ఔషధాల విభాగం
azadi ka amrit mahotsav

ఆసుపత్రులలో అత్యవసర ఔషధాలపై పర్యవేక్షణ

प्रविष्टि तिथि: 31 JUL 2026 4:34PM by PIB Hyderabad

   జాతీయ ఆరోగ్య పథకం (ఎన్‌హెచ్‌ఎం) కింద కేంద్ర ప్రభుత్వం ఉచిత ఔషధ సరఫరా కార్యక్రమాన్ని (ఎఫ్‌డీఎస్‌ఐ) ప్రారంభించింది. ఆరోగ్య-కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ సమాచారం ప్రకారం- ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాలకు వచ్చే రోగులకు మందుల కొనుగోలు భారం లేకుండా ఉచితంగా సరఫరా చేయడం ఈ కార్యక్రమ లక్ష్యం. దీని కింద రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు తమ వనరుల పరిధి సంబంధిత కార్యక్రమ అమలు ప్రణాళికలలో పేర్కొన్న అవసరాల ప్రాతిపదికగా ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాలలో మందుల ఉచిత పంపిణీకి కేంద్రం ఆర్థిక సహాయం చేస్తుంది.

ఇందులో భాగంగా ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాలలో అత్యవసర మందుల అందుబాటు నిమిత్తం కేంద్రాల వారీగా జాబితాను ఆరోగ్య-కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ సిఫారసు చేసింది:

     i.     ఉప ఆరోగ్య కేంద్ర ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలు-113

    ii.     ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలు-179

   iii.     సామాజిక ఆరోగ్య కేంద్రాలు-301

  iv.     ఉప-జిల్లా ఆసుపత్రులు-318

    v.     జిల్లా ఆసుపత్రులు-381

ఈ పథకం కింద, మందుల కొనుగోలు, నాణ్యతకు హామీ, సరఫరా వ్యవస్థ నిర్వహణ, పటిష్ఠ  గిడ్డంగుల వ్యవస్థల బలోపేతం లేదా ఏర్పాటు, ప్రిస్క్రిప్షన్ తనిఖీ, ఫిర్యాదుల పరిష్కారం, ప్రామాణిక చికిత్స మార్గదర్శకాలపై అవగాహన, అత్యవసర మందుల కొనుగోలు-లభ్యతల వాస్తవ స్థితిపై పర్యవేక్షణ కోసం ‘డ్రగ్స్ అండ్‌ వ్యాక్సిన్ డిస్ట్రిబ్యూషన్ మేనేజ్‌మెంట్ సిస్టమ్’ పేరిట ఐటీ ఆధారిత వేదిక ఏర్పాటుకు ప్రభుత్వం మద్దతిస్తుంది. జాతీయ స్థాయిలో సరఫరా వ్యవస్థ నిర్వహణ, కార్యకలాపాల పర్యవేక్షణ సౌలభ్యం కోసం కేంద్రీయ డాష్‌బోర్డ్ కూడా రూపొందింది.

అలాగే, ఎన్‌హెచ్‌ఎం కింద ఎఫ్‌డీఎస్‌ఐ సహా వివిధ పథకాల ప్రగతి, అమలు స్థితిపై అంచనా, పర్యవేక్షణ కోసం ఏటా సార్వత్రిక సమీక్ష కార్యక్రమాలను నిర్వహిస్తారు.

ఎఫ్‌డీఎస్‌ఐ కింద కొనుగోలు చేసే మందుల నాణ్యతను ఈ కార్యక్రమంలో భాగమైన కింది కార్యాచరణ మార్గదర్శకాల ద్వారా నిర్ధారిస్తారు:-

     i.        అన్ని మందులను తప్పనిసరిగా పటిష్ట కొనుగోలు యంత్రాంగం ద్వారా ఉత్తమ తయారీ పద్ధతులను పాటించే తయారీదారుల నుంచి కొనాలి.

    ii.        సరఫరా అనంతరం ఆరోగ్య కేంద్రాలకు పంపిణీ చేసేముందు ప్రతి బ్యాచ్‌ను పరీక్షించాలి.

పీఎంబీజేపీ పథకం అమలు సంస్థ ‘ఫార్మాస్యూటికల్స్ అండ్‌ మెడికల్ డివైజెస్ బ్యూరో ఆఫ్ ఇండియా’ (పీఎంబీఐ), తమిళనాడులోనివి సహా అన్ని జనౌషధి కేంద్రాల్లో నిత్యావసర మందులతోపాటు ఇతర మందుల లభ్యతను నిరంతరం పర్యవేక్షిస్తుంది.

ఈ కేంద్రాలలో ఏవైనా సరఫరా అంతరాలుంటే పరిష్కరించడం సహా ఉత్పత్తుల నిరంతర సరఫరా-లభ్యత కోసం ఈ కింది చర్యలు చేపడతారు:

     i.        ఈ పథకం కింద ఉత్పత్తి జాబితాలో అత్యధికంగా అమ్ముడయ్యే 100 మందులు, మార్కెట్లో వేగంగా అమ్ముడయ్యే 100 మందులు సహా సర్వసాధారణంగా వాడే 200 మందులను ఈ కేంద్రాల్లో నిల్వ చేయడానికి ప్రభుత్వం ప్రోత్సాహకాలు మంజూరు చేసింది. ఈ మందులకు సంబంధించి వారు నిర్వహించే నిల్వల ప్రాతిపదికన నెలవారీ ప్రోత్సాహకానికి జనౌషధి కేంద్రాల యజమానులు అర్హులు.

    ii.        దేశవ్యాప్తంగా 5 గిడ్డంగులు సహా ప్రస్తుతం పంపిణీదారుల సంఖ్య 42కు చేరింది. ఇది మరింత విస్తరిస్తుండటంతో ఈ నెట్‌వర్క్‌ సహిత పటిష్ట సరఫరా వ్యవస్థ  అనుసంధానం కోసం పూర్తి సమాచార సాంకేతికత సహిత సరఫరా వ్యవస్థ అమలులో ఉంది.

   iii.        దీనికి అదనంగా, సర్వసాధారణంగా వాడే ఉత్పత్తుల లభ్యతకు భరోసాగా ‘పీఎంబీఐ’ ద్వారా వేగంగా అమ్ముడయ్యే 400 ఉత్పత్తులను క్రమం తప్పకుండా పర్యవేక్షిస్తూ, వాటికిగల డిమాండ్‌ను సదా అంచనా వేస్తున్నారు. అంతేగాక కొనుగోలు ప్రక్రియ  మెరుగుదల కోసం అంచనా పద్ధతి డిజిటలీకరణకు చర్యలు చేపట్టారు.

ఈ పథకం పరిధిని మరింత విస్తరించే దిశగా 2027 మార్చి నాటికి 25,000 జనౌషధి కేంద్రాలను ప్రారంభించాలని ప్రభుత్వం లక్ష్యనిర్దేశం చేసుకుంది. ఇందుకోసం ఫ్రాంచైజీ తరహా విధానాన్ని అనుసరిస్తూ తమిళనాడు సహా దేశవ్యాప్తంగా వ్యక్తిగత పారిశ్రామికవేత్తలు, ప్రభుత్వేతర సంస్థలు, సొసైటీలు, ట్రస్టులు, సంస్థలు, ప్రైవేట్ కంపెనీలు కూడా ఈ పథకం వెబ్‌సైట్ (www.janaushadhi.gov.in) ద్వారా జనౌషధి కేంద్రాల స్థాపనకు దరఖాస్తు చేసుకోవచ్చు. సేవలు సరిగా అందని ప్రాంతాల్లో కేంద్రాల ప్రారంభానికి, సౌలభ్యం కల్పనకు, వీలుగా ఈ దరఖాస్తుదారులకు ప్రభుత్వ ఆసుపత్రులలో ఉచితంగా స్థలం ఇవ్వాలని సంబంధిత పాలన యంత్రాంగం/జిల్లా మేజిస్ట్రేట్‌కు ‘పీఎంబీఐ’ క్రమం తప్పకుండా లేఖలు రాస్తోంది.

ప్రధానమంత్రి భారతీయ జనౌషధి యోజన కిందగల ఉత్పత్తి జాబితాలో 2,110 మందులు, 315 సర్జికల్స్, వైద్య వినియోగ వస్తువులు, పరికరాలు ఉన్నాయి. ఇందులో గుండె సంబంధ, కేన్సర్-మధుమేహం-అంటువ్యాధులు, అలర్జీ నిరోధక ఔషధాలతోపాటు జీర్ణకోశ వ్యాధుల మందులు, న్యూట్రాస్యూటికల్స్ వంటి అన్ని ప్రధాన చికిత్స ప్రక్రియలు ఉన్నాయి. ల్యాబ్ రీఏజెంట్లు, వ్యాక్సిన్లు మినహా, జాతీయ నిత్యావసర మందుల జాబితాలోని దాదాపు అన్ని జెనరిక్ మందులు ఈ జాబితాలో ఉన్నాయి. నిల్వల కొరత తగ్గింపు దిశగా తమిళనాడు సహా దేశవ్యాప్తంగా నిత్యావసర మందుల లభ్యత భరోసాకు నిరంతర పర్యవేక్షణతోపాటు ప్రభుత్వం తగిన దిద్దుబాటు చర్యలు చేపడుతోంది.

కేంద్ర ఎరువులు-రసాయనాల శాఖ సహాయ మంత్రి శ్రీమతి అనుప్రియా పటేల్ ఈ రోజు లోక్‌సభలో ఒక ప్రశ్నకు లిఖితపూర్వక జవాబిస్తూ ఈ సమాచారం వెల్లడించారు.

 

***


(रिलीज़ आईडी: 2292637) आगंतुक पटल : 15
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी