఆసుపత్రిలో ఫిజియోథెరపీ, దంతవైద్యం, ఆహార నియమాలు తదితర ఆధునిక పద్ధతులను అనుసంధానించింది. అంతేగాక, ఆయుర్వేద విధానంలో వ్యాధి నిర్ధారణకు అనుబంధంగా ప్రయోగశాల, రేడియాలజీ విధానాలను క్రమం తప్పకుండా నిర్వహిస్తోంది. తప్పనిసరి రొటేటరీ ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్‌లో భాగంగా మేఘాలయ ప్రభుత్వ ఆధ్వర్యంలోని వివిధ ఆసుపత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు శిక్షణార్థులను పంపడం ద్వారా ‘ఎన్‌ఈఐఏహెచ్‌’ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలతో కలసి కృషి చేస్తోంది.

ఇక ‘ఏఐఐఏ’లో ఐసీయూ విభాగం సహా 200 పడకల తృతీయ అంచె ఆరోగ్య సంరక్షణ కేంద్రం పనిచేస్తోంది. ఆయుర్వేదానికి ఒక సమగ్ర ఆదర్శ వైద్యవిధాన ఆసుపత్రిగా ఇది బాధ్యతలు నిర్వర్తిస్తుంది. వివిధ క్లినికల్, పారా క్లినికల్ విభాగాలలో ఆధునిక వైద్య నిపుణులు కూడా ఇక్కడ పనిచేస్తున్నారు. ఝజ్జర్‌లోని ‘ఎయిమ్స్‌’లో సమగ్ర కేన్సర్ క్లినిక్, పరిశోధన కేంద్రాన్ని, న్యూఢిల్లీలోని ‘విఎం’ మెడికల్ కాలేజీ అనుబంధ సఫ్దర్‌జంగ్ ఆసుపత్రిలో సమగ్ర వైద్య కేంద్రాన్ని ‘ఏఐఐఏ’ ఏర్పాటు చేసింది.

కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య పథకం (సీజీహెచ్‌ఎస్‌) కింద అల్లోపతి, ఆయుష్ వైద్య విధానాల ద్వారా ఆరోగ్య సంరక్షణ సేవలు లభిస్తాయి. ఈ పథకం లబ్ధిదారులు రెండు విధానాలలో దేని ద్వారానైనా చికిత్స పొందే వీలుంది. లబ్ధిదారుని క్లినికల్ పరిస్థితి, వైద్య అవసరాలు, వైద్యుల వృత్తిపరమైన అంచనాలపై చికిత్స ఎంపిక ఆధారపడి ఉంటుంది.

కేంద్ర ఆయుష్ శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర బాధ్యత) శ్రీ ప్రతాపరావు జాదవ్ ఈ రోజు లోక్‌సభలో ఒక ప్రశ్నకు లిఖితపూర్వక జవాబిస్తూ ఈ సమాచారం వెల్లడించారు.

 

***


(रिलीज़ आईडी: 2292663) आगंतुक पटल : 14
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी