శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
దేశంలోని అధికారిక ఆవిష్కరణ వ్యవస్థతో 'క్షేత్రస్థాయి ఆవిష్కర్తలను' అనుసంధానించాలని కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ పిలుపు
భారత తదుపరి వృద్ధి దశలో గ్రామాలు, చిన్న పట్టణాలు, కమ్యూనిటీ ఆవిష్కర్తలే కీలకం
క్షేత్రస్థాయి ఆవిష్కర్తల సన్మాన వేడుకలో 26 మంది ఆవిష్కర్తలకు సన్మానం
జాతీయ ఆవిష్కరణల కోసం విధాన ప్రణాళిక అవసరం
'వికసిత్ భారత్' లక్ష్య సాధన కోసం స్థానిక ఆలోచనలు జాతీయ స్థాయి వ్యాపార సంస్థలుగా ఎదగాలి: డాక్టర్ జితేంద్ర సింగ్
प्रविष्टि तिथि:
31 JUL 2026 4:20PM by PIB Hyderabad
"క్షేత్రస్థాయి ఆవిష్కర్త"లను దేశంలోని అధికారిక ఆవిష్కరణల వ్యవస్థతో అనుసంధానించాలని కేంద్ర శాస్త్ర, సాంకేతిక, భూ విజ్ఞాన శాస్త్రాల శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర బాధ్యత), ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంఓ), సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పింఛన్లు, అణుశక్తి, అంతరిక్ష శాఖల సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ఈ రోజు పిలుపునిచ్చారు. భారత తదుపరి వృద్ధి దశలో కేవలం ప్రయోగశాలలు, పెద్ద నగరాలు మాత్రమే కాకుండా గ్రామాలు, చిన్న పట్టణాలు, కమ్యూనిటీ స్థాయి ఆవిష్కర్తల పాత్ర అత్యంత కీలకమైనదిగా ఉంటుందని ఆయన అన్నారు. స్వయం-సమృద్ధ భారత్ సాధనలో, వికసిత్ భారత్@2047 దార్శనికత సాకారంలో ఈ క్షేత్రస్థాయి ఆవిష్కరణలే కీలకమని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు.
క్షేత్రస్థాయి ఆవిష్కరణలను జాతీయ స్థాయిలో విస్తరించగల సంస్థలుగా మార్చేందుకు ఒక నిరాటంకమైన విధాన ప్రణాళిక అవసరమని ఆయన పిలుపునిచ్చారు. ఆవిష్కరణలు కేవలం గుర్తింపు స్థాయిని దాటి శాస్త్రీయ ధ్రువీకరణ, సాంకేతిక పరిజ్ఞానాన్ని పలు భాషల్లోకి అనువదించడం, ఇంక్యుబేషన్, మార్కెట్ స్వీకరణ వంటి దశలనూ అధిగమించాలన్నారు. తద్వారా స్థానిక పరిష్కారాలు భారత అభివృద్ధి ప్రాధాన్యాలను పరిష్కరించగల జాతీయ ఆస్తులుగా పరిణామం చెందాలని కేంద్ర మంత్రి పేర్కొన్నారు.
న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ సాంస్కృతిక కేంద్రంలో జరిగిన క్షేత్రస్థాయి ఆవిష్కర్తల సన్మాన వేడుకలు-2026లో కేంద్ర మంత్రి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలోని ప్రభుత్వం... శాస్త్ర, సాంకేతిక, వ్యవస్థాపనలను అందరికీ అందుబాటులోకి తీసుకురావడం ద్వారా ఆవిష్కరణను జాతీయ ఉద్యమంగా మార్చిందని డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. అటల్ ఇన్నోవేషన్ మిషన్ (ఏఐఎమ్) ఆవిష్కరణల వ్యవస్థను ప్రముఖ సంస్థలు, మహానగర కేంద్రాలకు మించి విస్తరించిందన్నారు. గ్రామీణ, గిరిజన, కొండ, తీరప్రాంత, ఆకాంక్షాత్మక, మారుమూల ప్రాంతాల నుంచి ప్రతిభావంతులైన ఆవిష్కర్తలు భారత అభివృద్ధి ప్రయాణంలో చురుకైన భాగస్వాములుగా మారడానికి ఇది వీలు కల్పించిందని కేంద్ర మంత్రి పేర్కొన్నారు.
భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమానికి భారత ప్రభుత్వ ప్రధాన శాస్త్రీయ సలహాదారు ప్రొఫెసర్ అజయ్ సూద్, నీతి ఆయోగ్ సీఈవో నిధి చిబ్బర్, నీతి ఆయోగ్ సహా భారత ప్రభుత్వ ఉన్నతాధికారులు, శాస్త్రవేత్తలు, ఇంక్యుబేటర్ భాగస్వాములు, దేశవ్యాప్తంగా ఉన్న ఆవిష్కర్తలూ హాజరయ్యారు. వ్యవసాయం, ఆరోగ్య సంరక్షణ, పరిశుద్ధ ఇంధనం, సహాయక సాంకేతికత, నీటి నిర్వహణ, సర్క్యులర్ ఎకానమీ, సుస్థిర జీవనోపాధి రంగాల్లో ఆచరణాత్మక, సరసమైన, కమ్యూనిటీ ఆధారిత పరిష్కారాలను అభివృద్ధి చేసిన 26 మంది క్షేత్రస్థాయి ఆవిష్కర్తలను సత్కరించారు.
క్షేత్రస్థాయి ఆవిష్కరణలే భారత ఆవిష్కరణల వ్యవస్థకు నిజమైన బలమని కేంద్ర మంత్రి అభివర్ణించారు. దేశంలో నేడు 2.4 లక్షలకు పైగా అంకురసంస్థలు ఉన్నాయని, వాటి ద్వారా భారత్ ప్రపంచంలోనే మూడో అతిపెద్ద అంకురసంస్థల వ్యవస్థగా అవతరించిందని డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. ఈ విజయాలు ముఖ్యమైనవే అయినప్పటికీ... రైతులు, మహిళలు, చేతివృత్తులవారు, పారిశ్రామికవేత్తలు, సాధారణ పౌరుల జీవితాలను మెరుగుపరిచే సరసమైన సాంకేతిక పరిజ్ఞానాల ద్వారా పరిష్కరించిన నిజ జీవిత సమస్యల సంఖ్యతోనే భారత ఆవిష్కరణల ఉద్యమ విజయాన్ని కొలవగలమని ఆయన అన్నారు. శ్రమను తగ్గించి, ఉత్పాదకతను పెంచి, జీవనోపాధిని కల్పించి, స్థిరమైన స్థానిక సంస్థలను సృష్టించే ఆవిష్కరణలే నిజమైన సమ్మిళిత అభివృద్ధి స్ఫూర్తిని ప్రతిబింబిస్తాయని ఆయన పేర్కొన్నారు.
వెనకబడిన ప్రాంతాల ఆవిష్కర్తలకు మార్గదర్శనం, ఇంక్యుబేషన్, సాంకేతిక సలహాలు, మార్కెట్ అనుసంధానాలు, సామర్థ్య నిర్మాణ మద్దతును అందించడం ద్వారా... అటల్ కమ్యూనిటీ ఇన్నోవేషన్ సెంటర్లు (ఏసీఐసీలు) సామాజిక జ్ఞానానికి, అధికారిక ఆవిష్కరణల వ్యవస్థకు మధ్య కీలక వారధిగా మారాయని కేంద్ర మంత్రి అన్నారు. ఇప్పటికే 25 ఏసీఐసీలు పనిచేస్తున్నాయని... మరో 25 అభివృద్ధి దశలో ఉన్నాయన్నారు. ప్రస్తుతం ఉన్న కేంద్రాలు 2,500 మందికి పైగా క్షేత్రస్థాయి ఆవిష్కర్తలకు మద్దతునిచ్చాయని ఆయన పేర్కొన్నారు. ఒక మంచి ఆలోచన భౌగోళిక పరిమితులు, ఉమ్మడి అనుమతి లేదా వనరుల కొరతతో ఆగిపోకుండా... ఒక ఆచరణీయ సంస్థగా ఎదగడానికి అవసరమైన మద్దతును పొందేలా ఈ కేంద్రాలు సహాయపడుతున్నాయి.
ఈ సంవత్సరం గుర్తింపు పొందిన 26 మంది ఆవిష్కర్తలు భారత అట్టడుగు స్థాయి ఆవిష్కరణ ఉద్యమ వైవిధ్యానికి, చైతన్యానికి ప్రతీకలని డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. వీరు 16 రాష్ట్రాలు, 23 జిల్లాల నుంచి వచ్చారనీ, వీరి వయస్సు 24 నుంచి 66 సంవత్సరాల మధ్య ఉందనీ, వీరిలో 11 మంది మహిళా ఆవిష్కర్తలూ ఉన్నారని ఆయన తెలిపారు. వ్యవసాయం, ఆరోగ్య సంరక్షణ, నీటి సంరక్షణ, స్వచ్ఛ ఇంధనం, సుస్థిర తయారీ, దివ్యాంగులకు మద్దతు, గ్రామీణ జీవనోపాధి వంటి రంగాల్లో ఆచరణాత్మక పరిష్కారాల ద్వారా దేశం ఎదుర్కొంటున్న అత్యంత తీవ్రమైన సవాళ్లను వీరి కృషి పరిష్కరిస్తుందని కేంద్ర మంత్రి తెలిపారు. స్థానిక సమాజాలతో, వారి రోజువారీ సవాళ్లతో సన్నిహితంగా మమేకమైనప్పుడే తరచుగా పరివర్తనాత్మక ఆవిష్కరణలు ఉద్భవిస్తాయని ఇది పునరుద్ఘాటిస్తుందని ఆయన పేర్కొన్నారు.
ఈ వేడుకలో సత్కారం పొందిన ఆవిష్కరణలు భారత క్షేత్రస్థాయి సృజనాత్మకత విస్తృతిని ప్రతిబింబిస్తాయి. వీటిలో చిన్న రైతులు తమ పంటలను పండించిన చోటే శుద్ధి చేసుకోవడానికి వీలు కల్పించే కాంపాక్ట్ మినీ రైస్ మిల్లులు, సాగుకు యోగ్యం కాని భూమిని సాగులోకి తెచ్చే ట్రాక్టర్-ఆధారిత యంత్రాలు, వ్యవసాయ వ్యర్థాలను అధిక విలువ కలిగిన బయో-ఉత్పత్తులుగా మార్చే సాంకేతికతలు, వ్యవసాయ ఉత్పాదకతను మెరుగుపరిచే ఏఐ-ఆధారిత నేల ఆరోగ్య నిర్ధారణ సేవలు, వ్యవసాయ వ్యర్థాల నుంచి తయారైన సింగిల్-యూజ్ ప్లాస్టిక్‌లకు బదులుగా బయోడీగ్రేడెబుల్ ప్రత్యామ్నాయాలు, దివ్యాంగుల కోసం అందుబాటు ధరల్లో సహాయక సాంకేతికతలు, పర్యావరణ సుస్థిరతను ప్రోత్సహిస్తూ గ్రామీణ జీవనోపాధిని బలోపేతం చేసే వికేంద్రీకృత పరిశుద్ధ ఇంధన పరిష్కారాల వంటివి ఉన్నాయి.
ఆవిష్కరణ నుంచి వ్యాపార స్థాయికి ప్రయాణాన్ని వేగవంతం చేయాల్సిన అవసరాన్ని స్పష్టం చేస్తూ... ఏఐఎం ద్వారా పురోగమిస్తున్న క్షేత్రస్థాయి ఆవిష్కరణల వ్యవస్థకు, శాస్త్ర సాంకేతిక శాఖకు చెందిన 'నేషనల్ ఇనిషియేటివ్ ఫర్ డెవలపింగ్ అండ్ హార్నెసింగ్ ఇన్నోవేషన్స్ (నిధి)'కి మధ్య బలమైన సమన్వయం ఉండాలని డాక్టర్ జితేంద్ర సింగ్ పిలుపునిచ్చారు. ఇటువంటి కలయిక వల్ల ఆవిష్కర్తలకు టెక్నాలజీ బిజినెస్ ఇంక్యుబేటర్లు, సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్, నమూనా అభివృద్ధి, శాస్త్రీయ ధ్రువీకరణ, మేధో సంపత్తి మద్దతు, ఉత్పత్తి పరీక్ష, ధృవీకరణ, తయారీ భాగస్వామ్యాలు, ఆర్థిక-మార్కెట్ అనుసంధానాలు అందుబాటులోకి వస్తాయని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. తద్వారా ఆలోచన నుంచి ఉత్పత్తికి, ఉత్పత్తి నుంచి మార్కెట్‌కు ఒక పటిష్ఠమైన మార్గంగా జాతీయ విధాన ప్రణాళికను రూపొందించవచ్చని ఆయన అన్నారు.
నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ అనుభవాన్ని ప్రస్తావిస్తూ, నిరంతర సంస్థాగత మద్దతు లభించినప్పుడే క్షేత్రస్థాయి ఆలోచనలు జాతీయ గుర్తింపును సాధించగలవని భారత్ పలుసార్లు నిరూపించిందని కేంద్ర మంత్రి అన్నారు. సాంప్రదాయిక మట్టితో చేసిన ఆవిష్కరణగా మొదలై... బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ స్పెసిఫికేషన్‌కు ఆధారంగా మారిన మిట్టికూల్ రిఫ్రిజిరేటర్ ఉదాహరణను ఆయన ఉటంకించారు. శాస్త్రీయ ధ్రువీకరణ, ఇంక్యుబేషన్, సాంకేతిక అభివృద్ధి ద్వారా సామాజిక జ్ఞానాన్ని జాతీయస్థాయిలో ఆమోదం పొందిన ఉత్పత్తులుగా ఎలా మార్చవచ్చో ఇది వివరిస్తుందని కేంద్ర మంత్రి తెలిపారు.
శాస్త్రవేత్తలు, విద్యాసంస్థలు, ఇంక్యుబేటర్లు, పరిశ్రమలు, ప్రభుత్వ విభాగాలు సన్నిహిత భాగస్వామ్యంతో కలిసి పనిచేయాలని డాక్టర్ జితేంద్ర సింగ్ పిలుపునిచ్చారు. గుర్తింపు పొందిన ప్రతి ఆవిష్కర్తకు అనువాద-సంసిద్ధత అంచనా, ప్రత్యేక ఇంక్యుబేషన్, డిజైన్ మెరుగుదల, మేధో సంపత్తి సౌకర్యం, పరీక్ష, ధ్రువీకరణ, వాస్తవ-ప్రపంచ పైలట్ విస్తరణల ద్వారా నిరంతర మద్దతు అందాలన్నారు. గుర్తింపు ఒక ఆవిష్కర్త ప్రయాణానికి గమ్యం కాకూడదనీ, అది ప్రారంభం మాత్రమే కావాలని ఆయన పేర్కొన్నారు. తద్వారా స్థానిక ఆలోచనలు జాతీయ ప్రాముఖ్యత కలిగిన పరిష్కారాలుగా విస్తరించడానికి వీలు కల్పించాలనీ ఆయన అన్నారు.
ఆవిష్కర్తలు ఉన్న చోటికే వెళ్లి, శాస్త్ర సాంకేతిక రంగాల ద్వారా స్థానిక సవాళ్లను పరిష్కరించే వారి సామర్థ్యాన్ని బలోపేతం చేయడం ద్వారా... భారత ఆవిష్కరణల వ్యవస్థ క్షేత్రస్థాయి ప్రతిభకు మరింతగా స్పందించాలని ఆయన పేర్కొన్నారు. నిరంతర సంస్థాగత మద్దతు, ప్రభుత్వం, విద్యాసంస్థలు, పరిశ్రమల మధ్య బలమైన సహకారంతో... స్వయం-సమృద్ధ భారత్, వికసిత్ భారత్ లక్ష్యాలను సాధించడంలో క్షేత్రస్థాయి ఆవిష్కర్తలు కీలక భాగస్వాములుగా ఎదుగుతారన్నారు. తద్వారా దేశ తదుపరి తరం పరివర్తనాత్మక ఆలోచనలు దేశవ్యాప్తంగా ప్రతి గ్రామం, ప్రతి జిల్లా, ప్రతి సమాజం నుంచీ ఉద్భవిస్తాయని విశ్వాసం వ్యక్తం చేస్తూ డాక్టర్ జితేంద్ర సింగ్ తన ప్రసంగాన్ని ముగించారు.




***
(रिलीज़ आईडी: 2292649)
आगंतुक पटल : 7